Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాతావరణ మార్పుపై శిఖరాగ్ర సదస్సు-2021లో ప్రధాని ప్రసంగం


మాననీయులైన అధ్యక్షులు బైడెన్…

విశిష్ట సహచరులు…

ప్రపంచంలోని నా సహ పౌరులారా…

   నమస్కారం!

   ఈ సదస్సు నిర్వహణ దిశగా చొరవచూపిన అధ్యక్షులు బైడెన్ గారికి నా హృదయపూర్వక కృత‌జ్ఞ‌త‌లు. మానవాళి మొత్తం ఇవాళ ప్రపంచ మహమ్మారితో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ముప్పు ఇంకా దాటిపోలేదని గుర్తుచేసే సముచిత తరుణంగా ఈ సదస్సును పరిగణించాలి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు వాతావరణ మార్పు ముప్పు ఒక సజీవ వాస్తవం. వారి జీవితాలు, జీవనోపాధులు ఇప్పటికే ఈ ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నాయి.

మిత్రులారా!

   వాతావరణ మార్పును ఎదుర్కొనే దిశగా మానవాళికి నిర్దిష్ట కార్యాచరణ అవశ్యం. సదరు కార్యాచరణ అత్యంత భారీగా, అంతర్జాతీయ స్థాయిలో.. అమిత వేగంగా ముందుకు సాగడం మనకెంతో అవసరం. ఇందులో భాగంగా భారతదేశంలో మా వంతు కృషి మేం కొనసాగిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2030నాటికి 450 గిగావాట్లకు పెంచాలన్న మా ప్రతిష్టాత్మక లక్ష్యమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మాకు ప్రగతి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ పరిశుభ్ర ఇంధనం, ఇంధన సామర్థ్యం, అటవీకరణ, జీవవైవిధ్యం తదితరాలపై అనేక సాహసోపేత చర్యలు చేపట్టాం. కాబట్టే ‘జాతీయ నిర్దేశిత లక్ష్యం’ 2 డిగ్రీల సెల్సియస్ పరిధిలోగల అతికొద్ది దేశాల జాబితాలో భారత్ ఒకటిగా ఉంది. అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్ఎ), లీడ్ఐటీ, విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల కూటమి (సీడీఆర్ఐ) వంటివాటిని కూడా మేం ప్రోత్సహించాం.

మిత్రులారా!

   వాతావరణంపై బాధ్యతగల వర్ధమాన దేశంగా భార‌త్‌లో సుస్థిర ప్రగతి సంబంధిత నమూనాల సృష్టిలో భాగస్వాములను మేం ఆహ్వానిస్తున్నాం. హరిత ఆర్థిక సాయం, పరిశుభ్ర సాంకేతిక ప‌రిజ్ఞానాల లభ్యత అవసరమైన ఇతర వర్ధమాన దేశాలకూ ఈ నమూనాలు తోడ్పడతాయి. అందుకే నేను, అధ్యక్షులు బైడెన్ సంయుక్తంగా ‘‘భారత-అమెరికా వాతావరణ-పరిశుభ్ర ఇంధన కార్యక్రమం-2030 భాగస్వామ్యాని’’కి శ్రీకారం చుడుతున్నాం. తదనుగుణంగా పెట్టుబడుల సమీకరణ, పరిశుభ్ర ప‌రిజ్ఞానాల నిర్ధారణ, హరిత భాగస్వామ్యాలకు సౌలభ్యం వంటివాటికి మేం సంయుక్తంగా తోడ్పాటునిస్తాం.

మిత్రులారా!

   ప్రపంచ వాతావరణ కార్యాచరణ గురించి మనం చర్చిస్తున్న ఈ రోజున- నేను ఒక ఆలోచనను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. భారతదేశంలో తలసరి కర్బన ఉద్గార పరిమాణం అంతర్జాతీయ సగటుకన్నా 60 శాతం తక్కువగా ఉంది. మా జీవనశైలి నేటికీ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడినది కావడమే ఇందుకు కారణం. అందువల్ల వాతావరణ మార్పు కార్యాచరణలో జీవనశైలి మార్పు ప్రాముఖ్యం గురించి నేనివాళ నొక్కి చెబుతున్నాను. సుస్థిర జీవనశైలి, ‘ప్రాథమిక సూత్రాలవైపు తిరిగి మళ్లడం’ అనే అంశాలు కోవిడ్ అనంతర కాలంలో మన ఆర్థిక వ్యూహాలకు ముఖ్యమైన మూలస్తంభంగా ఉండితీరాలి.

మిత్రులారా!

   మహనీయుడైన భారతదేశపు యోగి స్వామి వివేకానందుని మాటలను ఈ సందర్భంగా నేను గుర్తుచేసుకుంటున్నాను. ఈ మేరకు ‘‘లేవండి… మేల్కొనండి… లక్ష్యం చేరేదాకా ఆగకండి’’ అని ఆయన మనకు పిలుపునిచ్చారు. తదనుగుణంగా వాతావారణ మార్పు కార్యాచరణ దశాబ్దం దిశగా ముందడుగు వేద్దాం రండి!

 

కృత‌జ్ఞ‌త‌లు… థ్యాంక్యూ వెరీమచ్…

 

***