ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వెనుకబడిన వర్గాలకు రుణసాయం దిశగా నిర్వహించిన దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. అంతకుముందు ‘‘ప్రధానమంత్రి సామాజికోత్థాన-ఉపాధి ఆధారిత జనసంక్షేమ (పిఎం-సూరజ్) పథకం జాతీయ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే దేశంలోని లక్షమంది బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు రుణ సహాయం మంజూరు చేశారు. అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరవాసి, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ వ్యవస్థాపకుడైన శ్రీ నరేంద్ర సేన్ తన ప్రగతి పయనం గురించి ప్రధానమంత్రికి వివరించారు. తొలుత ఓ సైబర్ కేఫ్ నడిపిన తాను కోడింగ్ నేర్చుకుని, ప్రస్తుత కంపెనీ యజమానిగా ఎదిగానని ఆయన తెలిపారు. నేటి తన కృషిలో భాగంగా ‘ఎంఎస్‌ఎంఇ’ల డిజిటలీకరణ ద్వారా సాధికారత సాధించాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నట్లు చెప్పారు. మరొక నరేంద్రుడి కథను తెలుసుకోవాలని ఉందంటూ ప్రధాని ఉల్లాసంగా వ్యాఖ్యానించడంపై శ్రీ సేన్ స్పందించారు. తనది గ్రామీణ వ్యాపార కుటుంబ నేపథ్యమని, అయినప్పటికీ తాము ఇండోర్‌కు తరలివచ్చాకు సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెంచుకున్నానని వివరించారు. ఓసారి ‘నాస్కామ్’ కార్యక్రమం సందర్భంగా దేశంలో ‘క్లౌడ్ గోడౌన్’ అవసరాన్ని ప్రధాని ప్రస్తావించడంతో స్ఫూర్తి పొంది, ‘క్లౌడ్ కంప్యూటింగ్’పై దృష్టి సారించానని వెల్లడించారు. ఆ విధంగా ‘‘ఓ గ్రామంలోని నరేంద్రుడు మరొక నరేంద్రుడి నుంచి ప్రేరణ పొందాడు’’ అని శ్రీ సేన్ చమత్కరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- శ్రీ సేన్ ఎదుర్కొన్న సవాళ్లు, ప్రభుత్వం నుంచి అందిన చేయూత గురించి వాకబు చేశారు. అప్పట్లో ప్రభుత్వ సాయం కోసం తన అభ్యర్థనను సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఆమోదించినట్లు శ్రీ సేన్ బదులిచ్చారు. దీంతో భారత తొలి డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని వివరించారు. శ్రీ సేన్ చొరవను ప్రధాని అభినందిస్తూ- అంకుర సంస్థల స్థాపనపై యువత ఆసక్తి కనబరచడాన్ని హర్షణీయమంటూ వారి చొరవను ప్రశంసించారు. ఈ క్రమంలో శ్రీ సేన్ విజయం సాధించారంటూ ఆయనను అభినందించారు.
జమ్మూలో బొటిక్ నిర్వాహకురాలు నీలం కుమారి మాట్లాడుతూ- మహమ్మారి సమయంలో దిగ్బంధం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నానని ప్రధానికి తెలిపారు. అయితే, ఆ తర్వాత ఉజ్వల, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్ వంటి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎంతో ప్రయోజనం పొందానని ఆనందం వెలిబుచ్చారు. అలాగే వ్యాపారం ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి రుణం కూడా లభించిందని, తాను మరికొందరికి ఉపాధి కూడా కల్పించానని తెలిపారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- స్వయం ఉపాధి పొందడమేగాక మరికొందరికి జీవనోపాధి కల్పిస్తున్న వ్యక్తిగా ఆమెను ప్రశంసించారు. దేశంలో నలుమూలలా లోగడ నిర్లక్ష్యానికి గురైన ప్రజలంతా నేడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తన స్ఫూర్తిదాయక కథనాన్ని పంచుకోవడంపై ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో వెనుకబడిన వర్గాల జీవితాలను జన్-ధన్, ముద్ర, పీఎం ఆవాస్, వ్యవస్థాపన అభివృద్ధి పథకం వంటివి ఎందరో వెనుకబడిన వారి జీవితాలను మారుస్తున్నాయని పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ నుంచి ‘జల్ జీవన్ ఆగ్రోటెక్’ సహ వ్యవస్థాపకుడు శ్రీ నరేష్ వ్యవసాయ వ్యర్థ జలాల పరిరక్షణ కార్యకలాపాలు నిర్వహించే తన అంకుర సంస్థ గురించి ప్రధానికి వివరించారు. దీని స్థాపన కోసం ‘అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ మిషన్’ కింద రూ.30 లక్షల రుణం పొంది, యంత్రాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీనిపై