ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 5.30 గంటలకు “సాగర భద్రత విస్తరణ – అంతర్జాతీయ సహకారానికి కేసు” పేరిట వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగనున్న అత్యున్నత స్థాయి బహిరంగ గోష్ఠికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు.
ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాల దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు, ఐక్యరాజ్య సమితి వ్యవస్థ, ప్రాంతీయ వ్యవస్థలకు చెందిన అత్యున్నత స్థాయి వివరణ నిపుణులు పాల్గొంటారు. సాగర జలాలపై నేరాలను, అభద్రతను సమర్థవంతంగా అదుపు చేయగల మార్గాలు, సాగర జలాల విభాగంలో సమన్వయ పటిష్ఠత వంటి అంశాలపై ఈ సందర్భంగా బహిరంగ చర్చ జరుగుతుంది.
ఇప్పటికే సాగర జలలాల భద్రత, సాగర జలాలపై నేరాలకు చెందిన వివిధ అంశాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చించి తీర్మానాలు ఆమోదించింది. అయితే సాగర జలాల భద్రత అనే అంశాన్ని తీసుకుని సమగ్ర స్థాయిలో బహిరంగ గోష్ఠి నిర్వహించడం ఇదే ప్రథమం. ఏ దేశం కూడా సాగర జలాల భద్రతతో ముడిపడిన భిన్న అంశాలను ఏకాకిగా పరిష్కరించలేదు. అందుకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలనకు తీసుకోవడం అవసరం. ఇలా సాగర భద్రతను సమగ్రంగా చర్చించడం వల్ల సాగర జలాల్లో సాంప్రదాయికంగాను, సాంప్రదాయేతరంగాను ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి, చట్టబద్ధమైన కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వీలు కలుగుతుంది.
సింధు నాగరికత నుంచి నేటి వరకు విభిన్న కాలాల్లో భారతదేశ చరిత్రలో సాగరాలు కీలక పాత్ర పోషించాయి. సాగరాలు ఉమ్మడి శాంతి, భద్రతలకు దోహదపడతాయన్న మన నాగరికత నైతిక విలువలను పరిగణనలోకి తీసుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాగర్ విజన్ ను 2015లో ఆవిష్కరించారు. సాగర్ అనేది ప్రాంతీయ దేశాలన్నింటి భద్రత, వృద్ధికి సంకేత నామం. సాగరాలను సుస్థిర వినియోగానికి ఉపయోగించుకోవడంలో సహకరించుకోవడం; సురక్షతం, భద్రమైన ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవడం; సాగర జలాల్లో స్థిరత్వ సాధనపై ఈ విజన్ దృష్టి కేంద్రీకరిస్తుంది. 2019 సంవత్సరంలో దీన్ని ఏడు మూల స్తంభాల ఆధారంగా భారత పసిఫిక్ సాగర చొరవ (ఐపిఓఐ–ఇండో పసిఫిక్ ఓషియన్ ఇనీషియేటివ్) పేరిట మరింతగా విస్తరించారు. ఆ ఏడు అంశాలు సాగర పర్యావరణం; సాగర వనరులు; సామర్థ్యాల నిర్మాణం, వనరుల భాగస్వామ్యం; వైపరీత్యాల తగ్గింపు, నిర్వహణ; శాస్ర్తీయ, సాకేంతిక, విద్యా విభాగాల్లో సహకారం; వాణిజ్య అనుసంధానత మరియు సాగర రవాణా.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒక బహిరంగ గోష్ఠికి అధ్యక్షత వహిస్తున్నతొలి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెబ్ సైట్ లో భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు, న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది.
***