Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింగ‌పూర్‌ లో ఫిన్‌టెక్ ఫెస్టివల్ జరిగిన సంద‌ర్భం గా ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌కోప‌న్యాసం

సింగ‌పూర్‌ లో ఫిన్‌టెక్ ఫెస్టివల్ జరిగిన సంద‌ర్భం గా ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌కోప‌న్యాసం

సింగ‌పూర్‌ లో ఫిన్‌టెక్ ఫెస్టివల్ జరిగిన సంద‌ర్భం గా ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌కోప‌న్యాసం

సింగ‌పూర్‌ లో ఫిన్‌టెక్ ఫెస్టివల్ జరిగిన సంద‌ర్భం గా ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌కోప‌న్యాసం


ప్ర‌పంచ ఆర్థిక రంగం లో ప్ర‌భావ‌శీల స్వరమైన సింగ‌పూర్ ఉప ప్ర‌ధాని శ్రీ థ‌ర్మన్ ష‌ణ్ముగ‌ర‌త్నం, ఫిన్‌టెక్ లో ప్ర‌ధాన సంస్థ అయిన సింగ‌పూర్ మానిట‌రీ అథారిటీ మేనేజింగ్ డైర‌క్ట‌ర్‌ శ్రీ ర‌వి మేనోన్‌, వంద‌ కు పైగా దేశాల‌ నుండి విచ్చేసి
ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకుంటున్న లక్షల మందికి,

న‌మ‌స్కారం..

సింగ‌పూర్ ఫిన్‌టెక్ పెస్టివల్ లో కీల‌కోప‌న్యాసం చేసే మొదటి ప్ర‌భుత్వాధినేత‌ గా అవ‌కాశం రావడం గొప్ప‌ గౌర‌వం.

భ‌విష్య‌త్తు పై స్థిర‌మైన దృష్టి క‌లిగిన భార‌తదేశ యువ‌త‌ కు ల‌భించిన గౌర‌వం ఇది.

130 కోట్ల మంది భార‌తీయుల జీవితాల‌ ను మారుస్తూ దేశం లో కొన‌సాగుతున్న ఆర్థిక విప్ల‌వాని కి ల‌భించిన గుర్తింపు ఇది.

ఇది ఆర్థిక , సాంకేతిక రంగాని కి సంబంధించిన ఒక కార్య‌క్ర‌మం, ఒక ఉత్స‌వం కూడా.

భార‌త‌దేశం లో ఇది దీపాల పండుగ దీపావ‌ళి జ‌రుపుకొనే స‌మ‌యం. ఆశ‌, ధ‌ర్మం, జ్ఞానం, సుసంప‌న్న‌త‌ ల విజ‌యాని కి గుర్తు గా ప్ర‌పంచ‌ వ్యాప్తం గా ఈ పండుగ‌ ను జ‌రుపుకుంటారు. దీపావ‌ళి దీప‌ కాంతులు సింగ‌పూర్‌ లో ఇంకా అలాగే ఉన్నాయి.

ఫిన్‌టెక్ ఫెస్టివల్ కూడా ఒక విశ్వాసాన్ని పండుగ‌ లా జ‌రుపుకోవ‌డం వంటిదే.

నూతన ఆవిష్కరణ ల స్ఫూర్తి, ఊహాశ‌క్తి లో విశ్వాసం పాదుకొల్ప‌డం.

యువ‌శ‌క్తి లో, మార్పు ప‌ట్ల వారి అభిరుచి పై విశ్వాసం చూప‌డం,

ప్ర‌పంచాన్ని ఒక అత్యుత్త‌మ ప్ర‌దేశం గా మార్చ‌డం లో విశ్వాసం,

ప‌ట్టుమ‌ని మూడేళ్ల‌ లో ఈ ఫెస్టివల్ ఇప్ప‌టికే ప్ర‌పంచం లో అతి పెద్ద ఉత్స‌వం గా రూపుదిద్దుకోవ‌డం ఆశ్చ‌ర్యమేమీ కాదు.

ఫైనాన్స్‌ కు అంత‌ర్జాతీయ కేంద్రం గా సింగ‌పూర్ ఉంది. ఇప్పుడు అది ఫైనాన్స్‌ కు సంబంధించిన డిజిట‌ల్ భ‌విష్య‌త్తు దిశ గా భారీ అడుగులు వేస్తోంది.

ఈ సంవత్సరం జూన్‌ లో ఇక్క‌డే నేను భారతదేశానికి చెందిన రూపేకార్డు ను ప్రారంభించాను. ఇది భార‌త‌దేశ‌పు ప్ర‌పంచ‌ శ్రేణి యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌- యుపిఐ ని ఉప‌యోగించి అంత‌ర్జాతీయ చెల్లింపు ల‌కు వీలు క‌ల్పించే మొబైల్ యాప్‌.

ఆసియాన్‌ తో మొదలుపెట్టి భారతీయ బ్యాంకుల నుండి ఫిన్‌టెక్ కంపెనీ లు, ఫిన్‌టెక్ సంస్థ‌ లు, ఇంకా ఆర్థిక సంస్థ‌ ల దాకా అనుసంధానం చేసే ఒక అంత‌ర్జాతీయ వేదిక‌ ను ప్రారంభించే గౌర‌వం ఈరోజు న నాకు ద‌క్కనుంది.