ప్రధానితోపాటు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి కంపెనీ వ్యవస్థాపకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం గురించి ప్రధానమంత్రి వాకబు చేశారు. తల్లిదండ్రులతో కలిసి పొలాల్లో పనిచేయడం ద్వారా దీనిపై తగిన అనుభవం పొందానని శ్రీ నరేష్ వెల్లడించారు. మరోవైపు ఆయుష్మాన్ భారత్ కార్డ్, రాష్ట్రీయ రేషన్ పథకం ప్రయోజనాలు పొందడం గురించి కూడా ఆయన ప్రధానికి తెలిపారు. తమ కంపెనీ ద్వారా రైతులను ఆదుకోవడంపై శ్రీ నరేష్ మాట్లాడుతూ- తాము స్వరూపమిచ్చి, తయారుచేసిన ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించిందన్నారు. వ్యవసాయ సమయంలో నీటి వృథా నిరోధంలో ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సద్వినియోగం దిశగా వ్యవసాయ రంగంలోని కొత్త పరిశ్రమలు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఆయన ఉత్సాహాన్ని ప్రధాని మోదీ మెచ్చుకుంటూ వ్యవసాయ రంగంలో చొరవ చూపడంలో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారంటూ ప్రశంసించారు.
గుంటూరు నివాసి, పారిశుధ్య కార్మికురాలు శ్రీమతి ముత్తమ్మ మాట్లాడుతూ- తన పేరిట సెప్టిక్ ట్యాంక్ మడ్డి తొలగింపు వాహనం మంజూరు కావడం తన జీవితాన్నే మార్చేసిందని ప్రధానికి చెప్పారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఆమె ‘‘ఈ వాహనం నాకెంతో ఆత్మబలాన్నిచ్చింది.. సమాజం నన్నిపుడు గౌరవిస్తోంది.. మీ చలవతోనే ఇదంతా సాధ్యమైంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఆమె కుటుంబం గురించి ప్రధానమంత్రి వాకబు చేయగా- తన పిల్లలు చదువుకుంటున్నారని, తాను డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తాను, తన కుటుంబం లబ్ధి పొందుతున్నట్లు పేర్కొంటూ, ప్రధానమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకెంతో ఇష్టమైన పరిశుభ్రత రంగంలో ముందడుగు వేయడంపై ప్రధాని ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. పౌరుల జీవితాల్లో సానుకూల మార్పు దిశగా ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామ కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ‘‘మహిళల ఆత్మగౌరవం, శ్రేయస్సు మా సంకల్పంలో కీలకాంశాలు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
లబ్ధిదారులతో ముచ్చటించిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దేశంలోని 470 జిల్లాల నుంచి దాదాపు 3 లక్షలమంది ఆన్ లైన్ మాధ్యమంద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై కృతజ్ఞతలు తెలిపారు. దళితులు, వెనుకబడిన, అణగారిన వర్గాల సంక్షేమాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమాన్ని దేశమంతా ప్రత్యక్షంగా చూస్తున్నదని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యంపై ప్రభుత్వ నిబద్ధతకు నేటి సందర్భం ఒక నిదర్శనమన్నారు. ఇందులో భాగంగా దేశంలోని 500 జిల్లాలకు చెందిన లక్ష మంది వెనుకబడిన వర్గాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.720 కోట్ల విలువైన ఆర్థిక సహాయం బదిలీ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ‘‘గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) వ్యవస్థ ఊహల్లోనైనా లేనిది’’ అన్నారు. ఇతర ప్రభుత్వ పథకాల ‘డిబిటి’ తరహాలోనే దళారులు, కమీషన్లు, సిఫారసులకు అతీతంగా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సహాయం అందించే ‘సూరజ్’ పోర్టల్ ప్రారంభించడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్ పరిశుభ్రం చేసే కార్యకలాపాల్లో గల సఫాయి మిత్రలకు ఆయుష్మాన్ భారత్ కార్టులు, పీపీఈ కిట్‌ల పంపిణీ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. అణగారిన వర్గాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమంలో సేవా కార్యక్రమాల విస్తరణ ఒక భాగమంటూ- ఈ పథకాలతో లబ్ధి పొందుతున్న వారిని ఆయన అభినందించారు.
