Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

రెండవ జాతీయ యూత్ పార్లమెంటు ఉత్సవం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం


నమస్కారం!
అన్నింటికంటే ముందుగా ఈ ముగ్గురు యువకులకు హృదయపూర్వకంగా అభినందనలను తెలియజేస్తున్నాను. వీరిలో ఉన్నతమైన పద్ధతులు, ఉత్తమమైన ఆలోచనలు, చక్కటి వక్తృత్వ కళ కూడా ఉంది. ఆలోచనలు, సిద్ధాంత ప్రవాహాన్ని చాలా చక్కగా వీరు వెల్లడించగలిగారు. వారి వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం నిండి ఉంది. ఈ ముగ్గురితోపాటు మన యువ మిత్రులందరికీ విజేతలుగా నిలిచినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ, విద్యామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, దేశ యువ మిత్రులారా.. మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.

స్వామీ వివేకానందుని జన్మజయంతి మనందరికీ సరికొత్త ప్రేరణను అందిస్తుంది. ఈ ఏడాది యూత్ పార్లమెంటు ఉత్సవం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరగడం ఈ సారి ప్రత్యేకత. ఈ సెంట్రల్ హాల్ మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రత్యక్ష సాక్షి. ఎందరోమంది మహానుభావులు, స్వాతంత్ర్య భారతం కోసం ఎన్నో నిర్ణయాలు ఇక్కడినుంచే తీసుకున్నారు. ఇక్కడే భవిష్యత్ భారతం కోసం సమాలోచనలు చేశారు. భవిష్యత్ భారతం కోసం వారి కలలను, వారి సమర్పణ భావాన్ని, వారి సాహసాన్ని, వారి సామర్థ్యాన్ని, వారి ప్రయత్నాలన్నీ ఈ సెంట్రల్  హాల్ లోనే అయ్యేవి. మిత్రులారా, మీరు కూర్చున్న స్థలంలోనే రాజ్యాంగ నిర్మాణం జరిగింది.. ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మహానుభావులు మీరు కూర్చున్న సీట్లోనే కూర్చుని ఉంటారు. ఇవాళ ఆ సీట్లో మీరు కూర్చున్నారు. దేశంలోని మహాపురుషులు కూర్చున్న స్థలంలో మీరు కూర్చున్న అంశాన్ని మనస్సులో ఊహించుకోండి. దేశానికి మీ నుంచి ఎన్నోఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. సెంట్రల్ హాల్లో కూర్చుని ఉన్న యువ మిత్రులందరికీ ఇవే ఆలోచనలు కలుగుతున్నాయనే నమ్మకం నాకుంది.

మీరందరూ ఇక్కడ చర్చించారు, మంథనం చేశారు అవన్నీ ఎంతో విలువైనవి. ఈసారి పోటీల్లో గెలిచిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ యువ మిత్రుల మాటలను వింటున్నప్పుడు నా మనసులో ఓ ఆలోచన వచ్చింది. మీ ప్రసంగాలపై నా ట్వీటర్ హ్యండిల్ ద్వారా ట్వీట్ చేస్తాను. మీ ముగ్గురి గురించే ట్వీట్ చేస్తాను. ఒకవేళ రికార్డెడ్ మెటీరియల్ అందుబాటులో ఉంటే.. నిన్నటి ఫైనల్ ప్యానల్ ఉన్న వారందరి ప్రసంగాలను ట్వీట్ చేస్తాను. పార్లమెంటు పరిసరాల్లో భావి భారతం రూపుదిద్దుకుంటోందనే విషయం యావద్దేశానికి తెలుస్తుంది. ఇవాళ మీ ప్రసంగాలను ట్వీట్ చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను.

