ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారత నౌకాదళానికి చెందిన సామగ్రి నిర్వహణకు ఇండియన్ నావల్ మెటీరియల్ మేనేజ్ మెంట్ సర్వీస్ (ఐఎన్ ఎమ్ఎమ్ఎస్) పేరిట ఒక కొత్త విభాగాన్ని గ్రూప్ ‘ఎ’ ఇంజనీరింగ్ సర్వీసుగా ఏర్పాటు చేసేందుకు, ఇందుకు అనుగుణంగా నౌకాదళ స్టోర్ అధికారుల గ్రూప్ ‘ఎ’ కాడర్ లో మార్పులు చేసేందుకు ఆమోదం తెలిపింది.
గ్రూప్ ‘ఎ’ పేరిట ఒక వ్యవస్థాత్మకమైన విభాగాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ రంగంలోకి అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి, అర్హులైన మెటీరియల్ మేనేజర్లను నియమించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. భారత నౌకాదళం సామగ్రి నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడి అన్ని వేళల్లోను రంగంలోకి దిగడానికి నౌకాదళ సమాయత్తతను పెంచుతుంది.
ఈ ప్రతిపాదిత ఐఎన్ ఎమ్ఎమ్ఎస్ మెటీరియల్ నిర్వహణ విభాగంలోని అత్యుత్తమ నిపుణులను ఆకర్షించడం ద్వారా నౌకాదళానికి చెందిన సామగ్రి నిర్వహణ విధులను మరింత బలోపేతం చేస్తుంది. ఈ విభాగంలో చేరే వారికి మరింత మెరుగైన కరియర్ అవకాశాలను అందించడంతో పాటు నౌకాదళ స్టోర్ లలో మెటీరియల్ నిర్వహణ సామర్థ్యాలు పెరిగి, ఏ క్షణంలో అయినా బరిలోకి దిగేందుకు నౌకాదళానికి సన్నద్ధతను సమకూర్చుతుంది.
—