Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో రోజ్  గార్  మేళానుద్దేశించి ప్రసంగించి, నియామకప్రక్రియలో కొత్తగా ఎంపికైన 51,000 మందికి నియామకపత్రాలు పంపిణీ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ అభ్యర్థులు  ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/రెవిన్యూ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ;  పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ; ఆర్థిక వ్యవహారాల శాఖ,  రక్షణ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ; కార్మిక, ఉపాధికల్పన శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరనున్నారు. 
నిమాయకాలు పొందిన వారినుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం నిరంతరాయంగా పురోగమిస్తున్నదని, అందులో భాగంగానే నేడు దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 50,000 మంది పైగా అభ్యర్థులకు ప్రభుత్వోద్యోగాల్లో నియామక పత్రాలు అందచేస్తున్నామని చెప్పారు. అభ్యర్థుల అవిశ్రాంత శ్రమకు లభించిన ఫలితమే ఈ నియామక పత్రాలని ఆయన నొక్కి చెప్పారు. కొత్తగా నియమితులైన వారిని ప్రధానమంత్రి అభినందిస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా పని చేసే వ్యవస్థలో వారు చేరబోతున్నారని తెలిపారు. ప్రభుత్వోద్యోగులుగా వారి విధులు, బాధ్యతల గురించి ప్రస్తావిస్తూ సామాన్య  ప్రజలకు ‘‘జీవన సారళ్యత’’ వారి అగ్ర ప్రాధాన్యం కావాలని సూచించారు. 

నవంబరు 26వ తేదీన జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల గురించి ప్రస్తావిస్తూ 1949 సంవత్సరంలో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని జాతి ఆమోదించి ప్రతీ పౌరునికి సమాన హక్కులు కల్పించిందని ప్రధానమంత్రి చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ సేవల గురించి  ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సామాజిక న్యాయం సిద్ధాంతంతో ఆయన పౌరులందరికీ  సమానావకాశాలు కల్పించారని తెలిపారు. కాని దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ సమానత్వ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి సంవత్సరాల తరబడి సమాజంలోని అధిక శాతం ప్రజలకు మౌలిక వనరులు, సదుపాయాలు అందకుండా  నిరాకరణకు గురి చేశారని ప్రధానమంత్రి శ్రీ మోదీ విమర్శించారు. 2014 సంవత్సరంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ‘‘నిరాకరణకు గురైన వారికి ప్రాధాన్యత’’ మంత్రం స్వీకరించి కొత్త బాట తొక్కిందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘ఇంతవరకు ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోని ప్రజల ముంగిటికి ప్రభుత్వం వెళ్తున్నది’’ అని నొక్కి చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన వారందరి జీవితాల్లో పరివర్తన తెచ్చేందుకు శ్రమిస్తున్నదన్నారు. ప్రభుత్వ ఆలోచనా ధోరణి, పని సంస్కృతిలో మార్పు ఫలితంగా అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు, ఫైల్స్  అన్నీ అవే అయినప్పటికీ పేదలు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యంతో పని తీరులోను, వ్యవస్థ తీరులోను సంపూర్ణ మార్పులు చోటు చేసుకున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. దీని వల్ల సగటు ప్రజల సంక్షేమం ముందువరుసలోకి వచ్చిందన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం గత 5 సంవత్సరాల కాలంలో 13 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం  నుంచి వెలుపలికి వచ్చారని ఆయన తెలిపారు. ‘‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయనేందుకు ఇది నిదర్శనం’’ అని ఆయన అన్నారు. వికసిత్  భారత్  సంకల్ప్  యాత్ర గురించి మాట్లాడుతూ ఆ యాత్ర ప్రభుత్వ పథకాలను సగటు పౌరుల ముంగిటికి తీసుకువెళ్తున్నదని చెప్పారు. కొత్తగా నియమితులైన వారు ఈ అవకాశాన్ని ప్రజల సేవకు అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. 

ఆధునిక రహదారులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జల మార్గాల రూపంలో భారతదేశంలో  సాగుతున్న మౌలిక వసతుల విప్లవాన్ని కొత్తగా నియమితులైన వారు వీక్షిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు. మౌలిక వసతుల్లో భారీ  పెట్టుబడులు లక్షలాది కొత్త ఉద్యోగాలను అందుబాటులోకి తెస్తున్నాయన్నారు. 

ప్రాజెక్టులను ఉద్యమ స్ఫూర్తితో పూర్తి చేస్తున్న తీరు గురించి మాట్లాడుతూ ‘‘ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోవడం నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారులకు అన్యాయం. ఇటీవల సంవత్సరాల్లో కేంద్రప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయల విలువ గల  ప్రాజెక్టులను సమీక్షించింది. వాటన్నింటినీ సత్వరం పూర్తి చేసింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. 22-23 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనా ఇటీవలే పనులు మొదలై  3 సంవత్సరాల్లో పూర్తయిన బీదర్-కల్బుర్గి రైల్వేలైన్ ప్రాజెక్టును ఇందుకు ఉదాహరణగా చూపారు. అలాగే 2008 నుంచి 2014 వరకు కేవలం పేపర్  మీదనే ఉండి 2014లో వాస్తవంగా పనులు ప్రారంభమై 2018లో పూర్తయిన సిక్కింలోని పాక్యాంగ్  విమానాశ్రయం, 20-22 సంవత్సరాల పాటు చర్చల్లో ఉండిపోయి ఇటీవలే పూర్తయిన పరదీప్  రిఫైనరీ కూడా ఇందుకు ఉదాహరణలని చెప్పారు. 

