గ్రీన్ హౌస్ వాయువుల (జి హెచ్ జిల) ఉద్గారాన్ని అదుపులో ఉంచడానికి ఉద్దేశించిన క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రం (క్యోటో ప్రోటోకాల్)రెండవ వచనబద్ధత కాలాన్ని అనుమోదించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రం రెండవ వచనబద్ధత కాలంపై 2012 సంవత్సరంలో అంగీకారం కుదిరింది. దీనిని ఇంతవరకు అనుమోదించిన (ర్యాటిఫైడ్) దేశాలు డెబ్భయ్ అయిదు.
శీతోష్ణ స్థితిలో మార్పునకు సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో భారతదేశం పోషించిన కీలకమైన పాత్రను దృష్టిలో పెట్టుకొంటే, శీతోష్ణ స్థితి సంబంధిత న్యాయం మరియు పర్యావరణ పరిరక్షణ అనే ప్రపంచ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్న భిన్న దేశాల మధ్య సౌమనస్యం విషయంలోనూ భారతదేశం నాయకత్వం వహిస్తున్నట్లుగా ప్రస్తుత నిర్ణయం మరింతగా స్పష్టం చేస్తున్నట్లు అవుతోంది. క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రాన్ని భారతదేశం అనుమోదించడం అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలను కూడా ఈ దిశగా ప్రోత్సహించగలుగుతుంది. నిలకడైన అభివృద్ధి ప్రాధమ్యాలకు అనుగుణంగా ఈ వచనబద్ధత కాలంలో క్లీన్ డెవలప్ మెంట్ మెకానిజమ్ (సిడిఎమ్) పథకాలను అమలుపరచడం కోసం భారతదేశంలోకి మరిన్ని పెట్టుబడులు తరలివచ్చేందుకూ ఆస్కారం ఏర్పడుతుంది.
శీతోష్ణ స్థితి వ్యవస్థపై కనీస ప్రమేయం ఉండే స్థాయిలో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువు కేంద్రీకరణలను స్థిరీకరించడమే ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (యుఎన్ఎఫ్ సిసి) ఉద్దేశం. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువు ప్రస్తుతమున్న అధిక స్థాయిలకు చేరడంలో అభివృద్ధిచెందిన దేశాలదే ప్రధాన బాధ్యత అని గుర్తించి, వాటిని తగ్గించే దిశగా ఏర్పరచిన లక్ష్యాల సాధనకు కృషి చేస్తామన్న వాగ్దానాన్ని అభివృద్ధి చెందిన దేశాల నుండి క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రం పుచ్చుకున్నది. అంతేకాకుండా, దీనికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని, ఆర్థిక వనరులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదలాయించాలని కూడా ఈ ప్రాథమిక పత్రం సూచిస్తోంది. క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రం నిర్దేశిస్తున్న తప్పనిసరి కర్తవ్యాలు లేదా లక్ష్యాల తాలూకు భారమేదీ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైన లేదు.
పూర్వరంగం:
క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రాన్ని 1997వ సంవత్సరంలో ఆమోదించారు. 2008-2012 వరకు ఒకటవ వచనబద్ధత కాలంగా పరిగణించారు. రెండవ వచన బద్ధత కాలానికిగాను క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రంలో సవరణ (దోహా సవరణ) లను 2013 మొదలుకొని 2020 వరకు అమలుపరచేటట్లు విజయవంతంగా ఆమోదించడమైంది. దోహా సవరణలో పొందుపరచిన ‘ఆప్ట్-ఇన్’ నిబంధనలలో భాగంగా అభివృద్ధి చెందిన దేశాలు తాము చేసిన వాగ్దానాలను ఇప్పటికే అమలుపరచడం ఆరంభించాయి.
2020 కన్నా పూర్వపు కాలంలో అభివృద్ధి చెందిన దేశాలు పాటించవలసిన శీతోష్ణస్థితి సంబంధిత పనులను గురించి భారతదేశం తరచుగా చెబుతూ వచ్చింది. అంతేకాకుండా కన్వెన్షన్ విధి విధానాల ప్రాతిపదికన చేపట్టవలసిన శీతోష్ణ స్థితి చర్యలను.. ఉదాహరణకు ది ప్రిన్సిపుల్ ఆఫ్ ఈక్విటీ అండ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ కేపబిలిటీస్ (సిబిడిఆర్ & ఆర్ సి) వంటివాటి కోసం.. కూడా భారతదేశం వాదించింది.