ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో రోజ్గార్ మేళా ద్వారా నియామకాలు పొందిన 71,000 మందికి పైగా యువతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు నియామకపత్రాలను అందించి, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి అంకితభావానికి ఈ రోజ్ గార్ మేళా అద్దం పడుతుంది. జాతి నిర్మాణం, స్వయం సాధికారత సాధించేందుకు తోడ్పడేలా యువతకు అర్థవంతమైన అవకాశాలను ఇది అందిస్తుంది.
సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కువైట్ నుంచి నిన్న రాత్రి తిరిగి వచ్చానని, అక్కడ భారతీయ యువత, వృత్తి నిపుణులతో విస్తృత చర్చలు జరిపానని తెలియజేశారు. ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమం ఈ దేశ యువతతోనే కావడం యాదృచ్ఛికమని అన్నారు. ‘‘దేశంలో వేలాది మంది యువతకు ఈ రోజు నూతన ఆరంభం కానుంది. ఏళ్లుగా మీరు కన్న కలలు ఇప్పుడు నిజమయ్యాయి. సంవత్సరాల తరబడి మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కింది. కొద్ది రోజుల్లో ముగిసిపోతున్న 2024 మీకు సరికొత్త ఆనందాన్ని అందించింది. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు.
రోజ్గార్ మేళాల ద్వారా భారతీయ యువ ప్రతిభను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత పదేళ్లుగా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించేందుకు సమష్టి కృషి జరుగుతోంది. ఈ రోజు 71,000 మందికి పైగా యువతకు నియామకపత్రాలను అందజేశామని ప్రధాని వెల్లడించారు. గడచిన ఏడాదిన్నర కాలంలోనే 10 లక్షల మందికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి చరిత్ర సృష్టించామని శ్రీ మోదీ పేర్కొన్నారు. పూర్తిగా పారదర్శక విధానంలో ఈ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్తగా నియామకాలు పొందినవారు అంకితభావం, చిత్తశుద్ధితో దేశానికి సేవ చేస్తారు.
యువత శ్రమ, సామర్థ్యం, నాయకత్వంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో ఉన్న భారత్ విధానాలు, నిర్ణయాలు ప్రతిభావంతులైన యువతకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించాయి. గత దశాబ్ద కాలంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలు యువతను ముందు వరుసలో ఉంచాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా ఉందని శ్రీ మోదీ తెలిపారు. భారతీయ యువత ప్రస్తుతం నూతన ఆత్మవిశ్వాసంతో ఉంది. వారు ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారు. నేడు యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు విస్తృతమైన సహాయ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. క్రీడలను వృత్తిగా ఎంచుకున్నవారు ఆధునిక శిక్షణా సౌకర్యాలు, టోర్నమెంట్ల ద్వారా తమకు లభిస్తున్న మద్ధతు ద్వారా ఓడిపోమనే విశ్వాసంతో ఉన్నారు. దేశంలో వివిధ రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మొబైల్ తయారీలో రెండో అతిపెద్ద వ్యవస్థగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. పునరుత్పాదక విద్యుత్తు, ఆర్గానిక్ వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ రంగం, పర్యాటకం, ఆరోగ్యం రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ నూతన అవకాశాలను సృష్టిస్తోంది.
దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి, నూతన భారత్ ను నిర్మించడానికి యువ ప్రతిభను ప్రోత్సహించడం కీలకమని, ఆ బాధ్యత విద్యావ్యవస్థపై ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. యువతకు నూతన అవకాశాలను కల్పించే ఆధునిక విద్యావ్యవస్థ దిశగా భారత్కు జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) మార్గనిర్దేశం చేస్తోంది. గతంలో ఈ వ్యవస్థ నిర్భంధంగా ఉండేదని, ప్రస్తుతం అటల్ టింకరింగ్ ల్యాబ్స్, పీఎం- శ్రీ స్కూల్స్ తదితర కార్యక్రమాల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని శ్రీ మోదీ వివరించారు. ‘‘మాతృభాషలోనే నేర్చుకునే, పరీక్షలు రాసే అవకాశం కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు, అణగారిన వర్గాలకు చెందిన యువతకు భాషాపరమైన అవరోధాలు తొలగించాం. 13 భాషల్లో నియామక పరీక్షలు నిర్వహిస్తున్నాం. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక రిక్రూట్మెంట్ ర్యాలీల ద్వారా సరిహద్దు ప్రాంతాలకు చెందిన యువతకు ఇచ్చే కోటాను పెంచాం. కేంద్ర పోలీసు బలగాల్లో 50,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు పొందారు. ఇది ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుంది’’ అని ప్రధానమంత్రి తెలిపారు.
