Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శత్రు వాటాల అమ్మకం కోసం విధివిధానాల రూపకల్పన యంత్రాంగం ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం


 ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- దేశంలోని శత్రు వాటాల విక్రయానికి సంబంధించి విధివిధానాల రూపకల్పన, యంత్రాంగం ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వివరాలిలా ఉన్నాయి:

i.    శత్రు ఆస్తుల చట్టం-1968… సెక్షన్ 8ఎ కింద ఉప సెక్షన్ 1కి అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అజమాయిషీలోని శత్రు లేదా కాందిశీక ఆస్తుల సంరక్షణ విభాగం (CEPI)ద్వారా శత్రు వాటాల విక్రయానికి ‘సూత్రప్రాయ ఆమోదం’ లభించింది.

ii.    అందుకు అనుగుణంగా శత్రు ఆస్తుల చట్టం-1968… సెక్షన్ 8ఎ కింద- ఉప సెక్షన్ 7 నిబంధనల ప్రకారం సదరు వాటాల విక్రయానికిగాను పెట్టుబడులు-ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖకు అధికారం దఖలుపరచబడింది. 

iii.    ఈ వాటాల విక్రయానంతరం సమకూరే ధనాన్ని పెట్టుబడుల ఉపసంహరణ నిధుల పద్దుకింద కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించే ప్రభుత్వ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది.

వివరాలు:
 
1.    మొత్తం 20,323 మంది వాటాదారులకు సంబంధించి దేశంలోని 996 కంపెనీలలో 6,50,75,877 వాటాలు ప్రస్తుతం CEPI సంరక్షణలో ఉన్నాయి. కాగా, ఈ 996 కంపెనీలలో 588 వరకూ ఉనికి/చురుగ్గా ఉండగా వీటిలో 139 లిస్టెడ్ (షేర్ మార్కెట్లో నమోదైన), మిగిలినవి అన్ లిస్టెడ్ కంపెనీలు. ఈ వాటాలను విక్రయించే ప్రక్రియకు ఆర్థికశాఖ మంత్రి అధ్యక్షతన రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి సభ్యులుగాగల ప్రత్యామ్నాయ యంత్రాంగం (AM) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ యంత్రాంగానికి ఉన్నతస్థాయి అధికారుల కమిటీ (HLC) సహాయసహకారాలు అందిస్తుంది. ఇందులో పెట్టుబడులు-ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (DIPAM) కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సహాధ్యక్షులుగా (కేంద్ర ఆర్థిక, న్యాయ, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నుంచి, CEPI నుంచి ప్రతినిధులు సభ్యులుగా)   ఉంటారు. వాటాలు వగైరా విక్రయానికి సంబంధించి వాటి పరిమాణం (సంఖ్య), ధర/ధరల శ్రేణి, సూత్రావళి/యంత్రాంగం తదితరాలపై ఈ కమిటీ సిఫారసులు అందజేస్తుంది.

2.    వాటాల విక్రయానికి ముందు సదరు ప్రక్రియ ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్ లేదా అధీకృత సంస్థ లేదా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం తీర్పు/జప్తు ఆదేశం/నిబంధనలు వంటివాటికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని.. లేదా ఉల్లంఘన కిందకు రాదని, సదరు వాటాల విక్రయానికి ప్రభుత్వం అన్ని హక్కులూ కలిగి ఉన్నదని CEPI ధ్రువీకరించాలి.

3.    శత్రు లేదా కాందిశీకుల చరాస్తులైన వాటాల వంటివాటిని విక్రయించే క్రమంలో వాణిజ్య బ్యాంకులు, న్యాయసలహాదారులు లేదా విక్రయాల బ్రోకర్లువంటి సలహాదారులు లేదా మధ్యవర్తులు అవసరమవుతారు. అలాంటివారి నియామకం కోసం బహిరంగ/పరిమిత టెండర్ ప్రక్రియను DIPAM నిర్వహిస్తుంది. అటుపైన అంతర-మంత్రిత్వ బృందం (IMG) విక్రయ ప్రక్రియకు మార్గనిర్దేశం చేస్తుంది. 

