Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింగ‌పూర్ ప్ర‌ధాని శ్రీ లీ సీన్ లూంగ్ భార‌తదేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

సింగ‌పూర్ ప్ర‌ధాని శ్రీ లీ సీన్ లూంగ్ భార‌తదేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

సింగ‌పూర్ ప్ర‌ధాని శ్రీ లీ సీన్ లూంగ్ భార‌తదేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌


శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ లీ సీన్ లూంగ్

ప్రసార మాధ్యమాల ప్ర‌తినిధులారా

డ్రైవ‌ర్ల అవ‌స‌రం లేకుండా ప‌ని చేసే కార్ల‌ను రూపొందించ‌డంలో సింగ‌పూర్ ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా ఉన్న సంగతి నాకు తెలియవచ్చింది. అయితే .. నేను ఇప్పుడు నిశ్చింత‌గా ఉన్నాను, మ‌నం అందరం కూడా నిశ్చింత‌గా ఉండ‌వ‌చ్చు.. ఎందుకంటే, సింగ‌పూర్ కు సార‌థ్యం వ‌హిస్తున్న ప్ర‌ధాని శ్రీ లీ భార‌త‌దేశపు అత్యంత బలమైన శ్రేయోభిలాషులలో ఒకరైన ప్రధాని శ్రీ లీ సింగపూర్ ప్రధాని సీటులో కూర్చొని సింగ‌పూర్ దేశాన్ని ముందుకు న‌డిపిస్తున్నారు, అలాగే మన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నారు. శ్రేష్ఠుడైన శ్రీ లీ, మీరు భార‌త‌దేశ స్నేహితులలో ఒకరుగా ఉన్నారు. మీ వచనబ‌ద్ద‌తను, మన దేశాల బంధాలను బ‌లోపేతం చేయ‌డానికి మీరు చేస్తున్న కృషిని మేం శ్లాఘిస్తున్నాము. మిమ్మ‌ల్ని నేడు ఇక్క‌డ‌కు ఆహ్వానించడం నిజానికి నాకు ద‌క్కిన ఒక గొప్ప గౌర‌వంగా నేను భావిస్తున్నాను.

స్నేహితులారా,

సింగ‌పూర్ కు నా మొట్టమొద‌టి ప‌ర్య‌ట‌న నివాళిని ఘటించ‌డానికి స‌ంబంధించింది. సింగ‌పూర్ కే కాదు, యావత్తు ఆసియాకే మార్గ‌ద‌ర్శిగా నిలచిన శ్రీ లీ కువాన్ యూ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ రోజు నేను సింగ‌పూర్ కు వ‌చ్చి ఆయన నివాళి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాను. సింగ‌పూర్ గ‌ర్వించ‌ద‌గ్గ మరొక గొప్ప ముద్దు బిడ్డ పూర్వ అధ్య‌క్షుడు శ్రీ ఎస్‌.ఆర్‌. నాథ‌న్ ఈ సంవ‌త్స‌రం స్వ‌ర్త‌స్తులైనందుకు మేం దు:ఖిస్తున్నాము. ఆయ‌న‌ భారతదేశ ఆప్త మిత్రులలో ఒకరు. మేం ఆయనకు ప్ర‌వాసీ భార‌తీయ స‌మ్మాన్ అవార్డును బహూకరించిన గౌరవాన్ని దక్కించుకున్నాము. ఆయ‌న లేని లోటు తీరనిది.

స్నేహితులారా,

సింగ‌పూర్ జాతీయ గీతం “మ‌జులాహ్ సింగ‌పూరా”– “ముందుకు సాగు, సింగ‌పూర్” అని దీని అర్థం. ఇందులో ఆశ్చ‌ర్యం లేదు. వ‌ర్త‌మానంలో కార్యాచ‌ర‌ణ‌కు న‌డుంక‌ట్టి భ‌విష్య‌త్ అవ‌సరాల‌ను గురించి ఆలోచించే దేశం ఏదైనా ఉందీ అంటే అది సింగ‌పూర్‌. త‌యారీ రంగం, ప‌ర్యావ‌ర‌ణం, నూత‌న‌త్వం, సాంకేతిక‌ విజ్ఞ‌ానం, ప్ర‌జా సేవ‌ల అమ‌లు.. ఇలా ఏదైనా తీసుకోండి.. ప్రపంచంలోని వేరే దేశాలు రేపు చేసే పనిని సింగపూర్ ఈ రోజే చేస్తున్నది.

