పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.
ఉభయ దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధం నెలకొన్న విషయం వారు గుర్తించారు. అంతే కాకుండా రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రజల మధ్య లోతైన స్నేహబంధం ఉన్నదన్న విషయం వారు పునరుద్ఘాటించారు. ఈ బంధం నుంచి పూర్తి స్థాయి ప్రయోజనం పొందాలన్న కట్టుబాటును ఉభయులూ ప్రకటిస్తూ భారత-పోలెండ్ ద్వైపాక్షిక సంబంధాలను ‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం’’ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు.
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ పట్ల ఉభయ దేశాలకు గల కట్టుబాటుతో పాటు చారిత్రక బంధం ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాదిగా నిలిచిందన్న విషయం ప్రధానమంత్రులిద్దరూ నొక్కి చెప్పారు. మరింత సుస్థిర, సుసంపన్న ప్రపంచం ఆవిష్కారానికిగాను తమ మధ్య గల ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని మరింత లోతుగా విస్తరించుకోవాలన్న కట్టుబాటును వారు పునరుద్ఘాటించారు.
ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక రాజకీయ చర్చలు పటిష్ఠం చేసుకోవడంతో పాటు పరస్పర ప్రయోజనకరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం నిరంతరం ఉన్నత స్థాయి సంప్రదింపులు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు నొక్కి చెప్పారు.
ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని; వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని ఉత్తేజితం చేయాలని; పరస్పర ప్రయోజనకరమైన కొత్త రంగాలకు సహకారాన్ని విస్తరించుకోవడానికి గల అవకాశాలు అన్వేషించాలని నాయకులిద్దరూ అంగీకరించారు. ఇందుకోసం ఉమ్మడి ఆర్థిక సహకార కమిషన్ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఉభయులూ అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతూకం చేసుకోవడంతో పాటు వాణిజ్య వస్తువుల జాబితాను విస్తరించుకోవడానికి కృషి చేయాలని నిర్ణయించారు.
ఆర్థిక సహకారాన్ని టెక్నాలజీ, వ్యవసాయం, అనుసంధానత, గనులు, ఇంధనం, పర్యావరణ రంగాలకు విస్తరించుకోవాల్సిన ప్రాధాన్యం పెరుగుతున్నదన్న విషయం వారు అంగీకరించారు.
ఆర్థిక, సామాజికాభివృద్ధిలో డిజిటైజేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్న విషయం గుర్తిస్తూ ఈ రంగానికి కూడా ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవడానికి ఉభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఉభయ దేశాల మధ్య స్థిరత్వం, విశ్వసనీయతను పెంచుకునేందుకు సైబర్ సెక్యూరిటీ సహా డిజిటైజేషన్ విభాగంలో సహకారం దోహదకారి అవుతుందని అంగీకరించారు.
ఉభయ దేశాల మధ్య, దేశాల్లోని విభిన్న ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచుకోవలసిన ప్రాధాన్యం ఉన్నదని ప్రధానమంత్రులు నొక్కి వక్కాణించారు. ఉభయ దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల నిర్వహణను వారు ఆహ్వానిస్తూ ఈ సర్వీసులను రెండు దేశాల్లోని కొత్త గమ్యాలకు విస్తరించుకోవలసిన అవసరం ఉన్నదని అంగీకరించారు. అలాగే సాగర జలాల్లో సహకారం పటిష్ఠం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించారు. మౌలిక వసతుల కారిడార్లు తెరవాలని నిర్ణయించారు.
ప్రపంచంలోని ఈ రెండు భారీ ప్రజాస్వామ్య దేశాలతో పాటుగా యూరోపియన్ యూనియన్ కు, భారతదేశానికి మధ్యన ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో భద్రత, సుసంపన్నత, సుస్థిర అభివృద్ధికి హామీ ఇవ్వగల ఉమ్మడి ప్రయోజనాలున్నాయన్న విషయం నాయకులిద్దరూ నొక్కి చెప్పారు. భారత-ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించుకోవాలని వారు పునరుద్ఘాటించారు. ఇది ఉభయులకు ప్రయోజనకరమే కాకుండా ప్రపంచంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని అంగీకరించారు.