భారతదేశం, సింగ‌పూర్‌ లు భారతదేశానికి, ఆసియాన్‌ కు సంబంధించిన చిన్న మ‌ధ్య‌ త‌ర‌హా సంస్థ‌ ల‌ను అనుసంధానించి, భార‌తీయ వేదిక‌ కు జ‌త‌ చేసి అంత‌ర్జాతీయంగా వాటిని విస్త‌రించ‌డానికి కృషి చేస్తున్నాయి.

మిత్రులారా,

స్టార్ట్- అప్ స‌ర్కిళ్ల‌ లో ఒక స‌ల‌హా వ‌స్తూ ఉండ‌డం నేను విన్నాను.

● మీ వెంచ‌ర్ కాపిట‌ల్ (విసి) ఫండింగ్ 10 శాతం పెర‌గాలంటే, మీరు రెగ్యుల‌ర్ బిజినెస్‌ కాక‌, ఒక ప్లాట్‌ఫాం ను నిర్వ‌హిస్తున్న‌ట్టు పెట్టుబ‌డి దారుల‌కు చెప్పండి.

● మీరు మీ వెంచ‌ర్ కాపిట‌ల్‌ ను 20 శాతం పెంచుకోవాలంటే, మీరు ఫిన్‌టెక్ స్పేస్‌ లో మీ కార్య‌క‌లాపాలను నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పండి.

● ఇన్వెస్ట‌ర్లు వారి మొత్తం సొమ్ము ను మీ వ‌ద్ద పెట్టుబ‌డి గా పెట్టాలంటే మీరు బ్లాక్‌చెయిన్ ను వాడుతున్న‌ట్టు చెప్పండి అని అంటున్నారు.

ఆర్థిక ప్ర‌పంచం లో కొత్త కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానం ఎలాంటి అవ‌కాశాల‌ను, ఎలాంటి ఉత్సుక‌త‌ ను క‌లిగిస్తున్న‌దో ఈ వ్యాఖ్య‌లు సూచిస్తున్నాయి.

నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం, అనుసంధాన‌త‌ను అందిపుచ్చుకోవ‌డం లో ఆర్థిక రంగం ముందుంటుంద‌ని చ‌రిత్ర తెలియ‌జేస్తోంది.

మిత్రులారా,

సాంకేతిక ప‌రిజ్ఞానం తెచ్చిన మార్పు కార‌ణం గా మ‌నం ఒక చారిత్ర‌క ప‌రివ‌ర్త‌న ద‌శ‌ లో ఉన్నాం.

డెస్క్‌టాప్ నుండి క్లౌడ్‌, ఇంట‌ర్ నెట్ నుండి సోశల్ మీడియా, ఐటి సేవ‌ల నుండి ఇంట‌ర్ నెట్ ఆఫ్ థింగ్స్.. ఇలా స్వ‌ల్ప వ్య‌వ‌ధి లోనే మ‌నం చాలా దూరం వ‌చ్చేశాం. ప్ర‌తి రోజూ వ్యాపారం లో అవాంత‌రాలు ఉంటున్నాయి.

అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ స్వ‌రూపం మారిపోతున్న‌ది.

నూత‌న ప్ర‌పంచం లో పోటీ ని, శ‌క్తిని సాంకేతిక‌త నిర్వ‌చిస్తోంది. అంతేకాదు, ఇది జీవితాల‌ను మార్చ‌డానికి అంతులేని అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది.

నేను 2014 లో ఐక్య‌ రాజ్య‌ స‌మితి లో మాట్లాడుతూ, అభివృద్ధి, సాధికారిత‌ లు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, మొబైల్ ఫోన్‌ లు వ్యాప్తి చెందినంత వేగం గానే ఇవి కూడా విస్త‌రించ‌గ‌ల‌వ‌ని మ‌నం విశ్వ‌సించాల‌ని అన్నాను.

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఆ దార్శ‌నిక‌త నేడు వాస్త‌వ‌ రూపం దాలుస్తోంది.

భార‌త‌దేశం లో,ఇది పాల‌న‌ లో, ప్ర‌జాసేవ‌ల క‌ల్పన లో మార్పు ను తీసుకువ‌చ్చింది. నూతన ఆవిష్కరణ ల‌కు, ఆశావ‌హ ప‌రిస్థితి కి, అవ‌కాశాల‌కు తలుపులను తెరచింది. బ‌ల‌హీనుల‌కు సాధికారిత ను క‌ల్పించి వారిని ప్ర‌ధాన స్ర‌వంతి లోకి వ‌చ్చేటట్టు చేసింది. ఇది ఆర్థిక వ్య‌వ‌స్థ అందుబాటు ను మ‌రింత ప్ర‌జాస్వామికం చేసింది.

