Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రక్షణ సామగ్రి ఉత్పత్తి లో ఆత్మనిర్భర్ భారత్ అనే అంశం పై జరిగిన సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


మంత్రివర్గంలో నా సహచరుడైనటువంటి శ్రీ రాజ్ నాథ్ గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు, సైన్యం లోని త్రి విధ దళాల అధిపతులు, భారత ప్రభుత్వం లో సీనియర్ అధికారులు మరియు పరిశ్రమ రంగాని కి చెందిన మిత్రులు… అందరికీ వందనము లు.

భారత రక్షణ ఉత్పత్తుల రంగం తో సంబంధం గల ముఖ్య భాగస్వాములంతా ఈ రోజు న ఇక్కడ కు విచ్చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఈ సదస్సు ను ఏర్పాటు చేసినందుకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ గారి ని, ఆయన బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ సదస్సు లో మీరందరు మీ మేధస్సు కు పదును పెట్టి సమష్టి గా ఇచ్చే సలహా లు రానున్న కాలం లో ఎంతో ఉపయోగపడుతాయి.

రక్షణ మంత్రి రాజ్ నాథ్ గారు దృఢసంకల్పం తో పని చేయడం కూడా నాకు సంతోషాన్ని ఇస్తోంది. ఆయన కఠోర ప్రయాస లు చాలా మంచి ఫలితాల ను అందిస్తాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది.

మిత్రులారా, గడచిన కొన్ని సంవత్సరాలు గా ప్రపంచం లో రక్షణ సామగ్రి ని దిగుమతి చేసుకొంటున్న ప్రధాన దేశాల లో భారతదేశం ఒకటి అనేది ఎవ్వరి వద్దా కూడాను దాగనటువంటి సంగతి. స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లో రక్షణ పరికరాల ఉత్పత్తి లో భారతదేశాని కి గొప్ప శక్తి యుక్తులు ఉండేవి. రక్షణ ఉత్పత్తుల తయారీ కి భారతదేశం లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సుప్రతిష్ఠిత వ్యవస్థ ఉండింది. భారతదేశం వద్ద ఉన్న వనరులు మరియు సంభవనీయత చాలా దేశాల వద్ద లేనేలేవు. అయితే అనేక దశాబ్దాల తరబడి ఈ విషయం లో పెద్ద గా శ్రద్ధ ను తీసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక రకం గా, అది ఒక నియమిత చర్య గా మారిపోయింది. ఎటువంటి గంభీర ప్రయాస లు చోటు చేసుకోలేదు. మన తరువాత చాలా ఏళ్లకు మొదలుపెట్టిన దేశాలు గడచిన 50 సంవత్సరాల కాలం లో మన కంటే ముందుకు దూసుకుపోయాయి. అయితే, పరిస్థితి ఇప్పుడు మారుతోంది.

ఈ రంగం లో సంకెళ్లను తొలగించడానికి మేము ఏకోన్ముఖ ప్రయత్నాలను చేస్తున్నటువంటి విషయాన్ని మీరు గత కొన్ని సంవత్సరాల లో గమనించే ఉంటారు. భారతదేశం లో కొత్త సాంకేతికతల ను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి ని పెంచడం, మరీముఖ్యం గా ఈ క్షేత్రం లో ప్రైవేటు రంగం యొక్క గరిష్ఠ వృద్ధి అనేవి మా లక్ష్యాలు గా ఉన్నాయి. అందువల్ల, లైసెను ఇచ్చే విధానం లో సంస్కరణ లు, సమాన అవకాశాల కల్పన, ఎగుమతి ప్రక్రియ ను సరళతరం చేయడం, ఆఫ్ సెట్ ప్రవిఝన్ లలో సంస్కరణ లు మొదలైన పలు చర్యల ను తీసుకోవడం జరిగింది.

మిత్రులారా, ఈ చర్యలన్నిటిలోకి రక్షణ రంగానికి సంబంధించి దేశం లో ఒక నూతనమైన మనస్తత్వం అనేది అన్నిటి కంటే ముఖ్యం అని నేను నమ్ముతున్నాను. దేశం లో ఒక కొత్త మనస్తత్వం పురుడు పోసుకొంది అనే దానిని మనం గమనించగలుగుతున్నాము. స్వయంసమృద్ధియుతమైనటువంటి మరియు ఆధునికమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలి అంటే రక్షణ రంగం లో ఆత్మవిశ్వాస భావన నెలకొనడం అనేది అన్నింటి కంటే మిన్న అయినటువంటి విషయం. చాలా కాలం నుండి, దేశం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకాన్ని గురించి చాలా రోజులుగా చర్చిస్తూ వచ్చింది కానీ, ఏ నిర్ణయాన్ని తీసుకోనేలేదు. ఈ నిర్ణయం ఒక ‘న్యూ ఇండియా’ యొక్క ఆత్మ విశ్వాసానికి ప్రతీక గా ఉంది.

