Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వియత్నాం పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన (సెప్టెంబర్ 03, 2016)

వియత్నాం పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన (సెప్టెంబర్ 03, 2016)


శ్రేష్ఠుడైన ప్రధాన మంత్రి శ్రీ గుయెన్ శువాన్ ఫుక్,

మీడియా ప్రతినిధులారా,

శ్రేష్ఠుడా, మీరు నాకూ, నా ప్రతినిధి బృందానికీ ఇచ్చిన సాదర ఆహ్వానానికీ, ఆతిథ్యానికీ నా ధన్యవాదాలు. ఇవాళ ఉదయం నాకు శ్రీ హో చి మిన్ గృహాన్ని స్వయంగా దగ్గరుండి చూపించి, మీరు నా పట్ల ఎంతో ఆదరాన్ని కనబరచారు. 20వ శతాబ్దపు మహోన్నత నాయకులలో శ్రీ హో చి మిన్ ఒకరు. ఈ గొప్ప భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు మహాశయా. నిన్న జాతీయ దినోత్సవాన్ని జరుపుకొన్న వియత్నాం ప్రజలకు కూడా అభినందనలు తెలియచేస్తున్నాను.

మిత్రులారా,

మన రెండు సమాజాల మధ్య 2000 సంవత్సరాల కు పైబడిన నాటి నుంచి అనుబంధం ఉన్నది. భౌద్దం భారత దేశం నుండి వియత్నాం లో ప్రవేశించడం, వియత్నాంలోని హిందూ చాం దేవాలయాల గురుతులు ఈ బంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నా తరానికి చెందిన ప్రజల హృదయాలలో వియత్నాంకు ఒక విశిష్ట స్థానం ఉంది. వలస పాలన నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో వియత్నామీయులు చూపిన ధైర్య సాహసాలు గొప్ప ప్రేరణను కలిగించాయి. జాతీయ పునరేకీకరణలో మీరు సాధించిన విజయాలు, జాతి నిర్మాణంలో మీరు చూపించిన నిబద్ధత మీ ప్రజల దృఢమైన స్వభావాన్ని ప్రతిఫలిస్తున్నాయి. భారతదేశంలో మేము మీ ధృడ సంకల్పాన్ని కొనియాడాము, మీ విజయాన్ని ఆస్వాదించాము, మీ జాతి ప్రయాణం పొడవునా మీ వెన్నంటే ఉన్నాము.

మిత్రులారా,

ప్రధానమంత్రి శ్రీ ఫుక్‌తో నా సంభాషణ విస్తృతమైనది, ఫలవంతమైనది. ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సహకారపు పూర్తి పరిధిని మేము చర్చించాము. మన ద్వైపాక్షిక ఒప్పందపు పరిధిని మరింత విస్తరించాలని, దానిని మరింత బలోపేతం చేయాలని మేము నిర్ణయించాము. ఈ ప్రాంతంలో రెండు ముఖ్యమైన దేశాలుగా, ఇద్దరికీ అవసరమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన పొత్తులను మరింత ముందుకు తీసుకు వెళ్లవలసిన అవసరం ఉందని మేము భావించాము. కొత్తగా తలెత్తుతున్న ప్రాంతీయ సవాళ్ళకు స్పందించడంలో పరస్పర సహకారం అవసరమని కూడా మేము గుర్తించాము. మన వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయిని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా పెంచడమనే చర్య భవిష్యత్ సహకారపు మార్గాన్ని, ఉద్దేశాన్ని సూచిస్తున్నది. ఈ చర్య మన ద్వైపాక్షిక సహకారానికి ఒక నూతన దిశను, గమనాన్ని, సారాన్ని అందిస్తుంది. మన ఉమ్మడి ప్రయత్నాలు ఈ ప్రాంతంలో సుస్థిరతను, భద్రతను, సంపదను పెంచడానికి దోహదం చేస్తాయి.

మిత్రులారా,

మన ప్రజలకు ఆర్థిక శ్రేయస్సును అందించాలనే మన ప్రయత్నాలకు తోడుగా వాటిని సంరక్షించే చర్యలు కూడా అవసరం అని మేము గుర్తించాము. అందువల్ల, మన ఉమ్మడి ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి మన రక్షణ చర్యలను మరియు భద్రత చర్యలను మరింత పటిష్టం చేయాలని మేము అంగీకారానికి వచ్చాము. సముద్రంలో గస్తీ పడవల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంలో ఈ రోజు సంతకం చేయడం మన రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన నిర్ధిష్ట చర్యలలో ఒకటి. మరింత లోతైన రక్షణ సహకారాన్ని సాకారం చేయడంలో భాగంగా వియత్నాంకు 500 మిలియన్‌ అమెరికన్ డాలర్లను కొత్త రక్షణ రేఖా రుణంగా అందిస్తున్నామని సంతోషంతో ప్రకటిస్తున్నాను. కొంతసేపటి క్రితం మేము సంతకం చేసిన విభిన్నమైన ఒప్పందాలు మన సహకారంలోని లోతును, వైవిధ్యాన్ని సూచిస్తాయి.

