Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుగాండా లో భార‌తీయ సముదాయాన్ని ఉద్దేశించి 2018 జులై 24న ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ ముసెవెని గారు, ఆయ‌న స‌తీమ‌ణి శ్రీమతి జేనెట్ ముసెవెని గారు మరియు పెద్ద సంఖ్య‌ లో ఇక్కడకు తరలివచ్చిన ప్రియ‌మైన నా సోదరీ సోద‌రులారా,

మీ అంద‌రితో నాకు ప్రేమ, అపేక్ష లతో కూడినటువంటి సంబంధం ఉంది.  మీ కుటుంబం లో నేను ఒక భాగాన్ని.  ఈ భారీ పరివారం లో ఓ భాగంగా నేనున్నాను. మరి ఈ కారణంగా మిమ్మ‌ల్నంద‌రినీ క‌లుసుకోవడంతో నా సంతోషం అనేక రెట్లు హెచ్చుతోంది.  మన ముఖాముఖి కి మరింత ప్రతిష్టను జోడించడం కోసం ఈ రోజున  గౌరవనీయ అధ్య‌క్షుడు స్వ‌యంగా ఇక్క‌డకు విచ్చేశారు.
 
యుగాండా లో జీవిస్తున్న వేలాది భార‌తీయ‌ల‌ప‌ట్ల మరియు భార‌తదేశం లోని 1.25 బిలియ‌న్ భార‌తీయుల‌ ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న అనంతమైన ప్రేమ కు ఆయన హాజరు ప్ర‌తీకాత్మకం గా నిలుస్తోంది.  మరి ఈ కారణంగా నేను యుగాండా అధ్య‌క్షునికి హృద‌య‌పూర్వ‌క గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నాను.  ఈ రోజు మీతో గ‌డ‌ప‌డానికే నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను.  రేపు యుగాండా పార్ల‌మెంటు ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌బోతున్నాను.  రెండు రోజుల క్రితం నేను పార్ల‌మెంటు లో ఇచ్చిన ప్ర‌సంగాన్ని మీరు ఆసాంతం వినే వుంటారు.  యుగాండా నా ప్ర‌సంగాన్ని యావత్తు యుగాండా ఆలకించింది.  మీకు నేను ఎంతో కృతజ్ఞుడిని అయి వుంటాను.
 
ప్రియ‌మైన నా సోద‌రీ సోద‌రులారా,

యుగాండా పార్ల‌మెంటు ను ఉద్దేశించి ప్ర‌సంగించే అవ‌కాశాన్ని భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి ఒకరు దక్కించుకోవడం ఇదే మొదటి సారి.  నేను యుగాండా అధ్య‌క్షునికి, యుగాండా ప్ర‌జల‌కు 1.25 బిలియ‌న్ కోట్ల మంది భారతీయుల పక్షాన నా యొక్క  కృత‌జ్ఞ‌త‌ ను వ్యక్తం చేయదలుస్తున్నాను. 

మిత్రులారా, యుగాండా ను సంద‌ర్శించ‌డ‌మూ, మీ అందరినీ కలుసుకొని మాట్లాడడమూ ఏ భార‌తీయునికైనా సంతోషాన్ని, ప్రీతి ని కలగజేసేదే. 

మీ నుంచి నేను ఆశిస్తున్న‌దల్లా మీ ఉత్సాహాన్ని, మీ ప్రేమాదరాలను, ఈ తరహా  మీ అనుభూతులను నేను పొందుతూనే వుండాలి అని.  యుగాండా ను సంద‌ర్శించే అవ‌కాశం, మిమ్మ‌ల్ని క‌లుసుకునే అదృష్టం నాకు లభించడం ఇది రెండో సారి. 11 సంవత్సరాల క్రితం నేను ఇక్క‌డ‌కు వచ్చాను.. అప్పట్లో నేను గుజ‌రాత్ కు ముఖ్య‌మంత్రి ని. మరి ఇప్పుడు నేను దేశ ప్ర‌ధాన మంత్రి గా ఇక్క‌డ‌కు వ‌చ్చాను.
 
గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా నేను ఉన్నప్పుడు, అప్పుడు కూడా అనేక మంది తో నేను ముఖాముఖి భేటీ అయ్యాను; వారితో ఆ రోజున పిచ్చాపాటీగా చ‌ర్చ‌లు జరిపాను.  వారిలో ప‌లువురు ఈ రోజు మీ మధ్యన ఉన్నారు . ఇక్కడ నాకు ప‌రిచ‌య‌ం ఉన్న‌ వారు ప‌లువురిని నేను చూస్తున్నాను.  వారిని ఒకరి త‌రువాత మరొకరుగా అధ్య‌క్షుడు నాకు ప‌రిచ‌యం చేశారు. ఇది నాకు సంతోషాన్ని ఇస్తోంది.  మీతో ఆయనకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో; మనం ఈ రోజంతా  క‌లిసే గ‌డిపాము.  ప‌లు కుటుంబాల గురించి పేర్ల‌తో స‌హా ఆయన నాకు చెప్పి, ఆయా కుటుంబాలు త‌న‌కు ఎలా తెలుసో వివరించారు.  అంతే కాదు, ఎన్నేళ్లుగా తనకు ఆయా కుటుంబ సభ్యులు పరిచితులో నాకు వెల్లడి చేశారు.  వీటన్నింటినీ నాతో ఆయన  పంచుకొన్నారు.  

మీకున్నటువంటి క‌ష్ట‌ప‌డే త‌త్త్వ, మీ ప్ర‌వ‌ర్త‌న‌, మంచి గుణం.. వీటి కార‌ణంగా మీరు ఇక్క‌డ గౌర‌వాన్ని ఆర్జించారు.  మీరు సాధించింది చిన్న విషయం ఏమీ కాదు. భారతదేశం నుంచి ఇక్క‌డ‌కు త‌ర‌లివ‌చ్చిన అనేక త‌రాల ప్ర‌జ‌ల ఈ నేల‌తో అనుబంధాన్ని పెంచుకున్నారు.  వారు ఈ నేల‌ ను ప్రేమించారు.
 
మిత్రులారా, యుగాండా తో భార‌త‌దేశ సంబంధాలు కొత్త‌వేమీ కావు.  ఇరు దేశాల మ‌ధ్య‌ బంధాలు చాలా పురాత‌న‌మైన‌వి.  క‌ష్ట‌ప‌డ‌డంలో, దోపిడికి వ్య‌తిరేకంగా పోరాడ‌డం లో ఇరు దేశాల మ‌ధ్య‌ బంధ‌ం ఉంది.  ఈ రోజు యుగాండా సాధించిన అభివృద్ధి కి ఇక్కడి ప్ర‌జ‌లు చిందించిన ర‌క్త, స్వేదాలే కార‌ణం.  అంతే కాదు ఈ అభివృద్ధి కోసం భార‌తీయులు కూడా వారి ర‌క్తాన్ని, చెమటను చిందించారు.  మీ లోని ప‌లు కుటుంబాలు ఇక్క‌డ మూడు నాలుగు త‌రాలుగా జీవిస్తున్నాయి.  ఇక్క‌డ హాజ‌రైన యువ‌త‌కు నేను ఒక విష‌యాన్ని గుర్తు చేయాల‌ని అనుకుంటున్నాను.  మీరు ప్ర‌యాణం చేసే రైలు కూడా భారతదేశం, యుగాండా ల మ‌ధ్య‌ సంబంధాల‌కు జోరును అందిస్తోంది.  ఒక‌సారి గ‌తం లోకి వెళ్తే మ‌న రెండు దేశాలు ఒక దేశానికి బానిస‌లుగా ఉండేవి.  ఆ స‌మ‌యంలో భారతదేశం లోని మా పూర్వీకుల‌ను ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చారు.  నాటి పాల‌కులు త‌పాకుల‌తో, వేటాడే ఆయుధాల‌తో భ‌య‌పెట్టి వారితో ఇక్క‌డ రైల్వే ట్రాకు ల‌ను నిర్మించారు.  యుగాండా సోద‌రీసోదరుల‌తో చేతులు కలిపిన భార‌తీయులు ఆ క‌ష్ట‌ కాలంలో త‌మ  పోరాటాన్ని కొన‌సాగించారు.  త‌ద్వారా యుగాండా కు స్వాతంత్ర్యం వ‌చ్చింది.  కానీ మా పూర్వీకులు ఇక్క‌డే స్థిర‌ప‌డాల‌ని నిర్ణ‌యించారు.  పాల‌ల్లో చ‌క్కెర క‌లిసిపోయిన‌ట్టుగా భార‌తీయులు ఇక్క‌డి స‌మాజంలో క‌లిసిపోయారు.  అదే విధంగా మావాళ్లు ఇక్క‌డి వాళ్ల‌తో మమేకమ‌య్యారు.
 
