విద్యుత్ రంగంలో సహకారానికి సంబంధించి భారత్, బ్రిటన్ ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఓయూ) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ కింది అంశాలలో పరస్పర సహకారం ఉంటుంది:
1) మార్కెట్ సంస్కరణలు. రెగ్యులేటరీ వ్యవస్థలు. విద్యుత్ సరఫరా, పంపిణీ అంశాల్లో పోటీ. పునర్వినియోగ ఇంధన వనరుల వినియోగానికి సంబంధించిన నిబంధనలు, ప్రోత్సాహకాలు;
2) పునర్వినియోగ వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడం;
3) సమర్థ రీతిలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం, వాహనాల ఇంధన వినియోగంలో మెరుగైన చర్యలతో సహా విద్యుత్ సామర్థ్య పెంపు చర్యలు, విధానాలు;
4) పవన విద్యుత్, సౌర విద్యుత్;
5) స్మార్ట్ గ్రిడ్‌లు;
6) శక్తిని నిల్వ చేయగల వినూత్న విధానాలతో సహా పలు పరిజ్ఞానాల్లో పరస్పర సహకారం;
7) పునరుత్పాదక, పునర్వినియోగ ఇంధన సంస్థల ఏర్పాటు;
8) ఆఫ్-గ్రిడ్ పునర్వినియోగ విద్యుత్ సేవలు;
9) అలల ద్వారా విద్యుదుత్పత్తి;
10) ఒప్పంద భాగస్వాముల అనుమతి మేరకు ఇతరత్రా అంశాల్లో పరస్పర సహకారం.
పరికరాల సరఫరాతో సహా సంపూర్ణ సాంకేతిక సహకారానికి ఈ ఎంఓయూ అవకాశం కల్పిస్తుంది. బ్రిటన్ చేపట్టిన పలు ప్రాజెక్టుల ద్వారా ఇరు పక్షాలూ ఆమోదించిన రీతిలో పరస్పర సహకారం కొనసాగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు నిర్దిష్ట ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. విద్యుత్ మార్కెట్ నిర్మాణం, పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌తో అనుసంధానించడంపై ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా ఇంధన భద్రత, సమర్థ సరఫరా, అందరికీ విద్యుత్‌ను అందుబాటులోకి తేవడం, సుస్థిర ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టి కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో తదనుగుణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.