రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా 11,72,240 మంది ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన రూ. 2028.57 కోట్లను బోనస్ (పిఎల్బీ)గా చెల్లించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ట్రాక్ నిర్వాహకులు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర గ్రూప్–ఎక్స్ సి వంటి వివిధ కేటగిరీల సిబ్బందికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. రైల్వే ఉద్యోగులను ఉత్సాహపరచడానికీ, రైల్వేల పనితీరు మరింత మెరుగుపడే దిశగా కృషి చేయడానికి ఈ బోనస్ చెల్లింపు ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.
అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దుర్గాపూజ / దసరా సెలవులకు ముందు బోనస్ చెల్లిస్తారు. ఈ ఏడాది కూడా 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ మొత్తాన్ని చెల్లిస్తున్నారు.
అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గాను చెల్లించే గరిష్ట మొత్తం రూ.17,951. ట్రాక్ నిర్వాహకులు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర గ్రూప్ ఎక్స్ సీ– వంటి వివిధ కేటగిరీల సిబ్బందికి ఈ చెల్లింపు ఉంటుంది.
2023-2024 సంవత్సరంలో రైల్వేల పనితీరు చాలా బాగుంది. రైల్వేలు రికార్డు స్థాయిలో 1588 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేశాయి. దాదాపు 6.7 బిలియన్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.
ఈ రికార్డు పని తీరుకు అనేక అంశాలు దోహదం చేశాయి. రైల్వేలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులను పెట్టడం ద్వారా మౌలిక సదుపాయాల మెరుగుదల, కార్యకలాపాల్లో సమర్థత, మెరుగైన సాంకేతికత మొదలైనవి కూడా ఇందుకు దోహదపడ్డాయి.
***