Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్య‌వ‌సాయ‌రంగ మౌలిక స‌దుపాయాల నిధి కింద ఆర్ధిక స‌హాయ స‌దుపాయ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం


స్నేహితులారా,

ఈ రోజు హ‌ల ష‌ష్ఠి. భ‌గ‌వాన్ బ‌ల‌రాములవారి జ‌యంతి. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ, ముఖ్యంగా అన్న‌దాత‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. 

ఈ శుభ సంద‌ర్భంలో దేశంలో వ్య‌వ‌స‌యారంగ స‌దుపాయాల‌ను అభివృద్ధి చేయ‌డానికిగాను ఒక ల‌క్ష‌ కోట్ల రూపాయ‌ల‌తో ప్రత్యేక నిధిని ప్రారంభించ‌డం జ‌రిగింది. ఇది దేశవ్యాప్తంగా గ్రామాల్లో మెరుగైన గిడ్డంగుల‌ను ఆధునిక శీత‌లీక‌ర‌ణ నిలువ భ‌వ‌నాల‌ను ఏర్పాటు చేయ‌డానికిగాను అవ‌స‌ర‌మైన‌ ఆర్ధిక సాయం అందిస్తుంది. అంతేకాదు ఆయా గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయి. 

దీనికి తోడు ఈ రోజున దేశ‌వ్యాప్తంగా 8.5 కోట్ల అన్న‌దాత‌ల కుటుంబాల‌కు పిఎం కిసాన్ స‌మ్మాన్ నిధి కింద 17 వేల కోట్ల రూపాయ‌ల‌ను బ‌దిలీ చేయ‌డం నాకు చాలా సంతోషంగా వుంది. ఈ ప‌థ‌కం కింద పెట్టుకున్న ల‌క్ష్యాన్ని చేరుకుంటున్నందుకు సంతృప్తినిస్తోంది. 

దేశంలోని ప్ర‌తి రైతుకు వారికి అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో నేరుగా సాయం అంద‌జేయ‌డంలో ఈ ప‌థ‌కం విజ‌య‌వంత‌మైంది. గ‌త ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాల్లో ఈ ప‌థ‌కంద్వారా 75 వేల కోట్ల రూపాయల‌ను రైతుల అకౌంట్ల‌లోకి నేరుగా డిపాజిట్ చేయ‌డం జ‌రిగింది. ఇందులో 22 వేల కోట్ల రూపాయ‌ల‌ను.. క‌రోనా కార‌ణంగా విధించిన లాక్ డౌన్ స‌మ‌యంలో ఆయా రైతులు ఖాతాల్లో డిపాజిట్ చేశాం. 

స్నేహితులారా, 

మ‌న దేశంలో గ్రామాల్లో ప‌రిశ్ర‌మ‌లు ఎందుకు లేవు? అనే చ‌ర్చ చాలా ద‌శాబ్దాలుగా న‌డుస్తోంది. ప‌రిశ్ర‌మ‌లు త‌మ ఉత్ప‌త్తుల‌కు త‌గిన ధ‌ర‌ను నిర్ణ‌యించుకునే స్వేచ్ఛ‌ను క‌లిగి వున్నాయి. అంతే కాదు అవి దేశంలో ఎక్క‌డైనా స‌రే త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకుంటున్నాయి. రైతుల‌కు కూడా అలాంటి స‌దుపాయం ఎందుకు వుండ‌కూడ‌దు?

న‌గ‌రంలో నెల‌కొల్పిన‌ స‌బ్బుల త‌యారీ ప‌రిశ్ర‌మ ఆ స‌బ్బుల‌ను న‌గ‌రాల్లోనే అమ్మ‌డం లేదు. అయితే ఈ నియ‌మం వ్య‌వ‌సాయ‌రంగానికి వ‌ర్తించ‌డం లేదు. రైతులు తాము పండించిన పంట‌ల‌ను స్థానిక మండీల్లోనూ, వారి వారి ప్రాంతాల్లోనే అమ్ముకోవ‌డం ఇంత‌కాలం జ‌రిగింది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో మ‌ధ్య‌వ‌ర్తులు లేరు. వ్య‌వ‌సాయ రంగ క్ర‌య విక్ర‌యాల్లో ఎందుకు మ‌ధ్య‌వ‌ర్తులున్నారు?  దేశంలో ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికోసం మౌలిక స‌దుపాయాలు అందుబాటులో వున్న‌ట్టే వ్య‌వ‌సాయ‌రంగానికి కూడా ఆధునిక మౌలిక స‌దుపాయాలు వెంట‌నే అందుబాటులోకి రావాలి. 

