రెండు సార్లు పన్ను విధింపు నివారణ కోసం, ఇంకా ఆదాయంపై పన్నులకు సంబంధించిన ఫిస్కల్ ఇవేఝన్ నిరోధం కోసం భారతదేశం, న్యూ జీలాండ్ ల మధ్య థర్డ్ ప్రొటోకాల్ టు ది కన్ వెన్షన్ అనుమోదం మరియు ఎంట్రీ ఇన్ టు ఫోర్స్ లకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ప్రోటోకాల్ పై 2016 అక్టోబరు 26 నాడు సంతకాలు జరిగాయి.
పన్ను ప్రయోజనాల కోసం భారతదేశం మరియు న్యూ జీలాండ్ ల మధ్య సమాచార మార్పిడిని ఈ ప్రోటోకాల్ ఉత్తేజితం చేయనుంది. ఇది పన్ను ఎగవేతకు కళ్లెం వేయడానికి మరియు పన్ను చెల్లించకుండా తప్పించుకోవడాన్ని అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, ఉభయ దేశాల మధ్య పన్నుల సంబంధి ఆదాయ క్లెయిముల వసూలులో కూడా సహాయపడగలుగుతుంది.
ప్రస్తుత కన్ వెన్షన్ లోని సమాచార మార్పిడికి సంబంధించిన ఆర్టికిల్ 26 స్థానంలో ఒక కొత్త ఆర్టికిల్ ను ప్రవేశపెట్టారు. ఈ కొత్త ఆర్టికిల్ సమాచార మార్పిడి సంబంధి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందింది.
ప్రొటోకాల్ లో ‘పన్నుల వసూలులో సహాయం’ అంశంపైన ఒక కొత్త ఆర్టికిల్ ను జతచేయడమైంది.
ప్రొటోకాల్ అమలులోకి రావడానికి సంబంధించి ఆయా చట్టాలలో పొందుపరచవలసిన ప్రక్రియలు పూర్తి అయినట్టు నోటిఫై చేసిన తేదీ నుండి ప్రొటోకాల్ ఆచరణాత్మకం కాగలదు.
పూర్వ రంగం:
ఆదాయపు పన్ను చట్టం, 1961 లో భాగంగా విధించే ఆదాయపు పన్నును చెల్లించకుండా తప్పించుకోవడం, లేదా ఎగవేయడాన్ని నిరోధించడం కోసం మరియు అటువంటి పన్నును రాబట్టుకోవడం కోసం ఏదైనా విదేశంతో లేదా స్పెసిఫైడ్ అథారిటీ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 90 కింద అధికారం ఉంది. సంబంధిత కన్ వెన్షన్ 1986 డిసెంబర్ 3 నుండి అమలులోకి వచ్చింది. 1997లో ఫస్ట్ ప్రొటోకాల్ ద్వారా, 2000 వ సంవత్సరంలో సెకండ్ ప్రొటోకాల్ ద్వారా కన్ వెన్షన్ లో సవరణలను తీసుకురావడం జరిగింది. ఆ తరువాత థర్డ్ ప్రొటోకాల్ ద్వారా సమాచార మార్పిడి సంబంధి ఆర్టికిల్ ను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అప్ డేట్ చేయడం కోసం మరింతగా సవరించాలని, పన్నుల వసూలులో సహాయపడే ఒక ఆర్టికిల్ ను చేర్చాలనిభారతదేశం ప్రతిపాదించింది. తదనుగుణంగా, న్యూ జీలాండ్ తో సంప్రదింపులు జరపడం మరియు థర్డ్ ప్రొటోకాల్ యొక్క రెండు ఆర్టికిల్స్ పై ఒక అంగీకారానికి రావడమైంది.