ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రథమ మహిళ మాన్యురాలు శ్రీమతి కిమ్ జుంగ్-సూక్ తో నేడు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానించిన మీదట ప్రథమ మహిళ శ్రీమతి కిమ్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఆమె అయోధ్య లో 2018 వ సంవత్సరం నవంబర్ 6 వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి మరియు రాణి సూరీరత్న (హియో హాంగ్-ఓక్) యొక్క నూతన స్మారకం యొక్క భూమి పూజ కు ముఖ్య అతిథి గా హాజరు కానున్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రిందట, అయోధ్య రాకుమారి సూరీరత్న కొరియా కు పయనమైపోయి అక్కడి రాజు సురో ను పెళ్ళాడటం తో అయోధ్య కు, కొరియా కు మధ్య గాఢతమ చారిత్రక అనుబంధం అంకురించింది.
ప్రధాన మంత్రి మరియు ప్రథమ మహిళ శ్రీమతి కిమ్ లు భారతదేశానికి, కొరియా కు మధ్య ఉన్నటువంటి నాగరకతపరమైనటువంటి, ఇంకా ఆధ్మాత్మికపరమైనటువంటి బంధాన్ని గురించి నేటి సమావేశం లో చర్చించారు. ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడం పై వీరు ఇరువురూ తమ తమ అభిప్రాయాలను ఈ సందర్భం గా వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కి సియోల్ శాంతి బహుమతి లభించడం పట్ల ప్రథమ మహిళ శ్రీమతి కిమ్ అభినందనలు తెలిపారు. ఈ గౌరవం వాస్తవానికి భారతదేశ ప్రజలకే దక్కుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
అధ్యక్షులు మాన్య శ్రీ మూన్ జెయీ-ఇన్ 2018 వ సంవత్సరం జులై నెల లో భారతదేశం లో జరిపిన పర్యటన సఫలీకృతం కావడాన్ని ప్రధాన మంత్రి ఆత్మీయం గా జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. ఈ పర్యటన భారతదేశానికి, కొరియా రిపబ్లిక్ కు మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక సరిక్రొత్త వేగ గతి ని ప్రసాదించినట్లు ఆయన పేర్కొన్నారు.
**