Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన


శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్,

రష్యా, మరియు భారతదేశానికి చెందిన ప్రతినిధివర్గాలలోని ఉన్నతాధికార సభ్యులు,

ప్రసార మాధ్యమాల సభ్యులారా,

భారతదేశపు పాత మిత్రుడు, రష్యా అధ్యక్షుడైన శ్రీ పుతిన్‌ను ఈ రోజు ఇక్కడ గోవాకు ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రష్యన్ భాషలో చెప్పినట్లు

स्तारीय द्रुग लुछे नोविख़ द्वुख

[ఈ మాటలకు అర్థం : ఒక పాత స్నేహితుడు ఇద్దరు కొత్త మిత్రుల కన్నా మేలు అని.]

శ్రేష్ఠుడైన శ్రీ పుతిన్, భారతదేశం పట్ల మీ ప్రగాఢ అభిమానం గురించి నాకు ఎరుకే. మన సంబంధాలు మరింత బలోపేతం కావడంలో మీ వ్యక్తిగత శ్రద్ధ పోషించిన పాత్ర చాలా ప్రత్యేకం. మారుతున్న, సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులలో మీ నాయకత్వం మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి స్థిరత్వాన్ని, గాఢతను సంతరించింది. మనది నిజంగా విశిష్టమైన, ప్రత్యేక అధికారాలున్న సంబంధం.

మిత్రులారా,

గత రెండు వార్షిక సదస్సుల నుండి మన భాగస్వామ్యం కొత్త శక్తితో ప్రయాణం కొనసాగిస్తోంది. అధ్యక్షుడు శ్రీ పుతిన్, నేను మా సంబంధాలకు సంబంధించిన విశాలమైన, ఉపయోగకరమైన చర్చను ఇప్పుడే ముగించాము. ఈ సమావేశం ద్వారా వచ్చిన అత్యున్నమైన ఫలితం.. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం విశేషం, ప్రత్యేకమైన స్వభావాన్ని స్పష్టం చేస్తోంది. రానున్న రోజుల్లో మరింత లోతైన రక్షణకు, ఆర్థిక బంధాల ఏర్పాటుకు ఈ సమావేశం పునాది వేసింది. భారత సాంకేతిక, భద్రత రంగాలకు ఉత్తేజం కలిగించేలా.. మన ప్రాథమ్యాలకు అనుగుణంగా కామోవ్ 226టి హెలికాప్టర్ల తయారీ, యుద్ధ నౌకల నిర్మాణం, భిన్నమైన రక్షణ వేదికల నిర్మాణం, సమకూర్చుకొనే దిశగా ఒప్పందాలు జరిగాయి. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడంలోనూ మనకు వీరు సహకరిస్తారు. వార్షిక మిలటరీ పారిశ్రామిక సమావేశాలు నిర్వహించడం ద్వారా ఇరు పక్షాల మధ్య భాగస్వామ్య స్థాపన జరిగి ముందుకు నడిపించేందుకు వీలు ఉంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉభయ దేశాల మధ్య న్న బలమైన, భిన్నమైన రక్షణ భాగస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇది ఇరు దేశాలకు గర్వకారణం. కొద్ది నిమిషాల ముందే.. కుడన్ కులమ్- 2ను అంకితం చేయడం, కుడన్ కులమ్-3, 4 యూనిట్ లకు శంకుస్థాపన చేయడం ద్వారా.. భారతదేశం, రష్యా ల మధ్య పౌర అణు శక్తి రంగంలో సహకార ఫలితం స్పష్టమైంది. దీంతో పాటు ప్రతిపాదిత 8 రియాక్టర్ల నిర్మాణం ద్వారా.. ఇరు దేశాల మధ్య అణు శక్తి సహకారం వ్యాప్తి చెందడంతో పాటు.. ఇరు దేశాలకు మంచి లాభాలనందిస్తాయి. అణు శక్తి భద్రతలో మన అవసరాలు, ఉన్నతమైన సాంకేతికత, పెద్దమొత్తంలో స్థానికీకరణ, భారత్‌లో తయారీకి అనుగుణంగా వీటి నిర్మాణం జరుగుతుంది. రష్యా హైడ్రో కార్బన్ రంగంలో మా పాత్ర పెరుగుతుందని గత సంవత్సరం మాస్కోలో నేను చెప్పాను. దీనికి అనుగుణంగానే.. గడచిన నాలుగు నెలల్లోనే భారతీయ కంపెనీలు.. రష్యా చమురు, గ్యాస్ రంగంలో దాదాపు 5.5 బిలియన్ యు ఎస్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇది మా బలమైన, లోతైన సంబంధాలకు స్పష్టమైన నిదర్శనం. అధ్యక్షుడు పుతిన మద్దతుతో భవిష్యత్తులో ఈ రంగంలో మా పరిధిని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరుదేశాల మధ్య గ్యాస్ పైప్‌లైన్ వైయాలనే ఆలోచన కూడా ఉమ్మడి అధ్యమనంలో ఉంది. బలమైన పౌర అణు సహకారం, ఎల్ఎన్‌జీ సోర్సింగ్, చమురు-గ్యాస్ రంగం, పునరుత్పాదక రంగంలో భాగస్వామ్యం ద్వారా.. ఇరు దేశాల మధ్య ఆశాజనకమైన శక్తి వారథి నిర్మాణం జరుగుతుంది.

