రాజ్యంగాన్ని ఆమోదించుకొని 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా లోక్‌సభలో చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. మనం ఈ ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకోవడం భారత పౌరులకే కాక పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గర్వకారణమూ, గౌరవభరితమంటూ వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగ 75వ వార్షికోత్సవ అసాధారణ, మహత్తర యాత్ర సందర్భంగా ఆయన రాజ్యాంగ నిర్మాతలు కనబర్చిన ముందుచూపునకు, వారి దార్శనికతకు, వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ 75 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రజాస్వామ్య ఉత్సవాన్ని జరుపుకోవలసిన తరుణమన్నారు. ఈ ఉత్సవంలో పార్లమెంటు సభ్యులు కూడా పాలుపంచుకొంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని శ్రీ మోదీ చెబుతూ, దీనికిగాను వారికి ధన్యవాదాలనూ, అభినందనలనూ తెలిపారు.
ఈ 75 సంవత్సరాల ఘట్టాన్ని ఒక అసాధారణ సన్నివేశంగా ప్రధాని అభివర్ణిస్తూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన వెంటనే దానికి ఎదురవుతాయనుకున్న అన్ని సంభావ్యతలనూ, ఆ తరువాత ఎదురైన సవాళ్లను రాజ్యాంగం అధిగమించి మనను ఇప్పటి స్థితికి చేర్చినందుకు గర్వంగా ఉందని ప్రధాని అన్నారు. ఈ మహత్కార్యాన్ని నెరవేర్చినందుకు రాజ్యాంగ శిల్పులకు, కోట్లాది మంది పౌరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగంలో ఎలాంటి విలువలకు రాజ్యాంగ రూపకర్తలు స్థానం కల్పించారో ఆ విలువలను దేశ పౌరులు అలవర్చుకోవడంలో సఫలమై, ముందుకు సాగిపోతున్నారని శ్రీ మోదీ అన్నారు. ఈ కారణంగా ప్రశంసలు వాస్తవానికి దక్కాల్సింది పౌరులకేనని ఆయన అన్నారు.
భారత్ 1947లో పుట్టిందన్న ఉద్దేశాన్నో లేక రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చిందన్న ఉద్దేశాన్నో రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ సమర్ధించలేదు. అంతకన్నా వారు భారతదేశ ఘన సంప్రదాయాన్ని, ఘన వారసత్వాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి వాటిని చూసి గర్వపడ్డారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, ఈ గణతంత్ర గత చరిత్ర ఎప్పటికీ ప్రశంసనీయంగానే ఉంటూ వస్తున్నాయనీ, ప్రపంచానికి ప్రేరణనిస్తున్నాయనీ ఆయన అన్నారు. ఈ కారణంగా, ‘‘ ప్రజాస్వామ్యానికి జననిగా భారతదేశం పేరు తెచ్చుకొంది’’ అని కూడా ఆయన చెప్పారు. మనది ఒక గొప్ప ప్రజాస్వామిక దేశమనీ, ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించిన దేశం కూడానని శ్రీ మోదీ చెప్పారు.
రాజ్యాంగ చర్చల్లో రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్ చెప్పిన మాటలను ప్రధాని ప్రస్తావిస్తూ ‘‘శతాబ్దాలు గడిచాక, ఆ తరహా విశిష్ట సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది మన ఘనమైన చరిత్రను, గతాన్నీ గుర్తుకు తెస్తోంది. అప్పట్లో మనం స్వతంత్రులం.. మేధావులం.. సభల్లో అర్థవంతమైన అంశాలను చర్చించడం, వాదోపవాదాలు చేయడం చేసేవాళ్లం’’ అని అన్నారు. డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ పలికిన మాటలను ప్రధాని ఉటంకిస్తూ ‘‘ఈ గొప్ప దేశానికి గణతంత్ర వ్యవస్థ ఒక కొత్త దృక్పథం ఏమీ కాదు. ఎందుకంటే మనకు మన చరిత్ర మొదలైనప్పటి నుంచీ ఈ వ్యవస్థ సుపరిచితమే’’నని చెప్పారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మాటలను ప్రధాని ప్రస్తావిస్తూ, ‘‘ప్రజాస్వామ్యం అంటే భారత్‌కు తెలియదని కాదు, భారత్‌లో అనేక గణతంత్రాలు మనుగడ సాగించిన కాలమంటూ ఒకటి ఉండింది’’ అని తెలిపారు.
రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియలోనూ, రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేయడంలోనూ మహిళలు పోషించిన పాత్రను ప్రధానమంత్రి కొనియాడారు. రాజ్యాంగ పరిషత్తులో గౌరవనీయులైన, క్రియాశీలురైన 15 మంది సభ్యులు ఉండేవారు, వారు వారి నికార్సైన ఆలోచనలను, అభిప్రాయాలను, ఉద్దేశాలను ఇచ్చి రాజ్యాంగ ముసాయిదా రచన ప్రక్రియను మరింత బలోపేతం చేశారని ఆయన అన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ భిన్నమైన నేపథ్యాలు కలిగినవారని శ్రీ మోదీ గుర్తుకు తెస్తూ, మహిళా సభ్యులు ఇచ్చిన ఆలోచనాపూర్వక సూచనలు, సలహాలు రాజ్యాంగంపైన ఎనలేని ప్రభావాన్ని ప్రసరించాయని స్పష్టంచేశారు. ప్రపంచంలో అనేక ఇతర దేశాలు మహిళలకు వోటుహక్కును ఇవ్వడానికి దశాబ్దాల కాలం పడితే, ఆ హక్కులను మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఇవ్వడం చూస్తే గర్వంగా ఉందని కూడా ప్రధాని అన్నారు. ఇదే స్ఫూర్తితో, జి-20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్ష బాధ్యతను నిర్వహించిన కాలంలో మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధన అనే దృష్టికోణాన్ని ప్రపంచం ఎదుట ఆవిష్కరించిందని ఆయన వివరించారు. పార్లమెంటు సభ్యులంతా కలిసి నారీశక్తి వందన్ అధినియానికి చట్టరూపాన్ని ఇవ్వడంలో సఫలమయ్యారని కూడా శ్రీ మోదీ తెలియజేస్తూ, రాజకీయరంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు.
ప్రతి ప్రధాన విధాన నిర్ణయంలో కేంద్ర స్థానంలో నిలిచింది మహిళలే అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తయిన కాలంలో భారత రాష్ట్రపతి పదవిని ఒక గిరిజన మహిళ నిర్వహిస్తూ ఉండడం ఒక గొప్ప యాదృచ్చిక ఘటన అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తిని మనం చేతల్లో చూపిస్తున్నామని చాటిచెబుతోందని ఆయన అన్నారు. పార్లమెంటులోనూ, మంత్రిమండలిలోనూ మహిళల ప్రాతినిధ్యం, పాత్ర నిరంతరంగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ‘‘సామాజిక, రాజకీయ, విద్యా, క్రీడల రంగం కావచ్చు లేదా మరే ఇతర రంగం కావచ్చు.. మహిళల ప్రాతినిధ్యమూ, మహిళల తోడ్పాటూ దేశానికి గర్వకారణమవుతూ వస్తున్నాయి’’ అని శ్రీ మోదీ గట్టిగా చెప్పారు. సైన్, టెక్నాలజీ రంగంలో, ప్రత్యేకించి అంతరిక్ష రంగంలో మహిళల తోడ్పాటులను చూసుకొని భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని ఆయన అన్నారు. దీనికి అత్యంత ఘనమైన ప్రేరణగా నిలిచింది మన రాజ్యాంగమే అని ఆయన అన్నారు.
భారతదేశం శరవేగంగా పురోగమిస్తోందని శ్రీ మోదీ పునరుద్ఘాటిస్తూ, త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్నారు. భారత్‌ను 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి సంకల్పం అని ఆయన చెప్పారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలంటే భారతదేశ ఏకత అత్యంత ప్రధానమైన అవసరం అని కూడా ఆయన చెప్పారు. భారతదేశ ఏకతకు పునాదిగా ఉన్నది కూడా మన రాజ్యాంగమే అని ప్రధానమంత్రి తెలిపారు. రాజ్యాంగాన్ని సిద్ధం చేసే ప్రక్రియలో మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధులు, రచయితలు, ఆలోచనపరులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, ఇతర వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులు పాలుపంచుకొన్నారని శ్రీ మోదీ గుర్తుచేస్తూ, వారంతా భారతదేశం ఐకమత్యంగా ఉండడం ఎంతో ముఖ్యం అనే వాస్తవం విషయంలో అత్యంత స్పందనశీలతను కనబరిచారన్నారు.
