ఆగిపోయిన గోరఖ్ పూర్, సింద్రీ, బరౌనీ ఎరువుల విభాగాల పునరుద్ధరణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటిలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐఎల్) కు చెందిన మూసివేతకు గురైన సింద్రీ (ఝార్ ఖండ్), గోరఖ్ పూర్ (ఉత్తర ప్రదేశ్) ల లోని యూరియా యూనిట్ లతో పాటు, హిందుస్తాన్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎఫ్సిఎల్) కు చెందిన బరౌనీ (బిహార్) యూనిట్ కూడా ఉంది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఈ మూడు ఎరువుల యూనిట్ లను ప్రభుత్వ రంగ సంస్థలు (పిఎస్యులు) అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపిసి), కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), ఇంకా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) మరియు ఎఫ్సిఐఎల్/ హెచ్ఎఫ్సిఎల్ లు ‘నామినేషన్ రూట్’ లో ఏర్పాటు చేసే ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా పునరుద్ధరించనున్నారు.
సింద్రీ, గోరఖ్ పూర్, బరౌనీ లలో కొత్త యూనిట్ ల స్థాపన బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ ఖండ్ లలో యూరియాకు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడంలో తోడ్పడగలదు. దేశ పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల నుండి యూరియాను దూర ప్రాంతాలకు రైలుమార్గాలు, రహదారి మార్గాల గుండా మోసుకువెళ్లడంలో ప్రస్తుతం ఎదురవుతున్న ఒత్తిడి ఈ యూనిట్ ల ఏర్పాటుతో తగ్గగలదు. అంతే కాక, రవాణాపై ప్రభుత్వం వెచ్చిస్తున్న సబ్సిడీని ఆదా చేయడమూ సాధ్యపడుతుంది. ఈ యూనిట్ లు ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి ని వేగవంతం చేయగలవు. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమే కాకుండా, ఈ యూనిట్ ప్రత్యక్షంగా 1200 మందికి, పరోక్షంగా 4500 మందికి ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతుంది.
జగదీశ్ పూర్ నుండి హల్దియా కు గ్యాస్ ను చేరవేసేందుకు ఒక గొట్టపుమార్గాన్ని వేసేందుకు మెస్సర్స్ గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ పైప్ లైన్ కు కొత్త యూరియా యూనిట్ లు ప్రధాన వినియోగదారు సంస్థలు కాగలవు. జగదీశ్ పూర్ – హల్దియా గ్యాస్ పైప్ లైన్ ను ఆరంభించడం తూర్పు రాష్ట్రాలలో కీలకమైన ప్రాథమిక సదుపాయాల వికాసానికి ఎంతో ముఖ్యం. ఇది ఈ ప్రాంత ఆర్థిక పురోగతిపై బహుళవిధ ప్రభావాన్ని చూపించగలదు.
యూరియా రంగానికి అవసరమైన గ్యాస్ పూలింగ్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సి సి ఇ ఎ) ఇదివరకే ఆమోదించింది. తత్ఫలితంగా ఈ కొత్త ఎరువుల యూనిట్ లు పునరుద్ధరణ అనంతరం తమకు అవసరమయ్యే గ్యాస్ ను పూల్ డ్ ప్రైస్ ప్రాతిపదికన పొందేందుకు వీలు చిక్కుతుంది. తద్వారా ఈ యూనిట్ లు ప్రపంచ శ్రేణిలో పోటీ పడగలిగే స్థితిలో ఉండగలవు.
పూర్వ రంగం :
ఈ యూనిట్ లు 1990-2002 మధ్య కాలంలో మూతపడి వ్యాపారం చాలించాయి. పర్యవసానంగా ఈ యూనిట్ లు, వాటితో సంబంధం ఉన్న ఇతర సదుపాయాలు నిరుపయోగంగా మిగిలాయి. నామ్ రూప్ (అస్సాం) లో ఉన్న రెండు చిన్న యూనిట్ లు మినహా దేశ తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల యూనిట్ అంటూ ఏదీ లేదు. ఇంతకు ముందు 2015లో ప్రభుత్వం ఈ మూడు యూనిట్ లను ‘బిడ్డింగ్ రూట్’ లో పునరుద్ధరించే ప్రతిపాదనను ఆమోదించింది. అయితే, ఎఫ్ సి ఐ ఎల్ కు చెందిన గోరఖ్ పూర్, సింద్రీ ఎరువుల విభాగాల పునరుద్ధరణ కోసం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్స్ (ఆర్ ఎఫ్ క్యు స్) కు ప్రతిస్పందనగా ఒక దరఖాస్తు మాత్రమే అందడంతో బిడ్డింగ్ ప్రక్రియను ముందుకు తీసుకుపోలేకపోయారు.
దేశంలో ఒక ఏడాదిలో వినియోగమవుతున్న యూరియా ఇంచుమించు 320 ఎల్ ఎమ్ టి గా ఉంది. ఇందులో 245 ఎల్ ఎమ్ టి యూరియా దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగతా యూరియాను దిగుమతి చేసుకోవలసి వస్తోంది. దేశీయంగా యూరియా ఉత్పాదనను అధికం చేసేందుకు తాల్ చర్ (ఒడిశా) మరియు రామగుండం (తెలంగాణ) లలోని ఎఫ్ సి ఐ ఎల్ యూనిట్ లను పి ఎస్ యు ల ద్వారా ‘నామినేషన్ రూట్’ లో పునరుద్ధరించే ప్రతిపాదనను ప్రభుత్వం ఇంతక్రితం ఆమోదించింది.