ఈ రోజు, మీరంద‌రూ ఇక్క‌డ అన్ని రంగాల్లోనూ మీ శ‌క్తిని ధార‌పోస్తున్నారు.  యుగాండా అభివృద్ధి కావ‌చ్చు, వ్యాపారాలు కావ‌చ్చు, క‌ళ‌లు, ఆట‌లు.. ఇలా మీ జీవితాల‌ను శాసించే అన్ని రంగాల్లో మీరు కృషి చేస్తున్నారు. మ‌హాత్మ గాంధీ చితా భ‌స్మాన్ని ఇక్క‌డి జింజా న‌ది లో క‌లపడమైంది.  ఈ దేశ రాజ‌కీయాల్లో అనేక మంది భార‌తీయులు చాలా ఉత్సాహంగా పాల్లొంటూ వ‌చ్చారు.  అంతే కాదు వారు ఆ ప‌నిని ఇప్పటికీ చేస్తున్నారు.  యుగాండా కు స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత పార్ల‌మెంట్ సభాపతులుగా ప‌ని చేసిన‌ వారిలో కీర్తి శేషులు న‌రేంద్ర భాయ్ ప‌టేల్ ఉన్నారు.  ఆయ‌న ఆ ప‌ద‌వి ని అలంక‌రించిన మొద‌టి ఐరోపాయేత‌రుడు.  ఆయ‌న ఎంపిక కూడా ఏక‌గ్రీవంగా జ‌రిగింది.  యుగాండా లో భారతీయులు గ‌డ్డు ప‌రిస్థితులను కూడా ఎదుర్కొన్నారు.  కొంత‌మంది దేశాన్ని వ‌దలిపెట్టి వెళ్లిపోయారు కూడా.  కానీ ఇక్క‌డి ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం భార‌తీయుల‌ను త‌మ హృద‌యాల‌లో నుంచి బయట‌కు పంపలేదు.  ఈ రోజున నేను యుగాండా అధ్య‌క్షునికి, యుగాండా ప్ర‌జ‌ల‌కు నా హృద‌యపూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.  భారతీయ సముదాయాన్ని  ఆద‌రిస్తున్నందుకు మరో సారి నేను మనసారా కృత‌జ్ఞ‌త‌లను వ్యక్తం చేస్తున్నాను. 

ఇక్క‌డే ఈ నేల మీద పుట్టిన మీ లోని ప‌లువురికి బ‌హుశా భార‌త‌దేశాన్ని సంద‌ర్శించే అవ‌కాశం కూడా  లభించలేదేమో.  మీ లోని కొంత మందికి త‌మ మూలాలు తెలిసి  ఉండ‌కపోవ‌చ్చు.  త‌మ పెద్ద‌లు భార‌త‌దేశం లోని ఏ రాష్ట్రాన్నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చారో, ఏ గ్రామాన్నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చారో తెలియ‌క‌పోయి వుండ‌వ‌చ్చు.  అయిన‌ప్ప‌టికీ మీరు మీ హృద‌యాల్లో భార‌త‌దేశాన్ని స‌జీవంగా నిలుపుకొన్నారు.  మీ హృద‌య స్పంద‌న‌ల్లో ఒక‌టి యుగాండా కోసమైతై, ఆ త‌రువాత వ‌చ్చే స్పంద‌న భార‌త‌దేశం కోస‌మే.  వాస్త‌వంగా చెప్పాలంటే మీరు భార‌తీయ రాయ‌బారులు.  ప్ర‌పంచానికి మీరు భార‌త జాతీయ రాయ‌బారులు.  కొద్ది సేప‌టి క్రితం, దేశాధ్య‌క్షునితో క‌లసి వేదిక మీద‌కు వ‌స్తున్న‌ప్పుడు ఇక్క‌డ వేదిక మీద నా ప‌ర్య‌ట‌న‌ కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను చూశాను.  అవి ఎంతో ప్ర‌శంసనీయ‌మైన‌వి.  ఉర్రూత‌లూగించే భార‌తీయ‌త‌ను మీరు భ‌ద్రంగా కాపాడుకుంటూ వ‌స్తున్నారు.
 
