Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజమాత వసుంధర రాజే సింధియా శతజయంత్యుత్సవాల సందర్భంగా రూ.100 ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం

రాజమాత వసుంధర రాజే సింధియా శతజయంత్యుత్సవాల సందర్భంగా రూ.100 ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం


నమస్కారం,

కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దేశవిదేశాల్లోని రాజమాత విజయరాజే సింధియా అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు, నా ప్రియ సోదర, సోదరీమణులారా,
ఈ కార్యక్రమానికి వస్తున్న సమయంలో విజయరాజే జీ జీవిత చరిత్రను ఓసారి తిరగేస్తున్న సమయంలో.. కొన్ని ఆసక్తికర పేజీలు కనిపించాయి. అందులో వారు గుజరాత్ యువతనేత నరేంద్ర మోదీ పేరుతో నా పేరును ప్రస్తావించారు.

ఇన్నేళ్ల తర్వాత అదే వారి అదే నరేంద్రమోదీ.. దేశపు ప్రధాన సేవకుడిగా వారి స్మృతిని తలుచుకుంటున్నాడు. డాక్టర్ మురళీ మనోహర్ జోషి గారి నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఓ యాత్ర జరుగుతున్న సందర్భంలో నేనే ఆ యాత్ర వ్యవస్థను చూశానన్న సంగతి మీకు తెలిసిందే.

ఈ కార్యక్రమం కోసం రాజమాత కన్యాకుమారి వచ్చారు. మేం శ్రీనగర్ వెళ్తున్నప్పుడు జమ్మూలో మాకు వీడ్కోలు పలికేందుకు కూడా వారు వచ్చారు. ప్రతి నిమిషం మాలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పుడు మా కల ఒక్కటే.. లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగరేయాలి. ఆర్టికల్ 370ని రద్దుచేయాలి. రాజమాత గారు మాకు ఈ యాత్రలో వీడ్కోలు పలికారు. అప్పటి ఆ కల ఇప్పుడు సాకారమైంది.

వారి పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒకచోట వారు రాసిన ‘ఒకరోజు శరరీరాన్ని ఇక్కడే వదిలి పెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఆత్మ ఎక్కడినుంచి వచ్చిందో అక్కడకే వెళ్లిపోతుంది. శూన్యం నుంచి శూన్యం వరకు. నా భాగస్వామ్యం ఉన్న, నన్ను భాగస్వామిగా చేసుకున్న కార్యక్రమాల్లోని స్మృతులను ఇక్కడే వదిలి వెళ్తాను’ అని చదివాను. ఇవాళ రాజమాత ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటారు. వారి శుభాశీస్సులను మనకు అందిస్తూనే ఉంటారు. వారు భాగస్వామిగా ఉన్న కార్యక్రమాల్లో ఇక్కడున్న వారిలో కొంతమంది భాగస్వాములుగా ఉండటం ముదావహం. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇవాళ రాజమాత శతజయంత్యుత్సవాలు జరుపుకుంటుండటం సంతోషకరం.

మనలో చాలా మందికి రాజమాతతో చాలా దగ్గరగా కలిసి పనిచేసేందుకు, వారి సేవాకార్యక్రమాలను చూడటంతోపాటు వారి వాత్సల్యాన్ని పొందే సౌభాగ్యం లభించింది. చాలా మంది రాజమాత సన్నిహితులు ఈ సమావేశంలో ఉన్నారు. కానీ రాజమాతకు మాత్రం దేశప్రజలంతా వారి కుటుంబసభ్యులు. ‘నేను ఒక కొడుకుకు కాదు.. వేలమంది పుత్రులకు తల్లిని. వారి ప్రేమాభిమానాల్లో మునిగిపోయాను’ అని చాలా సందర్భాల్లో రాజమాత చెప్పేవారు. అలాంటి గొప్పవ్యక్తిత్వ శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా లేకపోయి ఉన్నట్లయితే.. ఈ కార్యక్రమం ఎంత ఘనంగా ఎందరి మధ్యన జరిగుండేది. కానీ.. నాకు రాజమాత గారితో ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకుంటే.. ఈ కార్యక్రమం భవ్యంగా జరిగినా జరగకపోయినా.. దివ్యంగా మాత్రం ఉండేదని నేను విశ్వసిస్తాను.

మిత్రులారా, గత శతాబ్దంలో భారతదేశ దిశను మార్చిన కొందరు వ్యక్తుల్లో రాజమాత విజయరాజే సింధియా ఒకరు. రాజమాత కేవలం వాత్సల్యమూర్తి మాత్రమే కాదు. వారు గొప్ప నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం, సుపరిపాలనను ప్రజలకు అందించిన పాలకురాలు. స్వాతంత్ర్య సంగ్రామం నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈ 70 ఏళ్ల వరకు భారతీయ రాజకీయ వేదికపై ప్రతి అడుగునకు వారు సాక్షిగా ఉన్నారు. విదేశీ వస్తువుల బహిష్కారం నుంచి రామమందిర నిర్మాణ ఉద్యమం వరకు రాజమాత గారి విస్తృతానుభవం అందరికీ తెలిసిందే.

రాజమాతతో కలిసి పనిచేసిన వారు, సన్నిహితులకు వారి గురించి చాలా బాగా తెలుసు. వారికి సంబంధించిన అంశాలు కూడా వారి బాగా తెలుసు. రాజమాత జీవితయాత్రను, వారి జీవన సందేశాన్ని నేటికీ దేశం చదువుకుంటోంది. వాటినుంచి ప్రేరణ పొందుతోంది. చాలా విషయాలు నేర్చుకుంటోంది. వారి అనుభవాలను పదేపదే గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది. ఇటీవలి మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ వారి ప్రేమ, ఆప్యాయతల గురించి విస్తారంగా వెల్లడించాను.

వివాహానికి ముందు రాజమాతకు ఏ రాజ కుటుంబంతోనూ సంబంధం లేదు. వారు ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. కానీ వివాహం తర్వాత రాజ కుటుంబంలోకి రాగానే అందరి అభిమానాన్నీ చూరగొన్నారు. అంతేకాదు. ప్రజాసేవ, రాజకీయ బాధ్యతలను నిర్వర్తించేందుకు రాజకుటుంబంలోనే పుట్టాల్సిన అవసరం లేదని కూడా వారు నేర్పించారు. యోగ్యత, ప్రతిభ, దేశం పట్ల ఓ మంచి భావన ఉన్నటువంటి సాధారణ వ్యక్తులెవరైనా ఈ ప్రజాస్వామ్య దేశంలో సేవ చేసేందుకు ముందుకు రావొచ్చని నిరూపించారు. అధికారం ఉండి, అపారమైన సంపదలుండి, సామర్థ్యం ఉండి, వీటన్నింటికీ మించి రాజమాత అనే హోదా ఉన్నప్పటికీ.. తానుమాత్రం.. సంస్కారాన్ని, సేవను, స్నేహగుణాన్ని తన గుర్తింపుగా మార్చుకున్నారు.