Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై బడ్జెట్ అనంతర వెబినార్ లో  ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొనడం ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ సంవత్సరం బడ్జెట్ తమ ప్రభుత్వ మూడో పదవీ కాలంలోని మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ అని, ఇది విధానాలలో స్థిరత్వాన్ని ప్రదర్శించడంతో పాటు వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా  కొత్త దృష్టికోణాన్ని విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు వివిధ వర్గాల నుంచి వచ్చిన విలువైన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను మరింత ప్రభావవంతంగా రూపొందించడంలో సంబంధిత వర్గాల పాత్ర మరింత కీలకమైనదిగా మారిందని ఆయనతెలిపారు.

“వికసిత భారత్ లక్ష్యం దిశగా మా సంకల్పం చాలా స్పష్టంగా ఉంది.  రైతులు సుసంపన్నంగా,  సాధికారత కలిగి ఉండే దేశాన్ని కలసికట్టుగా నిర్మిస్తున్నాం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ఏ ఒక్క రైతు కూడా వెనుకబడకుండా, ప్రతి రైతును ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయమే అభివృద్ధికి తొలి చోదకశక్తి అని, ఇది రైతులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. “భారత్ ఏకకాలంలో రెండు ప్రధాన లక్ష్యాల కోసం పనిచేస్తోంది: ఒకటి వ్యవసాయ రంగం అభివృద్ధి, రెండోది గ్రామాల సౌభాగ్యం”, అని ఆయన పేర్కొన్నారు.

ఆరేళ్ల క్రితం అమలు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు దాదాపు రూ.3.75 లక్షల కోట్లు అందాయని, ఈ మొత్తాన్ని నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేశామని శ్రీ మోదీ వివరించారు. రైతులకు ఏటా అందిస్తున్న రూ.6,000 ఆర్థిక సాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. మధ్యవర్తుల ప్రమేయం, దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా ఈ పథకం ప్రయోజనాలు దేశవ్యాప్తంగా రైతులకు చేరేలా రైతు కేంద్రీకృత డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిపుణులు, దార్శనికుల సహకారంతోనే ఇలాంటి పథకాల విజయం సాధ్యమని ప్రధాని పేర్కొన్నారు. వారి సహకారంతో ఏ పథకమైనా పూర్తి శక్తితో, పారదర్శకతతో అమలు చేయొచ్చని కొనియాడారు. ఈ ఏడాది బడ్జెట్ లో చేసిన ప్రకటనలను అమలు చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా కృషి చేస్తోందని, ఇందుకు వారి సహకారం నిరంతరం ఉండాలని కోరారు.

దేశ వ్యవసాయ ఉత్పాదన రికార్డు స్థాయికి చేరుకుందని చెబుతూ, 10-11 సంవత్సరాల క్రితం వ్యవసాయ ఉత్పాదన 265 మిలియన్ టన్నులుగా ఉందని, అది ఇప్పుడు 330 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. అదేవిధంగా ఉద్యాన ఉత్పత్తి 350 మిలియన్ టన్నులు దాటిందని . విత్తనం నుంచి మార్కెట్ వరకు ప్రభుత్వ విధానం, వ్యవసాయ సంస్కరణలు, రైతు సాధికారత, బలమైన విలువ ఆధారిత వ్యవస్థ ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొని మరిన్ని పెద్ద లక్ష్యాలను సాధించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ దిశలో, తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగిన 100 జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించే పిఎం ధన్ ధాన్య కృషి యోజనను బడ్జెట్లో ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ద్వారా అభివృద్ధి కొలమానాల్లో కనిపించిన సానుకూల ఫలితాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు, సహకారం, సమన్వయం ఆరోగ్యకరమైన పోటీ వల్ల ఈ ప్రగతి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి సహాయపడే పిఎం ధన్ ధాన్య కృషి యోజనను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ ఈ 100 జిల్లాల ఫలితాలను అధ్యయనం చేయాలని, నేర్చుకున్న వాటిని వర్తింపజేయాలని ఆయన కోరారు.