మా ప్ర‌భుత్వం 2014వ సంవత్సరం లో అన్ని వ‌ర్గాల‌నూ అభివృద్ధి లో భాగ‌స్వామ‌ల ను చేసే ల‌క్ష్యం తో అధికారం లోకి వ‌చ్చింది. అత్యంత మారుమూల గ్రామం లోని ప్ర‌తి ఒక్క పౌరుడి, అత్యంత బ‌ల‌హీనడి జీవితాల‌ను మార్చే దిశ‌గా అధికారం లోకి వ‌చ్చాం.

ఈ ల‌క్ష్య‌ాన్ని సాధించడం జ‌ర‌గాలంటే స‌మ్మిళిత ఆర్థిక సేవ‌లు అందుబాటు లోకి రావాలి. ఇదే పునాది. ఈ ల‌క్ష్యం భార‌త‌దేశం వంటి భారీ దేశం లో అంత సుల‌భ‌మైన విష‌యం కాదు.

కానీ, మేం దీనిని కొద్ది నెల‌ల్లోనే సాధించ‌ద‌ల‌చుకున్నాం. సంవ‌త్స‌రాలు కాదు, నెల‌ల్లోనే.

ఫిన్‌టెక్‌ శ‌క్తి, డిజిట‌ల్ అనుసంధాన‌ం వ్యాప్తి కార‌ణంగా మేం ముందెన్న‌డూ లేనంత వేగం తో భారీ స్థాయి లో విప్ల‌వాత్మ‌క మార్పులను తీసుకువచ్చాం.

స‌మ్మిళిత ఆర్థిక‌త‌ ను ముందుగా 1.3 బిలియన్ మంది భార‌త ప్ర‌జ‌ల‌కు సాకారం చేశాం. మేం 1.2 బిలియ‌న్ బ‌యోమెట్రిక్ గుర్తింపు ల‌ను రూపొందించాం. దీనినే ‘ఆధార్’ పేరు తో పిలుస్తాం. కొద్ది సంవ‌త్స‌రాల‌ లోనే దీనిని సాధించాం.

జ‌న్‌ ధ‌న్ యోజ‌న లో భాగం గా ప్ర‌తి భార‌తీయుడి కి ఒక బ్యాంకు ఖాతా ను ఇవ్వాల‌ని ల‌క్ష్యం గా పెట్టుకున్నాం. మూడు సంవ‌త్స‌రాల‌లో మేం 330 మిలియ‌న్ కొత్త బ్యాంకు ఖాతా ల‌ను ప్రారంభించాం. ఇవి 330 మిలియ‌న్ ప్ర‌జ‌ల‌కు గుర్తింపు ను, గౌర‌వాన్ని,

అవకాశాల‌ను ఇచ్చాయి.

2014 నాటికి 50 శాతం కన్నా తక్కువ మంది భార‌తీయుల‌కు మాత్ర‌మే బ్యాంకు ఖాతాలు ఉండేవి; ఇప్పుడు ఇవి దాదాపు అంద‌రికీ ఉన్నాయి.

అందువ‌ల్ల బిలియ‌న్‌ కు పైగా బ‌యోమెట్రిక్ గుర్తింపులు, బిలియ‌న్‌ కు పైగా బ్యాంకు ఖాతాలు, బిలియ‌న్ సెల్‌ఫోన్‌ లు ఉన్నాయి. ప్ర‌పంచం లోనే అతి పెద్ద సార్వజనిక మౌలిక‌ స‌దుపాయాల వ్య‌వ‌స్థ భార‌తదేశం లో ఉంది.

3.6 ల‌క్ష‌ల కోట్ల‌ రూపాయ‌ల‌కు పైగా లేదా 50 బిలియ‌న్ డాల‌ర్ల మేర‌కు ప్ర‌యోజ‌నాలు ప్ర‌జ‌ల‌కు నేరుగా ప్ర‌భుత్వం నుండి అందాయి.

మారుమూల ప్రాంతాల‌ లోని పేద ప్ర‌జ‌లు సుదూర ప్రాంతాలకు వెళ్ల‌వ‌ల‌సిన అవ‌స‌రం గాని, హ‌క్కుల సాధ‌న‌ కోసం మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్ర‌యించవలసిన అవ‌స‌రం గాని ఇక ఎంత‌మాత్రం లేదు.

న‌కిలీ ఖాతాలు, డూప్లికేట్‌ ఖాతాల కార‌ణం గా ప్ర‌భుత్వ నిధులు దుర్వినియోగం అయ్యే ప‌రిస్థితి లేదు. మేం దీనివ‌ల్ల 80 వేల కోట్ల రూపాయ‌లు అంటే 12 బిలియ‌న్ డాల‌ర్ల మేర‌కు దుర్వినియోగం కాకుండా నిలువ‌రించ‌గ‌లిగాం.

ఇప్పుడు ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వారి ఖాతాల‌లో బీమా సొమ్ము ను అందుకొంటున్నారు. అలాగే వృద్ధాప్య పింఛన్ లు అందుకోగ‌లుగుతున్నారు.