ఈ విష‌యాన్ని నేను నా గ‌త అనుభ‌వాల ఆధారంగా చెప్ప‌గ‌ల‌ను.  అంతే కాదు ఈ రోజు నా అనుభ‌వాల ఆధారంగా కూడా చెప్ప‌గ‌ల‌ను.  దీనికి సంబంధించి చాలా త‌క్కువ ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.  మీరంతా భార‌తీయ భాష‌ల‌తో ఉన్న అనుభూతుల‌తో జీవిస్తున్నారు.  భార‌తీయ ఆహారం, క‌ళ‌లు, సంస్కృతి లకు సంబంధించిన అనుభూతుల‌తో జీవిస్తున్నారు.  భిన్న‌త్వంలో ఏక‌త్వం, కుటుంబ విలువ‌లు, యావత్తు ప్రపంచం ఒకే కుటుంబం అనే అనుభూతులతో మీరు జీవిస్తున్నారు.  అందుకే ప్ర‌తి భార‌తీయుడు మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నారు. 1.25 బిలియ‌న్ భార‌తీయులు మిమ్మ‌ల్ని చూసి గ‌ర్విస్తున్నారు. నాకు కూడా మీరంటే గర్వంగా ఉంది. మీకు శిర‌స్సును వంచి న‌మ‌స్కరిస్తున్నాను.
 
మిత్రులారా, యుగాండా తో పాటు ఆఫ్రికా లోని అనేక దేశాలు భార‌త‌దేశానికి చాలా ముఖ్య‌మైన దేశాలు.  దీనికి ప్ర‌ధాన‌మైన కార‌ణం ఆయా ఆఫ్రికా దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్య‌ లో జీవిస్తున్నారు.  వారు మీలాగే ఆయా దేశాల్లో నివసిస్తున్నారు. దీనికి సంబంధించి రెండో కార‌ణం బానిస‌త్వానికి వ్య‌తిరేకంగా మ‌నంద‌ర‌మూ క‌లిసిక‌ట్టుగా యుద్ధం చేశాం.  మూడోది, అభివృద్ధి విష‌యంలో మ‌న దేశాల‌న్నీ క‌లిసి ఉమ్మ‌డిగా ఒకే స‌వాలును ఎదుర్కొంటున్నాయి.  సంతోషాల‌న‌యినా, విషాదాల‌నైనా క‌లిసిక‌ట్టుగా పంచుకునే చ‌రిత్ర మ‌న దేశాల సొంతం.  మ‌న రెండు దేశాలు ఒక దానినుంచి మ‌రొక‌టి ఎంతో కొంత నేర్చుకోవ‌డం జ‌రిగింది.  మ‌నం ఒక‌రికొక‌రం మ‌న శ‌క్తియుక్తుల‌ మేర‌కు మ‌ద్ద‌తిచ్చుకుంటూ స‌హాయం చేసుకుంటూ వ‌చ్చాం.  ఈ నాటికీ అదే స్ఫూర్తి ని ప్ర‌ద‌ర్శిస్తూ మ‌నం ముందుకు సాగుతున్నాం.  యుగాండా తో బ‌ల‌మైన ర‌క్ష‌ణ సంబంధాల‌ను మేం కోరుకుంటున్నాం.  యుగాండా అవ‌స‌రాల‌ మేర‌కు యుగాండా మిలిట‌రీ కి త‌గిన శిక్ష‌ణ ఇవ్వ‌డానికి మేం ఏర్పాట్ల‌ను చేస్తూ వున్నాం.  ప్ర‌స్తుతం వేయి మంది కి పైగా యుగాండా విద్యార్థులు భార‌త‌దేశం లో చ‌దువుకుంటున్నారు.