రాజ్యాంగ రూపకర్తల మనసుల్లోనూ, మేధలోనూ ఏకత నిండి ఉంటే, స్వాతంత్ర్యం వచ్చాక మాత్రం వక్రీకరణకు తావిచ్చిన మనస్తత్వాలు లేదా స్వార్థపరత్వం వంటి వాటి కారణంగా జాతీయ ఏకత అనే కీలక భావన మీద చాలా పెద్ద దెబ్బ కొట్టారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసంతోషాన్ని ప్రకటించారు. భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా భారతదేశం ఉంటూ వచ్చిందని ప్రధాని ప్రధానంగా చెబుతూ, మనం వైవిధ్యాన్ని సంబరంగా జరుపుకొంటాం, దేశ ప్రగతి దీనిలోనే ఇమిడి ఉందన్నారు. ఏమైనా, వలసవాద మానసికతను కలిగిఉన్న వారు భారత్‌లో జరుగుతున్న మంచి విషయాలను చూడలేరు, భారత్ 1947లో పుట్టిందని నమ్మిన వారు ఈ భిన్నత్వానికి నిరాకరణలను కోరారని ఆయన అన్నారు. వివిధత్వం అనే అమూల్య ఖజానాను సంబరంగా జరుపుకొనేందుకు బదులుగా దానిలో- దేశ ఏకతకు హాని చేయాలనే ధ్యేయంతో- విషబీజాలను నాటేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. భిన్నత్వాన్ని వేడుక చేసుకోవడాన్ని మన జీవనాల్లో ఒక విడదీయరానటువంటి భాగంగా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి శ్రీ మోదీ విజ్ఞప్తి చేస్తూ, అదే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు సిసలైన నివాళి కాగలదన్నారు.
గత పదేళ్లలో, ప్రభుత్వ విధానాలు మన దేశ ఏకతను పటిష్టపరచాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటూ వచ్చాయని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా చెప్పారు. రాజ్యాంగ 370వ అధికరణం దేశ ఏకతకు ఒక అడ్డంకిలా ఉండిందని ఆయన అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశ ఏకత ఒక ప్రాధమ్యంగా ఉండిందని శ్రీ మోదీ పునరుద్ఘాటిస్తూ, ఈ కారణంగానే 370వ అధికరణాన్ని రద్దుచేశారన్నారు.
భారతదేశం ఆర్థికంగా పురోగమించడంతో పాటు ప్రపంచదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలంటే భారత్‌లో అనుకూల స్థితిగతులుండాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. వస్తువులు, సేవలపై పన్ను (జీఎస్టీ)పై చర్చలు దేశంలో చాలా కాలం నుంచీ కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక ఏకతలో జీఎస్టీ సార్థక పాత్రను పోషించిందని ఆయన చెబుతూ, ఈ అంశంలో ఇదివరకటి ప్రభుత్వ తోడ్పాటును ఒప్పుకొన్నారు. జీఎస్టీని అమలుపరిచే అవకాశం, ‘‘వన్ నేషన్, వన్ ట్యాక్స్ (ఒకే దేశం, ఒకే పన్ను)’’ భావనను ముందుకు తీసుకుపోయే అవకాశం ప్రస్తుత ప్రభుత్వానికి దక్కాయని ఆయన అన్నారు.
రేషన్ కార్డులు మన దేశ పేదలకు ఎలా ఒక విలువైన పత్రంలా ఉంటున్నదీ శ్రీ మోదీ చెబుతూ, ఒక పేద వ్యక్తి – అతడు గానీ, లేదా ఆమె గానీ – ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల గురించీ, వారికి ఎలాంటి ప్రయోజనాలూ అందకపోవడాన్ని గురించీ ప్రస్తావించారు. ఈ విశాల దేశంలో పౌరులందరికీ- వారు ఎక్కడ ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా- సమాన హక్కులు ఉండాలని ఆయన స్పష్టంచేశారు. ఈ ఏకత భావనను బలపరచడానికి, ప్రభుత్వం ‘‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ (ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు)’’ భావనను బలోపేతం చేసిందని ఆయన చెప్పారు.
పేదలకు, సామాన్య పౌరులకు ఆరోగ్య సంరక్షణ సేవలను ఉచితంగా అందిస్తే పేదరికంతో వారు పోరాడే సామర్థ్యం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఆరోగ్య సంరక్షణ సేవలు వారు పనిచేసే చోట అందుబాటులో ఉంటూ ఉంటే, వారు ఆ చోటుకు దూరంగా వెళ్లినా ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూడా ఆరోగ్య సంరక్షణ సేవలు అందాలన్నారు. జాతీయ ఏకత సూత్రాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ‘‘వన్ నేషన్, వన్ హెల్త్ కార్డ్ (ఒకే దేశం, ఒకే ఆరోగ్య కార్డు)’’ కార్యక్రమాన్ని ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రవేశపెట్టిందన్నారు. పుణెలో పనిచేసే బిహార్ దూరప్రాంతానికి చెందిన వ్యక్తి సైతం ఆయుష్మాన్ కార్డు తో అవసరమైన వైద్య సేవలను అందుకోగలుగుతారని ఆయన చెప్పారు.
దేశంలో ఒక ప్రాంతం విద్యుత్తు సదుపాయాన్ని కలిగి ఉంటే, మరో ప్రాంతం సరఫరాలో సమస్యల కారణంగా చీకటిలో మునిగి ఉండేదని, అటువంటి పరిస్థితులు కూడా ఉండేవని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. మునుపటి ప్రభుత్వాల పదవీకాలాల్లో, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలకుగాను భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా విమర్శించేవారని ఆయన అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి, ఏకతా మంత్రాన్ని స్థిరపరచడానికి ప్రభుత్వం ‘‘వన్ నేషన్, వన్ గ్రిడ్’’ (ఒకే దేశం, ఒకే గ్రిడ్) కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని ప్రధాని స్పష్టంచేశారు. ప్రస్తుతం, విద్యుచ్ఛక్తిని భారతదేశంలో మారుమూలలకూ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయడం సాధ్యమైందని ఆయన తెలిపారు.
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, జాతీయ ఏకకతను బలపరచడానికి సంతులిత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఈశాన్య ప్రాంతం కావచ్చు, జమ్మూ- కశ్మీర్ కావచ్చు, హిమాలయ ప్రాంతాలుకావచ్చు లేదా ఎడారి ప్రాంతాలు కావచ్చు.. ప్రభుత్వం మౌలిక సదుపాయాలను సమగ్ర స్థాయిలో సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలను చేపట్టిందని ఆయన తెలిపారు. అభివృద్ధి లోపించిన కారణంగా ఆమడ దూరంలో నిలిచిపోయాయన్న భావనను తొలగించి, తద్వారా ఏకతను పెంపొందించాలన్నదే ఈ కార్యక్రమం ధ్యేయమని, ఆయన అన్నారు.
కలిగిన వారికి, లేని వారికి మధ్య డిజిటల్ మాధ్యమం పరంగా విభజన ఉందని శ్రీ మోదీ స్పష్టంచేస్తూ, డిజిటల్ ఇండియాలో భారత్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా గొప్ప గౌరవ భావనకు మూలం అయిందన్నారు. ఈ విజయంలో టెక్నాలజీ ప్రజాస్వామ్యీకరణ ఒక కీలక కారకం అయిందని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాతల దార్శనికత నుంచి మార్గదర్శకత్వాన్ని అందుకొని, జాతీయ ఏకతను బలపరచడానికి ఆప్టికల్ ఫైబర్ సేవలను భారతదేశంలోని ప్రతి పంచాయతీకి విస్తరించడానికి ప్రభుత్వం పనిచేసింది అని శ్రీ మోదీ వివరించారు.
