Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు బ‌యలుదేరే ముందు ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న


ఈ రోజు నేను ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళుతున్నాను. మేం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత తొలి ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న ఇది. ఈ ప‌ర్య‌ట‌న ఫ‌లితంపై నేను చాలా ఆశావ‌హంగా ఉన్నాను.

ద‌శాబ్దాలుగా భార‌త, ర‌ష్యా మైత్రికి చ‌రిత్ర సాక్షి. ప్ర‌పంచంలో భార‌త్‌కు అత్యంత విలువైన మిత్ర‌ దేశాల్లో ర‌ష్యా ఒక‌టి.

2001 జ్ఞాప‌కాలు నా మ‌దిని త‌డుతున్నాయి. అప్పుడే నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాను. అట‌ల్‌ జీ తో క‌లిసి ర‌ష్యా సంద‌ర్శించే అవ‌కాశం వ‌చ్చింది. భార‌త‌-ర‌ష్యా వార్షిక స‌మావేశాల‌కు నాంది అది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఉభ‌య దేశాల మ‌ధ్య వార్షిక స‌మావేశాలు నిరంత‌రాయంగా జ‌రుగుతూనే ఉన్నాయి.

నా ఈ ప‌ర్య‌ట‌న‌తో భార‌త‌, ర‌ష్యాల మధ్య ఆర్థిక‌, ఇంధ‌న‌, భ‌ద్ర‌తా విభాగాల్లో స‌హ‌కారం మ‌రింత లోతుగా పాతుకుంటుంద‌ని భావిస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాల‌జీ, మైనింగ్ వంటి రంగాల‌కు కూడా ఈ స‌హ‌కారం విస్త‌రించాల‌ని మేం కోరుతున్నాం. భార‌త‌, ర‌ష్యాల మ‌ధ్య వాణిజ్య బంధం కూడా మ‌రింత‌గా పెరుగుతుంద‌ని నేను భావిస్తున్నాను. ఇది ఉభ‌య దేశాల‌కే కాదు… ప్ర‌పంచం మొత్తానికి ప్ర‌యోజ‌న‌క‌రం అవుతుంది.

ఈ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో నేను ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రుపుతాను. భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టాల్సిందిగా ఆహ్వానించేందుకు ర‌ష్యా వ్యాపార‌వేత్త‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతాను. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కార్య‌క్ర‌మానికి కూడా నేను హాజ‌ర‌వుతాను. ఉభ‌య దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న బాంధ‌వ్యాన్ని ఈ ప‌ర్య‌ట‌న మ‌రింత ముందుకు తీసుకువెడుతుంద‌ని నేను భావిస్తున్నాను.