ఐక్యరాజ్య సమితి నిబంధనావళి పునాదిగా శాంతి స్థాపన, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటుకు ప్రధానమంత్రులిద్దరూ తమ కట్టుబాటును ప్రకటించారు. ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల మధ్య సంఘర్షణలు, ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత ప్రపంచంలో బహుళ కోణాల్లో భద్రతా రంగంలో సహకారం పెంచుకోవడానికి అంగీకరించారు. నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను గౌరవిస్తూ ప్రపంచ శాంతి, సుస్థిరత, భద్రత కోసం విభిన్న అంతర్జాతీయ వేదికలపై సహకారం పెంచుకోవాలని ఉభయులు నిర్ణయించారు.
రక్షణ రంగంలో సహకారం పటిష్ఠం చేసుకుని, లోతుగా పాదుకునేలా చేసుకోవాలన్న అవసరాన్ని ఉభయులు గుర్తించారు. ఉమ్మడి రక్షణ సహకార కార్యాచరణ బృందం సహా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ద్వైపాక్షిక వ్యవస్థలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని అంగీకరించారు.
యుద్ధంతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్ పట్ల, మానవ సమాజంపై దాని దుర్భర, విషాదకరమైన ప్రభావం పట్ల వారు తీవ్ర ఆందోళన ప్రకటించారు. సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవిస్తూ ఐక్య రాజ్య సమితి నిబంధనావళిలోని నియమావళి, ప్రయోజనాలకు అనుగుణంగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి సమగ్ర, న్యాయబద్ధమైన, దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరాన్ని వారు పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆహార, ఇంధన భద్రత పైన ప్రత్యేకించి ప్రపంచ దక్షిణ ప్రాంతం పైన ఉక్రెయిన్ యుద్ధ ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వారు ఆందోళన ప్రకటించారు. ఈ యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాల వినియోగం లేదా అణ్వాయుధాలు వినియోగిస్తామన్న బెదిరింపులు ఏ మాత్రం ఆమోదనీయం కాదని వారు వక్కాణించారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళికి లోబడి అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ ప్రపంచంలోని ఏ దేశం కూడా ఏ ఇతర స్వతంత్ర దేశ సార్వభౌమత్వం, రాజకీయ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు సైన్యాన్ని వినియోగించే ధోరణులకు పాల్పడరాదని నొక్కి చెప్పారు.
ఉగ్రవాదాన్ని నాయకులిద్దరూ తీవ్రంగా ఖండిస్తూ దాన్ని ఏ రూపంలోనూ, ఏ రకంగానూ అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. ఏ దేశం ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, ప్రణాళిక, మద్దతు అందించకూడదని; ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వరాదని వారు తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తీర్మానాలను; ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాన్ని పటిష్ఠంగా అమలుపరచాల్సిన అవసరం ఉన్నదని వారు నొక్కి చెప్పారు. సమగ్ర అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక ఒడంబడికను (సిసిఐటి) సత్వరం అమలుచేయాలని వారు పునరుద్ఘాటించారు.
సాగర జలాల చట్టంపై ఐక్యరాజ్య సమితి ఒడంబడికకు (యుఎన్ సిఎల్ఓఎస్) అనుగుణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, బహిరంగంగా, నిబంధనల ఆధారితంగా ఉండాలన్న కట్టుబాటును ఉభయ వర్గాలు ప్రకటించాయి. సాగర భద్రతను, అంతర్జాతీయ శాంతి సుస్థిరతలను కాపాడుతూ సాగర ప్రాంత దేశాల సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, నౌకాయాన స్వేచ్ఛలను సంపూర్ణ గౌరవించాలని నొక్కి చెప్పారు.
