కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన మెస్సర్స్ రిచర్డ్ సన్ & క్రుడ్డాస్ (1972) లిమిటెడ్ (ఆర్ & సి) పారిశ్రామిక మరియు ఆర్థిక పునర్ నిర్మాణ మండలి (బి ఐ ఎఫ్ ఆర్) పరిధిలో నుండి బయటకు రావడానికి అనువుగా భారీ పరిశ్రమల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. కంపెనీకి భారత ప్రభుత్వం ఇచ్చిన రూ. 101.78 కోట్ల రుణాన్ని, ఆ రుణంపై జమ అయిన రూ. 424.81 కోట్ల వడ్డీని ఈక్విటీగా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కంపెనీకి చెందిన నాగపూర్ మరియు చెన్నై యూనిట్ లకు సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణను, ముంబయ్ లోని కంపెనీ స్థలంలోని కార్యకలాపాలను ఇతర స్థానాలకు మార్చేందుకు కూడా మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలియజేసింది. అయితే, ముంబయ్ లో కంపెనీకి ఉన్న భూమిని లీజ్ హోల్డ్ నుండి “ఆక్యుపేషన్ క్లాస్ II” గా మారుస్తారు. ఇలా చేయడం వల్ల ఈ భూమిని ప్రభుత్వ మార్గదర్శక నిబంధనల మేరకు అత్యంత అనుకూలమైన రీతిలో వినియోగించుకోవడం కంపెనీకి సాధ్యపడుతుంది.