విద్యార్థి త‌నకు రావ‌ల‌సిన ఉపకార వేతనం నేరు గా అత‌ని ఖాతా లో జ‌మ అవుతోంది. ఇక వారికి ర‌క‌ర‌కాల విజ్ఞాప‌న‌ల‌తో కాల‌యాప‌న జ‌రిగే ప‌రిస్థితి ఎంత‌మాత్ర‌ం లేదు.

ఆధార్ ఆధారిత 4,00,000 మైక్రో ఎటిఎం ల ద్వారా మారుమూల గ్రామీణ‌ ప్రాంతాల‌లో సైతం బ్యాంకింగ్ సేవ‌లు ప్ర‌జ‌ల గ‌డ‌ప‌ వ‌ద్ద‌కు అందుబాటు లోకి వచ్చాయి.

ఇక ఇప్పుడు ఈ డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల ద్వారా ప్ర‌పంచం లోనే అతి పెద్ద ఆరోగ్య‌భ‌ద్ర‌త ప‌థ‌కం ‘ఆయుష్మాన్’ 500 మిలియ‌న్ భార‌తీయుల‌కు ఆరోగ్య బీమా ను
అందుబాటు లోకి తీసుకువస్తోంది.

ముద్ర‌ ప‌థ‌కం 145 మిలియ‌న్ రుణాలు అందించ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది. నాలుగు సంవ‌త్స‌రాల‌లో ఈ రుణాలు 6.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు అంటే 90 బిలియ‌న్ డాల‌ర్ల‌ కు చేరాయి. ఈ రుణాలలో సుమారు 75 శాతం వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు చేరాయి.

కేవలం కొద్దివారాల క్రిత‌మే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ను మేం ప్రారంభించుకొన్నాం. దేశ వ్యాప్తంగా 150 వేల‌ తపాలా కార్యాలయాలు, 3,00,000 తపాలా సేవా ఉద్యోగులు ఇంటింటికి బ్యాంకింగ్ సేవ‌లను అందించేందుకు సాంకేతిక
ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

అందరికీ ఆర్థిక సేవలు అందాలన్నా కూడా డిజిట‌ల్ అనుసంధాన‌ం అవసరం.

దేశం లోని ఒక ల‌క్షా ఇరవై వేల గ్రామ‌పంచాయతీ ల‌కు డిజిట‌ల్ అనుసంధానాన్ని క‌ల్పించాం. ఇందుకు సుమారు 3 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల ఫైబ‌ర్ ఆప్టిక్ కేబుల్స్ వేశాం.

మూడు ల‌క్ష‌లకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ లు గ్రామాల‌కు డిజిట‌ల్ అనుసంధాన‌త‌ను తెచ్చాయి. ఇవి రైతుల భూముల‌కు సంబంధించిన రికార్డులు, రుణం, బీమా, విపణి, మంచి ధ‌ర‌ ల‌ను అందుబాటు లోకి తీసుకువస్తున్నాయి. ఇవి ఆరోగ్య సేవ‌లను, ప‌రిశుభ్ర‌త‌ కు సంబంధించిన‌ ఉత్ప‌త్తులను మ‌హిళ‌ల‌ కు అందుబాటు లోకి తెస్తున్నాయి.

భార‌త‌దేశంలో చెల్లింపులు, లావాదేవీల‌కుసంబంధించి ఫిన్‌టెక్ తీసుకువ‌చ్చిన డిజిటైజేశన్ పరివర్తన కీల‌క‌మైంది.

భార‌త‌దేశం వైవిధ్య‌భ‌రిత‌మైన ప‌రిస్థితుల తోను, స‌వాళ్ల‌ తోను ఉన్నటువంటి దేశం. మా ప‌రిష్కారాలు కూడా వైవిధ్యం తో కూడి ఉంటాయి. మా డిజిటైజేశన్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది, ఎందుకంటే మా పేమెంట్ ప్రాడ‌క్టు లు అంద‌రి అవ‌స‌రాలను తీర్చేవి.

మొబైల్‌, ఇంట‌ర్ నెట్ స‌దుపాయం క‌లిగిన వారికి ఇక భీమ్‌-యుపిఐ ప్ర‌పంచంలోనే అత్య‌ధునాత‌న‌, సుల‌భ‌మైన ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాట్‌ఫాం. దీని ద్వారా ఖాతాల మ‌ధ్య చెల్లింపులు చేయ‌డానికి వ‌ర్చువ‌ల్ పేమెంట్ అడ్ర‌సు ను ఉప‌యోగిస్తారు.

మొబైల్ ఉండి ఇంట‌ర్ నెట్ స‌దుపాయం లేని వారికి ఇక యు.ఎస్‌.ఎస్‌.డి వ్య‌వ‌స్థ 12 భాష‌ ల‌లో అందుబాటులో ఉంది.

మొబైల్ కాని ,ఇంట‌ర్ నెట్ స‌దుపాయం కాని లేని వారికి ఆధార్ అనుసంధానిత పేమెంట్ వ్య‌వ‌స్థ ఉంది. ఇది బ‌యో మెట్రిక్‌ ను ఉప‌యోగించుకుంటుంది. ఇది ఇప్ప‌టికే బిలియ‌న్ లావాదేవీల‌ను నమోదు చేసింది. ప‌ట్టుమ‌ని రెండు సంవత్సరాలలో ఇది ఆరు రెట్లు వృద్ధి చెందింది.