మిత్రులారా,
స్వామీ వివేకానంద దేశానికి చేసిన దిశానిర్దేశం.. ప్రాంతం, సమయం, వయసుతో సంబంధం లేకుండా  ప్రతి ఒక్కరికీ మార్గదర్శనం చేస్తుంది. స్వామీ వివేకానందుడితో అనుసంధానం కాని వ్యక్తి గానీ, వారి బోధనల స్ఫూర్తి పొందని గ్రామం గానీ, నగరం గానీ ఉండరు. స్వామీజీ బోధనలు, సందేశం.. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కూడా కొత్త ప్రేరణను కలిగించింది. సుదీర్ఘమైన వలసపాలకుల సమయంలో.. వేల ఏళ్ల మన శక్తిసామర్థ్యాలు దూరమయ్యాయి. స్వామీ వివేకానందుడు మళ్లీ ఆ శక్తిసామర్థ్యాలను గుర్తుచేశారు. అనుభవంలోకి తీసుకొచ్చారు. మన సామర్థ్యాన్ని, మన మనస్సు-ఆలోచనను పునరుజ్జీవింపజేశారు. జాతీయ చైతన్యాన్ని జాగృతపరిచారు. మీకో విషయం తెలిసి ఆశ్చర్యపోతారు. విప్లవ మార్గంలో, శాంతి మార్గంలో తమకు తోచిన పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న అందరూ.. స్వామీ వివేకానందుడి నుంచి ప్రేరణ పొందిన వారే. వారిని అరెస్టు చేస్తున్న సమయంలో, ఉరితీస్తున్న సమయంలో.. వివేకానందుడికి సంబంధించిన సాహిత్యం పోలీసుల చేతికి చిక్కేది. ఆ సమయంలో.. అసలు స్వామీ వివేకానందుని రచనల్లో, ఆలోచనల్లో దేశభక్తి కోసం, జాతి నిర్మాణం  కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసేందుకు ప్రేరణ ఇవ్వడంతోపాటు.. ప్రతి నవయువకుడి మనసులను ఇంతగా ప్రభావితం చేసేందుకు అందులో ఏముందని బ్రిటిష్ పాలకులు అధ్యయనం చేయించారు. కాలం మారింది, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ ఇవాళ్టికి కూడా స్వామీజీ మన మధ్యలోనే ఉంటారు. ప్రతిక్షణం మనకు ప్రేరణ అందిస్తూనే ఉంటారు. వారి ప్రభావం మన ఆలోచనధోరణిలో ఎక్కడో ఒకచోట స్పష్టంగా కనబడుతుంది. ఆధ్మాత్మికత, జాతీయవాదం, జాతి నిర్మాణం, దేశహితం, జనసేవ సంబంధిత అంశాల్లో స్వామీజీ చేసిన సూచనలు మన మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. మన యువమిత్రులు కూడా ఈ అంశాన్ని మనస్సులో అనుభవిస్తూనే ఉంటారని నాకు విశ్వాసం ఉంది. ఎక్కడైనా స్వామీ వివేకానందుడి చిత్రపటం కనిపించగానే.. మనస్సులో శ్రద్ధ, ఓ గౌరవభావం జాగృతమై.. ఆ చిత్రపటానికి దండం పెట్టుకోవడం మనందరికీ తప్పకుండా జరిగేదే.

మిత్రులారా,
స్వామీ వివేకానంద మనకో విలువైన కానుక ఇచ్చారు. వ్యక్తిత్వ నిర్మాణం, సంస్థల నిర్మాణమే ఆ విలువైన కానుక. దీనిపై చాలా తక్కువగా చర్చ జరుగుతుంది. కానీ.. దీనిపై మనం అధ్యయనం చేస్తే.. స్వామీ వివేకానందుడు వ్యక్తి నిర్మాణ మహత్కార్యాన్ని సమర్థవతంగా ముందుకు తీసుకెళ్తున్న విలువైన సంస్థలను ఏర్పాటుచేసి ముందుకుతీసుకెళ్లారనే విషయం మనకు అవగతం అవుతుంది. వారి సంస్కారం, వారి సేవాభావం, వారి సమర్పణాభావం నిరంతరం జాగృతమవుతూనే ఉన్నాయి. వ్యక్తి ద్వారా సంస్థ నిర్మాణం..సంస్థల ద్వారా ఎందరోమంది వ్యక్తుల నిర్మాణం అనేది ఓ అనవరత, ఆలస్యం లేకుండా, నిరంతర చక్రప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్వామీజీ ప్రభావం ఉన్నవారు.. కొత్త సంస్థల నిర్మాణానికి ప్రేరణ పొందుతారు. సంస్థలను, వ్యవస్థలను నిర్మించి.. స్వామీజీ బోధనల మార్గంలో ప్రయాణిస్తూ.. కొత్త వ్యక్తులను ఈ సిద్ధాంతంతో అనుసంధానం చేస్తూ ముందుకెళ్తారు. వ్యక్తుల నుంచి వ్యవస్థలు, వ్యవస్థలనుంచి వ్యక్తుల నిర్మాణ చక్రమే నేటికీ భారతదేశానికి ఓ బలమైన శక్తి. మీరందరూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చాలా వినే ఉంటారు. అది కూడా దాదాపుగా ఇలాంటిదే. ఓ తెలివైన వ్యక్తి ఓ మంచి కంపనీని స్థాపిస్తారు.. ఆ తర్వాత ఆయన ఏర్పర్చే వ్యాపారానుకూల వాతావరణంతో ఆ కంపెనీ మరెందరో తెలివైన వ్యక్తులను రూపొందిస్తుంది. వీరు మరింత ముందుకెళ్లి కొత్త సంస్థలను ఏర్పాటుచేసి.. మరికొంతమంది తమలాంటి వారిని తయారుచేస్తారు. ఈ చక్రం దేశం, సమాజంలోని ప్రతి రంగానికి అంతే విలువైనది.

మిత్రులారా,
నేడు దేశంలో నూతన జాతీయ  విద్యావిధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన లక్ష్యం కూడా.. చక్కటి వ్యక్తిత్వ నిర్మాణం చేయడమే. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా జాతినిర్మాణం ఈ విధానం, యువత ఆకాంక్షలు, వారి నైపుణ్యత, వారి ఆలోచన, వారి నిర్ణయాలకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇకపై వారు తమకు నచ్చిన విషయాలను ఎంచుకోవచ్చు.. నచ్చిన కాంబినేషన్లలో, స్ట్రీమ్ లలో విద్యాభ్యాసం చేయవచ్చు. ఒక కోర్సు ను బ్రేక్ చేసి మరో కోర్సులో చేరాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అలాగని.. ఇంతకుముందు నేర్చుకున్న కోర్సులు వ్యర్థంగా మిగిలిపోతాయని, మీ కష్టం వ్యర్థమవుతుందని అనుకోవద్దు. ఆ చదువుకు సర్టిఫికెట్ కూడా దొరుకుతుంది.. ఇది కూడా ముందుకెళ్తుంది.