ఏకత వర్ధిల్లాలని రాజ్యాంగం ఆశిస్తున్నదని, ఈ స్ఫూర్తితో మాతృభాష ప్రాముఖ్యాన్ని గుర్తించారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మాతృభాషను అణగదొక్కితే దేశ జనాభా సాంస్కృతికంగా సుసంపన్నులు కాలేరు అని ఆయన అన్నారు. నూతన విద్య విధానం మాతృభాషకు చెప్పుకోదగ్గ ప్రాముఖ్యాన్ని కట్టబెట్టందని, తద్వారా నిరుపేదల పిల్లలు సైతం వారి స్థానిక ప్రాంత భాషల్లో వైద్యులుగాను, ఇంజినీర్లుగాను అయ్యే వీలును ఈ విద్య విధానం కల్పిస్తోందన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ మద్దతునిస్తుంది, వారి అవసరాలను తీర్చాలని ఆదేశిస్తోందని ఆయన అన్నారు. అనేక శాస్త్రీయ భాషలకు వాటికి న్యాయంగా దక్కాల్సిన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చారని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ ప్రచార ఉద్యమం జాతీయ ఏకతను బలపరుస్తూ, నవ తరంలో సాంస్కృతిక విలువలను పాదుగొల్పుతోందని ఆయన అన్నారు.
కాశీ తమిళ్ సంగమం, తెలుగు కాశీ సంగమంలు విశేష సంస్థాగత కార్యక్రమాలుగా పేరుతెచ్చుకొన్నాయని శ్రీ మోదీ చెబుతూ, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక బంధాలను బలపరిచేవేనన్నారు. భారతదేశ ఏకతకున్న ప్రాధాన్యాన్ని రాజ్యాంగ కీలక సూత్రాల్లో గుర్తించారనీ, దీనిని ఒప్పుకోవాల్సిందేనని ఆయన చెప్పారు.
రాజ్యాంగం తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటుండగా, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అనే ముఖ్య ఘట్టాలకు కూడా వాటి వంతు ప్రాధాన్యం ఉందని ప్రధానమంత్రి అన్నారు. చరిత్రను ఆయన గుర్తుకుతెస్తూ, రాజ్యాంగ 25వ వార్షికోత్సవం సందర్భంగా, దానిని దేశంలో ముక్కలుగా చించేశారన్నారు. ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి)ని విధించారు, రాజ్యాంగపరమైన వ్యవస్థలను నేలమట్టం చేశారు, దేశాన్ని ఒక జైలులాగా మార్చారు, పౌర హక్కులను లాగేసుకొన్నారు. పత్రికా స్వాతంత్ర్యాన్ని బందీని చేశారు అని ప్రధాని వివరించారు. ప్రజాస్వామ్యానికి గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు, రాజ్యాంగ రూపకర్తలు చేసిన త్యాగాలను పూడ్చిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధాని అన్నారు.
రాజ్యాంగ 50వ వార్షికోత్సవాన్ని దేశప్రజలు 2000 నవంబరు 26న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలో నిర్వహించుకొన్నారని శ్రీ మోదీ అన్నారు. శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయీ ఒక ప్రధానమంత్రి గా దేశ ప్రజలకు ఒక ప్రత్యేక సందేశాన్నిచ్చారు. ఏకత, ప్రజల ప్రాతినిధ్యం, భాగస్వామ్యాలకున్న ప్రాధాన్యాన్ని ఆయన ప్రధానంగా చెప్పారని ప్రధాని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని సజీవంగా నిలిపి, ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నది శ్రీ వాజ్‌పేయీ ప్రయత్నాల ధ్యేయమని ఆయన అన్నారు.
రాజ్యాంగ 50వ వార్షికోత్సవం సందర్భంగా… రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రి అయ్యే విశేషాధికారం తనకు దక్కిందని ప్రధాన మంత్రి అన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఉన్న కాలంలో, గుజరాత్లో రాజ్యాంగ 60వ వార్షికోత్సవాన్ని నిర్వహించామని ఆయన చెప్పారు. చరిత్రలో మొట్టమొదటిసారి, రాజ్యాంగాన్ని ఒక ఏనుగు మీద నిలిపి, రాజ్యాంగ గౌరవ్ యాత్రను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రాజ్యాంగానికి గొప్ప ప్రాధాన్యం ఉందని, ఈ రోజు, రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొంటున్న క్రమంలో, లోక్‌సభలో జరిగిన ఒక సంఘటనను ప్రధాని గుర్తుకు తెచ్చారు. ఆ సందర్భంలో ఒక సీనియర్ నాయకుడు నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ, అందుకు జనవరి 26 ఉండనే ఉందికదా అని అన్నారని శ్రీ మోదీ వివరించారు.
ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు శ్రీ మోదీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాజ్యాంగానికున్న శక్తిని, వివిధత్వాన్ని గురించి చర్చిస్తే ప్రయోజనకరంగా ఉండేది. అదే జరిగితే నవ తరానికి అమూల్యమైందిగా ఈ కార్యక్రమం ఉండేదన్నారు. ఏమైనా ప్రతి ఒక్కరికి వారి స్వీయ నిర్బంధాలంటూ ఉంటాయి. వేరు వేరు రీతులైన వారి సొంత అపనమ్మకాలు, భయాలు ఉంటూ ఉంటాయి. వాటిలో కొన్ని వారి వైఫల్యాలను బయటపెడుతూ ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలు పక్షపాతి ప్రవృత్తులకు మించి ఎదిగి జాతీయ హితాలపై దృష్టిని కేంద్రీకరించి జరిగి ఉంటే, ఆ చర్చలు కొత్త తరాన్ని సుసంపన్నం చేసి ఉండేవని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
రాజ్యాంగంలో ఉల్లేఖించుకొన్న భావన తన వంటి చాలా మందికి వారు ప్రస్తుతం ఉన్న స్థానాలకు చేరుకొనేందుకు వీలు కల్పించిందని ప్రధాని చెబుతూ, రాజ్యాంగం అంటే తనకున్న ప్రత్యేక గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి నేపథ్యం లేకున్నా, తమను ఇక్కడకు తీసుకు వచ్చినవి రాజ్యాంగానికి ఉన్న శక్తితోపాటు ప్రజల ఆశీర్వాదాలేనని ఆయన ప్రధానంగా చెప్పారు. సమాన స్థితిగతులలో ఉన్న అనేక మంది వ్యక్తులు ప్రధాన పదవులను అధిష్టించారంటే అది రాజ్యాంగం కారణంగానే అని శ్రీ మోదీ అన్నారు. దేశం ఒకటి కాదు, మూడు సార్లు గొప్ప విశ్వాసాన్ని చాటడం ఒక మహద్భాగ్యం అని ఆయన అన్నారు. రాజ్యాంగం లేకపోతే ఇది సాధ్యపడేదే కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశం 1947 నుంచి 1952 వరకు ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని కాకుండా ఒక తాత్కాలిక ప్రభుత్వాన్నీ, ఎలాంటి ఎన్నికలూ జరపక ఎంపిక చేసిన ప్రభుత్వాన్నీ చూసిందని శ్రీ మోదీ అన్నారు. 1952కు పూర్వం, రాజ్యసభ ఏర్పాటు కాలేదు, ఏ రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించలేదు. దీని అర్థం ప్రజల వద్ద నుంచి ఎలాంటి తీర్పూ రాలేదని ఆయన చెప్పారు. ఇంతజరిగిన తరువాతా, 1951లో, ఎన్నికైన ప్రభుత్వమంటూ లేకుండా, భావ స్వాతంత్ర్యంపై దాడి చేస్తూ రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక ఆర్డినెన్సును జారీ చేశారు. ఇది రాజ్యాంగ రూపకర్తలకు జరిగిన ఒక అవమానం. ఎందుకంటే అలాంటి అంశాలను రాజ్యాంగ పరిషత్తులో పరిశీలించలేదని ప్రధాని ఉద్ఘాటించారు. అవకాశం ఎదురుపడగానే, వారు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించారు. ఇది రాజ్యాంగ నిర్మాతలకు జరిగిన తీవ్ర అవమానమని అన్నారు. రాజ్యాంగ పరిషత్తులో సాధించలేనిదానిని ఎన్నికవని ప్రధాని ఒకరు దొడ్డిదారిన నెరవేర్చుకొన్నారు. ఇది ఒక పాపం అని ప్రధానమంత్రి అన్నారు.
రాజ్యాంగాన్ని 1971లో సవరించి సుప్రీం కోర్టు చేసిన నిర్ణయాన్ని తిప్పివేసి న్యాయవ్యవస్థ రెక్కలు కత్తిరించారని ప్రధానమంత్రి చెప్పారు. ఆ సవరణ రాజ్యాంగంలోని ఏ అధికారణాన్ని అయినా సరే న్యాయ సమీక్షకు తావివ్వకుండా పార్లమెంటు మార్చగలగుతుందనేదే, దీంతో న్యాయస్థానాలకు వాటి అధికారాలు లాగేసుకొన్నారని శ్రీ మోదీ తెలిపారు. దీంతో అప్పటి ప్రభుత్వానికి ప్రాథమిక హక్కులను తగ్గించివేయడానికి, న్యాయ వ్యవస్థను అదుపుచేయడానికి వీలు కలిగింది అని ఆయన అన్నారు.
