యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ డివెలప్‌మెంట్ (ఇబిఆర్‌డి) లో భారతదేశం సభ్యత్వం పొందేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇబిఆర్‌డి లో సభ్యత్వాన్ని సంపాయించడం కోసం అవసరమైన చర్యలను ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని ఆర్థిక వ్యవహారాల విభాగం తీసుకోవడం మొదలు పెడుతుంది.
ప్రభావం:
• అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ముఖ చిత్రాన్ని మెరుగుపరచుకొనేందుకు, భారతదేశం యొక్క ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించుకొనేందుకు ఇబిఆర్‌డి లో సభ్యత్వం తోడ్పడగలదు. అంతేకాకుండా ఇది ఇబిఆర్‌డి యొక్క రంగాల వారి విజ్ఞానాన్ని మరియు కంట్రీస్ ఆఫ్ ఆపరేషన్ ను భారతదేశానికి అందుబాటులోకి తీసుకు వస్తుంది కూడాను.
• భారతదేశం యొక్క పెట్టుబడి అవకాశాలు ఒక సరికొత్త ఉత్తేజాన్ని పొందుతాయి.
• తయారీ, సేవలు, సమాచార, సాంకేతిక విజ్ఞానం మరియు శక్తి రంగాలలో భారతదేశానికి, ఇబిఆర్‌డి కి మధ్య కో- ఫైనాన్సింగ్ అవకాశాల పరిధిని ఈ సభ్యత్వం విస్తరిస్తుంది కూడాను.
• ఇబిఆర్‌డి కార్యకలాపాలు కొనసాగే దేశాలలో ప్రధానంగా ప్రైవేటు రంగం అభివృద్ధి చెందేలా చూడడం ఇబిఆర్‌డి కార్యకలాపాలలో ముఖ్యమైందిగా ఉంది. ప్రైవేటు రంగం అభివృద్ధి చెందడంలో బ్యాంకు యొక్క సాంకేతిక సహాయాన్ని, బ్యాంకుకు ఉన్న రంగాల వారీ విజ్ఞానాన్ని భారతదేశం ఉపయోగించుకోవడంలో బ్యాంకులో భారతదేశం సభ్యత్వం సహాయపడుతుంది.
• దేశంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని మెరుగుపరచడంలో ఈ సభ్యత్వం తోడ్పాటును అందిస్తుంది.
• ఇబిఆర్ డి యొక్క సభ్యత్వం భారతీయ సంస్థల స్పర్థాత్మక శక్తిని పెంపొందిస్తుంది. వ్యాపార అవకాశాలు, సేకరణ కార్యకలాపాలు, కన్సల్‌టెన్సీ అసైన్‌మెంట్ ల వంటి అశాలలో అంతర్జాతీయ విపణులు అందుబాటులోకి రావడానికి ఈ సభ్యత్వం బాట పరుస్తుంది.
• ఈ సభ్యత్వం భారతీయ వృత్తి నిపుణులకు సరికొత్త అవకాశాలను ప్రసాదించడంతో పాటు, భారతదేశం నుండి జరిగే ఎగుమతులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది.
• ఆర్థిక కార్యకలాపాలలో వృద్ధి.. ఉద్యోగ కల్పన సామర్థ్యాన్ని సృష్టిస్తుంది.
• భారతదేశ పౌరులు బ్యాంకులో ఉద్యోగాలు పొందేందుకు కూడా ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఆర్థికపరంగా ప్రభావం:
ఇబిఆర్‌డి లో సభ్యత్వం దిశగా కనీస ప్రారంభిక పెట్టుబడి సుమారు ఒక మిలియన్ యూరోలు ఉంటుంది. అయితే సభ్యత్వాన్ని పొందడం కోసం కనీసం 100 షేర్లు కొనుగోలు చేయాలని భారతదేశం తీసుకొనే నిర్ణయం పై ఈ భావన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ భారతదేశం ఎక్కువ సంఖ్యలో బ్యాంకు షేర్లను కొనుగోలు చేయాలని భావించినట్లయితే, ఇందులో ఇమిడి ఉండే ఆర్థిక భారం మరికాస్త అధికం కావచ్చు. బ్యాంకులో చేరడం కోసం ప్రస్తుతం మంత్రివర్గం యొక్క సూత్రప్రాయ ఆమోదాన్ని పొందడం జరుగుతోంది.
పూర్వ రంగం:
యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీ కన్స్‌స్ట్రక్షన్ అండ్ డివెలప్‌మెంట్ (ఇబిఆర్‌డి) లో సభ్యత్వం పొందాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంటూ వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మెరుగైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మెరుగుపరచుకొంటున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు ల వంటి బహుముఖ అభివృద్ధి బ్యాంకు (ఎమ్ డిబి ల) తో భారతదేశానికి ఉన్న సాన్నిహిత్యానికి తోడు ప్రపంచ అభివృద్ధి యవనిక మీద తన ఉనికిని విస్తరింప జేసుకోవడం సముచితంగా ఉంటుందని భావించడం జరిగింది. ఈ పూర్వ రంగంలోనే ఏశియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబి)లో, న్యూ డివెలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డిబి) లో చేరాలని ఇంత క్రితం నిర్ణయం తీసుకొన్నారు.
***