రియల్ ఎస్టేట్ రంగం స్వరూపం సైతం రెరాతో మారిపోయి ఆ రంగంలో పారదర్శకత వచ్చిందని,  పెట్టుబడులకు ఉత్తేజం కలిగిందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘నేడు లక్ష కోట్ల రూపాయలకు పైబడిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రెరా కింద నమోదయ్యాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు. గతంలో ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా స్తంభించిపోయాయని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన వృద్ధి భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 

ప్రభుత్వం చేపట్టిన విధానాలు, నిర్ణయాల కారణంగా దేశ ఆర్థిక రంగం కొత్త శిఖరాలకు చేరిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ భారత వృద్ధి గాథ పట్ల అత్యంత ఆశావహంగా ఉన్నాయన్నారు. పెట్టుబడి రేటింగ్  లు ఇచ్చే ప్రపంచ  స్థాయి సంస్థ దేశంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్న పని చేసే వయసులోని జనాభా, కార్మిక ఉత్పాదకత పెరుగుదల వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుని భారత వృద్ధిరేటుకు ఆమోదముద్ర వేసిందని ఆయన చెప్పారు. భారతదేశ తయారీ,  నిర్మాణ రంగాల బలమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. రాబోయే కాలంలో పలు ఉపాధి, స్వయం-ఉపాధి అవకాశాలు దేశంలో అందుబాటులోకి వస్తాయనేందుకు ఇవి నిదర్శనాలని ఆయన చెప్పారు. 

అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా చేరేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వోద్యోగులుగా నియమితులైన వారిదేనని శ్రీ మోదీ నొక్కి చెప్పారు.  ‘‘ఏదైనా ప్రాంతం ఎంత దూరంలో ఉందనేది కాదు, అది మీ ప్రాధాన్యం కావాలి; ఏ వ్యక్తి అయినా ఎంత మారుమూల దూరంలో ఉన్నాడనేది కాదు, మీరు అతన్ని చేరాలి’’ అని సూచించారు. భారత ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఎంత దూరం వెళ్లారనే దాని ఆధారంగానే అభివృద్ధి చెందిన భారత్  కల సాకారం అవుతుందని శ్రీ మోదీ సూచించారు. 

రాబోయే 25 సంవత్సరాలు జాతికి కీలకమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కొత్తగా నియమితులైన వారందరూ నూతన ‘‘కర్మయోగి ప్రారంభ్’’ అభ్యాస మాడ్యూల్  లో చేరి తమ అభ్యాసం కొనసాగించాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఏడాది క్రితం ప్రారంభమైన ‘‘కర్మయోగి ప్రారంభ్’’ మాడ్యూల్ ద్వారా కొత్తగా నియమితులైన లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు శిక్షణ పొందారని ఆయన తెలిపారు. ఐగాట్  కర్మయోగి ఆన్ లైన్  శిక్షణ వేదికపై 800 పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ‘‘మీలోని నైపుణ్యాలను పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోండి’’ అని ఆయన సూచించారు. కొత్తగా నియమితులైన వారందరినీ అభినందించి వారు విజయం సాధించాలన్న ఆకాంక్షతో ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ‘‘జాతి నిర్మాణంలో మీ అందరి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలి’’ అంటూ శ్రీ మోదీ ముగించారు. 

పూర్వాపరాలు
ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధానమంత్రి కట్టుబాటుకు రోజ్ గార్  మేళా ఒక ముందడుగు. ఉపాధి అవకాశాలు మరింతగా పెంచడానికి;  యువతను సాధికారం చేసి జాతి అభివృద్ధిలో వారి భాగస్వామ్యం సాధించేందుకు వీలుగా అర్ధవంతమైన అవకాశాలు కల్పించడానికి మంచి వేదిక రోజ్  గార్  మేళా. 

కొత్తగా నియమితులైన వారు తమ నవ్య ఆలోచనా ధోరణులు, పోటీ సామర్థ్యాల ద్వారా పారిశ్రామిక, ఆర్థిక, సామాజికాభివృద్ధికి తమ సేవలు అందిస్తూ ఆయా రంగాలను పటిష్ఠం చేసి ప్రధానమంత్రి వికసిత్ భారత్ కల సాకారం కావడానికి దోహదపడతారు.

కొత్తగా నియమితులైన వారు కర్మయోగి ప్రారంభ్  ద్వారా శిక్షణ అవకాశం పొందడంతో పాటు ‘‘ఎక్కడి నుంచైనా ఏ డివైస్’’పై అయినా ఐ గాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 800 పైగా ఇ-లెర్నింగ్  కోర్సులు అభ్యసించే అవకాశం పొందుతారు.