అత్యవసర స్థితి కాలంలో, రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడంతోపాటు ప్రజాస్వామ్యానికి ఊపిరి సలపనీయకుండా చేశారని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్.. వీరి ఎన్నికలను ఏ న్యాయస్థానంలో సవాలు చేయకుండా 39వ సవరణను 1975లో ఆమోదించారు. పాత నిర్ణయాలను కూడా దీని పరిధిలోకి తీసుకు రావడానికి గతానికి వర్చించేలా దీనిని అమలుపరిచారని ఆయన వివరించారు.
ఒక కోర్టు కేసులో అప్పటి ప్రధానికి వ్యతిరేకంగా ఆదేశాన్నిచ్చిన న్యాయమూర్తి శ్రీ హెచ్.ఆర్. ఖన్నాకు సీనియారిటీ ఉన్నప్పటికీ భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని ఇవ్వలేదని ప్రధానమంత్రి తెలిపారు. ఇది రాజ్యాంగ ప్రక్రియను, ప్రజాస్వామ్య ప్రక్రియను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టంచేశారు.
షా బానో కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ప్రధానమంత్రి గుర్తుచేస్తూ అది రాజ్యాంగంలో పొందుపర్చిన ఆత్మగౌరవం, స్ఫూర్తిల ఆధారంగా ఒక భారతీయ మహిళకు న్యాయాన్ని అందించిన కేసు అని అన్నారు. వయోవృద్ధురాలొకరికి ఆమెకు హక్కుగా దక్కాల్సిన దానిని సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసిందని, కానీ అప్పటి ప్రధాని ఈ స్ఫూర్తిని తోసిపుచ్చుతూ ఆ క్రమంలో రాజ్యాంగ సారాన్ని త్యజించారని శ్రీ మోదీ అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని తిప్పేయడానికి పార్లమెంటు మరోసారి ఒక చట్టాన్ని ఆమోదించిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
చరిత్రలో మొట్టమొదటిసారిగా, రాజ్యాంగాన్ని తీవ్రంగా గాయపరిచారని ప్రధానమంత్రి అన్నారు. ఎన్నికైన ప్రభుత్వమంటూ ఏర్పడాలని, ప్రధాన మంత్రి అంటూ ఒకరు ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో పొందుపరిచారని ఆయన అన్నారు. ఏమైనప్పటికీ, రాజ్యాంగేతర అస్తిత్వంగా రూపుదిద్దుకొన్న , ఎలాంటి ప్రమాణాన్ని స్వీకరించని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)కన్నా ఉన్నతస్థానంలో నిలిపారని ఆయన వివరించారు. ఈ ఎన్టిటీకి పీఎంఓ కన్నా మిన్నయిన ఒక అనధికార హోదాను ఇచ్చారని ప్రధాని తెలిపారు.
భారతదేశ రాజ్యాంగంన్ని అనుసరించిన ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు, ప్రభుత్వ అధిపతి మంత్రిమండలిని ఏర్పాటు చేస్తారు అని శ్రీ మోదీ వివరించారు. మంత్రిమండలి నిర్ణయాన్ని తెలిపే పత్రాన్ని పత్రికారచయితల సమక్షంలో అహంకారి వ్యక్తులూ, రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తులూ చించేసిన సంఘటనను శ్రీ మోదీ జ్ఞాపకానికి తెచ్చుకొంటూ ఈ వ్యక్తులు రాజ్యాంగంతో ఒక అలవాటుగా ఆటాడుకొన్నారని, రాజ్యాంగాన్ని వారు గౌరవించ లేదన్నారు. అప్పటి మంత్రిమండలి ఆనాటి తన నిర్ణయాన్ని మార్చడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
రాజ్యాంగ 370వ అధికరణం సుపరిచితమేననీ, రాజ్యాంగ 35ఎ అధికరణాన్ని గురించి తెలిసిన వారు తక్కువమందేననీ ప్రధాని అన్నారు. రాజ్యాంగ 35ఎ అధికరణాన్ని పార్లమెంటు ఆమోదం పొందకుండానే అమల్లోకి తెచ్చారని, పార్లమెంటు ఆమోదాన్ని పొంది ఉండాల్సిందనీ ఆయన ఉద్ఘాటించారు. రాజ్యాంగానికి ప్రధాన సంరక్షకురాలైన పార్లమెంటును పక్కదారి పట్టించి రాజ్యాంగ 35ఎ అధికరణాన్ని దేశంపైన రుద్దారని, జమ్మా-కాశ్మీర్లో స్థితికి ఇది కారణమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు తెలియజేయకుండా ఈ పనిని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా పూర్తి చేశారని ఆయన ప్రధానంగా చెప్పారు.
శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ్ఞాపకార్థం ఒక స్మృతిచిహ్నాన్ని నిర్మించాలన్న నిర్ణయాన్ని తీసుకొన్నారని, అయితే ఈ పనిని తరువాతి పది సంవత్సరాల్లో ప్రారంభించడం గాని, లేదా అనుమతిని ఇవ్వడం గాని జరగలేదని శ్రీ మోదీ తెలిపారు. ప్రధానమంత్రి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ అంటే గౌరవంతో అలీపూర్ రోడ్డు వద్ద డాక్టర్ అంబేద్కర్ స్మృతిచిహ్నాన్ని తాము నిర్మించి, ఆ పనిని పూర్తి చేసినట్లు చెప్పారు.
శ్రీ చంద్రశేఖర్ పదవీకాలంలో, 1992లో ఢిల్లీలోని జన్‌పథ్‌లో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారని శ్రీ మోదీ గుర్తుచేసుకొన్నారు. ఈ ప్రాజెక్టు 40 సంవత్సరాల పాటు కాగితంమీదే మిగిలిపోయింది తప్ప అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. 2015లో తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఆ పనిని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు భారత్ రత్న ను ప్రదానం చేసే పనిని సైతం స్వాతంత్ర్యం వచ్చిన చాలా కాలం తరువాత పూర్తి చేశారన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో నిర్వహించారని, డాక్టర్ అంబేద్కర్ శత జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం మౌలో ఒక స్మృతిచిహ్నాన్ని పునర్నిర్మించారని శ్రీ మోదీ తెలిపారు.
సమాజంలో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోయిన వర్గాల వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని కంకణం కట్టుకొన్న దూరాలోచనపరుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని శ్రీ మోదీ ప్రశంసిస్తూ, భారత్ అభివృద్ధి చెందాలంటే, దేశంలో ఏ ప్రాంతం బలహీనంగా ఉండిపోకూడదని డాక్టర్ అంబేద్కర్ నమ్మారన్నారు. ఈ భావనే రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పాటుకు దారితీసిందని ఆయన చెప్పారు. వోటుబ్యాంకు రాజకీయాలలో నిమగ్నం అయి ఉండే వ్యక్తులు రిజర్వేషన్ వ్యవస్థ పరిధికి లోపల ధార్మికంగా తృప్తిపరిచే విధానం ముసుగులో వివిధ చర్యలను చేపట్టడానికి ప్రయత్నాలు చేశారని, దీంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సముదాయాలకు చాలా హానిని కలగజేశారని ప్రధాని అన్నారు.
రిజర్వేషన్లను మునుపటి ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయని ప్రధాని వ్యాఖ్యానించారు. భారతదేశంలో సమానత్వం కోసం, సంతులిత అభివృద్ధి కోసం రిజర్వేషన్లను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రవేశపెట్టారని ఆయన స్పష్టంచేశారు. మండల్ కమిషన్ నివేదికను దశాబ్దాల తరబడి అటకెక్కించారని, దీంతో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో జాప్యం జరిగిందని ప్రధాని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లను ముందే ఇచ్చి ఉంటే ఎంతో మంది ఓబీసీ వ్యక్తులు ప్రస్తుతం వివిధ పదవులలో దేశానికి సేవలను అందిస్తూ ఉండేవారని ప్రధాని తెలిపారు.
