రణ్ బీర్ కపూర్: మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ గారూ లేదా ప్రధాన మంత్రి గారూ.. ఈ రెండు సంబోధనల్లో ఎలా పలకరించాలంటూ గత వారం రోజులుగా మేం మా వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులో పెద్ద ఎత్తున చర్చించుకున్నాం. రీమా అత్త రోజూ నాకు ఫోన్ చేసి ఏమని పలకరిద్దాం రా, ఈ విషయంలో ఎలా ముందుకు పోదాం… చెప్పవేంరా.. అంటూ ఒకటే ప్రశ్నలు వేసేది.
ప్రధానమంత్రి: తమ్ముడూ, మీ కుటుంబంలో నేనూ ఓ భాగమేనయ్యా. మీకు ఏమని పిలవాలనిపిస్తే అలానే పిలవండి.
మహిళ: గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారూ.
ప్రధానమంత్రి: కట్.
మహిళ: మీరు మమ్మల్ని ఈరోజు ఇక్కడికి రమ్మని ఎంతో ప్రేమతో పిలిచారు. విలువైన మీ టైంని మా కోసం కేటాయించారు. రాజ్ కపూర్ వందో పుట్టినరోజు సందర్భంగా మేం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాన్నగారి సినిమాల్లో ఓ సినిమాలో కొన్ని పదాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ‘మై న రహూంగీ, తుమ్ న రహోగే, లేకిన్ రహేంగీ నిశానియా (నేను ఉండను, నువ్వు ఉండవు, అయితే గుర్తులు మాత్రం ఉండిపోతాయి).
ప్రధానమంత్రి: బాగుంది.
మహిళ: మాపైన అనంతమైన ప్రేమను చూపించారు. నరేంద్ర మోదీ గారు…ప్రధానమంత్రిగా మీరు ఈ రోజు కపూర్ కుటుంబంపై చూపించిన గౌరవం ఎంతటిదో దేశం మొత్తం గమనిస్తుంది.
ప్రధానమంత్రి: కపూర్ సాహెబ్ గొప్ప సేవ చేశారు. మీ అందరినీ ఇక్కడికి రమ్మని మీకు స్వాగతం పలకడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. రాజ్ సాహెబ్ వందో పుట్టిన రోజు భారతీయ సినిమా ప్రయాణంలో ఒక బంగారు మజీలీని సూచిస్తున్నది. ‘నీల్ కమల్’ వచ్చిన 1947 నుంచి 2047 వరకూ ఈ నూరేళ్ళ యాత్ర దేశానికొక అసాధారణ తోడ్పాటును అందిస్తుంది. ప్రస్తుత కాలంలో దౌత్య వర్గాల్లో ‘సాఫ్ట్ పవర్’ గురించి ఎంతో చర్చ జరుగుతోంది. ‘సాఫ్ట్ పవర్’ అనే మాట ఇంకా పుట్టని కాలంలోనే రాజ్ కపూర్ సాహెబ్ తన కృషితో ప్రపంచ రంగస్థలం మీద భారత్ ప్రభావాన్ని అప్పటికే సుప్రతిష్ఠితం చేశారు. దేశానికి చేసిన మహత్తర సేవ ఇది.
మహిళ: రణ్ బీర్ విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. రష్యా వెళ్లినపుడు టాక్సీ డ్రైవరు.. మీరు భారత్ నుంచి వచ్చారా అని అడిగి, వెంటనే పాట పాడడం మొదలుపెట్టాడు. నేను రాజ్ కపూర్ మనవడిని.. అంటూ (రణ్ బీర్) చెప్పాడు. ఆయనకు చెప్పు… (రణ్ బీర్ ని ఉద్దేశించి).
రణ్‌బీర్ కపూర్: నేను ఆయన మనవడిని అంటూ అతనితో చెప్పాను. ఇక ఆ కారణంగా నాకు ప్రతిసారీ టాక్సీ ఉచితంగా దొరికేది.
ప్రధానమంత్రి: ముఖ్యంగా మధ్య ఆసియా విషయంలో బహుశా ఏదో ఒక పని చేయాలి. అక్కడి వారి మనసులను గెలుచుకునేందుకు ఒక చిత్రాన్ని తీయాలి. ఇన్నేళ్ళయ్యాక కూడా రాజా సాహెబ్ తో ఉన్న ఆత్మీయ బంధం కొనసాగుతున్నది. చూడబోతే ఇదొక అద్భుతం సుమా.
మహిళ: ఈ కాలంలో, చిన్నపిల్లలకు కూడా రకరకాల పాటలను నేర్పిస్తున్నారు.
ప్రధానమంత్రి: అది వారి జీవితాల్లో చెరగని ముద్రను వేసిందని చాటిచెబుతోంది. మధ్య ఆసియాలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను నమ్ముతున్నా. ఈ బంధానికి ప్రాణం పోసేందుకు మనం పాటుపడాలి. దీనిని కొత్త తరంతో ముడివేయాలి. ఈ అనుబంధాన్ని బలపరిచేందుకు ఆ తరహా సృజనాత్మక ప్రయత్నాల్ని మొదలుపెట్టాలి. మరి వాటిని తప్పక సాధించవచ్చును.