స్నేహితులారా, 

అన్న‌దాత‌లు, వ్య‌వ‌సాయ‌రంగం ఎదుర్కొంటున్న ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికీ ఆత్మ‌‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ కింద ప‌రిష్కారాలు తెలుసుకోవ‌డం జ‌రుగుతోంది. ఏడు సంవ‌త్స‌రాలుగా అమ‌లులో వున్న ఒక జాతి, ఒకే మార్కెట్ అనే కార్య‌క్ర‌మం ఇప్పుడు పూర్తి కాబోతోంది. మొద‌ట ఇ – నామ్ ప‌ద్ధ‌తిలో ఒక సాంకేతిక‌త ఆధార వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేసుకున్నాం. ఇప్పుడు చ‌ట్టాలు చేసుకోవ‌డంద్వారా రైతును మార్కెట్ల ప‌రిధినుంచి, మార్కెట్ ప‌న్నుల‌నుంచి విముక్తుల‌ను చేయ‌డం జ‌రిగింది. ఇప్పుడు రైతుల ముందు అనేక అవ‌కాశాలున్నాయి. వారు త‌మ పంట‌ను అమ్ముకోవాలంటే త‌మ పొలాన్నించే అమ్ముకోవ‌చ్చు. లేదంటే గిడ్డంగికి త‌ర‌లించి అక్క‌డ‌నుంచి ఇ-నామ్ తో సంబంధ‌మున్న వ్యాపారుల‌కు, సంస్థ‌ల‌కు అమ్ముకోవ‌చ్చు. ఎవ‌రు మంచి రేటు ఇస్తే వారికి అమ్ముకోవ‌చ్చు. 

అదే ప‌ద్ధ‌తిలో మ‌రొక కొత్త చ‌ట్టాన్ని తీసుకురావ‌డం జ‌రిగింది. దీని ప్ర‌కారం రైతులు ప‌రిశ్ర‌మ‌ల‌తో నేరుగా భాగ‌స్వామ్యం పెట్టుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు చెప్పాలంటే ఇప్పుడు రైతులు చిప్స్ త‌యారు చేసే వ్యాపారుల‌తోను, మ‌ర్మాల‌డే, చ‌ట్నీత‌యారు చేసే వ్యాపార‌లతోను నేరుగా సంప్ర‌దింపులు చేసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల  తాము పంట‌లు వేసే స‌మయంలోనే రైతుల‌కు గిట్టుబాటు ధ‌రలు ల‌భిస్తాయి. భ‌విష్య‌త్తులో ధ‌ర‌లు త‌గ్గిపోతాయేమోన‌నే భ‌యాన్నించి వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

స్నేహితులారా,  

మ‌న వ్య‌వ‌సాయ‌రంగంలో ఉత్ప‌త్తికి సంబంధించి, దిగుబ‌డికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. చేతికొచ్చిన పంట‌లు వృధా అయిపోవ‌డ‌మ‌నేది ఒక పెద్ద స‌మ‌స్య‌గా తయారైంది. ఇది రైతుల‌నే కాదు దేశాన్ని కూడా తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతున్న స‌మ‌స్య‌. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికిగాను ఒక వైపున చ‌ట్టాల‌ప‌రంగా వున్న అడ్డంకుల‌ను తొల‌గిస్తూనే మ‌రో వైపున రైతుల‌కు నేరుగా స‌హాయం అందించ‌డం జ‌రుగుతోంది. దేశంలో ఆహార ధాన్యాల కొర‌త తీవ్రంగా వున్న స‌మ‌యంలో మ‌నం నిత్యావ‌స‌ర వ‌స్తువుల చ‌ట్టాన్ని అమలులోకి తెచ్చాం. కానీ ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద ఆహార ఉత్ప‌త్తి దేశంగా నిలిచిన త‌ర్వాత కూడా అదే చ‌ట్టం అమ‌లులో వుంది. 