పేమెంట్ కార్డుల‌ను రూపే అంద‌రికీ అందుబాటులోకి తెస్తోంది. 250 మిలియ‌న్‌ కు పైగా ఇవి నాలుగు సంవ‌త్స‌రాల క్రితం బ్యాంకు ఖాతా కూడా లేని వారికి సంబంధించిన‌వి.

కార్డుల‌ నుండి క్యుఆర్‌, వాలెట్‌, డిజిట‌ల్ లావాదేవీలు భార‌త‌దేశం లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇవాళ భారతదేశం లో 128 బ్యాంకు లు యుపిఐ తో అనుసంధాన‌మై ఉన్నాయి.

యుపిఐ పై లావాదేవీలు గ‌డ‌చిన 24 మాసాలలో 1500 రెట్లు పెరిగాయి. ఈ లావాదేవీలు ప్ర‌తి నెలా 30 శాతం పెరుగుతూ వ‌స్తున్నాయి.

అయితే , ఇవి విస్త‌రిస్తున్న వేగం కంటే నాకు ప్రేర‌ణ క‌లిగిస్తున్న‌ది డిజిట‌ల్ పేమెంట్స్ అందిస్తున్న అవ‌కాశాలు, స‌మ‌ర్ధ‌త‌, పార‌ద‌ర్శ‌క‌త‌, సౌల‌భ్యం.

ఒక దుకాణదారు త‌న సరకుల పట్టిక ను త‌గ్గించుకోవ‌డానికి ఆన్‌లైన్‌ తో అనుసంధానం కావ‌చ్చు, వ‌సూళ్లను వేగ‌వంతం చేసుకోవ‌చ్చు.

ఒక పండ్ల తోట పెంప‌కందారులైన రైతు లేదా ఒక గ్రామీణ చేతివృత్తుల కార్మికుడు నేరు గా విపణి తో అనుసంధానం కాగ‌ల సౌక‌ర్యం ఏర్ప‌డింది. మార్కెట్లు ద‌గ్గ‌ర‌య్యాయి. రాబ‌డి పెరిగింది, చెల్లింపులు వేగ‌వంత‌ం అయ్యాయి.

కార్మికుడు త‌న వేత‌నాల‌ను అందుకోవ‌డం గాని, లేదా ఇంటి కి పండం గాని త‌న రోజువారీ ప‌నుల‌కు ఎలాంటి ఆటంకం లేకుండా సుల‌భ‌త‌ర‌మైంది.

ప్ర‌తి డిజిట‌ల్ పేమెంట్ స‌మ‌యాన్ని ఆదా చేస్తుంది. ఇది దేశ పొదుపు న‌కు పెద్ద ఊతాన్ని ఇస్తుంది. ఇది వ్య‌క్తుల ఉత్పాద‌క‌త పెంపున‌కు, మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇది ప‌న్ను వ‌సూళ్ల‌ ను మెరుగ‌ప‌ర‌చ‌డానికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో న్యాయ‌మైన‌ ధోర‌ణి కి దోహ‌ద‌ప‌డుతుంది. ఇంకా, డిజిట‌ల్ చెల్లింపులు అవ‌కాశాల ప్ర‌పంచాని కి ద్వారం వంటివి.

డాటా అన‌లిటిక్స్‌, కృత్రిమ మేధ‌స్సు.. ఇవి విలువ ఆధారిత సేవ‌ ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డం లో తోడ్ప‌డుతున్నాయి. స్వ‌ల్ప రుణ చ‌రిత్ర ఉన్న వారికి లేదా అస‌లు రుణ చ‌రిత్ర అంటూ లేని వారికి ఈ సేవ‌లు అందుబాటు లో ఉంటున్నాయి.

అందరికీ ఆర్థిక సేవలు సూక్ష్మ‌, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థ లకు సైతం విస్త‌రించాయి.

కేవ‌లం ఒక సంవత్సరం క్రిత‌ం దేశ‌వ్యాప్తం గా ఆరంభమైన వ‌స్తువులు మరియు సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) డిజిట‌ల్ నెట్‌వ‌ర్క్ పరిధి లోపలకు ఇవి అన్నీ వ‌స్తున్నాయి.

బ్యాంకులు రుణాలతో వారి చెంతకు పోతున్నాయి. ప్ర‌త్యామ్నాయ రుణ ప్రదాత సంస్థ లు వినూత్న ఆర్థిక న‌మూనాల‌ను ఇవ్వజూపుతున్నాయి. ఇవి ఇక ఎంత‌మాత్రం అత్య‌ధిక వ‌డ్డీ రేట్లతో పనిచేసే ఇన్ ఫార్మ‌ల్ మార్కెట్ల‌ వైపు చూడవలసిన అవ‌స‌రం లేదు.

