కేంద్ర ప్రభుత్వం లోని వాణిజ్య విభాగం కోసం ఉద్దేశించిన ఒక నూతన కార్యాలయ భవన సముదాయం ‘వాణిజ్య భవన్’ నిర్మాణానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో శంకుస్థాపన చేశారు.
భవన నిర్మాణం నిర్ధిష్ట కాలం లోపలే పూర్తి కాగలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఈ పని పాత అలవాట్లకు భిన్నంగా ‘న్యూ ఇండియా’ స్ఫూర్తి కి అనుగుణంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. (పాత అలవాట్లలో భాగంగా, చివరకు రాజధాని నగరం లోను ముఖ్యమైన భవన నిర్మాణ పథకాల అమలులో ఎడతెగని జాప్యం జరిగింది). ఈ సందర్భంగా ఆయన డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేశనల్ సెంటర్, డాక్టర్ ఆంబేడ్కర్ నేశనల్ మెమోరియల్, ప్రవాసి భారతీయ కేంద్ర మరియు సెంట్రల్ ఇన్‌ఫర్మేశన్ కమిశన్ కై ఉద్దేశించిన నూతన కార్యాలయ భవనాలను గురించి ప్రస్తావించారు.
ప్రభుత్వం యొక్క పని తీరులో గిరి గీసుకొని విధులను నిర్వర్తించే పద్ధతి ని వారించిన తాలూకు ఫలితమే ఇది అని కూడా ఆయన చెప్పారు. నూతన కార్యాలయ భవనం- వాణిజ్య భవన్- భారతదేశం యొక్క వాణిజ్య రంగంలో అడ్డుగోడలను తొలగించేందుకు మరింతగా దోహద పడగలదంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశ జనాభా లో వయోవర్గం పరంగా నెలకొన్నటువంటి సానుకూలత ను గురించి ఆయన మాట్లాడుతూ, మన దేశ యువతీ యువకుల ఆకాంక్షలను నెరవేర్చడం మనందరి సమష్టి బాధ్యత అన్నారు.
డిజిటల్ టెక్నాలజీ ని స్వీకరించడం గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, నూతన భవనాన్ని నిర్మిస్తున్న ప్రదేశం ఇదివరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్ స్వాధీనం లో ఉండిందని తెలిపారు. దీనికి బదులుగా ప్రస్తుతం గవర్నమెట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్) వచ్చిందని, ఇది స్వల్ప వ్యవధిలో 8700 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలను జరిపిందని ఆయన పేర్కొన్నారు. జిఇఎమ్ ను మరింతగా విస్తరించే దిశగాను, దేశం లోని ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి ప్రయోజనం చేకూరేటట్లుగాను కృషి చేయాలని వాణిజ్య విభాగానికి ఆయన విజ్ఞప్తి చేశారు. జిఎస్‌టి యొక్క లాభాలను గురించి ఆయన చెబుతూ, ప్రజలకు స్నేహపూర్వకంగా ఉండే, అభివృద్ధికి స్నేహపూర్వకంగా ఉండే మరియు పెట్టుబడికి స్నేహపూర్వకంగా ఉండేటటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో భారతదేశం ఏవిధంగా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నదీ చాటి చెప్పడం కోసం ప్రధాన మంత్రి వివిధ స్థూల ఆర్థిక పరామితులను మరియు ఇతర సూచికలను గురించి ప్రస్తావించారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచం లోని అయిదు అగ్రగామి ఫిన్-టెక్ దేశాల సరసన నిలిచిందని ఆయన తెలిపారు. ‘‘వ్యాపార నిర్వహణలో సరళత్వం’’, ‘‘వాణిజ్య నిర్వహణలో సరళత్వం’’.. ఇవి రెండూ కూడాను ఒక పరస్పర అనుసంధానితమైన ప్రపంచం లో ‘‘జీవించడం లో సరళత్వం’’తో సంబంధాన్ని కలిగివున్నటువంటి అంశాలని ఆయన అన్నారు.
ఎగుమతులుపెరగాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఈ కృషి లో రాష్ట్రాలను క్రియాశీల భాగస్వాములను చేసి తీరాలన్నారు. మొత్తం ప్రపంచపు ఎగుమతులలో భారతదేశం వాటాను ప్రస్తుతం ఉన్న 1.6 శాతం స్థాయి నుండి కనీసం 3.4 శాతం స్థాయికి పెంచేందుకు వాణిజ్య విభాగం తప్పక ఒక సంకల్పాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. అదే విధంగా దేశీయ తయారీ ఉత్పాదకతను పెంచడం కోసం, మరి అలాగే దిగుమతులను తగ్గించడం కోసం అవశ్యం ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ను ఒక ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. దేశీయంగా తయారీకి ఊతాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.
***