మ‌న గ్రామాల్లో మెరుగైన గిడ్డంగుల‌ను నిర్మించుకోలేక‌పోవ‌డానికి, వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రైన ప్రోత్సాహం ల‌భించ‌క‌పోవ‌డానికి ఈ చ‌ట్టం ప్ర‌ధాన‌మైన అడ్డంకిగా మారింది. ఈ చ‌ట్టం త‌ర‌చుగా దుర్వినియోగ‌మ‌వుతూ వ‌చ్చింది. వ్యాపారుల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను భ‌య‌పెట్ట‌డానికి ఈ చ‌ట్టాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించారు. ఈ భ‌యెట్టే వ్య‌వ‌స్థ‌నుంచి ఇప్పుడు వ్య‌వ‌సాయ వ్యాపార వ‌ర్గాలకు ముక్తి ల‌భించింది. ఇప్పుడు వ్యాపారులు ముందుకొచ్చి గ్రామాల్లో గిడ్డంగుల‌ను, ఇత‌ర స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. 

స్నేహితులారా, 

ఈ రోజున ప్రారంభించిన వ్య‌వ‌సాయరంగ మౌలిక స‌దుపాయాల నిధి కార‌ణంగా రైతులు త‌మ త‌మ గ్రామాల్లో ఆధునిక గిడ్డంగి స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం ద్వారా ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను రైతు సంఘాల‌కు, క‌మిటీల‌కు, ఎఫ్ పి వోల‌కు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఈ డ‌బ్బును ఉప‌యోగించుకొని వారు త‌మ త‌మ ప్రాంతాల్లో గిడ్డంగుల‌ను, శీత‌ల గిడ్డంగుల‌ను, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. రైతుల‌ను వ్యాపారులుగా మార్చ‌డానికి ఏర్పాటు చేసిన ఈ ఆర్ధిక సాయం విష‌యంలో రైతుల‌కు 3 శాతం వ‌డ్డీ రాయితీ కూడా వుంటుంది. కాసేప‌టి క్రితం కొంత మంది రైతు సంఘాల ప్ర‌తినిధుల‌తో మాట్లాడాను. దేశంలోని రైతు సంఘాల‌కు ఈ నూత‌న నిధి మంచి ప్ర‌యోజ‌నాల‌ను క‌ల‌గ‌జేస్తుంది. ఈ రైతు సంఘాలు ఎన్నో సంవ‌త్స‌రాలుగా రైతుల‌కు సేవ‌లందిస్తున్నాయి. 

స్నేహితులారా, 

ఈ ఆధునిక స‌దుపాయాల క‌ల్ప‌న కార‌ణంగా వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పడానికి అపారమైన సాయం ల‌భిస్తుంది. ప్ర‌తి జిల్లాలోని ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఉత్ప‌త్తుల‌ను జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అమ్మ‌డానికి వీలుగా ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ అభియాన్ కింద ఒక ప్ర‌ధాన‌మైన ప‌థ‌కాన్ని తయారు చేయ‌డం జ‌రిగింది. దీని ప్ర‌కారం దేశంలోని ప‌లు జిల్లాల్లో వ్య‌వ‌సాయ ప‌రిశ్ర‌మ‌ల క్లస్ట‌ర్ల‌ను ఆయా గ్రామాల‌కు స‌మీపంలో అభివృద్ధి చేసుకోవ‌డం జ‌రుగుతుంది. 