స్నేహితులారా, మీరంద‌రూ ఇక్క‌డ‌కు వ‌చ్చిన తరువాత భార‌త‌దేశం లో చాలా మార్పు వ‌చ్చింది.  ఆఫ్రికా దేశాల్లో యుగాండా చాలా వేగంగా అభివృద్ధ‌ి చెందుతున్న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ ను క‌లిగిన దేశం గా గుర్తింపు పొందిన‌ట్టే ప్ర‌పంచ దేశాల్లో భార‌త‌దేశానికి ఆ పేరు ఉంది.  ప్ర‌పంచాభివృద్ధికి కావ‌ల‌సిన జోరు ను భార‌త‌దేశ ఆర్ధిక రంగం అంద‌జేస్తోంది.  ప్రస్తుతం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న దేశానికి గుర్తింపును తెచ్చింది.  ఇవాళ, మేము భారతదేశంలో త‌యారైన కార్ల‌ను, స్మార్ట్ ఫోన్ల‌ను గ‌తంలో వాటిని ఏ ఏ దేశాల‌ నుంచి  దిగుమ‌తి చేసుకున్నామో ఆ దేశాల‌కు అమ్ముతున్నాం.  ఇక్కడ యుగాండాలో మీరు స్మార్ట్ ఫోన్ల‌ను కొంటున్న‌ప్పుడు మీకు మేడ్ ఇన్ ఇండియా లేబెల్ తో కూడిన స్మార్ట్ ఫోన్లు క‌నిపించ‌డానికి చాలా అవ‌కాశాలు ఉన్నాయి.
 
ఇటీవలే ప్ర‌పంచం లో అతి పెద్ద మొబైల్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌ యొక్క పునాదిరాయిని భారతదేశంలో వేయ‌డమైంది.  భారతదేశం చాలా వేగంగా త‌యారీ కేంద్రంగా మారి ప్ర‌పంచం లోనే త‌న స‌త్తా చాటుతోంది.  దీనికి తోడు భార‌త‌దేశం డిజిట‌ల్ సాంకేతిక‌త సాయం తో ప్ర‌జ‌లకు సాధికారితను కల్పిస్తోంది.  ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌లు సేవ‌లు మొబైల్ ఫోన్ల‌లో ల‌భిస్తున్నాయి.  బాలల జ‌న‌నాల న‌మోదు నుంచి మ‌ర‌ణాల న‌మోదు వ‌ర‌కు, చాలా వ‌ర‌కు సేవ‌ల‌ను డిజిట‌ల్ చేయ‌డం జ‌రిగింది.  వాటిని ఆన్ లైన్ లో ల‌భ్య‌మ‌య్యేలా చేశాం.  భార‌త‌దేశం లోని ప్ర‌తి ప్ర‌ధాన‌మైన గ్రామంలో బ్రాడ్ బ్యాండ్ ఇంట‌ర్ నెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌డానికి గాను ప‌నులు చాలా వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ రోజున‌, భార‌త‌దేశం లో త‌యారైన ఉక్కు ను ఉప‌యోగించే  సూది నుంచి, రైల్వే ట్రాకుల వ‌ర‌కు మెట్రో రైలు పెట్టెల  నుంచి, కృత్రిమ ఉప‌గ్ర‌హాల‌ వ‌ర‌కు భార‌త‌దేశం లోనే త‌యారు చేయ‌డం జ‌రుగుతోంది. భార‌త‌దేశం త‌యారీ రంగంలోనే కాదు స్టార్ట్- అప్ ల విష‌యంలోను చాలా వేగంగా ప్ర‌గ‌తి సాధిస్తోంది.
 
ప్ర‌పంచం లో ఏ దేశానికి వెళ్లినా, అక్క‌డ నేను మీలాంటి సజ్జనుల‌కు ఒక విష‌యాన్ని గుర్తు చేస్తుంటాను.  గ‌తంలో  భార‌త‌దేశానికి ఎలాంటి ఇమేజ్ ఉందో వారికి గుర్తు చేస్తుంటాను.  వేలాది సంవ‌త్స‌రాల వైభ‌వాన్ని క‌లిగిన దేశాన్ని పాములు ప‌ట్టుకొనే వారు నివ‌సించే దేశంగా చిత్రీక‌రించారు.  ప్ర‌పంచానికి భారతదేశాన్ని ఇలాగే ప‌రిచ‌యం చేసే వారు.  భార‌త‌దేశం అంటే పాములు ప‌ట్టే వారు, మంత్ర తంత్రాల‌తో బ‌తికే వారు అన్న‌ట్టుగా చిత్రీక‌రించారు.  ఇదా మ‌న దేశానికి ఉండవలసిన గుర్తింపు ?   దేశానికి ఉన్న ఇలాంటి గుర్తింపు ను మ‌న యువ‌త మార్చివేసింది.  భార‌త‌దేశ‌మంటే ల్యాండాఫ్ మౌస్ అంటే ఐటీ, సాప్ట్‌వేర్ దేశ‌ం అని మ‌న వాళ్లు నిరూపించారు.
 