చాలా కాలం పాటు రక్షణ ఉత్పత్తుల తయారీ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వలేదు. ఆదరణీయులు అటల్ జీ యొక్క ప్రభుత్వం ఈ విషయం లో ప్రథమంగా చొరవ తీసుకొంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, మరిన్ని సంస్కరణల ను తేవడం జరిగింది. మొట్టమొదటిసారి ఈ రంగం లో 74 శాతం ఆటోమేటిక్ ఎఫ్ డిఐ కి తలుపులను తెరవడం జరుగుతున్నది. ఇది ఒక ‘న్యూ ఇండియా’ యొక్క ఆత్మవిశ్వాసం తాలూకు ఫలం.

దశాబ్దాల తరబడి, యుద్ధసామగ్రి కర్మాగారాల ను ప్రభుత్వ విభాగాల వలే నడుపుతూ వచ్చారు. ఆ రకమైన హ్రస్వ దృష్టి వల్ల దేశం ఇబ్బందులు పడటమే కాక, అక్కడ పనిచేసే ప్రతిభావంతులు, కఠోర పరిశ్రమ చేసే అనుభవజ్ఞులైన శ్రామికవర్గం కూడా అనేకమైన ఇక్కట్టులను ఎదుర్కొన్నారు.

కోట్లాది మందికి ఉపాధి ని కల్పించవలసిన ఈ రంగం కొద్దిమంది ఉద్యోగులకే పరిమితమై పోయింది. ఇప్పుడు మేము యుద్ధ సామాగ్రి కార్ఖానాలను కార్పోరేట్ లుగా మార్చే దిశ లో సాగుతున్నాము. దీనివల్ల కార్మికులు, సైన్యం ఉత్తేజాన్ని పొందగలుగుతాయి. ఒక ‘న్యూ ఇండియా’ తాలూకు ఆత్మ విశ్వాసానికి ఇది రుజువు.

మిత్రులారా, రక్షణ ఉత్పత్తుల స్వావలంబన పట్ల మాకు ఉన్న కట్టుబాటు కేవలం చర్చలకు లేక కాగితాలకు పరిమితం కాలేదు. వాటిని అమలు చేయడానికి అనేక నిర్దిష్ట చర్యలను తీసుకోవడం జరిగింది. సి డి ఎస్ పదవి ని సృష్టించడం వల్ల సామాగ్రి సేకరణ లో త్రి విధ సైనిక దళాల మధ్య సమన్వయం పెరిగింది. అది రక్షణ సామగ్రి కొనుగోళ్ల ను పెంచడానికి తోడ్పడుతోంది. రానున్న కాలం లో దేశీయ పరిశ్రమ కు ఆర్డర్ లు పెరుగుతాయి. దీనికి పూచీ పడటం కోసం, రక్షణ మంత్రిత్వ శాఖ కేపిటల్ బడ్జెటు లో కొంత భాగాన్ని దేశం లో తయారు చేసే సామగ్రి ని కొనుగోలు చేసేందుకుగాను కేటాయించడమైంది.

ఇటీవల రక్షణ సామగ్రి లో 101 వస్తువులను అచ్చంగా దేశం లోనే కొనుగోలు చేయాలని నిర్దేశించడాన్ని మీరు గమనించే ఉంటారు. రానున్న రోజుల్లో ఈ జాబితా ను మరింత సమగ్రం గా మార్చి, మరెన్నో వస్తువుల ను దానిలో చేర్చడం జరుగుతుంది. ఈ జాబితా తయారీ లక్ష్యం ఒక్క దిగుమతుల ను పరిమితం చేయడం మాత్రమే కాదు, భారతీయ పరిశ్రమల ను ప్రోత్సహించడం కూడా ఈ చర్య యొక్క ఉద్దేశమే. అది ప్రైవేటు రంగం కావచ్చు, ప్రభుత్వ రంగం, ఎంఎస్ ఎంఇ లేక స్టార్ట్ అప్స్ కావచ్చు.. ప్రభుత్వం భావన, ఇంకా భావి అవకాశాల ను గురించి మిత్రులారా, మీ అందరి ముందు తేటతెల్లం చేయడం జరిగింది.