స్నేహితులారా, 

గ్రామాల్లోని వ్య‌వసాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌నుంచి వ‌చ్చే ఆహార ఉత్ప‌త్తులు న‌గ‌రాల‌కు స‌ర‌ఫ‌రా అవుతాయి. న‌గ‌రాల్లోని ఇత‌ర పారిశ్రామిక ఉత్ప‌త్తులు అక్క‌డ‌నుంచి గ్రామాల‌కు చేరుకుంటాయి. ఇలాంటి మెరుగైన ప‌రిస్థితికి మ‌నం చేరుకోబోతున్నాం.మ‌నం అమలు చేస్తున్న ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ ల‌క్ష్యం కూడా ఇదే. ఇప్పుడు ఒక ప్ర‌శ్న బైట‌కు వ‌స్తుంది. అదేంటంటే వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌ను నిర్వ‌హించేది ఎవ‌రు?  ఈ విష‌యంలో కూడా స‌న్న చిన్న త‌ర‌హా రైతుల‌తో ఏర్పడిన రైతు సంఘాల‌కే ప్ర‌ధాన‌మైన వాటా వుంటుంది. వీటిని మ‌నం రైతు ఉత్ప‌త్తిదారుల సంఘాలు ( ఎఫ్ పివో) అని పిలుస్తున్నాం. 

కాబ‌ట్టి, గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా రైతు ఉత్ప‌త్తిదారుల సంఘాల నెట్ వ‌ర్క్ ను నిర్మించ‌డానికి త‌గిన కృషి చేయ‌డం జ‌రిగింది. రాబోయే సంవ‌త్స‌రాల్లో దేశ‌వ్యాప్తంగా ప‌ది వేల రైతు ఉత్ప‌త్తిదారుల సంఘాలుండేలా చూడ‌డానికి చేప‌ట్టిన ప‌ని ప్ర‌స్తుతం న‌డుస్తోంది. 

స్నేహితులారా, 

ఎఫ్ పి వో ల నెట్ వ‌ర్క్ కోసం ఒక వైపున కృషి జ‌రుగుతూనే వుంది. మ‌రో వైపున వ్య‌వ‌సాయ‌రంగానికి సంబంధించిన స్టార్ట‌ప్ కంపెనీల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంది. దాదాపుగా 350 స్టార్ట‌ప్ కంపెనీల‌కు ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ల‌భించింది. ఇవ‌న్నీ ఆహార త‌యారీ ప‌రిశ్ర‌లు, కృత్రిమ విజ్ఞానం ( ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌), ఇంట‌ర్ నెట్ ఆఫ్ థింగ్స్ , ఆధునిక వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల త‌యారీ, పున :  వినియోగ శ‌క్తి వ‌న‌రుల రంగాల‌కు సంబంధించిన కంపెనీలు. 

 స్నేహితులారా, 

రైతుల‌కు సంబంధించిన ఈ సంస్క‌ర‌ణ‌ల‌న్నిటిలో, ఈ ప‌థ‌కాల‌న్నిటిలో స‌న్న చిన్న‌కారు రైతులే కీల‌కం. ఎందుకంటే దేశంలో వారే ఎక్కువ‌గా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ వున్నారు. ప్ర‌భుత్వం అందిస్తున్న ప్ర‌యోజ‌నాల‌ను వారు పూర్తిగా అందుకోవ‌డం లేదు. దేశంలోని చిన్న‌స‌న్న‌కారు రైతుల స్థితిగ‌తుల‌ను మార్చ‌డానికిగాను గ‌త ఆరు ఏడు సంవ‌త్స‌రాలుగా కృషి జ‌రుగుతోంది. వ్య‌వ‌సాయరంగ అభివృద్ధికి చిన్న స‌న్న‌కారు రైతు సంక్షేమాన్ని అనుసంధానించడం జ‌రిగింది. వారిని సాధికారుల‌ను చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. 

స్నేహితులారా, 

స‌న్న‌చిన్న‌కారు రైతుల‌ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్ర‌ధాన‌మైన ప‌థ‌కాన్ని రెండు రోజుల క్రితం ప్రారంభించ‌డం జ‌రిగింది. ఇది రానున్న రోజుల్లో దేశం మొత్తానికి అత్య‌ధిక ప్ర‌యోజ‌నాన్ని క‌ల‌గ‌జేయ‌నున్న‌ది. మ‌హారాష్ట్ర బిహార్ రాష్ట్రాల మ‌ధ్య‌న కిసాన్ రైలును ప్రారంభించ‌డం జ‌రిగింది. 

