Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించడమే కాక కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజనును ప్రధాని ప్రారంభించారు. ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, తెలంగాణలో చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషనును ప్రారంభించారు.

శ్రీ గురు గోవింద్ సింహ్ జీ జయంతి సందర్భంగా ప్రధాని తన శుభాకాంక్షలను తెలిపారు. శ్రీ గురు గోవింద్ సింహ్ జీ బోధనలు, జీవనం ఒక బలమైన, సమృద్ధిసహితమైన దేశాన్ని ఆవిష్కరించాలనే దార్శనికతను సాకారం చేయడానికి ప్రేరణనిస్తాయని ప్రధాని స్పష్టంచేశారు. సంధానాన్ని (కనెక్టివిటీ) సమకూర్చడంలో భారత్ శరవేగంగా ముందుకు పోతోందని శ్రీ మోదీ ప్రశంసను వ్యక్తం చేస్తూ, 2025 ప్రారంభం అయిననాటి నుంచి, భారత్ తన మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను 1000 కి.మీ. కి పైగా విస్తరించడం వంటి తన కార్యక్రమాల జోరును పెంచుతోందన్నారు. ఇటీవల ఢిల్లీ-ఎన్‌సీఆర్ లో నమో భారత్ రైలును ప్రారంభించుకోవడం, నిన్న ఢిల్లీ మెట్రో ప్రాజెక్టుల్ని ప్రారంభించుకోవడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. యావత్తు దేశం కలిసికట్టుగా ఒక్కో అడుగునే ముందుకు వేస్తూపోతోందనడానికి ఈ రోజున నిర్వహిస్తున్న కార్యక్రమమే ఒక నిదర్శనంగా ఉందనీ, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తెలంగాణల్లో ప్రారంభించిన ప్రాజెక్టులు దేశ ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఆధునిక సంధాన రంగంలో ఒక ప్రధాన పురోగమనానికి సంకేతంగా నిలిచాయని శ్రీ మోదీ అభివర్ణించారు. అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతకు వాస్తవ రూపాన్ని ఇవ్వడంలో ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ (అందరితో కలిసి, అందరి పురోగమనం) మంత్రం సాయపడుతోందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పరిణామాలకు గాను ఆయా రాష్ట్రాలకూ, భారతదేశ పౌరులందరికీ ఆయన అభినందనలను తెలిపారు.

దేశంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ వంటి ఆధునిక రైల్ నెట్‌వర్క్‌ల పనులు త్వరితగతిన పురోగమిస్తున్నాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఈ ప్రత్యేక కారిడార్లు రైలు మార్గాలపైన ఇప్పుడున్న ఒత్తిడిని తగ్గిస్తాయని, అంతేకాక అధిక వేగంతో పయనించే రైళ్లకు మరిన్ని అవకాశాలను అందిస్తాయని కూడా ఆయన అన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ (భారత్‌లోనే తయారీ)ని ప్రోత్సహిస్తున్న కారణంగా రైల్వేల్లో పెనుమార్పు సంభవిస్తోందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. మెట్రోల కోసం, రైల్వేల కోసం ఆధునిక రైలుపెట్టెలను అభివృద్ధిపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. స్టేషన్లకు కూడా సరికొత్త రూపురేఖల్ని కల్పిస్తున్నారు, స్టేషన్లలో సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు, రైల్వే స్టేషన్లలో ‘వన్ స్టేషన్, వన్ ప్రోడక్ట్’ స్టాళ్లను నెలకొల్పుతున్నారు అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ రైల్వే రంగంలో లక్షల కొద్దీ నూతన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి అని ఆయన చెప్పారు. ‘‘గత పదేళ్ల కాలంలో, రైల్వేల్లో లక్షలాది యువజనులు శాశ్వత ప్రభుత్వోద్యోగాలను సంపాదించుకొన్నారు. కొత్తగా రైలు పెట్టెలను తయారు చేస్తున్న కర్మాగారాల్లో ముడిసరుకులకు డిమాండు ఏర్పడడం ఇతర రంగాల్లో సైతం మరిన్ని ఉద్యోగావకాశాలకు దారితీస్తుంది’’ అని శ్రీ మోదీ వివరించారు.

