ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్ వారి కేన్సర్ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఖోడల్ ధామ్ పవిత్ర భూమితో, ఖోడల్ మాత భక్తులతో ఈ విధంగా మమేకం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతోషం వెలిబుచ్చారు. అమ్రేలిలో కేన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రాలకు శంకుస్థాపన ద్వారా శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్ ప్రజా సంక్షేమ/సేవా రంగాల్లో మరో ముఖ్యమైన ముందడుగు వేసిందని శ్రీ మోదీ వివరించు. శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్-కాగ్వాడ్ స్థాపించి త్వరలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సేవాభావం, ఉన్నత విలువలు, సత్సంకల్పంతో లేవా పటీదార్ సమాజం శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్టును 14 ఏళ్ల కిందట స్థాపించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆనాటినుంచీ తన విశిష్ట సేవల ద్వారా లక్షలాది ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకు కృషి చేసిందని కొనియాడారు. ఈ మేరకు ‘‘విద్య, వ్యవసాయం, ఆరోగ్యం సహా రంగమేదైనా ఖోడల్ ధామ్ ట్రస్ట్ బహుముఖ కృషి అత్యద్భుతం’’ అని ప్రశంసించారు. అమ్రేలిలో నిర్మించనున్న కేన్సర్ ఆస్పత్రి ట్రస్టు సేవా స్ఫూర్తికి మరో నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. ఈ ఆస్పత్రి ద్వారా అమ్రేలిసహా సౌరాష్ట్రలోని విశాల ప్రాంతం కూడా విస్తృత ప్రయోజనం పొందుతాయని ప్రధాని అన్నారు. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి చికిత్స చేయించుకోవడం ఏ వ్యక్తికైనా, కుటుంబానికైనా పెను సవాలేనని ప్రధానమంత్రి అన్నారు. ఈ చికిత్సలో రోగికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ దిశగా గడచిన 9 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 30 కొత్త కేన్సర్ ఆస్పత్రులు నిర్మించామని, మరో 10 కొత్త ఆస్పత్రుల పనులు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.
కేన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కేన్సర్ నిర్ధారణ అయ్యేసరికి వ్యాధి ముదిరిపోతున్నదని ఆయన గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితుల నివారణ కోసమే కేంద్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో 1.5 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను నిర్మించిందని తెలిపారు. వీటిలో కేన్సర్‌సహా అనేక ప్రాణాంతక వ్యాధులను ముందస్తుగా గుర్తించడంపై దృష్టి సారిస్తారని ఆయన తెలిపారు. ‘‘కేన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే, సరైన చికిత్స చేసే అవకాశం వైద్యులకు లభిస్తుంది’’ అన్నారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్ లేదా రొమ్ము కేన్సర్ వంటివాటిని ప్రాథమిక దశలోనే గుర్తించడంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మహిళలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నారని శ్రీ మోదీ గుర్తుచేశారు.
గడచిన రెండు దశాబ్దాల్లో గుజరాత్ ఆరోగ్య రంగంలో అద్భుత ప్రగతి సాధించిందని, ఆ మేరకు దేశంలోనే అతిపెద్ద వైద్య కూడలిగా మారిందని ప్రధాని గుర్తుచేశారు. రాష్ట్రంలో 2002 నాటికి కేవలం 11 వైద్య కళాశాలలుండగా, నేడు వాటి సంఖ్య 40 దాటిందని, ఈ 20 ఏళ్లలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య దాదాపు 5 రెట్లు పెరిగిందని చెప్పారు. అదేవిధంగా పీజీ సీట్ల సంఖ్య కూడా మూడు రెట్లు పెరగడంతో విద్యార్థులకు సౌలభ్యం కలిగిందని వివరించారు. ‘‘ఇప్పుడు మనకు రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ కూడా ఉంది’’ అని ఆయన గుర్తుచేశారు. అలాగే 2002 నాటికి గుజరాత్లో 13 ఫార్మసీ కళాశాలలు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య ఇవాళ దాదాపు 100 దాటిందని తెలిపారు. గత 20 ఏళ్లలో ఫార్మసీ డిప్లొమా కళాశాలల సంఖ్య కూడా 6 నుంచి 30కి పెరిగినట్లు వివరించారు. ప్రతి గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ఆరోగ్య రంగంలో ప్రధాన సంస్కరణలకు గుజరాత్ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు. మరోవైపు గిరిజన, పేద ప్రాంతాలకు ఆరోగ్య సౌకర్యాలను విస్తరించినట్లు ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ‘‘గుజరాత్లో 108 అంబులెన్స్ సౌకర్యంపై ప్రజల విశ్వాసం నిరంతరం బలపడుతూ వచ్చింది’’ అని ఆయన గుర్తుచేశారు.