ఈ రోజు చౌధరి చరణ్ సింగ్ జయంతి, దీని గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది ఆయనను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ‘‘మనకు ఆహారం అందిస్తోన్న రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజును రైతుల దినోత్సవంగా మనం జరుపుకొంటున్నాం. భారతదేశ అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలపైనే ఆధారపడి ఉందని చౌధరి సాబ్ నమ్మేవారు. మా ప్రభుత్వ విధానాలు – గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్న యువతకు నూతన ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాయి’’ అని ప్రధాని అన్నారు.
బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసే గోబర్-ధన్-యోజన తరహా కార్యక్రమాలు ఇంధన ఉత్పత్తితో పాటు ఉద్యోగాలను సైతం కల్పిస్తున్నాయని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించే ఈ-నామ్ పథకం నూతన ఉపాధి అవకాశాలకు మార్గం తెరచింది. ఇథనాల్ మిశ్రమంలో పెరుగుదల రైతులకు లబ్ధి చేకూర్చడంతో పాటు చక్కెర రంగంలో ఉద్యోగాలను సృష్టించింది. దాదాపుగా 9,000 వరకు రైతు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీవోలు)ను ఏర్పాటు చేయడం ద్వారా మార్కెట్ సౌలభ్యం పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల సృష్టి ఎలా జరిగిందో ప్రధానమంత్రి వివరించారు. అలాగే వేల సంఖ్యలో ధాన్యం గోదాములను నిర్మించే బృహత్తర పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది గణనీయమైన స్థాయిలో ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తుంది.
ప్రతి పౌరునికి బీమా సౌకర్యం కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు బీమా సఖి యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి అన్నారు. డ్రోన్ దీదీ, లఖ్పతి దీదీ, బ్యాంకు సఖి యోజన తదితర కార్యక్రమాలు వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ‘‘ఈ రోజు, వేలాది మంది మహిళలు నియామకపత్రాలు అందుకున్నారు. వారి విజయం మనకు స్ఫూర్తినిస్తుంది. ప్రతి రంగంలోనూ మహిళలు స్వావలంబన సాధించేలా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 26 వారాల ప్రసూతి సెలవులను ప్రవేశపెట్టడం ద్వారా లక్షల మంది మహిళల ఉద్యోగ భవిష్యత్తుకు భద్రత ఏర్పడింది’’ అని శ్రీ మోదీ వివరించారు.
మహిళల పురోగతిలో ఎదురవుతున్న ఇబ్బందులను స్వచ్ఛ భారత్ అభియాన్ తొలగించిందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రత్యేక టాయిలెట్ల వసతి లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థినులు పాఠశాల స్థాయిలోనే చదువు మానేసేవారని అన్నారు. సుకన్య సమృద్ధి యోజన బాలికల విద్యకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తోందని ఆయన వివరించారు. అలాగే 30 కోట్ల జన ధన్ ఖాతాల ద్వారా నేరుగా మహిళలకే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుంది. ‘‘ముద్ర యోజన ద్వారా హామీ రహిత రుణాలను ఇప్పుడు మహిళలు పొందుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మహిళల పేరు మీదే ఇల్లు కేటాయిస్తున్నారు. పోషణ అభియాన్, సురక్షిత మాతృత్వ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకాలు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు.