రైల్వేల రంగానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని, దేశంలో మొట్టమొదటి గతి-శక్తి విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు. రైల్వే నెట్‌వర్క్ విస్తరించిన కొద్దీ, కొత్త డివిజన్లను, ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు, దీంతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, లేహ్-లద్దాఖ్ వంటి ప్రాంతాలకు ప్రయోజనం కలగనుంది అని ఆయన అన్నారు. రైల్వే మౌలిక సదుపాయాల పరంగా జమ్మూ కాశ్మీర్ కొత్త విజయాల్ని సాధిస్తోంది, ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లైనును గురించి ఇవాళ దేశమంతటా చర్చించుకొంటున్నారు అని ఆయన తెలిపారు. చీనాబ్ వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైల్వే కమాను వంతెన, ఈ వంతెన పని పూర్తి అయిందా అంటే ఆ ప్రాంతాన్ని భారతదేశంలో మిగతా ప్రాంతాలతో కలపడంలో ఓ కీలక పాత్రను పోషిస్తుంది, అంతేకాకుండా లేహ్-లద్దాఖ్ ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది అని శ్రీ మోదీ చెప్పారు.

దేశంలో మొట్టమొదటి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అయిన అంజి ఖాద్ వంతెన కూడా ఈ ప్రాజెక్టులో ఓ భాగం అని శ్రీ మోదీ వివరించారు. చీనాబ్ వంతెన, అంజి ఖాద్ వంతెనలు ఇంజినీరింగ్‌లో సాటిలేని ఉదాహరణలు, అవి ఆ ప్రాంతంలో ఆర్థిక పురోగతికి దారితీసి, సమృద్ధిని ప్రోత్సహిస్తాయి అని ఆయమన వివరించారు.

ఒడిశాలో ప్రాకృతిక వనరులు పుష్కలంగా ఉన్నాయి, పెద్ద కోస్తా తీరం ఉంది, అంతర్జాతీయ వ్యాపారానికి దండిగా అవకాశాలున్నాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో రూ. 70,000 కోట్ల కన్నా ఎక్కువ విలువతో కూడిన అనేక రైల్వే ప్రాజెక్టులు, ఏడు గతి శక్తి కార్గో టర్మినళ్లను ఏర్పాటు చేయడంతో వ్యాపార రంగానికీ, పరిశ్రమల రంగానికీ దన్ను లభించినట్లయింది అని ఆయన అన్నారు. ఈరోజు, ఒడిశాలో రాయగడ రైల్వే డివిజన్‌కు శంకుస్థాపన పూర్తి అయింది, దీంతో రైల్వేల్లో మౌలిక సదుపాయాలు పుంజుకొని పర్యటన రంగం, వ్యాపారం, ఒడిశాలో ప్రత్యేకించి గిరిజన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణ ఒడిశాలో ఉద్యోగకల్పనకు ప్రోత్సాహం లభిస్తుంది అని ఆయన వివరించారు.

తెలంగాణలో చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషనును ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభించారు. అవుటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేసే శక్తి ఈ కొత్త టర్మినల్ స్టేషనుకు ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. ఈ స్టేషన్, అవుటర్ రింగ్ రోడ్డుకు సంధానమవుతుంది. ఇది ఆ ప్రాంతంలో అభివృద్ధిని చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుతుంది’’ అని ఆయన అన్నారు. ఈ స్టేషన్లో ప్లాట్‌ఫారాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌరవిద్యుత్తు ఆధారంగా సాగే కార్యకలాపాలు వంటి ఆధునిక వసతి, సదుపాయాలు కూడా ఉన్నాయని శ్రీ మోదీ వివరించారు. ‘‘ఇది దీర్ఘకాలం పాటు మన్నికైన మౌలిక సదుపాయాలను సమకూర్చడంలో వేసిన ఒక ముందడుగు’’ అని కూడా ఆయన అభివర్ణించారు.ఈ కొత్త టర్మినల్ ఇప్పటికే సేవలందిస్తున్న సికిందరాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రజలకు ప్రయాణాల్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుంది అని ఆయన తెలిపారు.

ఈ తరహా ప్రాజెక్టులు జీవన సౌలభ్యాన్ని పెంచడం ఒక్కటే కాకుండా వ్యాపార సౌలభ్యాన్ని కూడా పెంచి, భారత్ మౌలిక సదుపాయాల విస్తరణ పరంగా పెట్టుకొన్న లక్ష్యాలను సాధించడంలో తోడ్పడుతుందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.

