పశుగణం రంగంలో వృద్దికి ఊతమివ్వడానికి సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎమ్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సవరించిన ఆర్‌జీఎమ్‌ను రూ.1000 కోట్ల అదనపు వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పథకంలో కేంద్ర వాటా కింద అమలు చేయనున్నారు. 2021-22 మొదలు 2025-26 సంవత్సరాలకు వర్తించే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఈ పథకానికి మొత్తం రూ.3400 కోట్లు ఖర్చు చేయనున్నారు.
రెండు కార్యకలాపాలను కొత్తగా అమలు చేయనున్నారు. వాటిలో ఒకటోది చిన్న వయస్సు గల ఆవుల సంరక్షక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అయ్యే మూలధన వ్యయంలో నుంచి 35 శాతాన్ని ఒకసారి సాయంగా నిర్దిష్ట ఏజెన్సీలకు అందిస్తారు. మొత్తం 15000 ఆవుదూడలకు 30 పాలన, పోషణ నిలయాలను ఈ ఏజెన్సీలు నెలకొల్పుతాయి. ఇక రెండోది.. ఉన్నత అనువంశకత కలిగిన కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) మార్గంలో ఉత్పత్తి చేసిన పెయ్య దూడలను కొనుగోలు చేసేదిశగా రైతులను ప్రోత్సహించడం. దీనికోసం పాల సంఘాల నుంచి గాని, ఆర్థిక సంస్థల నుంచి గాని, బ్యాంకుల నుంచి గాని రైతు తీసుకునే రుణానికి చెల్లించాల్సిన వడ్డీలో 3 శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లించే (ఇంటరెస్ట్ సబ్వెన్షన్) వెసులుబాటును సమకూర్చడం. ఈ చర్య అధికంగా పాలిచ్చే తరహా జాతులను వ్యవస్థలో భాగం చేయడానికి తోడ్పడుతుంది.
పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసులు వర్తించే కాలంలో, అంటే 2021-22 మొదలు 2025-26 మధ్య రూ.3400 కోట్ల కేటాయింపుతో సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ను ఆమోదించారు.
రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా ప్రస్తుతం చేపడుతున్న కార్యకలాపాలను కొనసాగించడానికే ఈ పథకాన్ని ఉద్దేశించారు. మిషన్ కార్యకలాపాల్లో వీర్య కేంద్రాలను (సీమెన్ స్టేషన్స్), కృత్రిమ గర్భధారణ నెట్‌వర్కును బలోపేతం చేయడం, ఎద్దుల ఉత్పత్తి కార్యక్రమాన్ని అమలుపరచడం, లింగ నిర్ధారిత వీర్య పద్ధతిని ఉపయోగించి తక్కువ కాలంలో ఎక్కువ పశుగణాభివృద్ధిని సాధించే కార్యక్రమాన్ని అమలుచేయడం, నైపుణ్యాభివృద్ధి, రైతుల్లో చైతన్యాన్ని ప్రోది చేయడం, శ్రేష్ఠత్వ కేంద్రాలను (సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ఏర్పాటు చేయడం సహా వినూత్న కార్యకలాపాలకు మద్దతివ్వడం, కేంద్రీయ పశుగణ పెంపక క్షేత్రాలను (సెంట్రల్ క్యాటిల్ బ్రీడింగ్ ఫారమ్స్) పటిష్టపరచడంతోపాటు ఈ తరహా కార్యకలాపాలకు ఇప్పుడు అందిస్తున్న సహాయానికి సంబంధించిన నియమనిబంధనలలో ఎలాంటి మార్పు చేయకుండానే ఈ పటిష్టీకరణను చేపట్టడం.. వంటివి భాగంగా ఉన్నాయి.
రాష్ట్రీయ గోకుల్ మిషన్‌ను అమలు చేయడంతోపాటు ప్రభుత్వం చేపడుతున్న ఇతరత్రా కృషి మూలంగా, పాల ఉత్పత్తి గత పది సంవత్సరాల్లో 63.55 శాతం మేర పెరిగింది. తలసరి పాల లభ్యత సైతం హెచ్చింది. 2013-14లో తలసరి పాల లభ్యత రోజుకు 307 గ్రాములు ఉండగా, 2023-24లో రోజుకు 471 గ్రాములకు చేరుకొంది. ఉత్పాదకత కూడా గత పదేళ్లలో 26.34 శాతానికి వృద్ధి చెందింది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎమ్)లో భాగంగా ఉన్న దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం (ఎన్ఏఐపీ) భారత్ అంతటా 605 జిల్లాల్లో రైతుల ఇళ్ల ముంగిటే కృత్రిమ గర్భధారణను (ఏఐ) ఉచితంగా అందిస్తారు. అయితే ఈ సౌకర్యాన్ని బేస్‌లైన్ ఏఐ కవరేజీ 50 శాతం కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాలకే అందిస్తారు. ఇంతవరకు, 8.39 కోట్లకు పైగా పశువులను లెక్కలోకి తీసుకున్నారు. 5.21 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభించింది. పశు జననాలకు సంబంధించి అత్యధునాతన సాంకేతికతను ఆచరణలోకి తీసుకురావడంతోపాటు దానిని రైతుల ఇళ్ల ముంగిటకు తీసుకురావడంలోనూ ఆర్‌జీఎమ్ అగ్రగామిగా ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర పశుగణ మండళ్ల (ఎస్ఎల్‌బీస్) ఆధ్వర్యంలో గాని, విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో గాని మొత్తం 22 ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. 2541 కన్నా ఎక్కువ హై జనెటిక్ మెరిట్ కలిగిన (హెచ్‌జీఎమ్) దూడలు పుట్టాయి. స్వయంసమృద్ధ సాంకేతికతలో గౌ చిప్, మహిష్ చిప్ రూపంలో రెండు ప్రధానమైన అడుగులు పడ్డాయి. ఇవి జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ), ఐసీఏఆర్‌కు చెందిన జాతీయ పశు ఆనువంశిక వనరుల మండలి (నేషనల్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ బ్యూరో.. ఎన్బీఏజీఆర్) అభివృద్ధిచేసిన స్వదేశీ గోజాతి పశువులకు ఉద్దేశించిన జినోమిక్ చిప్స్. ఎన్‌డీడీబీ అభివృద్ధి చేసిన గౌ సార్ట్ దేశీయంగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్య ఉత్పాదన సంబంధిత సాంకేతికత.
ఈ పథకం పాల ఉత్పత్తిని చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచనుంది. ఉత్పాదకతతో పాటు అంతిమంగా రైతుల ఆదాయాలను కూడా మెరుగుపరచనుంది. భారతదేశంలో దేశవాళీ ఎద్దుల ఉత్పాదనలో సువ్యవస్థిత, శాస్త్రీయ ప్రయత్నాలపైన, స్వదేశీ గోజాతి సంబంధిత జీనోమిక్ చిప్స్‌ను అభివృద్ధిపరచడం ద్వారా స్వదేశీ గోజాతి వంశక్రమాల శాస్త్రీయ సంరక్షణ, పరిరక్షణలపైన కూడా ఈ పథకం దృష్టిని కేంద్రీకరించనుంది. దీనికి అదనంగా, ఈ పథకంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల వల్ల ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ఒక సువ్యవస్థిత టెక్నాలజీ రూపాన్ని సంతరించుకొంది. ఈ కార్యక్రమం ఉత్పాదకతను పెంచడం ఒక్కటే కాకుండా, 8.5 కోట్ల మంది పాడి రైతులకు మేలు చేస్తుంది.
***