రిజర్వేషన్లను ధర్మం ఆధారంగా ఇవ్వాలా అనే అంశంపై రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కాలంలో విస్తృతంగా చర్చలు జరిగిన సంగతిని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, భారత్ వంటి దేశంలో ఏకత, అఖండతలను దృష్టిలో పెట్టుకొని ధర్మం లేదా సముదాయం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడం సాధ్యం కాదు అని రాజ్యాంగ శిల్పులు నిశ్చయించుకొన్నారన్నారు. ఇది ఉపేక్ష కాదని, బాగా ఆలోచించి తీసుకొన్న నిర్ణయమని ఆయన అన్నారు. ఇదివరకటి ప్రభుత్వాలు ధర్మం ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లను ప్రవేశపెట్టాయని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేక చర్య అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల అమలు అయినప్పటికీ కూడా, అలాంటి నిర్ణయాలను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆయన చెప్పారు. ధర్మం ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వాలన్న ఉద్దేశం లేదని ప్రధాని స్పష్టంచేస్తూ, అలాంటి చర్య రాజ్యాంగ రూపకర్తల ప్రవృత్తులను (సెంటిమెంట్లను) దెబ్బకొట్టే లజ్జావిహీన ప్రయత్నమన్నారు.
ప్రస్తుతం వార్తల్లోని అంశమైన ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) గురించి చర్చిస్తూ ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తు విస్మరించలేదని, దీనిపై విస్తృత చర్చలు జరిగాయని, అయితే ఎన్నికయ్యే ప్రభుత్వం దీనిని అమలు చేయడం ఉత్తమమని నిర్ణయించారని ప్రధానమంత్రి అన్నారు. ఇది రాజ్యాంగ పరిషత్తు నిర్దేశించిన అంశమని తెలిపారు. యూసీసీ గురించి డాక్టర్ అంబేద్కర్ మాట్లాడారని, ఆయన మాటలను వక్రీకరించకూడదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మతం ఆధారంగా రూపొందించిన పర్సనల్ చట్టాలను రద్దు చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గట్టిగా వాదించారని శ్రీ మోదీ గుర్తు చేశారు. జాతీయ ఐక్యతకు, ఆధునికతకు ఉమ్మడి పౌర స్మతి (యూసీసీ) అవసరమన్న కేఎం మున్షీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, యూసీసీ ఆవశ్యకతను పదే పదే చెబుతున్న సుప్రీంకోర్టు, దానిని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించిందని శ్రీమోదీ వెల్లడించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దానిని రూపొందించిన వారి ఉద్దేశాలకు అనుగుణంగా లౌకిక పౌర స్మృతిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గతంలో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావిస్తూ.. తమ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించనివారు.. దేశ రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తారని ప్రధాని ప్రశ్నించారు.
1996లో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్న శ్రీ మోదీ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి తమను ఆహ్వానించారని శ్రీ మోదీ గుర్తుచేశారు. అయితే ఆ ప్రభుత్వం 13 రోజులే కొనసాగిందని దానికి కారణం తాము రాజ్యాంగాన్ని గౌరవించడమే అని అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం శ్రీ అటల్ బిహారీ వాజపేయి బేరసారాలకు దిగలేదని, రాజ్యాంగాన్ని గౌరవించి 13 రోజుల తర్వాత రాజీనామా చేశారని వెల్లడించారు. 1998లో ఎన్డీయేకు అస్థిరత ఎదురైనప్పటికీ వాజపేయి సారథ్యంలోని ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉందని, రాజ్యాంగ విరుద్ధంగా పదవులను స్వీకరించడం కంటే ఒక్క ఓటుతో ఓడిపోవడానికి సిద్ధపడి రాజీనామా చేసిందని అన్నారు. ఇది తమ చరిత్ర అని, తాము విలువలను, సంప్రదాయాలను పాటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓటుకి నోటు కుంభకోణంలో సంఖ్యాబలం లేని ప్రభుత్వాన్ని కాపాడేందుకు డబ్బు ఉపయోగించారని, భారతీయ ప్రజాస్వామ్య స్ఫూర్తిని సంతగా మార్చి ఓట్లను కొనుక్కున్నారని ఆరోపించారు.
2014 తర్వాత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ, సేవ చేసే అవకాశం ఎన్డీయేకు దక్కిందని శ్రీమోదీ అన్నారు. పాత రుగ్మతల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించామని ఆయన తెలియజేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి గత పదేళ్లుగా దేశ ఐక్యతకు, సమగ్రతకు, ఉజ్వల భవిష్యత్తు కోసమే రాజ్యాంగ సవరణలు చేశామని ప్రధానమంత్రి చెప్పారు. మూడు దశాబ్దాలుగా ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పించాలని ఓబీసీ సామాజిక వర్గం కోరుతోందన్న పీఎం, ఈ హోదాను కల్పించేందుకు తాము రాజ్యాంగ సవరణ చేశామని, దీనికి గర్వపడుతున్నామని తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని, అందుకే రాజ్యాంగ సవరణ చేశామని తెలిపారు.
కులంతో సంబంధం లేకుండా, పేదరికం కారణంగా అవకాశాలకు దూరమై పురోగతి సాధించలేకపోతున్నవారు సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నారని ప్రధాని అన్నారు. ఈ విషయంలో అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ, డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారని విమర్శించారు. ఆర్థికంగా వెనకబడినవారికి సాధారణ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తాము రాజ్యాంగ సవరణ చేశామని వెల్లడించారు. ఎలాంటి వ్యతిరేకత లేకుండా, అందరి మన్ననలు అందుకొని, పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మొట్టమొదటి రిజర్వేషన్ సవరణ ఇదేనని అన్నారు. సామాజిక ఐక్యతను బలోపేతం చేసేలా ఉండటంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రూపొందించడమే దీనికి కారణమని అన్నారు.
మహిళలకు సాధికారతను కల్పించడం కోసం కూడా తాము రాజ్యాంగ సవరణలు చేశామని శ్రీ మోదీ తెలిపారు. దేశాన్ని ఐకమత్యంగా ఉంచడం కోసమే తాము రాజ్యాంగ సవరణలు చేశామని అన్నారు. 370వ అధికరణ కారణంగా జమ్ము కశ్మీర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో వర్తించేది కాదు. ఈ రాజ్యాంగాన్ని భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. జాతి ఐక్యతను బలోపేతం చేసేందుకు, డాక్టర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించామని అన్నారు. తాము 370వ అధికరణను తొలగించామని, సుప్రీంకోర్టు సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించిందని ప్రధానమంత్రి వెల్లడించారు.
370వ అధికరణను తొలగించేందుకు చేపట్టిన సవరణ గురించి ప్రస్తావిస్తూ, విభజన సమయంలో పొరుగుదేశాల్లో మైనార్టీలను కాపాడతామని మహాత్మాగాంధీతో సహా ఇతర జాతీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు తాము చట్టాలను రూపొందించామని శ్రీ మోదీ అన్నారు. ఈ వాగ్దానాలను గౌరవించేందుకే తాము పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) తీసుకొచ్చామని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి, దేశాన్ని బలోపేతం చేస్తుందని, కాబట్టి ఈ చట్టం తమకు గర్వకారణమని అన్నారు.
గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, ఉజ్వల భవిష్యత్తుకి మార్గం వేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేసిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. కాలపరీక్షకు అవి నిలబడతాయో లేదో సమయమే సమాధానం చెబుతుందని అన్నారు. స్వార్థపూరితమైన అధికార ప్రయోజనాల కోసం ఈ సవరణలు చేయలేదని, జాతి ప్రయోజనాల కోసమే చేశామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అందుకే ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటికి సమాధానం ఇవ్వగలుగుతున్నామని అన్నారు.
