‘యాస్’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘యాస్’ తుపాను 26వ తేదీ సాయంత్రం పశ్చిమ బెంగాల్-ఒడిషాల మధ్య తీరాన్ని దాటవచ్చునని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ సమయంలో గంటకు 155-165 కిలోమీటర్ల స్థాయి నుంచి 185 కిలోమీటర్లదాకా వేగంతో భీకర గాలులు వీచే ప్రమాదం ఉందని వివరించింది. తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా రాష్ట్రాల తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కాగలదని పేర్కొంది. అలాగే రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు సాధారణ స్థాయికన్నా 2 నుంచి 4 మీటర్లు అధికంగా ఎగసిపడవచ్చునని ‘ఐఎండీ’ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాలన్నిటికీ తాజా ముందస్తు అంచనాలతో ‘ఐఎండీ’ క్రమం తప్పకుండా సమాచార నివేదికలను జారీచేస్తోంది.
తుపానుకు సంబంధించి కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి 2021 మే 22వ తేదీన జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ)సహా తీరప్రాంత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాలతో సమావేశం నిర్వహించినట్లు ప్రధానమంత్రికి తెలిపారు. అలాగే దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) 24 గంటలూ పరిస్థితిని సమీక్షించడంతోపాటు సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలుసహా, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నదని తెలియజేశారు. అంతేకాకుండా తొలి విడత ‘ఎస్‌డిఆర్‌ఎఫ్’ నిధులను ‘ఎమ్‌హెచ్‌ఏ’ అన్ని రాష్ట్రాలకూ ముందుగానే విడుదల చేసింది. మరోవైపు 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పడవలు, టెలికాం పరికరాలు తదితరాలుసహా కూలిన చెట్లను తొలగించేవారితో కూడిన 46 బృందాలను ‘ఎన్డీఆర్ఎఫ్’ మోహరించింది. ఇవి కాకుండా మరో 13 బృందాలను ఇవాళ విమానంలో తరలించనుండగా, మరో 10 బృందాలను ఎప్పుడైనా రంగంలోకి దించడానికి సిద్ధంగా ఉంచింది.
రక్షణ-సహాయ-అన్వేషణ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా భారత తీరరక్షక దళం, నావికాదళాలు తమతమ నౌకలను, హెలికాప్టర్లను ఇప్పటికే మోహరించాయి. వాయుసేన, భారత సైన్యంలోని ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ యూనిట్లు కూడా పడవలు, రక్షణ పరికరాలతో ఏ క్షణంలోనైనా రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా పశ్చిమ తీరంలో మానవతా సహాయం, విపత్తు సహాయక యూనిట్లతో ఏడు నౌకలను కూడా ఏ క్షణంలోనైనా నియోగించేందుకు వీలుగా సిద్ధం చేశారు.
సముద్ర గర్భంలో చమురు అన్వేషణకు అమర్చిన సామగ్రి రక్షణకు, రవాణా నౌకలను వెనక్కు రప్పించి సురక్షితంగా లంగరు వేసేందుకు కేంద్ర పెట్రోలియం-సహజవాయువు శాఖ చర్యలు చేపట్టింది. అలాగే విద్యుత్తు మంత్రిత్వశాఖ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలన్నిటినీ అప్రమత్తంగా ఉంచింది. విద్యుత్తు తక్షణ పునరుద్ధరణ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, డి.జి.సెట్లు, ఇతర పరికరాలు వగైరాలను సిద్ధం చేసింది. అదేవిధంగా టెలికాం మంత్రిత్వశాఖ కూడా అన్ని టెలికాం టవర్లు, ఎక్స్ఛేంజీలపై నిరంతర పరిశీలనతోపాటు టెలికాం నెట్‌వర్క్ సత్వర పునరుద్ధరణకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది. తుపానువల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరోగ్య రంగ సంసిద్ధత, ప్రభావిత ప్రాంతాల్లో కోవిడ్ ప్రతిస్పందన చర్యలకు సంబంధించి ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచనాపత్రం జారీచేసింది. ఇక రేవులు-నౌకాయాన-జలరవాణా మంత్రిత్వశాఖ నౌకాయాన ఓడల సమీకరణతోపాటు అత్యవసర పడవ (టగ్)లను ఇప్పటికే మోహరించింది. మరోవైపు ముప్పు వాటిల్లగల ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించడంపై రాష్ట్రాల సన్నద్ధత దిశగా ‘ఎన్‌డీఆర్ఎఫ్’ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ విభాగాలకు చేయూతనిస్తోంది. అంతేకాకుండా తుపాను పరిస్థితులను ఎదుర్కొనడంపై నిరంతర సామాజిక అవగాహన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది.
తుపాను సన్నద్ధతపై సమీక్ష అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఆయా రాష్ట్రాల్లో అధిక ముప్పుగల ప్రాంతాల నుంచి ప్రజల సురక్షిత తరలింపులో అక్కడి ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించేలా అన్నిరకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత కార్యకలాపాల్లో పాల్గొంటున్న సిబ్బందిని సకాలంలో తరలించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలు చర్యలు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న విద్యుత్ సరఫరా, సమాచార సౌకర్యాలకు అంతరాయాలను కనీస స్థాయి పరిమితం చేసి, తక్షణ పునరుద్ధరణ చేపట్టాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. తుపాను ముప్పున్న ప్రదేశాల్లోని ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స, టీకాల కార్యక్రమం తదితరాలకు భంగం కలగకుండా రాష్ట్రాలతో సముచిత రీతిలో సమన్వయానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రణాళిక, సంసిద్ధత ప్రక్రియలో జిల్లా పాలన యంత్రాంగాలకు భాగస్వామ్యం ద్వారా ఉత్తమాచరణల గురించి అవగాహన, నిరంతర సమన్వయం అవసరాన్నిగురించి ప్రధాని నొక్కిచెప్పారు. తుపాను సమయంలో చేయదగిన/చేయదగని పనుల గురించి ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా స్థానిక భాషలో సూచనపత్రాలు, ఆదేశాలు జారీచేయాల్సిందిగా అధికారులను ప్రధాని ఆదేశించారు. స్థానిక సామాజిక సంస్థలు, పరిశ్రమలతో నిరంతర ప్రత్యక్ష సంబంధాలతో ప్రజలకు అవగాహన కల్పనసహా సహాయక చర్యల్లో పాలుపంచుకునేలా భాగస్వాములను చేయాల్సిన అవసరం గురించి కూడా ఆయన గుర్తుచేశారు.
ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి/సహాయమంత్రి, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి, ఆయా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు/హోం, టెలికాం, మత్స్య, పౌర విమానయానం, విద్యుత్, రేవులు-నౌకాయానం-జలమార్గాలు, ఎర్త్ సైన్సెస్ విభాగాల కార్యదర్శులుసహా రైల్వే బోర్డు చైర్మన్, ఎన్డీఎంఏ సభ్యులు-కార్యదర్శి, ఐఎండీ/ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరళ్లతోపాటు ‘పీఎంవో, ఎంహెచ్ఏ‘ల సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
***
Reviewed the preparedness to tackle Cyclone Yaas.
— Narendra Modi (@narendramodi) May 23, 2021
Was briefed on the various efforts to assist people living in the affected areas. https://t.co/pnPTCYL2Fm
Emphasised on timely evacuation as well as ensuring power and communications networks are not disrupted. Also emphasised on ensuring COVID-19 treatment of patients in affected areas does not suffer due to the cyclone.
— Narendra Modi (@narendramodi) May 23, 2021
Praying for everyone’s safety and well-being.