వ్యవసాయం మరియు అంతర్జాతీయ వ్యాపార అవసరాలకు వినియోగించే మొక్కల ఆరోగ్యం (ఫైటోశానిటరీ) సంబంధిత అంశాలలో సహకరించుకోవడం కోసం భారతదేశం మరియు ఇటలీ ల మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు) కుదుర్చుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది 2018 జనవరి లో కాలం తీరనున్న ఇదివరకటి ఎమ్ఒయు కు బదులుగా అమలు లోకి వస్తుంది. మునుపటి ఎమ్ఒయు పై 2008 జనవరి లో సంతకాలయ్యాయి.
వ్యవసాయ ఉత్పత్తి, అంతర్జాతీయ వ్యాపార అవసరాలకు వినియోగించే మొక్కలకు సంబంధించిన అంశాలు, పశు పోషణ, వ్యవసాయ సంబంధ పరిశోధన, ఫూడ్ ప్రాసెసింగ్ లతో పాటు ఉభయ పక్షాలు పరస్పరం నిర్ణయం తీసుకొనే మేరకు అదనంగా విస్తృత శ్రేణి లోని ఇతర రంగాల లోనూ సహకారానికి ఈ ఎమ్ఒయు తోడ్పడుతుంది.
వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి రంగాలలో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ/వ్యవసాయ యంత్ర సామగ్రి మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన లలో ఉత్పత్తి రీత్యా సహకారం మరియు సాంకేతిక విజ్ఞాన ఆదాన ప్రదానం పటిష్టీకరణ, పశుపోషణ రంగంలో అనుభవాల ఆదాన ప్రదానం, సాంకేతిక అవరోధాల నిర్మూలన, ఇంకా ఆధునిక శాస్త్ర విజ్ఞాన సంబంధిత పరిశోధనలు మరియు సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి.. వంటి అంశాలకు ఈ ఎమ్ఒయు బాట పరుస్తుంది
వ్యవసాయ రంగంలో ద్వైపాక్షిక ఆదాన ప్రదానాలను ప్రోత్సహించడానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని నియమించేందుకు మార్గాన్ని ఈ ఎమ్ఒయు సుగమం చేస్తుంది. వ్యవసాయ రంగ సహకారం కోసం దీర్ఘకాలిక కార్యక్రమాలను అమలు చేసే విషయమై పరిశీలించేందుకు, ఎగుమతి చేసిన వస్తువులలో ఫైటోశానిటరీ సంబంధిత నష్ట భయాలను తగ్గించుకోవడం కోసం అవసరమైన సహాయాన్ని మరింతగా అందించుకొనేందుకు కూడా ఈ ఎమ్ఒయు దోహదం చేస్తుంది.
రెండు దేశాల వ్యాపార సముదాయాలు మరియు శాస్త్ర విజ్ఞాన సంస్థలు, విద్యారంగ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సంబంధాలకు అవకాశాలను కల్పించడం, అటువంటి సంబంధాలను ప్రోత్సహించడంతో పాటు రెండు దేశాల లోని ఆయా పరిశోధన సంస్థల మధ్య ఇతోధిక సహకారానికి ఈ ఎమ్ఒయు ఒక సేతువుగా పని చేస్తుంది.