ఇటీవలి సంవత్సరాలలో చేసిన ప్రయత్నాల వల్ల దేశంలో పప్పు దినుసుల  ఉత్పత్తి పెరిగిందని, అయినప్పటికీ దేశీయ వినియోగంలో 20 శాతం ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడి ఉన్నామని, అందుచేత పప్పు ధాన్యాల ఉత్పత్తి ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శనగలు, పెసల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని, అయితే కందిపప్పు, బఠానీ, మినుములు, ఇతర పప్పుల ఉత్పత్తిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పప్పుదినుసుల ఉత్పత్తిని పెంచడానికి, అధునాతన విత్తనాల సరఫరాను కొనసాగించడం, హైబ్రిడ్ రకాలను ప్రోత్సహించడం చాలా అవసరమని, వాతావరణ మార్పులు, మార్కెట్ అనిశ్చితి, ధరల హెచ్చుతగ్గులు వంటి సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

గత పదేళ్ళలో ఐసిఎఆర్ తన విత్తనోత్పత్తి కార్యక్రమంలో ఆధునిక సాధనాలు,  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని, ఫలితంగా, ధాన్యాలు, నూనె గింజలు, పప్పుదినుసులు, పశుగ్రాసం, చెరకుతో సహా 2,900 కొత్త రకాల పంటలను అభివృద్ధి చేశారని, ఈ కొత్త రకాలను రైతులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలని, వాతావరణ మార్పుల వల్ల వారి ఉత్పత్తులు ప్రభావితం కాకుండా చూడాలని ప్రధానమంత్రి సూచించారు. అధిక దిగుబడి విత్తనాల కోసం  బడ్జెట్ లో జాతీయ మిషన్ ను ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విత్తన గొలుసులో భాగస్వామ్యం కావడం ద్వారా చిన్న రైతులకు చేరేలా ఈ విత్తనాల వ్యాప్తిపై ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలని ఆయన కోరారు.

పౌష్టికాహారంపై నేడు ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన, పాడి, మత్స్య ఉత్పత్తులు వంటి రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టామని శ్రీ మోదీ తెలిపారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటును ప్రకటించామని ఆయన చెప్పారు. విభిన్న పోషకాహారాలను ప్రోత్సహించడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని, అవి దేశంలోని ప్రతి మూలకు, ఇంకా ప్రపంచ మార్కెట్ కు చేరుకునేలా చూడాలని ఆయన సంబంధిత వర్గాలను కోరారు.

మత్స్య రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం,  మత్స్య పరిశ్రమ ఆధునికీకరణను లక్ష్యంగా పెట్టుకుని 2019లో ప్రారంభించిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమం మత్స్య పరిశ్రమలో ఉత్పత్తి, ఉత్పాదకత, కోత అనంతర నిర్వహణను మెరుగుపరిచిందని శ్రీ మోదీ  పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయని, దాని ఫలితంగా మత్స్య ఉత్పత్తి, ఎగుమతులు రెట్టింపయ్యాయని ఆయన తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలిలోనూ, విస్తృత సముద్ర ప్రాంతాలలోనూ సుస్థిరమైన చేపల వేటను ప్రోత్సహించే అవసరం ఉందని,  ఈ లక్ష్యం కోసం ఒక ప్రణాళిక తయారవుతుందని తెలిపారు. ఈ రంగంలో సులభ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని,  వీలైనంత త్వరగా వాటిపై పనిచేయడం ప్రారంభించాలని శ్రీ మోదీ భాగస్వాములను కోరారు. సంప్రదాయ మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద కోట్లాది మంది పేదలకు ఇళ్లు అందిస్తున్నామని, స్వామిత్వ యోజన ఆస్తి యజమానులకు ‘రికార్డు ఆఫ్ రైట్స్’ ఇచ్చిందని ప్రధాన మంత్రి చెప్పారు. పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలం పెరిగిందని, వారికి అదనపు మద్దతు లభించిందని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన చిన్న రైతులు, వ్యాపారులకు లబ్ధి చేకూర్చిందన్నారు. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించిన శ్రీ మోదీ, ఇప్పటికే 1.25 కోట్ల మంది మహిళలు లాఖ్ పతి  దీదీలుగా మారడానికి కృషి చేశామని, గ్రామీణ శ్రేయస్సు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ లో చేసిన ప్రకటనలు అనేక కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయని చెప్పారు. నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను మరింత సమర్థవంతంగా ఎలా అమలు చేయాలో ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని ప్రధాని కోరారు. వారి సలహాలు, సహకారాలతో సానుకూల ఫలితాలు సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి చురుకైన భాగస్వామ్యం గ్రామాలను శక్తివంతం చేస్తుందని, గ్రామీణ కుటుంబాలను సుసంపన్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ పథకాలను త్వరితగతిన అమలు చేసేందుకు ఈ వెబినార్ దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు భాగస్వాములంతా ఐక్యంగా పనిచేయాలని కోరారు.