మిత్రులారా,

వియత్నాంలో అభివృద్ధి,ఆర్థిక వృద్ధి చాలా వేగంగా జరుగుతున్నాయి.

వియత్నాం లక్ష్యాలలో :

* తన ప్రజలను సంపన్నులుగా చేయడం, వారికి సాధికారతను అందించడం.

* వ్యవసాయాన్ని ఆధునికీకరించడం.

* వ్యవస్థాపకతను, ఆవిష్కరణను ప్రోత్సహించడం.

* శాస్త్ర సాంకేతిక పునాదిని పటిష్ట పరచడం.

* వేగవంతమైన ఆర్థికాభివృద్ధి కోసం నూతన వ్యవస్థీకృత సామర్థ్యాలను సృష్టించడం.

* ఆధునిక జాతి నిర్మాణానికి అవసరమైన చర్యలను చేపట్టడం.. వంటివి కలసి ఉన్నాయి.

ఈ ప్రయాణంలో వియత్నాంకు భాగస్వామిగా, స్నేహితునిగా నిలవడానికి భారతదేశం, 125 కోట్ల మంది భారతదేశ ప్రజలు సంసిద్ధంగా ఉన్నాము. మన భాగస్వామ్య వాగ్దానాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రధాన మంత్రి, నేనూ ఈ రోజు అనేక నిర్ణయాలు తీసుకోవడానికి అంగీకరించాము. హా త్రాంగ్ లోని టెలి కమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో సాఫ్ట్‌వేర్ పార్క్ స్థాపన కోసం 5 మిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాంటును భారతదేశం అందచేయనున్నది. అంతరిక్ష సహకారానికి సంబంధించిన నియమాల ఒప్పందం ద్వారా వియత్నాం తన జాతీయ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ.. ఇస్రో) తో చేతులు కలుపుతుంది. ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడం కూడా మన వ్యూహాత్మక లక్ష్యం. దీని కోసం 2020 నాటికి 15 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి నూతన వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడం అవసరం. వియత్నాంలో కొనసాగుతున్న భారతీయ ప్రాజెక్టులను, పెట్టుబడులను కూడా నేను పర్యవేక్షిస్తాను. అంతే కాదు, నా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను, ప్రధాన కార్యక్రమాలను ఉపయోగించుకోవలసిందిగా వియత్నాం కంపెనీలను కూడా ఆహ్వానించాను.

మిత్రులారా,

మన ప్రజల మధ్య ఉన్న సాంస్మృతిక సంబంధం శతాబ్దాల నాటిది. వీలయినంత త్వరగా హనోయి లో భారతీయ సాంస్మృతిక కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించగలమనే నమ్మకం నాకుంది. ‘మై సన్ ‘ ప్రాంతంలోని చాం స్మారకాల పునరుద్ధరణ, పర్యవేక్షణ పనులను త్వరలోనే భారతీయ పురాతత్వ శాఖ చేపట్టనుంది. నలంద మహావిహార శాసనాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించడానికి చొరవ తీసుకొన్న వియత్నాం నాయకత్వానికి నా కృత‌జ్ఞ‌త‌లు.

మిత్రులారా,

చారిత్రక సంబంధాలు, భౌగోళిక సామీప్యం, సాంస్కృతిక బంధాలు మరియు వ్యూహాత్మక అంతరిక్షం- వీటి మూలంగా ASEAN ( ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం) భారతదేశానికి ప్రధానమైనది. మా ‘Act East’ policy (తూర్పు ఆసియా దేశాలతో మెరుగైన సంబంధాల విధానం) కి ఇది కేంద్ర బిందువు. భారతదేశానికి ASEAN అనుసంధానకర్తగా ఉన్న వియత్నాం నాయకత్వంలో, అన్ని రంగాలలో ASEAN- భారత దేశ భాగస్వామ్యం మరింత బలపడే దిశగా మేం కృషి చేస్తాము.

శ్రేష్ఠుడా,

మీ ఆతిథ్యం ఉదారమైనదీ, ఉదాత్తమైనదీనూ. వియత్నాం ప్రజలు చూపిన ప్రేమానురాగాలు నా హృదయాన్ని తాకాయి. మన భాగస్వామ్యం యొక్క స్వభావం, దిశ నుండి మనం సంతృప్తి చెందవచ్చు. అయితే, అదే సమయంలో మన పొత్తులు సక్రమంగా ముందుకు సాగేందుకు మనం దృష్టి పెట్టాలి. మీ ఆతిథ్యాన్ని నేను ఆనందించాను. వియత్నాం నాయకత్వానికి మా దేశంలో ఆతిథ్యం ఇస్తే నాకెంతో సంతోషం కలుగుతుంది. మా దేశానికి మిమ్మల్ని ఆహ్వానించే క్షణం కోసం మేము ఎదురుచూస్తుంటాము.

మీకు ఇవే నా ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.

****