యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రాంతీయ కార్యాలయం న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేయటానికి ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కాబినెట్ సమావేశం ఆమోదం తెలియజేసింది. యూపీయూ తో ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా ఈ ప్రాంతంలో యూపీయూ అభివృద్ధి సహకారానికి, సాంకేతిక సహాయానికి భారతదేశం కృషిచేస్తుంది.
ఈ ఆమోదం ద్వారా భారతదేశం తపాలా రంగంలోని వివిధ సంస్థలలో చురుకైన పాత్ర పోషిస్తూ త్రిముఖ సహకారానికి పాటుపడుతుంది. యూపీయూ ప్రాంతీయ కార్యాలయానికి ఒక ఫీల్డ్ ప్రాజెక్ట్ నిపుణుణ్ణి, సిబ్బందిని, కార్యాలయాన్ని భారతదేశం సమకూర్చుతుంది. సామర్థ్య నిర్మాణం, శిక్షణలు, సామర్థ్యం మెరుగుపరచుకోవటం, తపాలా సేవల నాణ్యత, తపాలా సాంకేతిక పరిజ్ఞానం పెంపు, ఈ-కామర్స్, వర్తకం పెంపుదల తదితర అంశాల ప్రాజెక్టులు సిద్ధం చేసి అమలులో పెట్టటానికి యూపీయూ తో సమన్వయం సాధిస్తుంది.
ఈ చొరవ వలన భారతదేశపు దౌత్య విస్తృతి పెరిగి ఇతర దేశాలతో సంబంధాలు బలోపేతమవుతాయి. మరీ ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ ఉనికి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుంది.
******