Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రెండురోజులు గడిపిన ప్రధాని

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రెండురోజులు గడిపిన ప్రధాని


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఇవాళ ముగిసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండు రోజుల సదస్సులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శులతో పరస్పర చర్చ సందర్భంగా తాను నొక్కిచెప్పిన విస్తృత శ్రేణి అంశాలను ఆయన వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించారు.

ఈ మేరకు పంపిన సందేశాల్లో:

   “రెండు రోజులుగా ఢిల్లీలో నిర్వహించిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలో విస్తృత చర్చలను మనం గమనించాం. దీనికి సంబంధించి ఇవాళ నా వ్యాఖ్యల మేరకు- ప్రజా జీవనాన్ని మరింత మెరుగుపరచగల, దేశ ప్రగతి పయనాన్ని బలోపేతం చేయగల అనేక అంశాల గురించి నొక్కిచెప్పాను.

  ప్రపంచమంతా భారత్‌పై దృష్టి సారించిన ప్రస్తుత పరిస్థితుల నడుమ మన యువతరంలోని అసమాన ప్రతిభతోపాటు రాబోయే కాలం మన దేశానిదే. ఇటువంటి సందర్భంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సార్వజనీనతలే అన్ని రంగాల్లో సుపరిపాలనపై మన కృషికి ఉత్తేజమిచ్చే నాలుగు మూలస్తంభాలు.

   మన ‘ఎంఎస్‌ఎంఇ’ రంగాన్ని బలోపేతం చేసే కృషి కొనసాగాలన్నది నా నిశ్చితాభిప్రాయం. దేశం స్వయం సమృద్ధం కావడానికి, ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ఇదెంతో కీలకం. అలాగే స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడమూ అంతే ముఖ్యం. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగంలో నాణ్యత ఎందుకు అవసరమో కూడా ప్రముఖంగా ప్రస్తావించాను.

   అర్థంలేని నిబంధనలు, కాలంచెల్లిన చట్టాలకు స్వస్తి చెప్పడంపై దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శులకు పిలుపునిచ్చాను. మన దేశం అసమాన రీతిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అదనపు నియంత్రణ, అర్థంలేని ఆంక్షలకు ఆస్కారం ఉండకూడదు.

   నేను లేవనెత్తిన మరికొన్ని అంశాల్లో ‘పీఎం గతిశక్తి’ కూడా ఒకటి. ఈ దార్శనికతను సాకారం చేసుకోవడంలో సమన్వయం ఎంత అవసరమో స్పష్టం చేశాను. అదేవిధంగా ‘మిషన్‌ లైఫ్‌’కు మరింత ఉత్తేజం కల్పించాలని, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరాన్ని విజయవంతం చేయాలని ప్రధాన కార్యదర్శులను కోరాను” అని ప్రధాని పేర్కొన్నారు.

****

DS