లబ్ధిదారులతో తన సంభాషణను ప్రస్తావిస్తూ- దళిత, అణగారిన, వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూరడం తనకెంత సంతృప్తినిస్తున్నదో ప్రధాని వివరించారు. వారికి. తనకు వ్యత్యాసమేమీ లేదని, వారిని తన కుటుంబంగా భావిస్తున్నందున అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరడం తనకు ఉద్వేగం కలిగిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మన దేశం 2047నాటికి వికసిత భారత్ కావాలన్న లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ- అణగారిన వర్గాలు ముందంజ వేస్తే తప్ప స్వప్నం సాకారం కాబోదని ప్రధాని స్పష్టం చేశారు. గతకాలపు ఆలోచన ధోరణిని ఛేదించడంద్వారా దళితులు, వెనుకబడిన, అణగారిన, గిరిజన వర్గాలకు గ్యాస్ కనెక్షన్, బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు అందేలా చూస్తున్నామని తెలిపారు.
కనీస సౌకర్యాల కల్పనలోనూ తరతరాలుగా వెనుకబడిన వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయని ప్రధాని గుర్తుచేశారు. అయితే, ‘‘అన్నివిధాలా నిరాశనిస్ప్పహల్లో కూరుకుపోయిన వారికి ప్రభుత్వం చేరువైంది. అంతేకాదు… దేశ ప్రగతిలో వారిని భాగస్వాములను చేసింది’’ అని వ్యాఖ్యానించారు. ఉచిత రేషన్/వైద్యం, పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తదితర పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది అణగారిన వర్గాల వారేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘‘ఈ పథకాలను మేం సంతృప్త స్థాయికి చేర్చే లక్ష్యం దిశగా కృషి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. సంచార, సంచార వర్గాలకోసం ప్రవేశపెట్టిన పథకాలతోపాటు పారిశుధ్య కార్మికుల కోసం ‘నమస్తే’ వంటి పథకాలను తెచ్చినట్లు ప్రధాని గుర్తుచేశారు. మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో మానవ వినియోగం అమానవీయమని ప్రధాని అన్నారు. ఈ పద్ధతిని నిర్మూలిస్తూ 60,000 మందికి ఆర్థిక సహాయం అందించి, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చేశామని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల సాధికారత కల్పనకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోంది’’ అన్నారు. ఈ మేరకు గత 10 సంవత్సరాల్లో వివిధ సంస్థల ద్వారా వారికి అందించే సహాయం రెట్టింపు చేశామని తెలిపారు. ఎస్సీల సంక్షేమం కోసం ఈ ఏడాది ప్రభుత్వం దాదాపు రూ.1.60 లక్షల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వాల పాలన కాలమంతా రూ.లక్షల కోట్ల కుంభకోణాలతో ముడిపడినది కాగా, నేడు ఈ సొమ్మునంతా దళిత, అణగారిన వర్గాల సంక్షేమంతోపాటు దేశాభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువతకు ఉపకారవేతనాల పెంపు, వైద్యవిద్య సీట్ల అఖిలభారత కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ‘నీట్‘లో ఓబీసీ విద్యార్థులకు ప్రవేశం, అణగారిన వర్గాల విద్యార్థులకు జాతీయ విదేశీ విద్యాభ్యాస ఉపకారవేతనం మంజూరు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. విదేశాలలో మాస్టర్స్, పిహెచ్.డి., అభ్యసించడానికి, శాస్త్రవిజ్ఞాన సబ్జెక్టులలో పీహెచ్.డి., చేయడానికి వీలుగా జాతీయ పరిశోధక విద్యార్థి ఉపకారవేతనం కూడా పెంచామని ఆయన తెలిపారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ప్రకటించడంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన పంచ తీర్థాలను అభివృద్ధి చేయడాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