ఇక‌, ఈ నెల‌ లోనే మేం ప‌ట్టుమ‌ని 59 నిమిషాల‌లో- బ్యాంకు ను కూడా సంద‌ర్శించ‌కుండానే- కోటి రూపాయ‌ల వ‌ర‌కు రుణాల‌ను సూక్ష్మ, లఘు, మ‌ధ్య‌త‌ర‌హా వాణిజ్య సంస్థ‌ ల‌కు రుణాలు మంజూరు చేయ‌డానికి మేం నిబ‌ద్ధుల‌మ‌య్యాం. ఇది జిఎస్‌టి రిట‌ర్న్‌లు, ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఉప‌యోగించుకునే ఏల్గరిదమ్ ద్వారా రుణ నిర్ణ‌యం జ‌రుగుతుంది. కేవ‌లం కొద్ది రోజుల‌లో ఇలాంటి ల‌క్షా యాభైవేల వాణిజ్య సంస్థ లు రుణాల కోసం ముందుకు వ‌చ్చాయి.

ఎంట‌ర్‌ప్రైజ్‌, ఉపాధి, సమృద్ధి లకు చోదకశక్తిగా ఉండేటటువంటి ఫిన్‌టెక్ శ‌క్తి ఇది.

డిజిట‌ల్ టెక్నాల‌జీ పార‌ద‌ర్శ‌క‌త‌ ను ప్ర‌వేశ‌పెడుతోంది. అలాగే ప్ర‌భుత్వ నూతన ఆవిష్కరణ లైన ఇ- మార్కెట‌ర్ జిఇఎమ్ ద్వారా అవినీతి లేకుండా చేస్తున్న‌ది. ప్ర‌భుత్వ సంస్థ ల కొనుగోళ్ల‌కు ఇది స‌మీకృత వేదిక గా ఉంది.

కొనుగోళ్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకోవ‌డానికి, పోల్చిచూసుకోవ‌డానికి, టెండ‌ర్ లకు, ఆన్‌లైన్ ద్వారా ఆర్డ‌ర్లు ఇవ్వ‌డానికి , కాంట్రాక్టు కుదుర్చుకోవ‌డానికి, చెల్లింపు ల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇప్పటికే 6,00,000 ఉత్ప‌త్తులు ఇందులో ఉన్నాయి. సుమారు 30,000 కొనుగోలు సంస్థ‌లు, 1,50,000 విక్రేత సంస్థలు,సేవా ప్రదాత సంస్థల పేర్లు ఈ వేదిక లో న‌మోదు అయ్యాయి.

మిత్రులారా,

ఫిన్‌టెక్ ఆవిష్క‌ర‌ణ‌లు, వాణిజ్యం ఇండియాలో అద్భుత‌ స్థాయి లో ఉంది. ఇది భారతదేశాన్ని ప్ర‌పంచం లోనే ప్ర‌ముఖ‌మైన ఫిన్‌టెక్‌, స్టార్ట్- అప్ దేశం గా తీర్చిదిద్దింది. భ‌విష్య‌త్ ఫిన్‌టెక్‌, ఇండ‌స్ట్రీ 4.0 భారతదేశం లో వెల్లివిరుస్తోంది.

కాగిత ర‌హిత‌, న‌గ‌దు ర‌హిత‌, నేరు గా వెళ్లనక్కర లేని, సుర‌క్షిత‌మైన, భ‌ద్ర‌మైన లావాదేవీలు అంద‌రికీ అందుబాటు లోకి వ‌చ్చే యాప్‌ ల‌ను మా యువ‌తీయువకులు త‌యారు చేస్తున్నారు.

వారు కృత్రిమ మేధ‌స్సు, బ్లాక్‌చెయిన్, మశీన్ లెర్నింగ్ టెక్నాల‌జీ ని బ్యాంకు లు, వినియోగ‌దారులు, నియంత్రణ దారు సంస్థ ల స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి వినియోగిస్తున్నారు.

అలాగే మా దేశ సామాజిక ల‌క్ష్యాల‌ను ఆరోగ్యం, విద్య నుండి సూక్ష్మ రుణం, బీమా ల వ‌ర‌కు అన్నింటిని వారు నెర‌వేరుస్తున్నారు.

భార‌త‌దేశం లో ఉన్న అపార నైపుణ్యాలు డిజిట‌ల్ ఇండియా, స్టార్ట్- అప్ ఇండియా ల వంటి కార్యక్రమాల కార‌ణం గా ఎంతో ప్ర‌యోజ‌నం పొంద‌గ‌లుగుతున్న‌ది. ఇందుకు మ‌ద్ద‌తునిచ్చే విధానాలు, ప్రోత్సాహ‌కాలు, ఫండింగ్ కూడా ఇందుకు ఉప‌క‌రిస్తున్నాయి.

ప్ర‌పంచం లో ఎక్కువ‌గా సమాచార రాశి ని వినియోగించే దేశం భార‌త‌దేశం. సమాచార రాశి వినియోగ ధర లు కూడా త‌క్కువ‌. ఫిన్‌టెక్‌ లో దీనిని అనుస‌రిస్తున్న అగ్ర‌గామి దేశం కూడా. అందువ‌ల్ల ఫిన్‌టెక్ కంపెనీల‌న్నింటికీ నేను భారతదేశం మీ అత్యుత్త‌మ గ‌మ్య‌స్థాన‌మ‌ని చెప్తాను.

