Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యంగూన్ లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

యంగూన్ లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌య‌న్మార్ లోని యంగూన్ లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ‘‘భార‌త‌దేశం మ‌రియు మ‌య‌న్మార్ ల‌ సుపుత్రులు, సుపుత్రిక‌ల విజ‌యాలు, ఇంకా వారి ఆకాంక్ష‌లు, సంస్కృతి-నాగ‌ర‌క‌త, చ‌రిత్ర‌ లకు వేలాది సంవ‌త్స‌రాలుగా మీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు’’ అంటూ అభివ‌ర్ణించారు. మ‌య‌న్మార్ యొక్క సుసంప‌న్న‌మైన ఆధ్యాత్మిక సంప్ర‌దాయాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి విపులంగా వివరించారు.

ప్ర‌వాసీ భార‌తీయులు భార‌త‌దేశానికి ‘‘జాతీయ దూత‌ల’’ వంటి వారు అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. యోగాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా లభించిన గుర్తింపు ప్ర‌వాసులు సాధించిన విజ‌య‌మ‌ని, వారు ప్ర‌పంచంలోని న‌లు మూల‌ల‌కు యోగాను తీసుకువెళ్ళార‌ని ఆయ‌న చెప్పారు.

‘‘మీతో నేను భేటీ అయినప్పుడల్లా, విదేశాల‌లో నివ‌సిస్తున్న మ‌న ప్ర‌జ‌లు భార‌త‌దేశం లోని ప్ర‌భుత్వ అధికారుల‌తో సంభాషించే స‌ర‌ళి ఇక ఏక‌ప‌క్షం ఎంత మాత్రం కాద‌ని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది’’ అని ఆయ‌న అన్నారు.

‘‘మన దేశాన్ని మేము కేవ‌లం సంస్క‌రించ‌డంతోనే సరిపెట్టడం లేదు, దానిని ప‌రివ‌ర్త‌న‌కు లోను చేస్తున్నాం’’ అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. పేద‌రికానికి, ఉగ్ర‌వాదానికి, అవినీతికి, మ‌త‌త‌త్త్వానికి, మరియు కుల‌వాదానికి చోటు ఉండ‌న‌టువంటి భార‌త‌దేశాన్ని నిర్మిస్తున్నామ‌ని కూడా ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం లోని కేంద్ర ప్ర‌భుత్వం అవ‌స్థాప‌న పై శ్ర‌ద్ధ వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. మంచి అవ‌స్థాప‌న అంటే ఒక్క ర‌హ‌దారులు మ‌రియు రైలు మార్గాలు మాత్ర‌మే కాదు, స‌మాజంలో ఒక గుణాత్మ‌క‌మైన మార్పును తీసుకువ‌చ్చే అనేక ఇత‌ర అంశాలు ఇందులో చేర్చి ఉంటాయి అని ఆయ‌న అన్నారు. క‌ఠిన‌మైనటువంటి నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డం అనే బాధ్య‌త నుండి ప్ర‌భుత్వం త‌ప్పించుకుపోవ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు.

వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) దేశ వ్యాప్తంగా ఒక కొత్త సంస్కృతిని తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు. భార‌త‌దేశాన్ని ప‌రివ‌ర్త‌నకు లోను చేయడం సాధ్య‌మేనని, మ‌న వ్య‌వ‌స్థ‌లోకి చొర‌బ‌డిన కొన్ని చెడుల బారి నుండి మనం బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతామ‌ని భార‌త‌దేశ ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నార‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

భార‌త‌దేశం మ‌రియు మ‌య‌న్మార్ సంబంధాల‌లోని శ‌క్తి ఇరుదేశాల ప్ర‌జ‌ల‌ మ‌ధ్య నెల‌కొన్న సంబంధాలేన‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

యంగూన్ ప్రాంత ముఖ్య‌మంత్రి శ్రీ ఫియో మిన్ థీన్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.