మిత్రులారా,
విదేశాల్లో అందుబాటులో ఉండే విద్యావకాశాల కోసం మన యువత ఎదురుచూసేదో.. అలాంటి ఎకోసిస్టమ్‌నే నేడు మన దేశంలో అందుబాటులోకి తీసుకొస్తున్నాము. అక్కడి ఆధునిక విద్య, చక్కటి వ్యాపార అవకాశాలు, టాలెంట్ ను గుర్తించడం, గౌరవప్రదమైన వ్యవస్థ వంటివి సహజంగానే మన విద్యార్థులను ఆకర్షించేవి. అలాంటి వ్యవస్థనే మన దేశంలో అందుబాటులోకి తీసుకురావాలని మేం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. మన యువత ధైర్యంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. తన కలలను సాకారం చేసుకుంటూ స్వయం అభివృద్ధి చేసుకునేందుకు ఆవశ్యకమైన వాతావరణాన్ని రూపొందించడం జరుగుతోంది. విద్యావ్యవస్థ అయినా.. సమాజ వ్యవస్థ అయినా.. చట్టపరమైన సూక్ష్మ నైపుణ్యాలయినా.. ప్రతి అంశంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతోంది. స్వామి వివేకానందుడు కూడా ఈ అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. దాన్ని మనం ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ అంశంపైనా, శారీరక దృఢత్వం పైన, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడాన్ని కూడా ఆయన నొక్కిచెప్పేవారు. ఇనుప కండలు, ఉక్కునరాలు అని వారి సందేశాల ప్రస్తావనను స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ యువత శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఈ దిశగా ఫిట్ ఇండియా ఉద్యమమైనా.. యోగ విషయంలో చైతన్యమైనా.. క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలికవసతుల కల్పన అయినా.. యువతను అన్ని రకాలుగా సుదృఢపరిచేందుకే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మిత్రులారా,
ఈ మధ్య మీరు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్ అనే మాటను తరచుగా వింటున్నాం. స్వామీ వివేకానందుడిని అధ్యయనం చేస్తే ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ను వివేకానందుడు ‘మీపై మీరు విశ్వాసాన్ని ఉంచండి’ (బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్) అని చెప్పారు. లీడర్‌షిప్ విషయంలో.. ‘అందరిపైనా విశ్వాసం ఉంచండి’ (బిలీవ్ ఇన్ ఆల్) అని బోధించారు. ‘పురాణాల ప్రకారం.. ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచని వారిని నాస్తికులు అంటారు. కానీ ప్రస్తుత ధర్మం ప్రకారం.. తనపై తాను విశ్వాసం ఉంచని వాడే నాస్తికుడిగా చెప్పుకోవచ్చు’ అని స్వామీ వివేకానందుడు వివరించారు. నాయకత్వానికి సంబంధించిన విషయం వచ్చినపుడు.. వారు తనకంటే ముందు.. తన బృందం (టీమ్)పై విశ్వాసాన్ని ఉంచేవారు. నేనెక్కడో చదివాను. ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఓసారి స్వామి వివేకానంద.. తన సహచరుడైన స్వామి శారదానందజీ తో కలిసి లండన్‌లో ఓ బహిరంగ ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్లారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆహుతులందరూ వచ్చేశారు. సహజంగానే.. వీరిలో అధికులు.. స్వామీ వివేకానందుడి వాణిని వినేందుకు ఉత్సాహంగా వచ్చినవారే. ప్రసంగంలో వారి వంతు రాగానే.. స్వామీ వివేకానందుల వారు వేదికపైకి వచ్చి.. ఈసారి నా బదులుగా స్వామీ శారదానంద జీ ప్రసంగిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని స్వామీ శారదానందజీ కూడా ఊహించలేదు. ఈ ప్రసంగానికి వారు సిద్ధంగా కూడా లేరు. కానీ ఎప్పుడైతే స్వామి శారదానందజీ ప్రసంగాన్ని ప్రారంభించారో.. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా, ఆసక్తిగా ఆలకిస్తున్నారు. వారి ప్రసంగానికి ముగ్ధులయ్యారు. ఇదే నాయకత్వ లక్షణం. తనతోపాటు తన బృంద సభ్యులపై విశ్వాసాన్ని ఉంచడం. ఇవాళ మనం ఎంతవరకు స్వామీ వివేకానందుడి గురించి తెలుసుకుంటున్నామో.. అందులో స్వామీ శారదానందులవారి పాత్ర కూడా ఉందనే విషయాన్ని మనం  మరవొద్దు.

 

***