ఎల్‌ఇడి బ‌ల్బుల ప‌రిశ్ర‌మ భార‌త‌దేశం లో సాధించిన ఆర్థిక స్థితి ని గ‌మ‌నించిన‌పుడు ఈ ఇంధ‌న సమర్థ‌త క‌లిగిన సాంకేతిక ప‌రిజ్ఞానం అంత‌ర్జాతీయం గా మ‌రింత చౌక‌ గా అందుబాటు ధ‌ర‌ లో ల‌భ్య‌మ‌య్యే స్థితి. ఇలా భారతదేశ విస్తృత విపణి, ఫిన్‌టెక్
ఉత్ప‌త్తులు మ‌రింత ప్ర‌మాణాలు పాటించ‌డానికి, రిస్క్‌లు త‌గ్గించ‌డానికి, ఖ‌ర్చులు త‌గ్గించడానికి, అంత‌ర్జాతీయ స్థాయి కి ఎద‌గ‌డానికి వీలు ను క‌లగజేస్తుంది.

మిత్రులారా,

స్వ‌ల్ప‌ వ్య‌వ‌ధిలో భారతదేశం ఫిన్‌టెక్ ద్వారా ఆరు గొప్ప‌ ప్ర‌యోజ‌నాలను పొంద‌గ‌లిగింది. అవి అందుబాటు, అనుసంధాన‌ం, సుల‌భ‌త‌ర జీవ‌నం, అవ‌కాశాలు, జ‌వాబుదారుతనం.

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా, ఇండో- ప‌సిఫిక్ నుండి ఆఫ్రికా, లాటిన్ అమెరికా ల వ‌ర‌కు చూసిన‌ట్ట‌యితే అసాధార‌ణ ఆవిష్క‌ర‌ణ‌ ల‌కు సంబంధించిన ప్రేర‌ణాత్మ‌క క‌థ‌నాలు, సామాన్యుల జీవితాల‌లో మార్పులను తీసుకువ‌స్తున్నాయి.

అయితే ,ఈ దిశ‌ గా చేయవలసింది ఇంకా ఎంతో ఉంది.

మ‌న దృష్టి ప్ర‌జ‌లంద‌రి అభివృద్ధి గా ఉండాలి, అంటే అత్యంత వెనుక‌బ‌డిన వారి అభివృద్ధి జ‌ర‌గాలి.

బ్యాంకింగ్ సేవ‌ లకు దూరంగా ఉన్న 1.7 బిలియన్ మంది ప్ర‌జ‌ల‌ను ఆర్థిక విపణుల ప్ర‌పంచంలోకి తీసుకురావాలి.

ప్రపంచ‌వ్యాప్తంగా బిలియ‌న్ కంటే ఎక్కు వ ఉన్న అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు ఇప్ప‌టివ‌ర‌కు సామాజిక భ‌ద్ర‌త‌, బీమా స‌దుపాయం అంద‌ని వారికి వాటిని క‌ల్పించాలి.

ఇందుకు అనుగుణంగా మ‌న క‌ల‌ ల‌ను సాకారం చేసుకోవ‌డానికి ఫిన్‌టెక్‌ ను ఉప‌యోగించుకోవాలి. ఆర్థిక వ‌న‌రులు అందుబాటులో లేక ఏ సంస్థా త‌న కార్య‌క‌లాపాలను ప్రారంభించ‌లేని ప‌రిస్థితి ఉండ‌కూడ‌దు.

నష్టభయాలు, మోసాలు, సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల‌ను దెబ్బ‌ తీసే విధానాల‌ను ఎదుర్కొనే స్థాయి లో మ‌న బ్యాంకులను, ఆర్థిక‌ సంస్థ‌ల‌ను ప‌టిష్టం చేయాలి.

నియంత్రణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిబంధ‌న‌లు పాటించేలా చేయ‌డానికి సాంకేతిక ప‌రిజ్ఞానాన్నివినియోగించుకోవాలి. ఇందువ‌ల్ల మ‌రిన్ని నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు రావ‌డానికి, నష్టభయాలు త‌గ్గ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

మ‌నీలాండ‌రింగ్‌ ను, ఇత‌ర ఆర్థిక మోసాల‌ను అరిక‌ట్టేందుకు మ‌నం ఫిన్‌టెక్ ఉప‌క‌ర‌ణాల‌ను ఉప‌యోగించుకోవాలి.

మ‌న డాటా, వ్య‌వ‌స్థ‌లు విశ్వ‌స‌నీయ‌మైన‌విగా, భ‌ద్ర‌మైన‌విగా ఉంటే ప్ర‌స్తుత అంత‌ర్‌ అనుసంధాన‌ం ప్ర‌పంచంలో ఆర్థిక ప్ర‌పంచం విజ‌య‌వంతం కాగ‌ల‌దు.