మిత్రులారా,

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. శాస్త్ర, సాంకేతిక కమిషన్‌ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. దీనివల్ల ఇరు దేశాల సమాజానికి సంయుక్త అభివృద్ధి, వివిధ రంగాలలో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం మార్పిడి చేసుకొనేందుకు వీలుంటుంది. గత సదస్సు నుంచి.. ఆర్థిక సంబంధాలను మరింత లోతుగా విస్తృతంగా చేసుకునే ప్రయత్నాలలో ఉన్నాము. ఇరు దేశాల మధ్య వ్యాపారం, పరిశ్రమల రంగంలో చాలా బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. వాణిజ్యం, పెట్టుబడులు జోరు మీదున్నాయి. అధ్యక్షుడు శ్రీ పుతిన్ దీనికి సంపూర్ణ మద్దతు తెలిపారు. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంలో భారత భాగస్వామ్యం వేగవంతం అవుతుందని భావిస్తున్నాము. గ్రీన్ కారిడర్, అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడర్ ల ద్వారా వ్యాపార సౌలభ్యం, రవాణా లంకెలు బలోపేతమై.. ఇరు దేశాల మధ్య అనుసంధానం మరింత పెరుగుతుంది. జాతీయ పెట్టుబడులు, మౌలిక వసతుల నిధి (ఎన్ఐఐఎఫ్), రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి (ఆర్ డిఐఎఫ్)తో కలిపి బిలియన్ డాలర్లతో పెట్టుబడి నిధిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయడం ద్వారా మౌలిక వసతుల భాగస్వామ్యం ముందడుగు పడేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆర్థిక లింకేజీలను ఇరు దేశాల్లోని ప్రాంతాలు, రాష్ట్రాలకు కూడా అనుసంధానం చేస్తాము.

మిత్రులారా,

ఈ సదస్సు విజయవంతం కావడం బలమైన భారత- రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనం. దీంతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ వివాదాల్లో మన అభిప్రాయాలను ఉద్దేశాలను స్పష్టంగా చెప్పేందుకు వీలవుతుంది. ఉగ్రవాదంపై పోరాడడంపై రష్యాకున్న అభిప్రాయం మన అభిప్రాయంతో సరిపోతుంది. ఈ ప్రాంత భద్రతను ప్రశ్నిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై మనం చేస్తున్న పోరాటాన్ని రష్యా అర్థం చేసుకుని, మద్దతు ప్రకటించటాన్ని స్వాగతిస్తున్నాం. ఉగ్రవాదం, దీని మద్దతుదారులపై కఠినంగా వ్యవహరించాలని మేము నిర్ణయించాము. అఫ్ఘనిస్తాన్‌తో పాటు, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై అధ్యక్షుడు శ్రీ పుతిన్, నేను అభిప్రాయాలను పంచుకున్నాము. ప్రపంచ ఆర్థిక మార్కెట్ స్వరూపంలో వస్తున్న మార్పులు, ఇది విసురుతున్న సవాళ్లపై స్పదించేందుకు కలసి పనిచేసేందుకు అంగీకరించాం. ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, తూర్పు ఆసియా సదస్సు, జి20, షాంఘయ్ సహకార సంస్థ లలో మన సన్నిహిత సహకారం.. మన భాగస్వామ్యాన్ని అంతర్జాతీయంగా.. మరింత విస్తృతం చేసింది.

శ్రేష్ఠుడైన శ్రీ పుతిన్,

వచ్చే ఏడాది మన దేశాల దౌత్యపరమైన సంబంధాలు 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నందున.. భారత-రష్యా దేశాలు గత విజయాలను గుర్తుచేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాయి. 21వ శతాబ్దంలో ఇరు దేశాల ఉద్దేశాలు, సంయుక్త లక్ష్యాలకు సరిపోయేలా ఓ ఆదర్శవంతమైన భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు మనం ప్రయత్నిస్తున్నాము. మన బలమైన స్నేహం.. మన బంధాలకు స్పష్టమైన దిశానిర్దేశాన్ని, కొత్త ప్రేరణను, బలమైన వేగాన్ని అందించింది. ఎదురవుతున్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇది మన ఇరు దేశాలకు బలాన్ని, సత్తాను అందించడమే కాకుండా.. శాంతి, స్థిరత్వం సాధించేందుకు మార్గదర్శనం చేస్తుంది.

రష్యన్ భాషలో చెప్పినట్లు:

इंडियाई रस्सीया-रुका अब रुकु व स्वेतलोय बदूशीय

[దీని అర్థం: భారతదేశం, రష్యా లు కలిస్తే ప్రకాశవంతమైన భవిష్యత్తున్నట్లే.]

ధన్యవాదములు. మరీ మరీ కృత‌జ్ఞ‌త‌లు.