ఈ రైలు మ‌హారాష్ట్ర‌లో బ‌య‌లుదేరుతూ అక్క‌డ‌నుంచి నారింజ‌, ద్రాక్ష‌, ఉల్లిపాయ‌లులాంటి వివిధ ర‌కాలైన‌ పండ్ల‌ను, కూర‌గాయల‌ను తీసుకొని బిహార్ చేరుకుంటుంది. ఇది బిహార్ లో వాటిని దించేసిన త‌ర్వాత అక్క‌డి వ్య‌వ‌సాయ ఉత్పత్తులైన మ‌ఖానా, లిచి, పాన్‌, తాజా కూర‌గాయల‌ను, చేప‌లు మొద‌లైన‌వాటిని తీసుకొని మ‌హారాష్ట్ర చేరుకుంటుంది. దీని కార‌ణంగా బిహార్ లోని ప‌లువురు చిన్న‌స‌న్న‌కారు రైతులు నేరుగా ముంబాయి, పుణే లాంటి పెద్ద న‌గ‌రాల్లో త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోగ‌లుగుతారు. ఈ రైలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రైతుల‌కు కూడా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంది. ఎందుకంటే ఇది ఆ రాష్ట్రాల మీదుగా కూడా ప్ర‌యాణం చేస్తుంది కాబ‌ట్టి. దీని ప్ర‌త్యేక‌త ఏమంటే ఇదిపూర్తిగా ఎయిర్ కండిష‌న్ రైలు. అంటే రైల్వే ట్రాకుల మీద ఒక శీత‌లీక‌ర‌ణ గిడ్డంగి ప్ర‌యాణం చేస్తున్న‌ద‌న్న‌మాట‌. ఈ రైలు అన్ని ర‌కాల రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంది. పాలు, పండ్లు, కూర‌గాయ‌లు, చేప‌ల రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఉత్ప‌త్తుల‌ను వినియోగించే న‌గ‌ర వినియోగ‌దారుల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.  

రైతులు త‌మ పంట‌ల్ని స్థానిక మండీల్లో త‌క్కువ ధ‌ర‌ల‌కు అమ్ముకునే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు తొల‌గిపోయి వారు ప్ర‌యోజ‌నం పొందుతారు. వ్య‌వ‌సాయ‌ ఉత్ప‌త్తుల‌ను ట్ర‌క్కుల‌ద్వారా స‌ర‌ఫ‌రా చేయుడంద్వారా వాటిలో కొంత వృధా అయిపోవ‌డ‌మ‌నేది ఈ రైలు కార‌ణంగా అరిక‌ట్ట‌డం జ‌రుగుతుంది. ట్ర‌క్కుల‌తో పోలిస్తే స‌ర‌కు ర‌వాణా ఖ‌ర్చులు చాలా చాలా త‌క్కువ‌గా వుంటాయి. ఇక న‌గ‌రాల్లో నివ‌సించే వారికి తాజా పండ్లు, కూర‌గాయ‌లు ల‌భిస్తాయి. వాతావ‌ర‌ణ ఇబ్బందులు, ఇంత‌ర సంక్షోభాల కార‌ణంగా కొర‌త వ‌చ్చింద‌నే మాట వినిపించ‌ద‌రు. అంతే కాదు వీటి ధ‌ర‌లు కూడా అందుబాటులో వుంటాయి. 

అన్నిటికీ మించి ఈ రైలు కార‌ణంగా గ్రామాల్లోని సన్న‌చిన్న‌కారు రైతుల ఆర్ధిక ప‌రిస్థితి మెరుగ‌వుతుంది. వారు ఇప్పుడు దేశంలోని పెద్ద పెద్ద న‌గ‌రాల్లో త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకుంటుండ‌డంవ‌ల్ల తాజా కూర‌గాయ‌ల‌ను పండించడంపై దృష్టి పెడతారు. అంతే కాదు వారికి పాడి ప‌రిశ్ర‌మ‌, చేప‌ల పెంపకంవిష‌యంలో త‌గిన ప్రోత్సాహం ల‌భిస్తుంది. దీని కార‌ణంగా త‌క్కువ పొలంలోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఉద్యోగ సంబంధ అవ‌కాశాలు పెర‌గ‌డ‌మే కాకుండా స్వ‌యం ఉపాధి పెరుగుతుంది. 