నారీశక్తి వందన్ అధీనియం ద్వారా అసెంబ్లీలు, లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని, తద్వారా మహిళల నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.
ఈ రోజు నియామక పత్రాలు స్వీకరించిన వారు పరివర్తన చెందిన ప్రభుత్వ వ్యవస్థల్లో చేరబోతున్నారని ప్రధానమంత్రి అన్నారు. గత దశాబ్దంగా ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, శ్రమ కారంణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సామర్థ్యం, ఉత్పాదకతల్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని అభిప్రాయపడ్డారు.
నేర్చుకోవాలనే, ఎదగాలనే తపన కారణంగా కొత్తగా నియమితులైన వారు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించారని, ఇదే ధోరణిని జీవితాంతం కొనసాగించడం ముఖ్యమని అన్నారు. ఐగాట్ కర్మయోగి వేదికలో ప్రభుత్వోద్యోగులకు అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల గురించి వివరిస్తూ.. వీలును బట్టి ఈ డిజిటల్ శిక్షణా పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘‘ఈ రోజు నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’’ అని ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
నేపథ్యం
ఉద్యోగ కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే ప్రధానమంత్రి ఆలోచనను సాకారం చేసే దిశగా ఏర్పాటు చేసిన కార్యక్రమమే రోజ్గార్ మేళా. జాతి నిర్మాణం, స్వయం సాధికారత సాధించే ప్రయాణంలో యువతను భాగస్వామ్యం చేసే దిశగా అర్థవంతమైన అవకాశాలను అందిస్తుంది.
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా నిర్వహించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు జరుగుతున్నాయి. కొత్తగా నియమితులైన వారు దేశవ్యాప్తంగా హోం వ్యవహారాలు, పోస్టల్ విభాగం, ఉన్నత విద్యావిభాగం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు.
आज भारत का युवा, नए आत्मविश्वास से भरा हुआ है।
वो हर सेक्टर में अपना परचम लहरा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2024
नए भारत के निर्माण के लिए देश दशकों से एक आधुनिक शिक्षा व्यवस्था की जरूरत महसूस कर रहा था।
नेशनल एजुकेशन पॉलिसी के जरिए देश अब उस दिशा में आगे बढ़ चुका है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2024
आज हमारी सरकार की नीतियों और निर्णयों से ग्रामीण भारत में भी रोजगार और स्वरोजगार के नए मौके बन रहे हैं।
एग्रीकल्चर सेक्टर में बड़ी संख्या में युवाओं को रोजगार मिला है, उन्हें अपने मन का काम करने के लिए मौका मिला है: PM
— PMO India (@PMOIndia) December 23, 2024
हमारा प्रयास है कि हर क्षेत्र में महिलाएं आत्मनिर्भर बनें: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2024
***
MJPS/VJ
Rozgar Melas are empowering the youth and unlocking their potential. Best wishes to the newly inducted appointees.https://t.co/XkEnXIqQZv
— Narendra Modi (@narendramodi) December 23, 2024
आज भारत का युवा, नए आत्मविश्वास से भरा हुआ है।
— PMO India (@PMOIndia) December 23, 2024
वो हर सेक्टर में अपना परचम लहरा रहा है: PM @narendramodi
नए भारत के निर्माण के लिए देश दशकों से एक आधुनिक शिक्षा व्यवस्था की जरूरत महसूस कर रहा था।
— PMO India (@PMOIndia) December 23, 2024
नेशनल एजुकेशन पॉलिसी के जरिए देश अब उस दिशा में आगे बढ़ चुका है: PM @narendramodi
आज हमारी सरकार की नीतियों और निर्णयों से ग्रामीण भारत में भी रोजगार और स्वरोजगार के नए मौके बन रहे हैं।
— PMO India (@PMOIndia) December 23, 2024
एग्रीकल्चर सेक्टर में बड़ी संख्या में युवाओं को रोजगार मिला है, उन्हें अपने मन का काम करने के लिए मौका मिला है: PM
हमारा प्रयास है कि हर क्षेत्र में महिलाएं आत्मनिर्भर बनें: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2024