సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను ప్లాంటు లో “పెట్టుబడి. యంత్రపరికరాల ఆధారంగా వర్గీకరించే విధానం” నుండి “వార్షిక టర్నోవర్ విధానం”లో వర్గీకరణ కు మార్పు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వ్యాపారానుకూలతను ప్రోత్సహించడానికి, అవి సాధిస్తున్న వృద్ధి ఆధారంగా వర్గీకరణ నిబంధనలు మార్చడానికి, కొత్తగా అమలులోకి వచ్చిన జిఎస్‌టి కి వాటిని అనుసంధానం చేయడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
వస్తువులను ఉత్పత్తి చేస్తున్న, సేవలు అందిస్తున్న సంస్థలను వార్షిక టర్నోవర్ ఆధారంగా వర్గీకరించడానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధి (ఎంఎస్ఎంఇడి) చట్టం, 2006 సెక్షన్ 7 లో ఈ దిగువ సవరణలు చేస్తారు:
– ఏడాదికి ఐదు కోట్ల రూపాయల టర్నోవర్ మించని యూనిట్లను సూక్ష్మ సంస్థల వర్గీకరణ నిర్వచనం పరిధి లోకి తెస్తారు.
– ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైబడి 75 కోట్ల రూపాయల లోపు టర్నోవర్ గల సంస్థలు చిన్న పరిశ్రమల వర్గీకరణలోకి వస్తాయి.
– ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైబడి 250 కోట్ల రూపాయలు దాటని టర్నోవర్ గల సంస్థలు మధ్యతరహా పరిశ్రమల వర్గీకరణలోకి వస్తాయి.
– ఇవి కాకుండా అవసరం అని భావించినప్పుడు ఎంఎస్ఎంఇడి చట్టం లోనిసెక్షన్ 7లో విధించిన పరిమితులకు మూడు రెట్లు లోబడి ఒక నోటిఫికేషన్ ను జారీ చేయడం ద్వారా టర్నోవర్ పరిమితులలో మార్పులు చేయడానికి అధికారం ఉంటుంది.
ప్రస్తుతం ఎంఎస్ఎండిఇ చట్టం (సెక్షన్ 7) వివిధ పారిశ్రామిక యూనిట్లను వస్తు తయారీ యూనిట్లయితే ప్లాంట్, యంత్రపరికరాలపై పెట్టుబడి ఆధారంగాను, సర్వీస్ సంస్థలైతే పరికరాలపై పెట్టుబడి ఆధారంగాను వర్గీకరిస్తూ వచ్చింది. ప్లాంట్ లేదా యంత్రపరికరాల్లో పెట్టుబడికి ఆయా సంస్థల యాజమాన్యాలు అందించే స్వీయ ప్రకటన ఆధారంగా తీసుకుంటున్నారు. అవసరం అయితే ఆ వివరాలను తనిఖీ చేస్తారు. ఇది లావాదేవీల వ్యయంతో ముడిపడి ఉంటుంది.
దీనికి బదులు టర్నోవర్ ను అర్హతగా తీసుకున్నట్టయితే గణాంకాలు విశ్వసనీయంగా ఉంటాయి. వాటి మదింపు విధానాలు కూడా జిఎస్‌టి నెట్ వర్క్, ఇతర విధానాల పరిధిలో వివక్ష రహితంగా, పారదర్శకంగా ఉంటాయి. తనిఖీల అవసరాన్ని కూడా తొలగించవచ్చు. వర్గీకరణ విధానం ప్రగతిశీలంగాను, యంత్రపరికరాలు, ప్లాంట్ లో పెట్టుబడుల విధానంలోని అస్థిరతలను తొలగించేదిగాను ఉంటుంది. వ్యాపారానుకూలత పెరుగుతుంది. అన్నింటిని మించి మారుతున్న ఆర్థిక వాతావరణానికి అనుగుణంగా ఎంఎస్ఎంఇడి చట్టం లోని నిబంధనలను తరచు పరిశీలించవలసిన అవసరం లేకుండానే ఎంఎస్ఎంఇలను వర్గీకరించే వెసులుబాటు ప్రభుత్వానికి లభిస్తుంది.
ఈ మార్పులు వ్యాపారానుకూలతను పెంచడంతో పాటు అవి సాధించే వృద్ధి ఆధారంగా దేశంలో ఎంఎస్ఎంఇ ల రంగం లో ప్రత్యక్ష ఉపాధి మరియు పరోక్ష ఉపాధి పెరిగేందుకు మార్గాన్ని సిద్ధం చేస్తాయి.