భారత్ ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వేలు, జలమార్గాలు, మెట్రో నెట్‌వర్క్‌లు సహా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున విస్తరించే పనిలో పడింది అని శ్రీ మోదీ వివరించారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉన్నది కాస్తా ప్రస్తుతం 150కి పెరిగింది, మెట్రో సర్వీసులు దేశవ్యాప్తంగా 5 నగరాల్లో ఉన్నవి కాస్తా 21 నగరాలకు విస్తరించాయని ఆయన అన్నారు. ‘‘ఈ ప్రాజెక్టులు ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు పయనించడంలో ఓ భాగంగా ఉన్నాయి, వికసిత్ భారత్ ఈ దేశంలో పౌరులు అందరికీ ఇప్పుడు ఒక మిషన్‌గా మారింది’’ అని ఆయన అన్నారు.

భారత్ వృద్ధిపై ప్రధాని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘నాకు నమ్మకముంది.. కలసికట్టుగా, మనం ఈ వృద్ధిని మరింత వేగవంతంగా మలుస్తాం’’ అన్నారు. ఈ ముఖ్య ఘట్టాలకు గాను మన దేశ పౌరులకు ఆయన అభినందనలు తెలియజేస్తూ, దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వేలు, సమాచార-ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర సైన్స్, టెక్నాలజీ, భూవిజ్ఞాన శాస్త్రాల శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి శ్రీ వి.సోమన్న, సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ బిట్టూ, కేంద్ర మంత్రి శ్రీ  బండి సంజయ్ కుమార్, తెలంగాణ గవర్నరు శ్రీ జిష్ణు దేవ్ వర్మ, ఒడిశా గవర్నరు శ్రీ హరి బాబు కంభంపాటి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ ముఖ్య మంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

నేపథ్యం

జమ్మూ ప్రాంతంలో సంధానాన్ని మరింత పెంచడంలో చేపట్టిన ఒక కీలక ప్రయత్నంగా, కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజనును ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవన నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వీటితోపాటు తెలంగాణలో చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషనును ప్రధాని ప్రారంభించారు.

పఠాన్‌కోట్-జమ్మూ-ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా, భోగ్‌పూర్ సిర్వాల్- పఠాన్‌కోట్, బతాలా – పఠాన్‌కోట్, పఠాన్‌కోట్ నుంచి జోగీందర్ నగర్ సెక్షన్లతో కూడిన 742.1 కి.మీ. మేర విస్తరించిన జమ్మూ రైల్వే డివిజనును ఏర్పాటు చేయడంతో జమ్మూ కాశ్మీర్‌కు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం కలగనుంది. దీంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లయింది. అలాగే, మన దేశంలో ఇతర ప్రాంతాలకు ఈ ప్రాంతంతో సంధానం మెరుగైంది. ఇది ఉద్యోగావకాశాల్నీ, మౌలిక సదుపాయాల అభివృద్ధినీ మెరుగుపర్చడంతోపాటు పర్యటన రంగాన్ని ప్రోత్సహించి ఆ ప్రాంతంలో మొత్తంమీద సామాజిక-ఆర్థిక అభివృద్ధికి బాటవేయనుంది.

చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషన్‌ను తెలంగాణలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో భాగంగా అభివృద్ధిచేశారు. ఇది ఒక కొత్త కోచింగ్ టర్మినల్. అంతేకాక, సుమారు రూ.413 కోట్ల వ్యయంతో దీనిని రెండో ప్రవేశం సదుపాయంతో తీర్చిదిద్దారు. దీనిని పర్యావరణ అనుకూల టర్మినల్‌గా రూపొందించారు. దీనిలో  ప్రయాణికులకు చక్కనైన వసతి, సదుపాయాలున్నాయి. ఇది సికిందరాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి రాజధాని నగరంలోని ప్రస్తుత కోచింగ్ టర్మినల్స్‌లో రైళ్ల రాకపోకల రద్దీని తగ్గించనుంది.

ప్రధాని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇది ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, ఇంకా సమీప ప్రాంతాల్లో సంధానాన్ని మెరుగుపరచనుంది. దీంతోపాటే, ఆ ప్రాంతంలో మొత్తంమీద సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దారితీయనుంది.

 

 

***