ఈ రోజున, అదే యువ‌త మ‌న దేశంలో వేలాదిగా స్టార్ట్- అప్ సంస్థ‌ ల‌ను ప్రారంభిస్తున్నారు.  ఈ విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.  గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో భార‌త‌దేశంలో 11 వేల‌కు పైగా స్టార్ట్- అప్ లు వాటి పేర్ల‌ను న‌మోదు చేసుకున్నాయి.  ప్ర‌పంచానికి, భార‌త‌దేశానికి అవ‌స‌ర‌మైన రీతిలో మ‌న యువ‌త అన్వేష‌ణ‌లుచేసి కొత్త వాటిని అంద‌జేస్తోంది. అలాగే అనేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు క‌నుగొంటున్నారు.  

మిత్రులారా, నేడు దేశంలో ఉన్న మొత్తం ఆరు ల‌క్ష‌ల గ్రామాల‌కు విద్యుత్తు సౌకర్యం ఉంది.  విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేని గ్రామం నేడు దేశంలో లేదు.  విద్యుత్తు క‌నెక్ష‌న్ పొంద‌డం ఇప్పుడు భార‌త‌దేశం లో చాలా సులువు.  ప్ర‌పంచ‌ బ్యాంకు విడుద‌ల చేసి ర్యాంకు ల‌ను చూస్తే మీకు ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో విద్యుత్తు సౌక‌ర్యాన్ని సులువుగా ఏర్పాటు చేసుకొనే దేశాల ర్యాంకు ల‌లో భార‌త‌దేశం  82 స్థానాల‌ను అధిగమించింది.  నేడు ప్ర‌పంచం లో మ‌న స్థానం 29.  దేశం లో అన్ని ప్రాంతాల‌కు విద్యుత్తు సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డ‌మే కాదు, విద్యుత్తు బిల్లు ల‌ను త‌గ్గించ‌డానిగాను ఉద్య‌మ‌ం స్థాయి లో కృషి చేయ‌డమైంది.  గ‌త నాలుగు సంవత్సరాలలో  కోట్లాది ఎల్ ఇడి బ‌ల్బుల‌ను అందించ‌డం జ‌రిగింది.  వంద కోట్ల‌ బ‌ల్బుల‌ను ప్ర‌జ‌ల‌కు అందించాం.  మిత్రులారా, భార‌త‌దేశం లోని వ్య‌వ‌స్థ‌ లోను, స‌మాజం లోను భారీ మార్పుల‌ను తీసుకు రావ‌డం ద్వారా దేశంలో ఇలాంటి మార్పులు అనేకం జ‌రుగుతున్నాయి.  ఈ రోజున, న్యూ ఇండియా ను ఆవిష్క‌రించాల‌నే ప్ర‌తిజ్ఞను స్వీకరించి భార‌త‌దేశం ముందుకు సాగుతోంది. 