స్నేహితులారా,

దాదాపుగా ప‌న్నెండు నెల‌ల క్రితం, నేను సింగ‌పూర్ లో ప‌ర్య‌టించినప్పుడు, మనం మన ద్వైపాక్షిక సంబంధాల‌ను నవీకరించిన స్ఫూర్తితోను, సరికొత్త శక్తి తోను వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య స్థాయికి ఎదిగేటట్లు చేసుకున్నాము. మన రెండు దేశాల ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూర్చడం కోసం సింగ‌పూర్ యొక్క బలాల‌ను, భార‌త‌దేశపు శక్తితోను, అలాగే.. సింగపూర్ యొక్క గతిశీలతను మన రెండు దేశాల సచేతనత్వంతోను జత కలపాలన్నదే మన భాగస్వామ్యపు ధ్యేయం. గ‌త సంవ‌త్స‌రం నేను సింగ‌పూర్ లో ప‌ర్య‌టించిన‌ప్పుడు, మన మహత్వాకాంక్షలతో కూడిన సహకారపూర్వక కార్యాచరణను అమలులోకి తెచ్చేందుకు ఒక మార్గ సూచీని మనం రూపొందించుకున్నాము.పరస్పరం అంగీకారం కుదిరిన నిర్ణయాలను సత్వరం అమలులోకి తీసుకురావడం కూడా మన మధ్య ఏర్పడ్డ అవగాహనలో ఒక ముఖ్యమైన భాగం.

ఇవాళ, ఎక్స్ లెన్సీ శ్రీ లీ మరియు నేను మన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం యొక్క ఆకృతిని, సాంద్రతను గురించి స‌మ‌గ్రంగా స‌మీక్షించాము. నేను సింగ‌పూర్ లో ప‌ర్య‌టించిన‌ సందర్భంలో, ప్ర‌ధాని శ్రీ లీ ద‌గ్గ‌రుండి నాకు అక్క‌డి సాంకేతిక విద్యా సంస్థ‌ను చూపించారు. ఈ రోజు మేం రెండు ఎమ్ ఒ యు ల‌ు కుదుర్చుకున్నాము. అవి నైపుణ్యాలకు పదునుపెట్టడానికి సంబంధించిన‌వి: వాటిలో ఒక‌టి, మా ఈశాన్య రాష్ట్రాల కోసం గువాహాటీలో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన‌ది; రెండోది, జాతీయ నైపుణ్యాల అభివృద్ధి మండ‌లి సహకారంతో ఏర్పాటు చేయవలసిన‌టువంటిది. ఇంకా-

రాజ‌స్థాన్ రాష్ట్ర ప్రభుత్వ స‌హ‌కారంతో ఉద‌య్ పూర్ లో ప‌ర్యట‌న సంబంధ శిక్ష‌ణ‌కు సంబంధించిన ఒక ఉన్న‌త‌ స్థాయి కేంద్ర ప్రారంభోత్సవం. దీనిని సైతం నేను స్వాగతిస్తున్నాను. సింగ‌పూర్ తో క‌లసి రాజ‌స్థాన్ ప‌ట్ట‌ణాభివృద్ధి, వ్య‌ర్థ ప‌దార్థాల నిర్వ‌హ‌ణ రంగాలలోనూ ప‌ని చేస్తోంది. సింగపూర్ ఇప్పటికే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నగర నిర్మాణంలో మా భాగ‌స్వామి అయింది.

స్నేహితులారా,

మ‌న ద్వైపాక్షిక సంబంధాలు దృఢంగా ఉండడానికి వాణిజ్య, పెట్టుబ‌డుల బంధాలు ముఖ్యం. ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల వ్యాపారాల ప‌రంగా భాగ‌స్వామ్యాల నెట్ వ‌ర్క్ చాలా బలంగా ఉంది. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌గ్ర‌మైన ఆర్ధిక స‌హ‌కార ఒప్పందపు స‌మీక్ష‌ను వేగ‌వంతం చేయాల‌ని ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని శ్రీ లీ, నేను అంగీక‌రించాము. మేధోప‌ర‌మైన ఆస్తి హ‌క్కు పైన ఈ రోజున ఎమ్ ఒ యు కుదిరింది. దీని వ‌ల్ల ఇరు దేశాల మ‌ధ్య‌ వ్యాపారాల ప‌రంగా ఇచ్చి పుచ్చుకోవ‌డాలు, స‌హ‌కారాలు సులువుగా కొన‌సాగుతాయి. సింగ‌పూర్ లో కార్పొరేట్ రూపీ బాండ్ల విడుద‌లను ప్ర‌ధాని శ్రీ లీ, నేను క‌లసి స్వాగ‌తిస్తున్నాము. భార‌త‌దేశంలో భారీ ప్రాథమిక సౌక‌ర్యాల ఏర్పాటుకు కావ‌ల‌సిన నిధుల స‌మీక‌ర‌ణ‌కు ఇది ఒక ముంద‌డుగు.

