ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ లోక్‌కల్యాణ్ మార్గ్‌లో వెంచర్ కేపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ చర్చాగోష్ఠి నిర్వహించారు. దేశంలో పెట్టుబడుల వాతావరణం భారీగా పెరగడానికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ దిశగా గడచిన ఏడేళ్లలో ప్రభుత్వం అనేకానేక కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇదే అంశాలపై సమావేశంలో చర్చ కొనసాగింది. అలాగే తాజా బడ్జెట్ రూపకల్పనకు ముందు పరిశ్రమ ప్రముఖులతో ప్రధానమంత్రి ఏ విధంగా వ్యక్తిగత చర్చలు నిర్వహించారో ఈ చర్చాగోష్ఠి ప్రతిబింబించింది.
దేశంలో వ్యాపార సౌలభ్యం మెరుగుకు అవసరమైన సూచనలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. అలాగే దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు సంస్కరణల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడంపై అభిప్రాయాలు స్వీకరించారు. ఆ మేరకు పలువురు ప్రతినిధులిచ్చిన ఆచరణాత్మక సూచనలు, సలహాలను ఆయన అభినందించారు. సమావేశంలో వారు ప్రముఖంగా ప్రస్తావించిన సమస్యలు, సవాళ్ల పరిష్కారంపై కృషి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. మరిన్ని సంస్కరణలు తెచ్చే దిశగా సాగుతున్న కృషి గురించి, భవిష్యత్ ఫలితాలివ్వగల ‘పీఎం గతిశక్తి’ వంటి చర్యలపైనా వారితో చర్చించారు. అదేవిధంగా లెక్కకుమిక్కిలి నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని తగ్గించటానికి తీసుకున్న చర్యలపైనా సంభాషించార. దేశవ్యాప్తంగా అంకుర సంస్థల పర్యవరణానికి ఉత్తేజమివ్వడాన్ని, క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలు పెరుగుతుండటాన్ని కూడా సమావేశంలో ఆయన ప్రస్తావించారు.
ప్రధానమంత్రి నాయకత్వ పటిమను వెంచర్ కేపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ప్రతినిధులు వేనోళ్ల కొనియాడారు. దేశంలో పెట్టుబడుల వాతావరణం భారీగా పెరగడం వెనుక ప్రధాన చోదకశక్తి ఆయన నాయకత్వమేనని ప్రశంసించారు. దేశంలో అంకుర సంస్థల పర్యావరణానికి ఉత్తేజమిచ్చేలా ప్రధాని చర్యలు తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ- ఆయనను ‘అంకుర సంస్థల ప్రధానమంత్రి’గా శ్రీ సిద్ధార్థ్ పాయ్ అభివర్ణించారు.
భారతదేశానికిగల వ్యవస్థాపక సామర్థ్యం గురించి, మన అంకుర సంస్థలు ప్రపంచ స్థాయిని అందుకునే విధంగా దాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాల గురించి కూడా వెంచర్ కేపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ మేరకు వ్యవసాయ అంకుర సంస్థల స్థాపనకుగల అవకాశాల గురించి శ్రీ ప్రశాంత్ ప్రకాష్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ కూడలిగా మలిచే దిశగా కృషిపై శ్రీ రాజన్ ఆనందన్ సూచనలిచ్చారు. మన దేశం గడచిన ఏడేళ్లుగా తీసుకొచ్చిన సంస్కరణలను… ముఖ్యంగా ‘ఆర్థిక అశక్తత-దివాలా స్మృతి’ (ఐబీసీ) వంటివాటిని శ్రీ శంతన నలవాడి ప్రశంసించారు. ‘బ్లాక్‌స్టోన్’ (నిధులు)కు సంబంధించి అంతర్జాతీయంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న భౌగోళిక దేశాలలో భారత్ ఒకటిగా ఉందని శ్రీ అమిత్ దాల్మియా చెప్పారు. గృహనిర్మాణ రంగంలో… ప్రత్యేకించి సరసమైన ధర ఇళ్ల విభాగంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలను శ్రీ విపుల్ రూంగ్టా ప్రశంసించారు. ఇంధన రంగంలో పరివర్తనలుసహా వాతావరణ మార్పులపై భారత్ ప్రకటించిన లక్ష్యాల ప్రభావంతో అందివస్తున్న అపార అవకాశాల గురించి కూడా ప్రతినిధులు చర్చించారు. ఆర్థిక-సాంకేతికత, ఆర్థిక నిర్వహణ, ఒక సేవగా సాఫ్ట్ వేర్ (ఎస్‌ఏఏఎస్) వగైరా రంగాలపైనా వారు సూచనలు చేశారు. భారతదేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వారు ప్రశంసించారు.
ఈ చర్చాగోష్ఠిలో- యాక్సెల్ నుంచి శ్రీ ప్రశాంత్ ప్రకాష్, సిక్వోయా నుంచి శ్రీ రాజన్ ఆనందన్, టీవీఎస్ క్యాపిటల్స్ నుంచి శ్రీ గోపాల్ శ్రీనివాసన్, మల్టిపుల్స్ నుంచి శ్రీమతి రేణుకా రామ్‌నాథ్, సాఫ్ట్ బ్యాంక్ నుంచి శ్రీ మునీష్ వర్మ, జనరల్ అట్లాంటిక్ నుంచి శ్రీ సందీప్ నాయక్, కేదారా క్యాపిటల్ నుంచి శ్రీ మనీష్ కేజ్రీవాల్, క్రిస్ నుంచి శ్రీ ఆష్లే మెనెజెస్, కోటక్ ఆల్టర్నేట్ అసెట్స్ నుంచి శ్రీని శ్రీనివాసన్, ఇండియా రీసర్జెంట్ నుంచి శ్రీ శంతను నలవాడి, 3ఒన్4 నుంచి శ్రీ సిద్దార్థ్ పాయ్, ఆవిష్కార్ నుంచి మిస్టర్ వినీత్ రాయ్, అడ్వెంట్ నుంచి శ్రీమతి శ్వేతా జలన్ బ్లాక్‌స్టోన్ నుంచి శ్రీ అమిత్ దాల్మియా, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి శ్రీ విపుల్ రూంగ్టా, బ్రూక్‌ఫీల్డ్ నుంచి శ్రీ అంకుర్ గుప్తా, ఎలివేషన్ నుంచి శ్రీ ముకుల్ అరోరా, ప్రోసస్ నుంచి శ్రీ సెహ్రాజ్ సింగ్, గజా క్యాపిటల్ నుంచి శ్రీ రంజిత్ షా, యువర్‌నెస్ట్ నుంచి శ్రీ సునీల్ గోయల్, ఎన్‌ఐఐఎఫ్ నుంచి శ్రీ పద్మనాభ్ సిన్హా పాల్గొన్నారు. అలాగే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, సహాయ మంత్రితోపాటు ప్రధాని కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు కూడా హాజరయ్యారు.
Had an extensive and insightful interaction with representatives of Venture Capital and Private Equity Funds. Highlighted the steps taken by the Government of India to make business easier, compliance burden lesser and to support young talent. https://t.co/zRzFSFW7Tv
— Narendra Modi (@narendramodi) December 17, 2021
During the interaction, heard about the vision and wonderful work being done by Venture Capital and Private Equity Funds to support entrepreneurial talent in sectors ranging from agriculture, education, technology to urban development, energy, infrastructure and more.
— Narendra Modi (@narendramodi) December 17, 2021