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యకర, బలవర్ధక సమాజం అవసరమని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. ‘‘ఖోడల్ మాత ఆశీస్సులతో ఇవాళ మన ప్రభుత్వం ఇదే మార్గంలో పయనిస్తోంది’’ అని ప్రధాని అన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రస్తావిస్తూ- నేడు పెద్ద సంఖ్యలో కేన్సర్ రోగులుసహా 6 కోట్ల మందికిపైగా ప్రజలు ఉచిత చికిత్స పొందడంలో ఈ పథకం ఎంతగానో తోడ్పడుతున్నదని చెప్పారు. తద్వారా పేదలకు రూ.లక్ష కోట్ల మేర ఆదా అయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా 80 శాతం రాయితీతో నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచేవిధంగా 10,000 జనౌషధి కేంద్రాలను ప్రారంభించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల సంఖ్యను 25,000కు పెంచాలని లక్ష్య నిర్దేశం చేసుకోవడం గురించి కూడా ప్రధాని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు, పథకాల ద్వారా ప్రజలకు రూ.30,000 కోట్లదాకా ఖర్చు తప్పిందని చెప్పారు. ‘‘ప్రభుత్వం కేన్సర్ మందుల ధరలను కూడా నియంత్రించింది.. దీంతో పెద్ద సంఖ్యలో రోగులకు ప్రయోజనం చేకూరింది’’ అని ఆయన చెప్పారు.
శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్‌తో తన దీర్ఘకాలిక అనుబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ప్రధాని మోదీ 9 అభ్యర్థనలను ప్రజల ముందుంచారు. ఈ మేరకు ప్రతి నీటి బొట్టును పొదుపు చేయడంతోపాటు జల సంరక్షణపై అవగాహన కల్పించడం. రెండోది- గ్రామ స్థాయిలో డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం. మూడోది- ప్రతి ఒక్కరూ తమ గ్రామం, ప్రాంతం, నగరాన్ని పరిశుభ్రతలో అగ్రస్థానంలో ఉంచడం. నాలుగోది- స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం, వీలైనంత మేర ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల వాడకం. ఐదోది- దేశంలో ప్రయాణం, దేశీయ పర్యాటకానికి ప్రోత్సహాం. ఆరోది- ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం. ఏడోది – దైనందిన ఆహారంలో శ్రీ అన్న (చిరుధాన్యాలు) చేర్చుకోవడం. ఎనిమిదోది- శరీర దారుఢ్యం… నిత్యం యోగా లేదా ఏదో ఒక ఆట ఆడటం/జీవితంలో దాన్ని అంతర్భాగం చేసుకోవడం. చివరిది- మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం.
ఎప్పటిలాగానే ట్రస్ఠు పూర్తి అంకిత భావంతో, సామర్థ్యంతో తన బాధ్యతలను నెరవేర్చగలదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రస్టు ఆధ్వర్యాన అమ్రేలిలో నిర్మిస్తున్న కేన్సర్ ఆస్పత్రి యావత్ సమాజ సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు. చివరగా లేవా పటీదార్ సమాజానికి, శ్రీ ఖోడల్ ధామ్ ట్రస్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఖోడల్ మాత దయతో మీరు నిరంతరం సామాజిక సేవలో తరించాలి’’ అని ఆకాంక్షించారు. వివాహ వేడుకల కోసం విదేశాలకు వెళ్లే ఆలోచన మాని, దేశంలోని ఎన్నో సుందర, ఆహ్లాదకర ప్రాంతాలను ఎంచుకోవాలని సంపన్న వర్గాలకు సూచించారు. ఆ మేరకు ‘‘మేడ్ ఇన్ ఇండియా తరహాలో ఇప్పుడు ‘వెడ్ ఇన్ ఇండియా’’కు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.
Sharing my remarks at foundation stone laying ceremony of Khodaldham Trust Cancer Hospital in Gujarat. https://t.co/ouPCMUpNgt
— Narendra Modi (@narendramodi) January 21, 2024