మహిళ: ఆయన ఎంతటి ప్రేమను అందుకొన్నారంటే… ఆయన పేరు దేశ దేశాల్లో ప్రసిద్ధి చెందింది. మీరు ఆయనను ఒక చిన్నపాటి ‘సాంస్కృతిక రాయబారి’ అని పిలవొచ్చు. అయితే ఈ రోజు , నేను ఇది చెప్పి తీరాలి. ఆయన ఒక చిన్న సాంస్కృతిక రాయబారి కావచ్చుక కానీ, మన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ప్రపంచ రంగస్థలం మీదకు తీసుకుపోయారు. మరి మేం ఎంతో గర్వపడుతున్నాం. మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతున్నారు.
ప్రధానమంత్రి: నిజానికి, ప్రపంచంలో దేశానికున్న హోదా చెప్పుకోదగినంతగా పెరిగింది. ఒక ఉదాహరణకు యోగానే తీసుకోండి.. ఈరోజు, ప్రపంచంలో మీరు ఏమూలకు వెళ్ళినా సరే, యోగాకు తిరుగులేని ఆదరణ లభిస్తుంది.
మహిళ: మా అమ్మగారు, ఇంకా నేను, బేబో, లోలో… మా అందరికీ, యోగ అంటే ఆసక్తి.
ప్రధానమంత్రి: నేను ప్రపంచ నాయకులను కలుసుకొన్నప్పుడల్లా, అది మధ్యాహ్న భోజనంలోగానీ లేదా డిన్నర్‌లోగానీ, నా చుట్టుపక్కల సాగే సంభాషణలు ఒక్క యోగ పైనే సాగుతుంటాయి.
వ్యక్తి: ఈ చిత్రం మా తాతగారికొక ప్రేమపూర్వకమైన నివాళి. ఇది వాస్తవానికి నిర్మాతగా నా మొట్టమొదటి చిత్రం. నేనేమో నా కుటుంబంతో కలిసి ఏదైనా చేయాలని కలలు కనేవాడిని. మాకు ఇష్టమైనవన్నీ ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.
మహిళ: నేను మీకు ఓ విషయం చెప్పవచ్చా? వీళ్ళు నా మునిమనవలు, నా పిల్లలు. వాళ్ళకి వాళ్ళ తాతగారిని చూసే అవకాశం రాలేదు. అయినప్పటికీ వాళ్ళు ఆయన గౌరవార్థం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అర్మాన్ చాలా పరిశోధన చేశాడు. ఇది, దీనిలో కొంత భాగాన్ని ఆయనకు నివాళి అని చెప్పాలి.
వ్యక్తి: మేం నేర్చుకున్నదంతా సినిమాల్లోనుంచే, దీనిలో చాలా విషయాలను మా అమ్మగారు మాకు నేర్పించారు.
ప్రధానమంత్రి: మీరు పరిశోధనలోకి దిగారా అంటే, ఒకరకంగా, మీరు ఆ ప్రపంచంలో మునిగిపోతారు. అనుక్షణమూ దానిలోనే జీవిస్తారు. మీరు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే, మీరు మీ తాతగారిని ఏనాడూ కలుసుకోకపోయినా, ఈ పని పుణ్యమాని ఆయన జీవితం ఎలా సాగిందో తెలుసుకొనే వీలు మీకు చిక్కింది.
వ్యక్తి: అవును, ముమ్మాటికీ. ఇది నాకో పెద్ద కలగా ఉంటూ వచ్చింది. ఈ ప్రాజెక్టులో నా పూర్తి కుటుంబ సభ్యులకు ఓ భాగం లభించినందుకు నేను ఎంత కృతజ్ఞతతో నిండిపోయానో చెప్పలేను.
ప్రధానమంత్రి: ఆయన చిత్రాలు ఎంతటి ప్రభావాన్ని కలిగించిందీ నేను మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొంటాను. జన్ సంఘ్ కాలంలో ఢిల్లీలో ఒకసారి ఎన్నికలు జరిగాయి. జన్ సంఘ్ ఓడిపోయింది. ఓటమి ఎదురయ్యాక అద్వానీ గారు, అటల్ గారు అన్నారు కదా, ‘‘ఇప్పుడు మనం ఏం చేద్దాం?’’ అని. ఉత్సాహాన్ని నింపుకోవడానికి ఒక చిత్రాన్ని చూడాలని వారు నిర్ణయించుకొన్నారు. వాళ్ళు రాజ్ కపూర్ సినిమా ఒకటి చూడడానికి వెళ్ళారు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారేసరికల్లా వాళ్ళలో మళ్ళీ ఆశలు రేకెత్తాయి. అది ఎలా ఉందంటే, వాళ్ళు ఓడిపోయినా ఒక నవోదయం వారికోసం వేచి ఉంది.
