ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ రైతు శ్రీ ఎం.మల్లికార్జున రెడ్డితో ముచ్చటించారు. ఆయన వ్యవసాయంతోపాటు పశుపోషణ, ఉద్యాన సాగు కూడా చేస్తుంటారు. కాగా, బి.టెక్ పట్టభద్రులైన శ్రీ రెడ్డి ఇంతకుముందు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసినవారు కావడం గమనార్హం. ఈ సందర్భంగా తన జీవన పయనం గురించి వివరిస్తూ- తాను విద్యావంతుణ్ని కాబట్టే రైతుగా రాణిస్తున్నానని శ్రీ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ప్రకృతి వ్యవసాయంతోపాటు తోటల పెంపకం, పశుపోషణ ద్వారా సమీకృత వ్యవసాయం చేపట్టానని ఆయన వెల్లడించారు. ఈ పద్ధతి వల్ల ప్రధానంగా రోజువారీ ఆదాయానికి భరోసా ఉంటుందని తెలిపారు. వ్యవసాయంలో భాగంగా ఔషధ మొక్కల సాగు కూడా చేస్తున్నందున ఐదు మార్గాల్లో ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు. లోగడ వ్యవసాయం మాత్రమే చేస్తున్నపుడు వార్షికాదాయం రూ.6 లక్షలుగా ఉండేదన్నారు. ఇప్పుడు సమీకృత విధానంతో తన ఆదాయం రూ.12 లక్షలు.. అంటే- రెట్టింపు అయిందని తెలిపారు.
వ్యవసాయ రంగంలో తన కృషికి ‘ఐకార్’సహా పలు ప్రసిద్ధ సంస్థల నుంచి పురస్కారం లభించిందని శ్రీ రెడ్డి చెప్పారు. భారత పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు నుంచి కూడా సత్కారం పొందానని తెలిపారు. సమీకృత వ్యవసాయంపై ప్రచారంతోపాటు పరిసర ప్రాంతాల రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తున్నానని శ్రీ రెడ్డి చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డు, భూసార కార్డు, బిందుసేద్యం రాయితీ, పంటల బీమా పథకం వగైరాల ద్వారా ప్రయోజనం పొందానని మల్లికార్జున రెడ్డి వివరించారు.
అనంతరం ప్రధానమంత్రి స్పందిస్తూ- కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందిన రుణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇస్తున్నందున వడ్డీ శాతాన్ని ఒకసారి పరిశీలించాల్సిందిగా సూచించారు. తరచూ విద్యార్థులతో మమేకమై విద్యావంతులైన యువత వ్యవసాయం రంగంపై మక్కువ చూపేలా కృషి చేయాలని ఆయనకు సూచించారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి ఇద్దరు కుమార్తెలతోనూ ప్రధాని మాట్లాడారు. విద్యావంతులైన యువత వ్యవసాయ రంగంలో ప్రవేశించడంపై హర్షం వ్యక్తం చేస్తూ- ‘‘ఈ రంగంలోగల అపార అవకాశాలకు మీరు బలమైన ఉదాహరణగా నిలిచారు’’ అని సమీకృత వ్యవసాయం చేస్తున్న మల్లికార్జున రెడ్డిని ప్రశంసించారు. ఆయన కృషి ఇతర రైతులకూ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ యువ వ్యవస్థాపకుడి విజయం కోసం తోడునీడగా నిలుస్తూ ఎంతో త్యాగం చేశారంటూ శ్రీ రెడ్డి భార్యను కూడా ప్రధాని మెచ్చుకున్నారు.
***