భారత రాష్ట్రపతి పదవిలో తాను ఉండగా, ఆఖరు రోజున ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వద్ద నుండి తనకు అందిన ఒక లేఖ లోని అంశాలను పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ వెల్లడి చేశారు. ప్రధాన మంత్రి నుండి వచ్చిన లేఖ తన హృదయాన్ని స్పర్శించిందని శ్రీ ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
లేఖ పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది:
న్యూ ఢిల్లీ,
24 జులై, 2017
ప్రియమైన ప్రణబ్ దా,
మీ విశిష్ట ప్రయాణంలో ఒక నూతన దశను ఆరంభిస్తున్న తరుణంలో, దేశానికి మీరు చేసినటువంటి గొప్ప సేవలకుగాను, మరీ ముఖ్యంగా గత అయిదు సంవత్సరాల లోను భారతదేశ రాష్ట్రపతిగా మీరు పోషించిన పాత్రకుగాను మీ పట్ల నాలో నిండిన విస్తారమైన ప్రశంసను, కృతజ్ఞతను వ్యక్తం చేయకుండా నేను ఉండబట్టలేకపోతున్నాను. మీరు మీ యొక్క నిరాడంబరత, ఉన్నత నియమాలు మరియు మార్గదర్శక నాయకత్వ లక్షణాలతో మాకు స్ఫూర్తినిచ్చారు.
మూడు సంవత్సరాల క్రితం, ఒక బయటి వ్యక్తిగా నేను న్యూ ఢిల్లీకి వచ్చాను. అప్పట్లో నా ముందు ఉన్నటువంటి కర్తవ్యం భారీదే గాక సవాళ్ళతో కూడుకున్నటువంటిది కూడా. ఇంత కాలం మీరు నాకు ఎల్లప్పుడూ ఒక గురువుగాను, పితృ సమానులుగాను ఉంటూ వచ్చారు. మీ యొక్క జ్ఞానం, నేతృత్వం, మంచి మనస్సు నాకు మరింత విశ్వాసాన్ని, బలాన్ని ప్రసాదించాయి. మీరు విజ్ఞాన ఖని అన్నది అందరికీ తెలిసిన విషయమే. వివిధ అంశాల పైన.. విధానం మొదలు రాజకీయాల వరకు, ఆర్థిక శాస్త్రం మొదలు విదేశీ వ్యవహారాల వరకు, ఇంకా.. భద్రత సంబంధ అంశాల నుండి జాతీయ మరియు ప్రపంచ ప్రాముఖ్యం కలిగిన అంశాల వరకు దాకా మీకు ఉన్న అంతర్ దృష్టిని చూసి నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి లోనయ్యే వాడిని. మీ మేధోపరమైన పరాక్రమం సదా నా ప్రభుత్వానికి మరియు నాకు తోడ్పడింది.
మీరు నా పట్ల చాలా ఆత్మీయతను, వాత్సల్యాన్ని, సంరక్షణ భావనను కనబరుస్తుండేవారు. నేను రోజంతా సమావేశాలలో గడిపిన తరువాతో, లేదా ఎన్నికల ప్రచార పర్యటనలో ఉన్నప్పుడో మీరు నాకు ఫోన్ చేసి ‘‘ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ఉన్నారని తలుస్తాను’’ అంటూ వాకబు చేసే తీరే నాలో సరికొత్త శక్తిని నింపివేసేది.
ప్రణబ్ దా, మన రాజకీయ ప్రస్థానాలు విభిన్న రాజకీయ పక్షాలలో సాగాయి. ఒక్కొక్క సారి మనం అనుసరించిన సిద్ధాంతాలు వేరయ్యాయి. మన అనుభవాలు సైతం భిన్నమైనటువంటివి. నాకున్న పరిపాలనానుభవం నా రాష్ట్రానికి సంబంధించిందయితే మీరేమో మన దేశ రాజకీయ ముఖ చిత్రం విస్తృతిని దశాద్ధాల తరబడి అవలోకిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ లోపలి గ్రహణ శక్తి మరియు జ్ఞానం.. వీటి శక్తి ఎంతటిదంటే, మనం మన అభిప్రాయాల సమన్వయంతో కలసి పనిచేయగలిగాము.
మీ రాజకీయ ప్రస్థానంలోను, రాష్ట్రపతిగా మీ హయాంలోను మీరు దేశ శ్రేయాన్నే అన్నింటి కన్నా మిన్నగా ప్రతిష్ఠించారు. భారతదేశ యువతీయువకులలోని ధీశక్తినీ, నూతన ఆవిష్కారాల తాలూకు ప్రజ్ఞనూ వెలికితీయగల కార్యక్రమాల కోసం రాష్ట్రపతి భవన్ యొక్క ద్వారాలను మీరు బార్లా తెరిచారు.
రాజకీయాలను నిస్వార్థంగా సమాజానికి తిరిగి ఇవ్వగలిగే ఒక సాధనంగా పరిగణించిన తరం నాయకుల కోవకు చెందిన వారు మీరు. భారతదేశ ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చే ఒక గొప్ప సాధనంగా నిలుస్తున్నారు మీరు. వినయశీలి అయిన ఒక ప్రజా సేవకుడు, అసామాన్యమైన ఒక నాయకుడు.. ఈ రెండూ కలగలసిన రాష్ట్రపతిని మీలో చూసుకొంటూ భారతదేశం మీరంటే ఎప్పటికీ గర్వపడుతూ ఉంటుంది.
మీ ఉత్తరదాయిత్వం మమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తుంది. ప్రతి ఒక్కరినీ వెంట కలుపుకుపోయే మీ ప్రజాస్వామ్యయుత దార్శనికత నుండి మేము సదా బలాన్ని అందిపుచ్చుకొంటూ ఉంటాము. ఈ దార్శనికతను మీరు ఒక సుదీర్ఘమైన, ప్రఖ్యాతమైన ప్రజా జీవనాన్ని సాగించడం ద్వారా వృద్ధి పరచుకొన్నారు. మీరు ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సమయంలో మీ భావి ప్రయాసలు ఫలించాలంటూ నేను నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
మీరు ఇచ్చినటువంటి మద్దతుకు, ప్రోత్సాహానికి, మార్గనిర్దేశనానికి మరియు స్ఫూర్తికి గాను మరొక్క సారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల కిందట పార్లమెంటులో జరిగిన వీడ్కోలు సమావేశంలో నా గురించి మీరు పలికిన దయాపూరితమైన పలుకులకు ఇవే నా ధన్యవాదాలు.
రాష్ట్రపతి గారూ, మీతో కలిసి, మీ యొక్క ప్రధాన మంత్రిగా పనిచేయడం నాకు ఒక గౌరవం.
జయ్ హింద్
సహృదయంతో భవదీయుడు,
(నరేంద్ర మోదీ)
భారతదేశ రాష్ట్రపతి
శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి కి
***
Pranab Da, I will always cherish working with you. @CitiznMukherjee https://t.co/VHOTXzHtlM
— Narendra Modi (@narendramodi) August 3, 2017