Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రోజ్‌గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేర్చుకోనున్నవారికి 71,000కు పైగా నియామక పత్రాలు: ప్రధానమంత్రి చేతుల మీదుగా డిసెంబరు 23న పంపిణీ


ఉద్యోగ నియామక ప్రక్రియలో ఖరారైన అభ్యర్థులకు నియామక పత్రాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 23న ఉదయం సుమారు పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఆయన 71,000కు పైగా నియామక లేఖల్ని పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

ఉద్యోగకల్పనకు అత్యున్నత ప్రాధాన్యాన్నివ్వాలన్న ప్రధాని నిబద్ధతను సాకారం చేసే దిశలో రోజ్‌గార్ మేళా ఒక ముందడుగు. ఇది యువతకు దేశనిర్మాణంలో పాల్గొనే అవకాశాల్ని కల్పించడంతోపాటు స్వీయ సాధికారతకు తోడ్పడనుంది.

దేశమంతటా 45 చోట్ల రోజ్‌గార్ మేళాను నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లో ఉద్యోగ నియామకాలు చోటుచేసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్త ఉద్యోగులను హోం శాఖ, తపాలా విభాగం, ఉన్నత విద్య విభాగం, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, సహా వివిధ మంత్రిత్వ శాఖల్లోనూ, విభాగాల్లోనూ చేర్చుకొంటారు.   

 

***