ఏకకాలం లో, మేము సేకరణ ప్రక్రియ ను వేగవంతం చేయడం, పరీక్షల యంత్రాంగాన్ని క్రమబద్ధం చేయడం మరియు నాణ్యత అవసరాల ను హేతుబద్ధం చేయడం కోసం కృషి చేస్తున్నాము. ఈ ప్రయత్నాల కు సైన్యం లోని త్రి విధ దళాల నుండి చాలా సమన్వయభరితమైన రీతి న సహకారం లభిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఒక రకం గా, అది క్రియాశీల పాత్ర.

మిత్రులారా, అధునాతన సామగ్రి లో స్వావలంబన ను సాధించడానికి టెక్నాలజీ స్థాయిని పెంచడం తప్పనిసరి. తదుపరి తరం ఉత్పత్తులను తయారు చేయవలసిన ఆవశ్యకత ఉంది. దానిని సాధించడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) తో పాటు ప్రైవేటు రంగాన్ని మరియు విద్యా సంస్థల లో పరిశోధన ను, నూతన ఆవిష్కరణల ను ప్రోత్సహించడం జరుగుతోంది. సాంకేతిక మార్పిడి సౌకర్యానికి బదులుగా విదేశీ భాగస్వాముల తో ఉమ్మడి సంస్థల ను ఏర్పాటు చేసి సహ ఉత్పత్తుల తయారీ పై ఎక్కువ గా దృష్టి పెట్టడం జరుగుతోంది. మన మార్కెట్ పరిమాణాన్ని దృష్టి లో పెట్టుకొని భారతదేశం లో ఉత్పత్తి ని ప్రారంభించే సర్వోత్తమ వికల్పం ఇప్పుడు మన విదేశీ భాగస్వామ్య సంస్థ లకు ఉంది.

మిత్రులారా, మా ప్రభుత్వం ఆది నుండి సంస్కరణ, ఆచరణ, ఇంకా పరివర్తన అనే మంత్రం తో పని చేస్తోంది. రెడ్ టేపిజం తగ్గించి రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో 2014 నుండి చేపట్టిన సంస్కరణ ల తీరు, వ్యాపారం సౌలభ్యాన్ని యావత్తు ప్రపంచం గమనించింది. ఎంతో కష్టతరమైన మరియు సంక్లిష్టమైన బౌద్ధిక సంపద రంగం, పన్ను ల విధానం, ఇన్ సోల్వన్సి ఎండ్ బ్యాంక్రప్టసి, అంతరిక్ష రంగం, ఇంకా అణు శక్తి రంగాల లో కూడా మేము సంస్కరణల ను ప్రవేశపెట్టాము. అంతేకాక ఇప్పుడు కార్మిక చట్టాల లో సంస్కరణ ల పరంపర కొనసాగుతున్న తీరు ను గురించి మీకు పూర్తి గా తెలుసు. మరి అది నిరంతర ప్రక్రియ కూడాను.

కొన్నేళ్ల కిందటి వరకు, వీటి ని గురించి ఎవరూ ఆలోచించలేదు. ఇప్పుడు ఈ సంస్కరణ లు ఆచరణాత్మకం గా మారాయి. సంస్కరణ ల ప్రక్రియ ఇక్కడితో ఆగదు. మేము మరింత ముందుకు పోతాము. అందువల్ల ఆగేది లేదు మరియు అలసట ఉండదు. నేను గాని, లేదా మీరు గాని అలసట చెందవలసిన పని లేదు. మనం ముందుకు సాగుతూనే ఉండాలి. మేము కట్టుబడి ఉన్నామని మా తరపు న మీకు నేను చెప్తున్నాను.