నాకు జ్ఞాపకం ఉంది. నేను చైనాలో ఉండగా, మీ నాన్నగారి పాటల్లో ఒక పాట నా చెవులకు సోకింది. దానిని మొబైల్ ఫోన్లో రికార్డు చేయాలని నా పక్కన ఉన్న వ్యక్తిని కోరాను. ఆ పాటను నేను రిషి సాహెబ్‌కు పంపించాను. ఆయన ఉప్పొంగిపోయారు.
ఆలియా: మీరు ఈ మధ్యే ఆఫ్రికా వెళ్ళినట్లున్నారు. నా పాటల్లో ఒక పాటను పాడుతున్న జవాను పక్కన మీరు నిలబడి ఉన్న దృశ్యాన్ని నేను చూశాను. ఆ దృశ్యం వైరల్ అయింది. చాలా మంది ఆ దృశ్యాన్ని నాకు పంపించారు. దానిని చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషించారు. పాటలకు ప్రపంచాన్ని ఏకం చేసే అపూర్వ శక్తి ఉందని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది. హిందీ పాటలు, ముఖ్యంగా వాటికొక ప్రత్యేక స్థానమంటూ ఉంది. అవి భాషల ఎల్లలను దాటిపోతాయి. ప్రజలకు అందులో మాటలకు అర్థం తెలియకపోవచ్చు. అయినా కానీ, వాళ్ళు తాము కూడా గొంతు కలుపుతారు. నేను ప్రయాణాలు చేసేటప్పుడు తరచుగా ఈ విషయాన్ని గమనించాను. ముఖ్యంగా రాజ్ కపూర్ పాటల విషయం. ఈ రోజుకు కూడా మన సంగీతంలో అందరినీ ఆకట్టుకొనే భావద్వేగాలు ఏవో ఉన్నాయనిపిస్తుంది. అది వెంటనే మనల్ని హత్తుకుపోతుంది. ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే, నాలో ఒక ప్రశ్న పుట్టింది.. మీకు ఇప్పటికీ పాటలు వినే అవకాశం లభిస్తోందా?
ప్రధానమంత్రి: అవును, నేను సంగీతాన్ని ఆస్వాదిస్తాను. వీలుచిక్కినప్పుడల్లా నేను తప్పక సంగీతాన్ని వింటూ ఉంటాను.
సైఫ్ అలీ ఖాన్: నేను కలుసుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి మీరే. మీరు ఒకసారికాదు రెండుసార్లు మమ్మల్ని ముఖాముఖి కలుసుకున్నారు. మీలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంది. పని అంటే మీరు చూపే అంకితభావం నిజంగా ప్రశంసించదగ్గది. మీరు చేసే ప్రతి పనికి నేను మిమ్మల్ని అభినందించాలనుకొంటున్నాను. మరి మీరు మాతో భేటీ అయినందుకు, ఇంత చనువుగా మాట్లాడినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
ప్రధానమంత్రి: మీ నాన్నను కలుసుకోవడం నాకు జ్ఞాపకం ఉంది. ఈరోజున మీ కుటుంబంలో మూడు తరాలకు చెందినవారిని కలుసుకొనే అవకాశం నాకు దక్కుతుందని నేను ఆశపడ్డాను. కానీ, మీరు మూడో తరాన్ని వెంటబెట్టుకురాలేదు.
కరిష్మా కపూర్: మేం వాళ్ళని తీసుకువద్దామనే అనుకున్నాం.
మహిళ: వాళ్ళంతా పెద్ద నటులు. మేం మరింత పెద్ద రంగంలో లేం. నా పిల్లలు వారి వంతు యథాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మమ్మల్ని పిలిచింది ప్రధానమంత్రి గారు. నాన్నా, మీకు థ్యాంక్స్.
రణ్‌బీర్ కపూర్: మేం డిసెంబరు 13, 14, 15 తేదీల్లో రాజ్ కపూర్ సినిమాలను గురించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నాం. భారత ప్రభుత్వం, ఎన్ఎఫ్డీసీ, ఇంకా ఎన్ఎఫ్ఏఐ గొప్పగా మద్దతునిచ్చాయి. మేం ఆయన సినిమాలు పదింటిని– దృశ్య, శ్రవణ మాధ్యమాల సాయంతో– పునరుద్ధరించాం. వాటిని భారత్‌లో 40 నగరాల్లో 160 థియేటర్లలో ప్రదర్శిస్తారు. ప్రీమియర్‌ను 13వ తేదీన ముంబయిలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాతో కలవాల్సిందిగా యావత్తు చలనచిత్ర పరిశ్రమను మేం ఆహ్వానించాం.
గమనిక: కపూర్ కుటుంబ సభ్యులు– ప్రధానమంత్రి మధ్య సంభాషణ హిందీలో జరిగింది.
***
This year we mark Shri Raj Kapoor Ji’s birth centenary. He is admired not only in India but all across the world for his contribution to cinema. I had the opportunity to meet his family members at 7, LKM. Here are the highlights… pic.twitter.com/uCdifC2S3C
— Narendra Modi (@narendramodi) December 11, 2024