అలాగే ‘‘ప్రభుత్వం అణగారిన వర్గాల యువత ఉపాధి-స్వయం ఉపాధికీ ప్రాధాన్యమిస్తోంది’’ అని వివరిస్తూ- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు సహా పేదలకు దాదాపు రూ.30 లక్షల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించిన ముద్ర యోజన గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వ్యవస్థాపకతకు ప్రోత్సాహమిస్తూ ‘స్టాండప్ ఇండియా’, ‘వెంచర్ క్యాపిటల్ ఫండ్’ పథకాలను ప్రవేశెపెట్టామని ఆయన గుర్తుచేశారు. ‘‘దళితులలో వ్యవస్థాపకత ప్రాధాన్యం దృష్ట్యా మా ప్రభుత్వం ‘అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్’ను కూడా ప్రారంభించింది’’ అని ప్రధాని మోదీ తెలిపారు. దళితులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు ఉద్దేశించిన విధానాలను ప్రస్తావిస్తూ- ‘‘అణగారినవర్గాల ప్రగతి, గౌరవాలపై మా నిబద్ధతకు ఇవన్నీ నిదర్శనాలు. ఈ కార్యక్రమం రాబోయే ఐదేళ్లలో మరింత విస్తరిస్తుంది… ఇది మోదీ మీకిస్తున్న హామీ. మీ అందరి ప్రగతితోనే వికసిత భారత్ స్వప్న సాకారం సాధ్యం’’ అని స్పష్టం చేస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.
నేపథ్యం
వెనుకబడిన వర్గాలకు రుణమద్దతు దిశగా ఏర్పాటు చేస్తున్న పిఎం-సూరజ్ పథకం జాతీయ పోర్టల్ అణగారినవర్గాలకు ప్రభుత్వ ప్రాధాన్యంపై ప్రధానమంత్రి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది సమాజంలోని అత్యంత అట్టడుగువర్గాల సముద్ధరణ లక్ష్యంగా రూపొందించిన ఓ పరివర్తనాత్మక కార్యక్రమం బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సి-ఎంఎఫ్‌ఐ సహా ఇతరత్రా ఆర్థిక సహాయ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగాగల అర్హులకు దీనికింద రుణ సహాయం అందించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్’ (నమస్తే-NAMASTE) పథకం కింద సఫాయి మిత్రలకు (మురుగు-సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే కార్మికులు) ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులతోపాటు పీపీఈ కిట్‌లను కూడా ప్రధానమంత్రి పంపిణీ చేశారు. అత్యంత సమస్యాత్మక పరిస్థితుల నడుమ పనిచేసే ముందువరుస పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రత పరిరక్షణ దిశగా మరో ముందడుగుకు ఈ పథకం ఒక నిదర్శనం. కాగా, దేశంలోని 500 జిల్లాల నుంచి వెనుకబడిన వర్గాలకు చెందిన సుమారు 3 లక్షల మంది వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
बीते 10 वर्षों से हमारी सरकार वंचित वर्ग के कल्याण और उत्थान के लिए समर्पित रही है। दलित, पिछड़े और वंचित समाज के कल्याण से जुड़े एक कार्यक्रम को संबोधित कर रहा हूं। https://t.co/T4iYjNiIo1
— Narendra Modi (@narendramodi) March 13, 2024
हमारी सरकार की योजनाओं से जिस तरह दलित, वंचित और पिछड़े समाज के मेरे परिवारजनों का जीवन बदल रहा है, वो व्यक्तिगत तौर पर मुझे भावुक करने वाला है। pic.twitter.com/ruDu8HT8yS
— Narendra Modi (@narendramodi) March 13, 2024
हम इस विजन के साथ आगे बढ़ रहे हैं कि हमारे वंचित और पिछड़े वर्ग के भाई-बहनों के विकास के बिना भारत विकसित नहीं हो सकता। pic.twitter.com/5Go211UaNX
— Narendra Modi (@narendramodi) March 13, 2024
2014 से पहले जो लाखों करोड़ रुपये घोटालों की भेंट चढ़ जाते थे, हमने उन्हें दलित-वंचित के कल्याण और देश के निर्माण में लगाया है। pic.twitter.com/QHAltO9IH9
— Narendra Modi (@narendramodi) March 13, 2024
आने वाले 5 वर्षों में वंचित वर्ग के विकास और सम्मान को लेकर ये मोदी की गारंटी है… pic.twitter.com/N5B2ACJUbJ
— Narendra Modi (@narendramodi) March 13, 2024