స్నేహితులారా,

ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల వ్యూహాత్మ‌క భాగ‌స్వామంలో ర‌క్ష‌ణ‌పరమైన, భ‌ద్ర‌తప‌ర‌మైన స‌హ‌కారం ముఖ్య‌ పాత్రను పోషిస్తున్నది. స‌ముద్ర‌ జ‌లాల‌ను క‌లిగిన దేశాలుగా ఇరు దేశాల మ‌ధ్య‌ స‌ముద్ర‌ప‌ర‌మైన క‌మ్యూనికేష‌న్ సంబంధాలు చాలా ముఖ్యం. అలాగే స‌ముద్ర ప్రాంతాలలో చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల అమ‌లు అనేది ఇరు దేశాల‌కు ముఖ్య‌మైన అంశం. ఆసియాన్‌, తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర స‌మావేశం, ఆసియాన్ రీజ‌నల్ ఫ్రేమ్‌వ‌ర్క్ రూప‌క‌ల్ప‌న‌లో మ‌న స‌హ‌కారం చాలా ముఖ్యం. న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని క‌లిగించే వాతావ‌ర‌ణంలో ప్రాంతీయ స‌హ‌కార నిర్మాణం దీని ముఖ్యోద్దేశం. ఇది పార‌ద‌ర్శ‌కంగా అంద‌రినీ కలుపుకొనివెళ్లేటట్లు ఉండాలి. ప్రబలుతున్న ఉగ్ర‌వాదం, ముఖ్యంగా సీమాంత‌ర‌ ఉగ్ర‌వాదం, తీవ్రవాద పోక‌డ‌లు తీవ్రం కావ‌డం మ‌న భ‌ద్ర‌త‌కు స‌వాళ్ల‌ను విస‌రుతున్నాయి. అవి స‌మాజాల మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నిస్తున్నాయి. శాంతి, మాన‌వ‌త్వంల‌ మీద న‌మ్మ‌కం ఉన్న‌ వారు ఐక‌మ‌త్యంతో వ్య‌వ‌హ‌రించి ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవాలనేది నా ప్ర‌గాఢ‌మైన న‌మ్మ‌కం. ఉగ్ర‌వాద స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డానికి ఇరు దేశాలు స‌హ‌కారాన్ని మ‌రింత‌ పెంపొందించుకోవాల‌ని మేం ఈ రోజు అంగీక‌రించ‌డం జ‌రిగింది. సైబ‌ర్ భ‌ద్ర‌త విష‌యంలోను అంగీకారానికి రావ‌డం జ‌రిగింది.

శ్రేష్ఠుడైన శ్రీ లీ,

భార‌త‌దేశం నేడు దృఢ‌మైన ఆర్ధిక ప్ర‌గ‌తి కోసం, మార్పు కోసం కృషి చేస్తోంది. ఈ ప్ర‌యాణంలో మా దేశానికి సింగ‌పూర్ ప్ర‌ధాన‌మైన భాగ‌స్వామి. భార‌త‌దేశ మార్పుకు స‌హ‌క‌రించ‌డానికిగాను ఉప ప్ర‌ధాని శ్రీ ష‌ణ్ముగ‌ర‌త్నం అందించిన ఆలోచ‌న‌ల నుండి ఈ మ‌ధ్య‌ే మేము ప్ర‌యోజ‌నాన్ని పొందాము. మీరు వ్య‌క్తిగ‌తంగా చూపే స్నేహ‌భావం మాకు ఎంతో విలువైంది. మీ నేతృత్వంలో ఇరు దేశాల బంధాలు మ‌రింత ప్ర‌గ‌తిని సాధించగలవు. మ‌రో సారి మీకు, మీ ప్ర‌తినిధి వర్గానికి స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మీ భార‌తదేశ సంద‌ర్శ‌న నిర్మాణాత్మకమూ, విజ‌య‌వంతమూ అవగలదన్న నమ్మకం నాకున్నది.

మీకు ఇవే నా ధన్యవాదములు.

మీకు అనేకానేక ధన్యవాదములు.