రాజ్యాంగానికి సంబంధించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చారని, ఎన్నో అంశాలను లేవనెత్తారని, అవన్నీ స్వార్థపూరితమైన రాజకీయ ప్రేరణలతో నిండి ఉన్నాయన్న ప్రధాని, రాజ్యాంగం భారతదేశంలోని ప్రజల పట్ల సున్నితంగా వ్యవహరిస్తుందని అన్నారు. ‘‘వియ్ ద పీపుల్’’ అన్నవాక్యం వారి సంక్షేమానికి, గౌరవానికి, శ్రేయస్సుకి ఉద్దేశించినది. సుభిక్షమైన దేశం సాధించే దిశగా, పౌరులందరికీ గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించే విధంగా రాజ్యాంగం మనకు మార్గదర్శిగా నిలుస్తుందని ప్రధాని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ చాలా గృహాల్లో మరుగుదొడ్డి లేదని, పేదలందరికీ వాటిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రచారం చేపట్టిందని, దాన్ని అంకితభావంతో స్వీకరించామని అన్నారు. ఈ విషయంలో ఎగతాళి చేసినప్పటికీ గౌరవప్రదమైన జీవితాన్ని సామాన్యులకు అందించడమే తమకు ముఖ్యం కాబట్టి దృఢంగా ఉన్నామని తెలియజేశారు. మహిళలు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత బహిరంగ ప్రదేశాల్లో విసర్జనకు వెళ్లేవారని, టీవీల్లోనూ, పత్రికల్లో మాత్రమే పేదలను చూసే వారికి ఇది ఏమాత్రం పట్టని అంశమని విమర్శించారు. పేదల జీవితాలను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి అన్యాయాలకు పాల్పడతారని అన్నారు. ప్రతి మనిషికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని రాజ్యాంగం చెప్పినప్పటికీ 80 శాతం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఎందుకు అందలేదని ప్రశ్నించారు.
ఈ దేశంలో లక్షలాది మంది తల్లులు సంప్రదాయ కట్టెల పొయ్యిపై వంట చేసేవారని, దాని నుంచి వచ్చే పొగకు కళ్లు ఎర్రగా మారిపోయేవని, ఈ పొగను పీల్చడం వందల సిగరెట్లు కాల్చడంతో సమానమని ప్రధానమంత్రి అన్నారు. దీనివల్ల వారి కంటిచూపు మందగించడంతో పాటు, ఆరోగ్యం క్షీణించేదని తెలిపారు. 2013 నాటి వరకు ఏడాదికి ఆరు సిలిండర్లు ఇవ్వాలా? తొమ్మిది సిలిండర్లు ఇవ్వాలా? అని చర్చలు జరిగేవని, తమ ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్ పంపిణీ జరిగేలా చేసిందని, ప్రతి ఒక్కరికీ కనీస ప్రాథమిక సౌకర్యాలు కల్పించడమే తమ ప్రాధాన్యమని శ్రీ మోదీ తెలియజేశారు.
ఆరోగ్య రంగం గురించి మాట్లాడుతూ.. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని, పేదరికం నుంచి బయటపడాలని పగలూరాత్రి కష్టపడే కుటుంబాన్ని, వారి ప్రణాళికలను, ప్రయత్నాలన్నింటినీ ఒక్క రోగం నాశనం చేయగలదని శ్రీ మోదీ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ 50-60 కోట్ల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తాము అమలు చేశామని వెల్లడించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులతో సహా సమాజంలో అన్ని వర్గాల వారికి ఈ పథకం ఆరోగ్య సేవలు అందిస్తుందని ప్రధాని అన్నారు.
పేదలకు అందించే ఉచిత రేషన్ గురించి మాట్లాడుతూ, 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని శ్రీ మోదీ అన్నారు. పేదరికం నుంచి వచ్చిన వారికే ఈ తోడ్పాటు అవసరం గురించి తెలుస్తుందని అన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగి త్వరగా కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోమని ఎలా సూచిస్తారో, అదే విధంగా మళ్లీ పేదరికంలో కూరుకుపోకుండా ఉండటానికి అందించే చేయూత కూడా అంతే అవసరమని అన్నారు. అందుకే పేదరికం నుంచి బయటకు వచ్చినవారు తిరిగి పేదలుగా మారకుండా ఉండటానికి, ఇంకా పేదరికంలో మగ్గుతున్న వారు దాని నుంచి బయటపడటానికి ఉచిత రేషన్ అందిస్తున్నామని వివరించారు. ఈ ప్రయత్నాన్ని హేళన చేయడం భావ్యం కాదని, పౌరుల గౌరవాన్ని, సంక్షేమాన్ని కాపాడటానికి ఇది చాలా కీలకమని అన్నారు.
పేదల పేరిట నినాదాలు ఇవ్వడానికే పరిమితయ్యారని, వారి పేరు చెప్పి బ్యాంకులను జాతీయం చేశారన్న శ్రీ మోదీ 2014 వరకు 50 కోట్ల మందికి పైగా భారతీయులు బ్యాంకులో అడుగే పెట్టలేదని విమర్శించారు. 50 కోట్ల మందికి ఖాతాలు తెరచి బ్యాంకు సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చామని అన్నారు. డిల్లీ నుంచి బయటకు వెళ్లే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే పేదలకు చేరుతోందని గతంలో మాజీ ప్రధాని ఒకరు వ్యాఖ్యానించారని ప్రధాని అన్నారు. ఇప్పుడు డిల్లీ నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో 100 పైసలు నేరుగా పేదల ఖాతాల్లోకే చేరే మార్గాన్ని తాము చూపించామని తెలిపారు. బ్యాంకులను సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో తాము చేసి చూపించామని అన్నారు. గతంలో బ్యాంకులోనికి ప్రవేశించే అనుమతి లేనివారు ఇప్పుడు గ్యారంటీ లేకుండా రుణాలు తీసుకునే అవకాశం కల్పించామని, పేదలకు సాధికారత కల్పించడమే రాజ్యాంగంపై తమ ప్రభుత్వానికున్న అంకితభావానికి నిదర్శనమని అన్నారు.
పేదలకు తమ కష్టాల నుంచి విముక్తి పొందకపోవడంతో ‘‘గరీబీ హఠావో’’ (పేదరికాన్ని తరిమేయడం) అనే నినాదం నినాదంగానే మిగిలిపోయిందని ప్రధానమంత్రి అన్నారు. పేదవారిని ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడమే తమ కర్తవ్యమని, దాన్ని సాధించేందుకు రేయింబవళ్లూ శ్రమిస్తున్నామని తెలిపారు. ఏ అండా లేని వారి పక్షాన తాను నిలబడతానని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ, ప్రత్యేక అవసరాలున్నవారికి తగినట్లుగా, వీల్ చెయిర్‌లోనే ట్రెయిన్ కంపార్ట్మెంట్ కు చేరుకొనేలా మౌలిక సదుపాయాలను కల్పించామని శ్రీ మోదీ తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల తమకున్న బాధ్యతే ఈ తరహా కార్యక్రమాలు రూపొందించడానికి కారణమని అన్నారు. సంకేత భాషపై చెలరేగిన వివాదాల కారణంగా వారికి తీవ్రమైన అన్యాయం జరిగిందని పీఎం అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సంకేత భాషలుండటం వల్ల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే అందరికీ ఒకే విధమైన సంకేత భాషను తాము రూపొందిచామని, దీనివల్ల వికలాంగులు లబ్ధిపొందుతున్నారని తెలియజేశారు.
సంచార, అర్థ సంచార జాతులకు చెందిన వారి సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకొనేవారు కాదని ప్రధాని అన్నారు. రాజ్యాంగం ప్రకారం వీరికి ప్రాధాన్యత ఉన్నందున వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసే వీధి వ్యాపారులు తోపుడు బళ్ళను అద్దెకు తీసుకోవడం నుంచి అధిక వడ్డీ రేట్లకు అప్పులు తీసుకొనే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ప్రధాని, వారికి పూచీకత్తు లేని రుణాలను అందించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు మూడో విడత రుణాలను తీసుకొని తమ వ్యాపారాన్ని విస్తరింపచేసుకొని గౌరవాన్ని పొందుతున్నారని ప్రధాని వివరించారు.
విశ్వకర్మ కళాకారుల సేవలు అవసరం లేని వారు ఈ దేశంలో ఎవరూ లేరని, శతాబ్ధాలుగా ఈ గొప్ప వ్యవస్థ ఉందని శ్రీ మోదీ అన్నారు. కానీ విశ్వకర్మ కళాకారుల సంక్షేమం గురించి ఏనాడూ, ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. బ్యాంకు లోన్లు, శిక్షణ, ఆధునిక పరికరాలు, వినూత్న డిజైన్లతో సహా వారికోసం తాము ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. విశ్వకర్మ సమాజాన్ని బలోపేతం చేసేందుకే ఈ కార్యక్రమం ప్రారంభిచామని ఆయన వెల్లడించారు.