మిత్రులారా, నేను ప్ర‌ధాన‌ మంత్రి ని అయిన తరువాత‌ నుంచి యుగాండా ను సంద‌ర్శించాల‌ని ఎంతో కుతూహలంతో వేచివున్నాను.  మూడేళ్ల క్రితం యుగాండా అధ్య‌క్షుడు ఇండియా- ఆఫ్రికా సమిట్ లో పాల్గొన‌డానికి భార‌త‌దేశానికి వ‌చ్చిన‌ప్పుడు యుగాండా ను సంద‌ర్శించాలంటూ న‌న్ను గ‌ట్టిగా కోరారు.  ప‌లు కార‌ణాల వల్ల నా యుగాండా ప‌ర్య‌ట‌న కార్య‌రూపం దాల్చ‌లేదు.  ఇంత‌కాలానికి అది స‌ఫ‌ల‌మై, మీతో మాట్లాడే అదృష్టం నాకు ల‌భించింది.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ఆఫ్రికా తో సంబంధాల విష‌యంలో భార‌త‌దేశం ప్ర‌త్యేకంగా దృష్టి ని కేంద్రీక‌రించింది.  ఈ రోజున భార‌త‌దేశ విదేశాంగ విధానం లో ఆఫ్రికా కు ప్ర‌ధాన‌మైన స్థానం ఉంది.  2015 లో మేము ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ సమిట్ ను ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆఫ్రికా లోని అన్ని దేశాల‌నూ ఆహ్వానించాం.  గ‌తం లో ఎంపిక చేసిన దేశాల‌ను మాత్ర‌మే ఆహ్వానించే వారు.  మేం పంపిన ఆహ్వానాన్నిఅన్ని ఆఫ్రికా దేశాలు అంగీక‌రించాయి.   అంతే కాదు, 41 దేశాల‌కు చెందిన నేత‌లు ఈ కార్యకమ్రం లో పాల్గొన్నారు.  అంద‌రూ ఢిల్లీ కి వ‌చ్చారు.  భార‌త‌దేశం యొక్క సాద‌ర స్వాగ‌తాన్ని మ‌న్నించి ఆఫ్రికా భారత్ కు  చేరువ‌యింది.  భారతదేశం తో చేయిని క‌లిపింది.  గ‌త నాలుగు సంవత్సరాలలో మంత్రిత్వ‌ స్థాయి లో సంద‌ర్శ‌న జ‌ర‌గ‌ని దేశం ఆఫ్రికా లో లేదు.  రాష్ట్ర‌ప‌తి, ఉప‌ రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన మంత్రి స్థాయిలలో 20 ప‌ర్య‌ట‌న‌లు చోటుచేసుకొన్నాయి.  ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ సమిట్ తో పాటు 32 ఆఫ్రికా దేశాల అధినేత‌లు భార‌త‌దేశాన్ని సంద‌ర్శించి భార‌తదేశ నేత‌ ల‌ను క‌లుసుకొన్నారు.  18 దేశాల్లో భార‌త‌దేశ దౌత్య కార్యాల‌యాల‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది.  దాంతో ఆఫ్రికా లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల సంఖ్య 47కు చేరుకోనుంది.  ఆఫ్రికా సామాజిక అభివృద్ధి పోరాటానికి భార‌త‌దేశం స‌హ‌క‌రిస్తూ వస్తోంది.  ఆఫ్రికా ఖండం ఆర్ధిక ప్ర‌గ‌తి ని సాధించ‌డానికిగాను భార‌త‌దేశం ముందుండి భాగ‌స్వామ్యాన్ని అందిస్తోంది.  ఈ కార‌ణంగానే గ‌త ఏడాది ఆఫ్రిక‌న్ డివెల‌ప్ మెంట్ బ్యాంకు వార్షిక స‌మావేశం భార‌త‌దేశం లో జ‌రిగింది.  3 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఆఫ్రికా  ప్రాజెక్టు ల‌కు సంబంధించిన రుణ స‌హాయానికి ఆమోదం తెల‌ప‌డమైంది.  ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ సమిట్ నేప‌థ్యం లో 10 బిలియ‌న్ డాల‌ర్ల స‌హాయాన్ని అందించవలసిన బాధ్య‌త మా మీద ఉంది.  దీనికి తోడు 600 మిలియ‌న్ డాల‌ర్ల గ్రాంటు ను అందిస్తామ‌ని చెప్ప‌డమైంది.  అంతే కాదు భార‌త‌దేశం లో చ‌దువుకొనే 50 వేల మంది విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నాల‌ను అందించ‌నున్నాం. భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌డానికిగాను 33 ఆఫ్రికా దేశాల‌కు ఎల‌క్ట్రానిక్‌ వీజా సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేశాం.  ఆఫ్రికా ప‌ట్ల భార‌త‌దేశానికి వున్న నిబ‌ద్ధ‌త ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 

గ‌త ఏడాది ఆఫ్రికా దేశాల‌తో భార‌త‌దేశ వాణిజ్యం 32 శాతం వృద్ధి ని సాధించింది.  అంత‌ర్జాతీయ సౌర వేదిక‌ లో స‌భ్య‌త్వం తీసుకోవాలంటూ నేను అన్ని ఆఫ్రికా దేశాల‌ను కోరాను.  నా అభ్య‌ర్థ‌న ఫ‌లితంగా ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ సౌర వేదిక‌ లోని స‌భ్యుల్లో స‌గం దేశాలు ఆఫ్రికా నుంచే ఉన్నాయి. 

అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో భార‌త‌దేశ గళాన్ని వినిపించిన‌ప్పుడు ఆఫ్రికా దేశాలు ఏకతాటి మీద నిలచి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి.  నూత‌న ప్ర‌పంచ ఆవిష్కారం లో ఆసియా, ఆఫ్రికా దేశాల ఉనికి రాను రాను బ‌లోపేత‌మ‌వుతోంది.  ఈ ప‌రిణామ క్ర‌మం లో మ‌న‌ వంటి దేశాల మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం అనేది ధ‌నాత్మ‌క వాతావ‌ర‌ణాన్ని తెస్తుంది.  కోట్లాది మంది ప్ర‌జ‌ల జీవితాల్లో స‌వ్య‌మైన మార్పు ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. 

మీ స‌మ‌యాన్ని వెచ్చింది ఇక్క‌డ‌కు వ‌చ్చినందుకు మీ ప్రేమాప్యాయతలను నా పైన వర్షింపజేసి న‌న్ను ఆశీర్వ‌దించినందుకు మీరు చూసిన ఉత్సాహానికి, త‌ప‌న‌ కు నా కృత‌జ్ఙ‌త‌ను వ్యక్తం చేస్తున్నాను.
 
యుగాండా అధ్య‌క్షునికి, యుగాండా ప్ర‌భుత్వానికి, యుగాండా ప్ర‌జ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు.
 
మీకు 2019వ సంవత్సరాన్ని గురించి తెలిసే వుండవచ్చు.  మీరు ఆలోచిస్తున్న‌ దానిని గురించి నేను ఆలోచించ‌డం లేదు.  2019 ని గురించి మీరు ఏమనుకొంటున్నారు?  మీ మ‌న‌స్సు లో ఏముంది ?   జ‌న‌వ‌రి 22వ, 23వ తేదీ ల‌లో ప్ర‌వాసి భార‌తీయ దివస్ ను నిర్వహించడం జ‌రుగుతుంది.  ఈ సారి ఈ కార్య‌క్ర‌మ స్థలం కాశీ- అదే బనార‌స్.  కాశీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున మిమ్మ‌ల్నంద‌రినీ దీనికి ఆహ్వానిస్తున్నాను.  బనార‌స్ ప్ర‌జ‌ల ఆశీర్వాదాల‌తో నేను ఎంపీన‌య్యాను.   తరువాత దేశ ప్ర‌జ‌ల ఆశీస్సు ల‌తో  ప్ర‌ధాన మంత్రి ని అయ్యాను.  జ‌న‌వ‌రి 18వ,19వ, 20వ తేదీల‌లో వైబ్రంట్ గుజ‌రాత్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ జ‌రగ‌నుండ‌డం సంతోష‌దాయ‌కం.  మీరు ద‌య‌చేసి 22వ, 23వ తేదీల‌లో కాశీకి రండి.  ప్ర‌యాగ‌ లో కుంభ మేళా జ‌న‌వ‌రి 14న ప్రారంభం కానుంది.  22వ, 23వ తేదీల‌లో కాశీలో గ‌డిపిన తరువాత కుంభ‌ మేళా ను సంద‌ర్శించండి.  ప్ర‌యాగ్ రాజ్ లో పుణ్య‌స్నానం ఆచ‌రించండి.  ఆ తరువాత జ‌న‌వ‌రి 26వ తేదీన ఢిల్లీ కి రండి.  ఆ విధంగా  పూర్తిగా ఒక వారం ప్యాకేజీ లాగా ప్ర‌యాణం పెట్టుకోండి.  ఒక దాని తరువాత మరొక‌టిగా అనేక కార్య‌క్ర‌మాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. 

ఈ రోజున నేను ఇక్క‌డ‌కు వ‌చ్చింది యుగాండా లోని నా సోద‌రీసోదరులను ఆహ్వానించ‌డానికే.  మీరంతా త‌ప్ప‌కుండా భార‌త‌దేశాన్ని సంద‌ర్శించాలి.  మీ ప్రేమాప్యాయ‌తలు భార‌త‌దేశానికి ద‌క్కాయి.  మీ ప్ర‌గ‌తి కోసం భార‌తదేశం శుభాశీస్సులను అందిస్తోంది.  ఇక్క‌డ మీ జీవితాలు భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా ఉన్నాయి.  మ‌రో మారు మీకు నేను మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  మీకు అనేకానేక ధన్యవాదాలు.

**