1968నాటి చట్టానికి సంబంధించి ‘‘శత్రువు’’  అనే పదానికి నిర్వచనం ఇలా ఉంది: ‘‘శత్రువు/కాందిశీకులు’’ లేదా ‘‘శత్రు అంశం’’ లేదా ‘‘శత్రు సంస్థ’’ అంటే… భారత రక్షణ చట్టం-నిబంధనల ప్రకారం… ఒక వ్యక్తి లేదా దేశం మనకు శత్రువు, శత్రు అంశం లేదా శత్రు సంస్థగా ఉండి ఉండొచ్చు. అయితే, ఈ వర్గాల్లో ‘‘దేనిలోనూ భారత పౌరులు మాత్రం ఉండరు.’’ కాగా, ఈ చట్టానికి 2017లో చేసిన సవరణలో ఈ నిర్వచనానికి కొన్ని మార్పుచేర్పులు చేశారు. ఆ మేరకు ‘‘శత్రువులు/కాందిశీకుల చట్టబద్ధ వారసులు- వారు భారత పౌరులైనా కావచ్చు… కాకపోవచ్చు లేదా మనకు శత్రువుకాని దేశానికి చెందిన పౌరుడు కావచ్చు లేదా జాతీయతను మార్చుకున్న శత్రువు కావచ్చు’’ అని సవరించబడింది.

ప్రభావం:
 
1.    ఈ నిర్ణయం వల్ల కొన్ని దశాబ్దాలుగా ఎవరికీ చెందకుండా మూలుగుతున్న శత్రు వాటాలు కాందిశీకుల ఆస్తుల చట్టం-1968 అమలులోకి వచ్చిన నేపథ్యంలో ద్రవ్య రూపంలోకి మారే వీలు ఏర్పడింది.
 
2.    అంతేకాకుండా 2017లో చేసిన సవరణవల్ల శత్రు ఆస్తుల విక్రయానికి ఎలాంటి అడ్డంకులకూ తావులేని చట్టపరమైన వెసులుబాటు కల్పించబడింది. 
 
3.    తాజాగా కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో శత్రు వాటాల విక్రయానికి అవసరమైన విధివిధానాల రూపకల్పన యంత్రాంగంతోపాటు వ్యవస్థీకృత చట్రం ఏర్పడే అవకాశం అందివచ్చింది.

కీలక ప్రభావం:

ఈ నిర్ణయం వల్ల కొన్ని దశాబ్దాలుగా ఎవరికీ చెందకుండా మూలుగుతున్న శత్రు వాటాలు కాందిశీకుల ఆస్తుల చట్టం-1968 అమలులోకి వచ్చిన నేపథ్యంలో ద్రవ్య రూపంలోకి మారే వీలు ఏర్పడింది. అలాగే ఈ విక్రయాలద్వారా లభ్యమయ్యే నిధులను దేశవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించే సదవకాశం లభిస్తుంది. 

పూర్వరంగం:

i.    భారత రక్షణ నిబంధనలు-1962, భారత రక్షణ నిబంధనలు-1971 (27.09.1997నుంచి అమలయ్యాయి) కింద CEPI అధీనంలో ఉన్న శత్రు/కాందిశీకుల ఆస్తులపై నిరంతర నియంత్రణ హక్కులు దఖలుపడతాయి. 

ii.    ఈ చట్టానికి 2017లో చేసిన సవరణద్వారా సెక్షన్ 8ఎ కింద శత్రు ఆస్తుల విక్రయ అధికారం CEPIకి దఖలుపడింది. అంతేకాకుండా…

a)    ‘‘ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునల్ లేదా అధీకృత సంస్థ లేదా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం తీర్పు/జప్తు ఆదేశం/నిబంధనలతో నిమిత్తం లేకుండా శత్రు ఆస్తుల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న సంస్థ కేంద్ర ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ నిర్దేశానికి అనుగుణంగా, ముందస్తు ఆమోదం లేదా సాధారణ/ప్రత్యేక ఆదేశాల జారీ ఆధారంగా శత్రు ఆస్తుల (సవరణ/చెల్లుబాటు) చట్టం-2017 అమలులోకి రాకముందే అందులోని నిబంధనల మేరకు సదరు శత్రు ఆస్తులను విక్రయించడం మరే విధంగానైనా ద్రవ్యరూపంలోకి మార్చుకోవచ్చు.’’

b)    శత్రు ఆస్తుల చట్టం-1968 సెక్షన్ 8ఎలోని ఉప సెక్షన్ 7లోగల సవరణ ప్రకారం… సదరు ఆస్తలు సంరక్షణ బాధ్యత చూస్తున్న సంస్థకు బదులు వాటి అమ్మకపు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఏ అధీకృత సంస్థకైనా, మరేదైనా మంత్రిత్వ శాఖకైనా అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వవచ్చు.

******