Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్‌ అనిరూద్‌ జుగనాథ్‌ మృతిపై గౌరవనీయ మారిషస్‌ ప్రధాని ప్రవీంద్‌ కుమార్‌ జుగనాథ్‌కు ఫోన్‌ ద్వారా సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


   మారిషస్‌ మాజీ ప్రధాని అనిరూద్‌ జుగనాథ్‌ కన్నుమూసిన నేపథ్యంలో ఆయన కుమారుడైన ప్రస్తుత ప్రధాని గౌరవనీయ ప్రవీంద్‌ కుమార్‌ జుగనాథ్‌కు ఫోన్‌ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. మారిషస్‌ ప్రధానమంత్రిగా, అధ్యక్షుడుగా తన జీవితంలో చాలా ఏళ్లపాటు సర్‌ అనిరూద్‌ జుగనాథ్‌ ప్రజాసేవ చేయడాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లో సర్‌ అనిరూద్‌ జుగనాథ్‌కుగల గౌరవాదరాలను ప్రముఖంగా ప్రస్తావించారు. మారిషస్‌తో భారత్‌ స్నేహసంబంధాలు అత్యంత ప్రత్యేకంగా పరిణామం చెందడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రస్తుతించారు. ఆయనను ‘గర్వకారకుడైన ప్రవాస భారతీయుడు’గా అభివర్ణిస్తూ- సర్‌ అనిరూద్‌ జుగనాథ్‌ను ‘ప్రవాస భారతీయ పురస్కారం’తోపాటు ‘పద్మ విభూషణ్‌’తో సత్కరించడం భారత్‌కు దక్కిన గౌరవంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. కాగా, సర్‌ అనిరూద్‌ వారసత్వ విధానాలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ ప్రకటించారు.

 

***