స్నేహితులారా, 

ప్ర‌భుత్వం తీసుకుంటున్న ఈ చ‌ర్య‌ల‌న్నిటి కార‌ణంగా 21వ శ‌తాబ్దంలో దేశంలోని గ్రామీణ ఆర్ధిక వ్య‌వ‌స్థ స్వ‌రూపం మారుతుంది. అంతే కాదు వ్య‌వ‌సాయ‌రంగంనుంచి వ‌చ్చే ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య కాలంలో తీసుకున్న నిర్ణ‌యాల‌కార‌ణంగా రానున్న రోజుల్లో గ్రామాల్లోను, వాటి చుట్టుప‌క్క‌ల ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు విస్తృతంగా పెరుగుతాయి. గ‌త ఆరు నెల‌లుగా ఈ సంక్షోభ స‌మ‌యంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలు, రైతులు ఈ దేశానికి అందిస్తున్న స‌హాయ స‌హ‌కారాల‌ను మ‌నం గ‌మ‌నిస్తూనే వున్నాం… లాక్ డౌన్ స‌మ‌యంలో ఈ దేశంలో ఆహార సంక్షోభం రాకుండా చూసింది ఎవ‌రో కాదు మ‌న రైతులే. దేశం లాక్ డౌన్ లో వున్న స‌మ‌యంలో రైతులు పొలాల‌కు వెళ్లి పంట‌లు పండించారు. రికార్డు స్థాయిలో పంట‌లు వేశారు. రైతులు చూపిన ఈ చొర‌వ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా 80 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు 8 నెల‌ల‌పాటు ఉచితంగా రేష‌న్ ఇవ్వ‌గ‌లిగాం. లాక్ డౌన్ మొద‌లైన మొద‌టిరోజునుంచి దీపావ‌ళి, ఛాత్ ప‌ర్వ‌దినాల‌వ‌ర‌కూ ఈ ఉచిత రేష‌న్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నాం. మ‌న రైతుల కార‌ణంగానే ఇది సాధ్య‌మ‌వుతోంది. 

స్నేహితులారా, 

ప్ర‌భుత్వం కూడా  గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రికార్డు స్థాయిలో రైతుల పంట‌ల్ని కొనుగోలు చేసింది. ఈ ప‌ని చేయ‌డంవ‌ల్ల గ‌తంతో పోలిస్తే 27వేల కోట్ల రూపాయ‌ల న‌గ‌దు అద‌నంగా రైతుల‌ను చేరుకుంది. విత్త‌నాలు కావ‌చ్చు, ఎరువులు కావ‌చ్చు…ఈ సారి ఈ క‌ష్ట‌కాలంలో కూడా రికార్డు స్థాయిలో ఉత్ప‌త్తి చేశాం. రైతుల డిమాండుకు అనుగుణంగా స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. దీని కార‌ణంగా ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా మ‌న గ్రామీణ ఆర్ధిక వ్య‌వ‌స్థ బ‌లోపేతంగా వుంది. గ్రామీల్లో స‌మ‌స్య‌లు త‌గ్గిపోయాయి. 

మ‌న గ్రామాలు అందుకున్న ఈ శ‌క్తియుక్తులు దేశాభివృద్ధిని వేగ‌వంతం చేయ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఈ న‌మ్మ‌కంతో నా రైతు సోద‌రులంద‌రికీ శుభాభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.
 
గ్రామాల‌నుంచి క‌రోనాను త‌రిమేయ‌డానికి మీరు చేస్తున్న ప్ర‌శంస‌నీయ‌మైన ప‌నిని కొన‌సాగించండి. రెండు గ‌జాల భౌతిక దూరం, మాస్కుల‌ను ధ‌రించాల‌నే నియ‌మాల‌ను పాటించ‌డం కొన‌సాగించండి. 

జాగ్ర‌త్త‌గా వుండండి, భ‌ద్రంగా, ఆరోగ్యంగా వుండండి. 

అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.

***