మ‌నం అంత‌ర్జాతీయం గా మ‌న అనుసంధానాన్ని సైబ‌ర్ బెదరింపు నుండి భ‌ద్రం గా రూపొందించుకోవాలి.

ఫిన్ టెక్ కార్య‌క‌లాపాల వేగం, వాటిని ముందుకు తీసుకుపోవ‌డం ప్ర‌జ‌ల‌కు సానుకూలంగా ఉండాలి గాని వారి ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ఉండ‌రాదు.

ఆర్థిక రంగానికి సంబంధించిన ఈ సాంకేతిక విజ్ఞానం ఎంద‌రో పేద‌ల జీవితాల‌ను మెరుగుప‌ర‌చ‌గ‌ల ప్ర‌త్య‌క్ష ప్ర‌భావాన్నిక‌లిగిఉండాలి.

అలాగే మ‌నం ఈ సాంకేతిక విజ్ఞానాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంపై ప్ర‌జ‌ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాలి. వారికి గ‌ల అవ‌కాశాల గురించి, ఇందుకు సంబంధించిన విధానాల గురించి వారికి తెలియ‌జేయాలి.

ఇందుకు ఫిన్‌టెక్ కేవ‌లం ఒక యంత్రాంగం లా కాకుండా ఒక ఉద్య‌మం గా ఉండాలి.

డాటా యాజ‌మాన్యానికి, స‌ర‌ఫ‌రా కు, ప్రైవ‌సీ, అనుతి, ప్రైవేట్‌, లోక కల్యాణం, చ‌ట్టం, విలువ‌ లకు సంబంధించి న ప్ర‌శ్న‌ల‌కు మ‌నం స‌మాధానాలు క‌నుగొనాలి.

చివ‌ర‌గా, భ‌విష్య‌త్తు కు అవ‌సర‌మైన నైపుణ్యాల‌పై మనం పెట్టుబ‌డి పెట్టాలి. దీర్ఘ‌కాలిక అవ‌స‌రాల కోసం పెట్టుబ‌డి పెట్ట‌డానికి, దీర్ఘ‌కాలిక అవ‌స‌రాల‌ కోసం ఆలోచ‌న‌లు చేయ‌డానికి మ‌ద్ద‌తివ్వ‌డానికి సిద్ధం కావాలి.

మిత్రులారా,

అవ‌కాశాలను, స‌వాళ్ల‌ను బ‌ట్టే ప్ర‌తి యుగం నిర్వ‌చింప‌బ‌డుతుంటుంది. ప్ర‌తి త‌రానికి భ‌విష్య‌త్తు ను రూప‌క‌ల్ప‌న చేసే బాధ్య‌త ఉంటుంది.

భావి ప్ర‌పంచం ప్ర‌తి అర‌చేతిలోనూ రూపుదిద్దుకొనేలా ఈ త‌రం చేస్తుంది.

మ‌న‌కు ల‌భించిన‌న్ని అవ‌కాశాలు చ‌రిత్ర‌లో మున్నెన్న‌డూ ల‌భించ‌లేదు.

కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు వారి జీవిత‌కాలంలో ఈ అవ‌కాశాలు, సుసంప‌న్న‌త సాకారం చేయ‌డానికి, ప్ర‌పంచాన్ని మ‌రింత మాన‌వీయంగా, ధ‌నిక‌, పేద‌ల మ‌ధ్య స‌మాన‌త్వంతో కూడిన‌దిగా, న‌గ‌రాలు, గ్రామాల మ‌ధ్య తేడాలు లేని, ఆకాంక్ష‌లు, విజ‌యాల మ‌ధ్య ఎలాంటి అస‌మాన‌త‌లు లేని స‌మాజ‌ నిర్మాణానికి మ‌న‌కు అవ‌కాశాలు ల‌భించాయి.

ఇత‌రుల‌ నుండి భారతదేశం నేర్చుకుంటున్న‌ట్టే, మ‌నం మ‌న అనుభ‌వాల‌ను, మ‌న నైపుణ్యాన్ని ప్ర‌పంచంతో పంచుకుందాం.

భారతదేశం సాధించేది ఇత‌రుల‌కు ఆశావ‌హ‌మైందే అవుతుంది. మేం భారతదేశాన్ని గురించి ఏం క‌ల‌లు కంటున్నామో ప్ర‌పంచం గురించి కూడా మేం అలాగే కోరుకుంటాం.

ఇది మ‌నంద‌రికీ ఉమ్మ‌డి ప్ర‌యాణం.

దీపాల పండుగ దీపావ‌ళి, చీక‌టి పై వెలుగు సాధించే విజ‌యం లాగే, నిరాశ‌, నిస్పృహ‌ల‌పై ఆశ‌, ఆనందాలు విజ‌యం సాధించిన‌ట్టే
ఈ ఉత్స‌వం మాన‌వాళి మెరుగైన భ‌విష్య‌త్తు కు అంద‌రూ క‌ల‌సిక‌ట్టు గా ఒక్కటి గా ముందుకుసాగాల‌ని పిలుపునిస్తోంది.

మీకు అందరికీ ధ‌న్య‌వాదాలు .