Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి లోక్ సభలో జవాబిచ్చారు


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్ సభలో సమాధానమిచ్చారు. చర్చకు ఉత్సాహాన్ని జోడించినందుకు, తమదైన అంతర్ దృష్టితో పలు విషయాలను పంచుకున్నందుకు సభ లోని వివిధ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా శక్తిలో ఏదో ప్రత్యేకత ఉందని ప్రధాన మంత్రి చెబుతూ, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి భారతదేశానికి ప్రధాన మంత్రి అయ్యారంటే అందుకు ఈ ‘జన శక్తే’ కారణమని శ్రీ మోదీ అన్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం ప్రాణాలను అర్పించే అవకాశం దక్కని తన వంటి వారు ఎంతో మంది ఉన్నారని, అయితే స్వేచ్ఛా భారతావనిలో జన్మించినందువల్ల వారు దేశం కోసం జీవిస్తున్నారని, దేశానికి వారు సేవ చేస్తున్నారని ప్రధాన మంత్రి చెప్పారు. జన శక్తి పట్ల విశ్వాసం ఉంటే సత్ఫలితాలు సిద్ధిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మన ప్రజలలో దాగి ఉన్న బలాన్ని సభ్యులు అర్థం చేసుకొని అభినందించాలని, భారతదేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు.

బడ్జెట్ సమర్పణ తేదీని ముందుకు జరపడంలో సహేతుకతను గురించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ వివరిస్తూ, దీనివల్ల నిధులు ఉత్తమమైన పద్ధతిలో వినియోగం కాగలవని తెలిపారు. అలాగే, ప్రస్తుతం దేశంలోని రవాణా రంగానికి ఒక సమగ్రమైన దృక్పథం అవసరమని, ఒకే కేంద్ర బడ్జెట్ ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుందని చెప్పారు.

తాను అధికారంలోకి వచ్చిన తరువాత నుండి పాలనలో చోటు చేసుకున్న మార్పు పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ సంతృప్తిని వ్యక్తం చేశారు. కుంభకోణాల వల్ల ఎంత డబ్బు నష్టపోయాము అనే చర్చ జరుగుతూ వచ్చిన కాలం నుండి, ఎంత మేరకు నల్లధనాన్నితిరిగి రాబట్టుకోగలిగాము అనే దాని పైన ప్రస్తుతం చర్చ జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.

తన పోరాటం పేదల కోసమని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ పోరాటం పేద ప్రజలకు వారికి చెందవలసినవి అందేటంత వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రతి అంశాన్ని ఎన్నికల దృష్టి కోణంలో నుండే చూడబోదని, దేశ ప్రజల హితం ప్రభుత్వానికి అన్నింటికన్నా అతి ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు.

నోట్ల చట్టబద్ధత రద్దును ‘స్వచ్ఛ భారత్ ఉద్యమం’తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోల్చారు. ఈ ఉద్యమం భారతదేశంలో నుండి అవినీతిని మరియు నల్లధనాన్ని పారదోలి, పరిశుభ్ర భారతావనిని ఆవిష్కరించడం కోసమేనని ఆయన తెలిపారు.

నోట్ల చలామణి రద్దుకు సంబంధించిన నియమాలను తరచుగా మారుస్తూ వచ్చారన్న విమర్శలపై ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, ఈ అభ్యాసంలోని లోటుపాట్లను కనిపెట్టాలని కోరుకున్న వారి కన్నా ఒక అడుగు ముందు ఉండాలనే ఇలా చేశామని చెప్పారు. ఎమ్ఎన్ఆర్ఇజిఎ నియమావళిలో కూడా వెయ్యికి పైగా పర్యాయాలు మార్పులు జరిగిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

వ్యవసాయదారులకు సౌకర్యవంతంగా ఉండేటట్లు మరియు వారు లాభపడేటట్లు పంట బీమా వంటి చర్యలను తీసుకున్నట్లు ప్రధాన మంత్రి వివరించారు.

ప్రధాన మంత్రి దేశ సాయుధ దళాలను కూడా ప్రశంసించారు. ఈ బలగాలు దేశాన్ని కాపాడే సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.

***