మిత్రులారా, మౌలిక సదుపాయాల కల్పన కు సంబంధించి చూస్తే రక్షణ కారిడర్ ల పని మెరుపు వేగం తో సాగుతోంది. ఉత్తర ప్రదేశ్, తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో అత్యంత అధునాతన మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేయడం జరుగుతోంది. రాబోయే అయిదు సంవత్సరాల కాలానికి గాను 20,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ని పెట్టాలని మేము లక్ష్యం గా నిర్దేశించుకొన్నాము. ఎంఎస్ఎంఇ, ఇంకా స్టార్ట్- అప్స్ కు చెందిన నవ పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహించడానికి మేము ప్రారంభించిన ఐడెక్స్ మంచి ఫలితాల ను ఇస్తోంది. ఈ ప్లాట్ ఫార్మ్ ద్వారా 50 కి పైగా స్టార్ట్- అప్స్ సాయుధ దళాల కు అవసరమైన టెక్నాలజీ ని మరియు ఉత్పత్తుల ను అభివృద్ధి చేశాయి.

మిత్రులారా, నేను మరొక విషయాన్ని మీ సమక్షం లో స్పష్టం చేయదలచాను. దేశం లో స్వావలంబన ను సాధించాలన్న మా సంకల్పం అంతర్ దృష్టి తో కూడింది కాదు. ఒక బలమైన భారతదేశాన్నిఆవిష్కరించాలనే యోచన వెనుక ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ను మరింత సుస్థిరం గా, ప్రతిఘాతుకం గా తీర్చిదిద్దడం మరియు ప్రపంచ శాంతి కి పాటుపడాలన్న అభిప్రాయం ఉంది. రక్షణ ఉత్పత్తుల తయారీ లో స్వావలంబన సాధించాలనే లక్ష్యం వెనుక కూడా అదే స్ఫూర్తి ఉంది. ఎన్నో మిత్ర దేశాల కు నమ్మకమైన రక్షణ సామగ్రి సరఫరాదారు కాగల సామర్ధ్యం భారతదేశానికి ఉంది. ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక సరిక్రొత్త వేగగతి లభించగలదు, అలాగే హిందూ మహా సముద్ర ప్రాంతం లో ఒక నికర భద్రత ప్రదాత గా భారతదేశం యొక్క పాత్ర కూడా మరింత పటిష్టం కాగలదు.

మిత్రులారా, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ప్రభుత్వ వచనబద్థత లు మీ ముందు ఉన్నాయి. కలసికట్టుగా మనం ఆత్మనిర్భర్ భారత్ గా ఆవిర్భవించాలన్న మన సంకల్పాన్ని చేతలలో చూపాల్సివుంది. స్వావలంబి భారతదేశం ఏర్పడిందంటే అది ప్రతి ఒక్కరి కి, అది ప్రైవేటు రంగం అయినా, లేక ప్రభుత్వ రంగం అయినా, లేక మన విదేశీ భాగస్వాములు అయినా, గెలుపు బాటల ను పరుస్తుంది. మీకు పని చేయడానికి అనువైన ఒక ఉత్తమ వ్యవస్థ ను కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

సదస్సు లో మీరు చేసే సూచన లు ఎంతో ఉపయోగకరం కాగలవు. రక్షణ ఉపకరణాల తయారీ మరియు ఎగుమతుల ప్రోత్సాహక విధానం ముసాయిదా ను మీ అందరికీ చూపినట్లు నాకు చెప్పారు. ఈ విధానాన్ని త్వరిత గతిన అమలులోకి తీసుకురావడానికి మీ ప్రతిపుష్టి సహాయకారి అవుతుంది. నేటి సదస్సు ఒకసారి జరిగే కార్యక్రమం గా మిగిలిపోనక్కరలేదు; ఇక ముందు ఇటువంటి సదస్సు లు జరగడం కూడా అవసరమే. పరిశ్రమ కు, ప్రభుత్వానికి మధ్య నిరంతర చర్చ లు, ప్రతిపుష్టి చోటు చేసుకొనే స్వతస్సిద్ధ సంస్కృతి అంటూ ఒకటి ఏర్పడాలి.

ఈ సామూహిక యత్నాల వల్ల మన సంకల్పం, తీర్మానాలు నెరవేరగలవని నేను నమ్ముతున్నాను. స్వయంసమృద్ధియుత భారతదేశం ఏర్పాటు కై మీ కాలాన్ని వెచ్చించి ఆత్మ విశ్వాసం తో ఈ సమావేశానికి హాజరైనందుకు గాను మరొక సారి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సంకల్పాన్ని నెరవేర్చుకొనేందుకు మనమంతా మరింత మెరుగ్గా మన బాధ్యతల ను నెరవేర్చగలమని నేను నమ్ముతున్నాను.

మరొక్కసారి, మీ అందరికీ నేను అనేకానేక శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదములు.

**