ప్రపంచ దేశాలకు వాతావరణ మార్పులు విసురుతున్న సవాలును గుర్తించిన నాయకులిద్దరూ వాతావరణ కార్యాచరణ ప్రణాళికల అమలులో సహకరించుకోవాలన్న అంగీకారానికి వచ్చారు. అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ), వైపరీత్య నిరోధక మౌలిక వసతుల సంఘటన (సిడిఆర్ఐ) రెండింటిలోనూ సభ్యత్వం ఇవ్వాలన్న పోలెండ్ అభ్యర్థనను బలపరిచేందుకు భారతదేశం అంగీకరించింది.
ఉభయ దేశాల మధ్య పార్లమెంటరీ బాంధవ్యం పాత్రను నాయకులు కొనియాడుతూ శాసన వ్యవస్థల మధ్య పరస్పర పర్యటనలు, సహకారం విస్తరించుకోవడం వల్ల ద్వైపాక్షిక బంధం మరింత పటిష్ఠమై పరస్పర అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
దీర్ఘకాలికంగా ఉభయ దేశాల ప్రజల మధ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని ప్రధానమంత్రులిద్దరూ నిర్ణయించారు. సాంస్కృతిక, విద్య, శాస్ర్త, పరిశోధన, ఆరోగ్య రంగాల్లో సహకారం మరింత విస్తరించుకోవాలన్న అంగీకారానికి వచ్చారు. ఉభయ దేశాల విద్యా సంస్థల మధ్య భవిష్యత్ దృక్కోణంతో సహకారం ప్రోత్సహించి, విస్తరించేందుకు తీసుకుంటున్న అదనపు చర్యలను వారు ఆహ్వానించారు.
ఆర్థిక, వ్యాపార అవకాశాల కల్పనలో పర్యాటక రంగం పాత్రను నాయకులు గుర్తిస్తూ ఉభయ దేశాల ప్రజల మధ్య అవగాహన విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో భాగంగా 2024-2028 సంవత్సరాల మధ్య ఐదేళ్ల కాలానికి సంయుక్త కార్యాచరణకు ఉభయులు అంగీకరించారు.
తన పట్ల, తనతో వచ్చిన ప్రతినిధివర్గం పట్ల ప్రదర్శించిన ఆదరాభిమానాలపై ప్రధానమంత్రి టస్క్ కు, పోలెండ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియచేస్తూ భారతదేశ సందర్శనకు రావాలని ప్రధానమంత్రి టస్క్ ను ఆహ్వానించారు.
***
Prime Ministers @narendramodi and @donaldtusk held a productive meeting in Warsaw, Poland. They explored avenues to enhance India-Poland cooperation in key sectors like food processing, AI, energy, and infrastructure. Both nations have also agreed on a social security agreement,… pic.twitter.com/ytoIIDY1rZ
— PMO India (@PMOIndia) August 22, 2024
I am glad to have met my friend, Prime Minister @donaldtusk. In our talks, we took stock of the full range of India-Poland relations. We are particularly keen to deepen linkages in areas such as food processing, urban infrastructure, renewable energy and AI. pic.twitter.com/a7VqCfj9Qa
— Narendra Modi (@narendramodi) August 22, 2024
PM @donaldtusk and I also discussed ways to expand cooperation in defence and security. It is equally gladdening that we have agreed on a social security agreement, which will benefit our people. pic.twitter.com/aQmb4zvPWR
— Narendra Modi (@narendramodi) August 22, 2024
Cieszę się, że dane mi było spotkać się z drogim Panem Premierem @donaldtusk. Podczas rozmowy podsumowaliśmy całość stosunków indyjsko-polskich. Szczególnie zależy nam na pogłębieniu relacji w dziedzinie przetwórstwa spożywczego, infrastruktury miejskiej, energii odnawialnej oraz… pic.twitter.com/ALDZVuokZK
— Narendra Modi (@narendramodi) August 22, 2024
Wraz z Premierem @donaldtusk dyskutowaliśmy również na temat poszerzenia współpracy w zakresie bezpieczeństwa i obronności. Równie zadowalające jest to, że przyjęliśmy wspólne założenia do porozumienia w sprawie zabezpieczenia społecznego, na którym skorzystają nowe narody. pic.twitter.com/p2s8RlNVEc
— Narendra Modi (@narendramodi) August 22, 2024