భారత రాజ్యాంగం ప్రకారం ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించేందుకు చట్టాలను రూపొందించామని శ్రీ మోదీ తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను పని చేసిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ రాష్ట్రంలో ఉమర్గాం నుంచి అంబాజీ వరకు విస్తరించిన ఉన్న గిరిజన ప్రాంతాల్లో సైన్స్ బోధించే పాఠశాల ఒక్కటి కూడా లేదని గుర్తించామని అన్నారు. సైన్స్ బోధించే పాఠశాలలు లేనప్పుడు గిరిజన విద్యార్థులు ఇంజనీర్లు లేదా డాక్టర్లుగా మారడం సాధ్యం కాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యావసరాను తీర్చేందుకు సైన్స్ బోధించే పాఠశాలలను, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
బాగా వెనకబడిన గిరిజన తెగలను అభివృద్ధి చేసేందుకుగాను పీఎం జన్మన్ యోజన పథకాన్ని రూపొందించేందుకు మార్గనిర్దేశం చేసిన రాష్ట్రపతికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఇలాంటి చిన్న చిన్న సమూహాలను పట్టించుకునేవారు కాదని, కానీ ఇప్పుడు వారికి ఈ పథకం ద్వారా అవసరమైన సాయం అందజేస్తున్నామని అన్నారు. అత్యంత అణగారిన వర్గాల వారికి సైతం తోడ్పాటు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
గడచిన 60 ఏళ్లలో దేశవ్యాప్తంగా 100 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారని, ఈ పేరున్న జిల్లాలకు విధులు నిర్వర్తించేందుకకు అధికారులకు పోస్టింగ్ ఇస్తే శిక్షగా భావించేవారని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. ఆన్లైన్లో క్రమం తప్పకుండా 40 అంశాలను పరిశీలిస్తూ, ఆకాంక్షాత్మక జిల్లాలు అనే విధానం తీసుకువచ్చామని, తద్వారా ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలియజేశారు. ఇప్పుడు ఆకాంక్షాత్మక జిల్లాలు తమ రాష్ట్రంలో ఉన్న అత్యుత్తమ జిల్లాలకు పోటీగా మారాయని, కొన్ని జిల్లాలు జాతీయ సగటును సైతం చేరుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఏ ప్రాంతమూ వెనకబడకూడదనే ఉద్దేశంతో 500 బ్లాకులను ఆకాంక్షాత్మక బ్లాకులుగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని వివరించారు.
రాముడు, కృష్ణుడి కాలం నుంచే గిరిజన తెగలు ఉన్నాయని కానీ స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు వారికోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేదంటూ, గిరిజన వ్యవహారాల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, వారి అభివృద్ధి, విస్తరణ కోసం బడ్జెట్ కేటాయించింది అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వమని వివరించారు. మత్స్యకార సంక్షేమ గురించి మాట్లాడుతూ మొదటిసారిగా మత్స్య శాఖను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయించిందని వెల్లడించారు. సమాజంలో ఈ వర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించామని చెప్పారు.
దేశంలోని సన్నకారు రైతుల గురించి వివరిస్తూ, సహకారం వారి జీవితంలో ముఖ్యమైన భాగమని ప్రధానమంత్రి అన్నారు. సన్నకారు రైతుల సమస్యలను ఎత్తి చూపుతూ, సహకార సంఘాలను బాధ్యతాయుతంగా, పటిష్టంగా మార్చి సాధికారత కల్పించేందుకు ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారి జీవితాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ప్రాధాన్యం గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం శ్రామిక శక్తి కోసం ఎదురుచూస్తోందని అన్నారు. ఈ అంశంలో జనాభా పరంగా లాభం పొందాలనుకుంటే మన శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ప్రపంచావసరాలకు అనుగుణంగా, అవకాశాలను అందిపుచ్చుకొనే విధంగా యువతను సిద్ధం చేయడానికి నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను రూపొందించామని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో తక్కువ మంది ఓట్లు, సీట్లు ఉండటం వల్ల నిర్లక్ష్యం చేశారని ప్రధాని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది అటల్ జీ ప్రభుత్వమేనని అన్నారు. దీని కారణంగానే రైల్వేలు, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాల నిర్మాణంతో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
భూమి రికార్డుల ప్రాధాన్యతను, వాటి విషయంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ నేటికీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసిందన్నారు. ఇంటి యాజమాన్య పత్రాలతో బ్యాంకులో రుణాలు తీసుకోవచ్చని, ఎవరైనా ఆక్రమిస్తారనే భయం కూడా ఉండదని అన్నారు.
గత పదేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నాలన్నింటి వల్ల పేదల్లో నూతన ఆత్మవిశ్వాసం నిండిందని, అతి తక్కువ సమయంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని ఓడించారని శ్రీ మోదీ అన్నారు. రాజ్యాంగం సూచించిన విధానంలో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం మాత్రమే కాదని, ఇది తమ నమ్మకమని, అందుకే ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేయగలుగుతున్నామని ప్రధాని వివరించారు. లబ్ధిదారులందరికీ నూటికి నూరు శాతం పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నిజమైన లౌకికవాదం, నిజమైన సామాజిక న్యాయం అంటూ ఉంటే, ఎలాంటి వివక్ష లేకుండా నూరు శాతం లబ్ధి అర్హులైన వారికి మాత్రమే చేకూరుతుంది. ఇదే అసలైన లౌకికత్వం, సామాజిక న్యాయమని అన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని దేశానికి దిశానిర్దేశం చేసే మాధ్యమంగా వర్ణిస్తూ, దేశాన్ని నడిపించే రాజకీయాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయని తెలిపారు. రాబోయే దశాబ్దాల్లో మన ప్రజాస్వామ్యం, రాజకీయాలు ఎలా ఉండాలో ఆలోచించాలని సూచించారు.
కొన్ని రాజకీయ పార్టీల అధికార కాంక్ష, రాజకీయ స్వార్థం గురించి మాట్లాడుతూ ఈ విషమయై ఎప్పుడైనా తమలో తాము ఆలోచించుకున్నారా అని శ్రీ మోదీ ప్రశ్నించారు. ఇది అన్ని పార్టీలను ఉద్దేశించి అడుగుతున్నానని తన మనసులోని ఆలోచనలనే సభ ముందు ఉంచుతున్నానని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, యువతరాన్ని ముందుకు నడిపించేందుకు, దేశంలోని యువతను ఆకర్షించేలా రాజకీయ పార్టీలు ప్రయత్నించాలని ప్రధాని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడం దేశ ప్రజాస్వామ్యానికి అవసరమని, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మందిని దేశ రాజకీయాల్లోకి తీసుకురావాలని సూచించారు. నూతన శక్తి, కొత్త ఆశలు, సంకల్పాలతో ఉండే యువత దేశానికి అవసరమని, భారత రాజ్యాంగం 75 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఎర్రకోటపై నుంచి రాజ్యాంగం కల్పించిన విధుల గురించి తాను చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, రాజ్యాంగం పౌరులకు హక్కులు కల్పించినట్టుగానే వారికి విధులను కూడా నిర్దేశించినట్టు గమనించకపోవడం శోచనీయమన్నారు. మన నాగరికత సారాంశం ధర్మం, కర్తవ్యమని చెబుతూ.. మన విధులను నిర్వర్తిస్తేనే హక్కులు లభిస్తాయని చదువురాని తన తల్లి నుంచి తాను నేర్చుకున్నానన్న గాంధీజీ పలుకులను ఉటంకించారు. మహత్మాగాంధీ చెప్పిన ఈ మాటలను తాను ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నట్టు చెప్పిన ప్రధాని, మన ప్రాథమిక విధులను మనం నిర్వర్తిస్తే, అభివృద్ధి చెందిన భారతాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. రాజ్యాంగ 75 ఏళ్ల ఉత్సవాలు ఈ అంశంలో మన అంకిత భావాన్ని బలోపేతం చేస్తాయని, ఈ సమయంలో కర్తవ్య దీక్షతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
భారత రాజ్యాంగ స్ఫూర్తితో 11 తీర్మానాలను సభ ముందు ఉంచాలని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. మొదటి తీర్మానం- ప్రభుత్వమైనా, పౌరుడైనా, అందరూ తమ విధులను నిర్వర్తించాలి, సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ భావనతో ప్రతి రంగమూ, ప్రతి వర్గమూ అభివృద్ధి ఫలాలను పొందేలా చేయడమే రెండో తీర్మానం. అవినీతిని ఏమాత్రం సహించకూడదని, అవినీతిపరులకు సమాజంలో స్థానం లేకుండా చేయడమే మూడో తీర్మానం. ఇక నాలుగో తీర్మానం విషయానికి వస్తే దేశ చట్టాలు, నిబంధనలు, సంప్రదాయాలను గర్వంగా అనుసరించాలి. బానిస మనస్తత్వాన్ని వదిలించుకొని, దేశ వారసత్వం పట్ల గర్వంగా ఉండటమే ఐదో తీర్మానం. వారసత్వం, బంధుప్రీతి నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కల్పించడమే ఆరో తీర్మానం. ఏడో తీర్మానం- రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దానిని రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించకూడదు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, అర్హులైనవారికి రిజర్వేషన్లను దూరం చేయకుండా, మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను అడ్డుకోవడమే తొమ్మిదే తీర్మానం. పదవ తీర్మానం – రాష్ట్రాల ద్వారా దేశాభివృద్ధి ఇదే మన అభివృద్ధి మంత్రం కావాలి. ఏక్ భారత్ శ్రేష్ట భారత్ లక్ష్యమే ప్రధానం కావాలి. ఇదే పదకొండో తీర్మానం.
