Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లిగ్నోసెల్యులోజిక్ బయోమాస్, ఇతర పునరుత్పాదక ముడిసరుకులు ఉపయోగించే అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడానికి “ప్రధాన్ మంత్రి జెఐ-విఎఎన్ యోజన”లో సవరణకు మంత్రివర్గం ఆమోదం


జీవ ఇంధనాల రంగంలో తాజా పరిణామాలకు అనుగుణంగా, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాన మంత్రి జెఐ-విఎఎన్ యోజనలో సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

సవరించిన పథకం అమలు కోసం 5 సంవత్సరాలు అంటే 2028-29 వరకు కాలవ్యవధి పొడిగించారు. లిగ్నోసెల్యులోసిక్ ముడిసరుకుల నుండి అంటే వ్యవసాయ, అటవీ సంబంధ అవశేషాలు, పారిశ్రామిక వ్యర్థాలు, సంశ్లేషణ (ఎస్‌వైఎన్) వాయువు, ఆల్గే మొదలైన వాటి నుండి ఉత్పత్తి చేసిన  అధునాతన జీవ ఇంధనాలు దీని పరిధిలోకి వస్తాయి. “బోల్ట్ ఆన్” ప్లాంట్లు, “బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు” కూడా ఇప్పుడు వాటి అనుభవాన్ని ఉపయోగించుకుని, వాటి సాధ్యతను మెరుగుపరచుకునేందుకు అర్హత కలిగి ఉన్నాయి.

బహుళ సాంకేతికతలు, బహుళ ముడిసరుకులను ప్రోత్సహించడానికి, ఈ రంగంలో కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలతో కూడిన ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తారు.

రైతులకు వారి వ్యవసాయ అవశేషాల ద్వారా లాభదాయకమైన ఆదాయాన్ని అందించడం, పర్యావరణ కాలుష్యాన్ని పరిష్కరించడం, స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించడం, దేశ  ఇంధన భద్రత, స్వావలంబనకు దోహదం చేయడం ఈ పథకం లక్ష్యం. ఇది అధునాతన జీవ ఇంధన సాంకేతికతల అభివృద్ధికి ఊతమిస్తూ మేక్ ఇన్ ఇండియా మిషన్‌ను ప్రోత్సహిస్తుంది. 2070 నాటికి నికరంగా సున్నా జిహెచ్‌జి ఉద్గారాలను సాధించాలనే భారతదేశ ప్రతిష్టాత్మక లక్ష్యానికి ఇది తోడ్పాటునందిస్తుంది.

 

ప్రధాన్ మంత్రి జెఐ-విఎఎన్ యోజన ద్వారా అధునాతన జీవ ఇంధనాలను ప్రోత్సహించే విషయంలోప్రభుత్వ నిబద్ధత సుస్థిరమైన, స్వావలంబన గల ఇంధన రంగాన్ని సాధించడంలో దాని అంకితభావాన్ని సూచిస్తుంది.

 

నేపథ్యం:

 

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను విక్రయించే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఇబిపి) కార్యక్రమం కింద ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇబిపి ప్రోగ్రామ్ కింద, పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఇఎస్‌వై) 2013-14లో గల 38 కోట్ల లీటర్ల నుండి ఇఎస్‌వై 2022-23లో అది 500 కోట్ల లీటర్లకు పెరిగింది, దానికి అనుగుణంగా బ్లెండింగ్ శాతం 1.53% నుండి 12.06%కి పెరిగింది. 2024 జూలై నెల వరకు బ్లెండింగ్ శాతం 15.83%కి చేరుకుంది, ప్రస్తుత ఇఎస్‌వై 2023-24లో మొత్తంగా బ్లెండింగ్ శాతం 13% కంటే అధికంగా ఉంది.

 

ఇఎస్‌వై 2025-26 చివరి నాటికి ఓఎంసిలు 20% బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇఎస్‌వై 2025-26లో 20% బ్లెండింగ్ సాధించడానికి 1100 కోట్ల లీటర్లకు పైగా ఇథనాల్ అవసరమవుతుందని అంచనా, ఈ బ్లెండింగ్ అవసరాలను తీర్చడానికి, ఇతర ఉపయోగాల (రసాయనిక, ఫార్మాస్యూటికల్ మొదలైనవి) కోసం 1750 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఇథనాల్ డిస్టిలేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
 

ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాల సాధనకు, ప్రభుత్వం 2వ తరం (2జి) ఇథనాల్ (అధునాతన జీవ ఇంధనాలు) వంటి ప్రత్యామ్నాయ వనరులపై కూడా దృష్టి సారిస్తుంది. సెల్యులోజిక్, లిగ్నోసెల్యులోజిక్ కంటెంట్ గల మిగులు బయోమాస్/వ్యవసాయ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మొదలైన వాటిని అధునాతన జీవ ఇంధన సాంకేతికతను ఉపయోగించి ఇథనాల్‌గా మార్చవచ్చు.

 

దేశంలో 2జి ఇథనాల్ సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, 2జి బయో-ఇథనాల్ ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం అందించడం కోసం 07.03.2019న “ప్రధాన్ మంత్రి జెఐ-విఎఎన్ (జైవ్ ఇంధన్-వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారన్) యోజన” నోటిఫై చేయబడింది.

 

ఈ పథకం కింద, హర్యానాలోని పానిపట్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొదటి 2జి ఇథనాల్ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి 2022, ఆగస్ట్ 10న జాతికి అంకితం చేశారు. వరుసగా బార్‌గఢ్ (ఒడిశా), భటిండా (పంజాబ్) మరియు నుమాలిగఢ్ (అస్సాం)లలో బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ అలాగే ఎన్ఆర్ఎల్ ఏర్పాటు చేస్తున్న ఇతర 2జి వాణిజ్య ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి.

***