ఈ తీర్మానాలతో అందరూ కలసి ముందుకు సాగుతూ, సమష్టి కృషితో అభివృద్ధి చెందిన భారత్ కలను మనం సాకారం చేయగలమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాలతో దేశం ఎప్పుడు అవలంభించడం ప్రారంభిస్తుందో, 140 కోట్ల మంది దేశ ప్రజలు కలలు నెరవేరతాయో.. అప్పుడు ఆశించిన ఫలితాలు లభిస్తాయని ఆయన అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలపై గౌరవం, వారి సామర్థ్యంపై నమ్మకం, యువశక్తి, మహిళాశక్తిపై అపార విశ్వాసం తనకు ఉన్నాయని శ్రీమోదీ తెలియజేశారు. 2047లో 100ఏళ్ల స్వతంత్రం పూర్తయ్యేనాటికి దానిని వికసిత భారత్‌గా జరుపుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగాలని కోరుతూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
Speaking in the Lok Sabha.https://t.co/iSrP6pOV2p
— Narendra Modi (@narendramodi) December 14, 2024
India is the Mother of Democracy. pic.twitter.com/LwGrMBw8d8
— PMO India (@PMOIndia) December 14, 2024
हमारा संविधान भारत की एकता का आधार है। pic.twitter.com/BexBouiw9m
— PMO India (@PMOIndia) December 14, 2024
2014 में जब एनडीए को सरकार बनाने का मौका मिला तो लोकतंत्र और संविधान को मजबूती मिली। pic.twitter.com/g6N0PvOgq0
— PMO India (@PMOIndia) December 14, 2024
गरीबों को मुश्किलों से मुक्ति मिले, यह हमारा बहुत बड़ा मिशन और संकल्प है। pic.twitter.com/bTIuENWnVB
— PMO India (@PMOIndia) December 14, 2024
अगर हम अपने मौलिक कर्तव्यों का पालन करें, तो कोई भी हमें विकसित भारत बनाने से नहीं रोक सकता। pic.twitter.com/j1hl7QfwJk
— PMO India (@PMOIndia) December 14, 2024
आज हमारी माताओं-बहनों और बेटियों का योगदान हर क्षेत्र में देश को गौरव दिला रहा है, तो इसके पीछे हमारे संविधान की बड़ी प्रेरणा है। pic.twitter.com/seWpemuZ7n
— Narendra Modi (@narendramodi) December 14, 2024
हमारा संविधान हमारी एकता का आधार है, जो विकसित भारत के संकल्प की सिद्धि के लिए देश की सबसे बड़ी आवश्यकता है। pic.twitter.com/lz4Cp7FTAC
— Narendra Modi (@narendramodi) December 14, 2024
जब संविधान के 25 वर्ष पूरे हुए थे, तब आपातकाल लाकर कांग्रेस ने संविधान और लोकतंत्र का गला घोंट दिया था। उसके माथे पर लगा ये पाप कभी धुलने वाला नहीं है। pic.twitter.com/PCvKXN4NX0
— Narendra Modi (@narendramodi) December 14, 2024
कांग्रेस की हर पीढ़ी ने संविधान का अपमान किया है, जिसके एक नहीं अनेक उदाहरण हैं… pic.twitter.com/2DBtsPJxzA
— Narendra Modi (@narendramodi) December 14, 2024
कांग्रेस ने सत्ता-सुख और अपने वोट बैंक को खुश करने के लिए धर्म के आधार पर आरक्षण का जो नया खेल खेला है, वो संविधान के खिलाफ एक बड़ी साजिश है। pic.twitter.com/eYB00an4sV
— Narendra Modi (@narendramodi) December 14, 2024
संविधान निर्माताओं की भावनाओं को ध्यान में रखते हुए हम पूरी ताकत के साथ सेक्युलर सिविल कोड के लिए निरंतर प्रयास कर रहे हैं। pic.twitter.com/v5MiooA4O8
— Narendra Modi (@narendramodi) December 14, 2024
***
MJPS/SR
Speaking in the Lok Sabha.https://t.co/iSrP6pOV2p
— Narendra Modi (@narendramodi) December 14, 2024
India is the Mother of Democracy. pic.twitter.com/LwGrMBw8d8
— PMO India (@PMOIndia) December 14, 2024
हमारा संविधान भारत की एकता का आधार है। pic.twitter.com/BexBouiw9m
— PMO India (@PMOIndia) December 14, 2024
2014 में जब एनडीए को सरकार बनाने का मौका मिला तो लोकतंत्र और संविधान को मजबूती मिली। pic.twitter.com/g6N0PvOgq0
— PMO India (@PMOIndia) December 14, 2024
गरीबों को मुश्किलों से मुक्ति मिले, यह हमारा बहुत बड़ा मिशन और संकल्प है। pic.twitter.com/bTIuENWnVB
— PMO India (@PMOIndia) December 14, 2024
अगर हम अपने मौलिक कर्तव्यों का पालन करें, तो कोई भी हमें विकसित भारत बनाने से नहीं रोक सकता। pic.twitter.com/j1hl7QfwJk
— PMO India (@PMOIndia) December 14, 2024
आज हमारी माताओं-बहनों और बेटियों का योगदान हर क्षेत्र में देश को गौरव दिला रहा है, तो इसके पीछे हमारे संविधान की बड़ी प्रेरणा है। pic.twitter.com/seWpemuZ7n
— Narendra Modi (@narendramodi) December 14, 2024
हमारा संविधान हमारी एकता का आधार है, जो विकसित भारत के संकल्प की सिद्धि के लिए देश की सबसे बड़ी आवश्यकता है। pic.twitter.com/lz4Cp7FTAC
— Narendra Modi (@narendramodi) December 14, 2024
जब संविधान के 25 वर्ष पूरे हुए थे, तब आपातकाल लाकर कांग्रेस ने संविधान और लोकतंत्र का गला घोंट दिया था। उसके माथे पर लगा ये पाप कभी धुलने वाला नहीं है। pic.twitter.com/PCvKXN4NX0
— Narendra Modi (@narendramodi) December 14, 2024
कांग्रेस की हर पीढ़ी ने संविधान का अपमान किया है, जिसके एक नहीं अनेक उदाहरण हैं… pic.twitter.com/2DBtsPJxzA
— Narendra Modi (@narendramodi) December 14, 2024
कांग्रेस ने सत्ता-सुख और अपने वोट बैंक को खुश करने के लिए धर्म के आधार पर आरक्षण का जो नया खेल खेला है, वो संविधान के खिलाफ एक बड़ी साजिश है। pic.twitter.com/eYB00an4sV
— Narendra Modi (@narendramodi) December 14, 2024
संविधान निर्माताओं की भावनाओं को ध्यान में रखते हुए हम पूरी ताकत के साथ सेक्युलर सिविल कोड के लिए निरंतर प्रयास कर रहे हैं। pic.twitter.com/v5MiooA4O8
— Narendra Modi (@narendramodi) December 14, 2024
2014 में एनडीए की सरकार बनने के बाद हमारे लोकतंत्र और संविधान को नई मजबूती मिली है। pic.twitter.com/GsxRMUrcwZ
— Narendra Modi (@narendramodi) December 15, 2024
‘गरीबी हटाओ’ हिंदुस्तान का सबसे बड़ा जुमला रहा है, जिसे कांग्रेस की चार-चार पीढ़ियों ने चलाया है। pic.twitter.com/KE5kdtzT13
— Narendra Modi (@narendramodi) December 15, 2024
संविधान की भावना से प्रेरित हमारे ये 11 संकल्प… pic.twitter.com/esuhYJACXD
— Narendra Modi (@narendramodi) December 15, 2024