ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మసూరీ పర్యటనలో భాగంగా, లాల్ బహాదుర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బిఎస్ఎన్ఎఎ) లో 92వ ఫౌండేషన్ కోర్సును అభ్యసిస్తున్న 360 మందికి పైగా ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి రెండవ రోజున ప్రసంగించారు. శిక్షణలో ఉన్న అధికారులు 17 సివిల్ సర్వీసులు మరియు రాయల్ భూటాన్ సివిల్ సర్వీసు లోని 3 సర్వీసులకు చెందిన వారు ఉన్నారు.
ప్రసంగ కార్యక్రమాని కన్నా ముందు, ‘‘సివిల్ సర్వీసులలో నేను ఎందుకు చేరానంటే’’ అనే అంశం పై ఆఫీసర్ ట్రైనీలు రాసిన వ్యాసాలు; మరియు గృహ నిర్మాణం, విద్య, సమీకృత రవాణా వ్యవస్థలు, పోషకాహార లోపం, ఘన వ్యర్థాల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ లావాదేవీలు, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ ఇంకా ‘‘న్యూ ఇండియా – 2022’’ ల వంటి ఇతివృత్తాలపై ప్రజెంటేషన్ లు చోటు చేసుకొన్నాయి.
స్వచ్ఛ భారత్ అభియాన్ పై శిక్షణలో ఉన్న అధికారులు తమకు ఉన్న ఆలోచనలలో ఉత్తమమైన వాటిని ఆవిష్కరించారు.
శిక్షణలో ఉన్న అధికారులు (ఒటి లు) ఇచ్చిన ప్రజెంటేషన్ లను ప్రధాన మంత్రి అభినందించి, ఆ తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఈ ప్రజెంటేషన్ లను భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కూలంకషంగా అధ్యయనం చేయాలని తాను ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా వారి అభిప్రాయాలను మరియు ప్రతిస్పందనను ఫౌండేషన్ కోర్సు ముగిసే లోపల ఒటి లతో పంచుకొంటారని కూడా ఆయన చెప్పారు.
శిక్షణను ముగించుకొన్న తరువాత వెనువెంటనే తమ జీవితాన్ని ఎలా గడపాలో అనే విషయం పై ఒటి లకు ప్రధాన మంత్రి సంకేతాలు అందిస్తూ, వారు తమ చుట్టుపక్కల ఉన్న వారి పట్ల శ్రద్ధ వహిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పుస్తకాల ద్వారా నేర్చిన జ్ఞానం వారిని పెడదోవ పట్టకుండా తప్పక అడ్డుకోగలుగుతుందని, అయితే తమ బృందాల తోను, ప్రజల తోను వారు ఏర్పరచుకొనే జోడీ మరియు సౌహార్దతలే వారు విజయవంతం అయ్యేందుకు తోడ్పడుతాయని ఆయన అన్నారు.
విధాన పరమైన కార్యక్రమాలు విజయవంతంగా అమలులోకి రావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
స్వాతంత్య్రం రావడాని కన్నా ముందు, బ్రిటిష్ ఏలుబడిని కాపాడటమే సివిల్ సర్వీసుల పరమావధిగా ఉండేదని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రస్తుతం ప్రజల అభ్యున్నతి మరియు సమృద్ధి.. ఇవే సివిల్ సర్వీసుల ధ్యేయమని ఆయన అన్నారు. ఈ ధ్యేయాలను ప్రభుత్వ అధికారులు తమలో ఇముడ్చుకొన్నట్లయితే ప్రభుత్వ యంత్రాంగానికి మరియు ప్రజలకు మధ్య అంతరాన్ని భర్తీ చేయవచ్చన్నారు.
ప్రభుత్వ అధికారులు వారి మధ్య పరిధులు విధించుకోవడం మరియు జట్టు స్ఫూర్తి అనేది లేకుండా నడుచుకోవడం వంటి సమస్యలను మసూరీలో ప్రారంభిక శిక్షణ కాలంలో సమర్థంగా పరిష్కరించుకోవచ్చని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఒటి లు కష్టమైన ప్రయాణం చేసిన సంగతిని ప్రధాన మంత్రి ప్రస్తావించి, జట్టు స్ఫూర్తిని కనబరచడం మరియు నాయకత్వం వహించడం వంటి విషయాలను అలవరచుకోవలసిందిగాను, వాటిని తమ వృత్తి జీవిత పర్యంతం అమలు చేయవలసిందిగాను ప్రధాన మంత్రి సూచించారు.
సామాజిక ఉద్యమాలు ఏ ప్రజాస్వామ్యంలోనైనా మార్పును తీసుకురాగలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు. ఇందుకోసం సివిల్ సర్వీసులు ఉత్ప్రేరకాలు అవ్వాలని ఆయన చెప్పారు. నిన్న జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఒటి లు పాడిన ‘‘వైష్ణవ్ జన’’ అనే భక్తి గీతాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఈ గీతంలోని ‘‘వైష్ణవ్ జన్’’ అనే పదాలకు బదులు ‘‘ప్రభుత్వ అధికారి’’ అనే పదాలు ఉంచే విషయమై ఒటి లు ఆలోచించాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు లేకుండా ఉండటం అనేది ఒక పెద్ద బలం అని ప్రధాన మంత్రి అన్నారు. సివిల్ సర్వీసులను అశోక చిహ్నంలో ఎవరికీ కనపడకుండా ఉన్నప్పటికీ అన్ని వేళలా తన ఉనికిని చాటి చెప్పే నాలుగో సింహం తో ఆయన పోల్చారు.
యాత్రకు వెళ్ళడం అనేది భారతదేశంలోని ఒక విశిష్టమైన సంప్రదాయమని, ప్రయాణం చేయడం మరియు ప్రజలతో మాటామంతీ జరపడం ఒక గొప్ప విద్య అని ప్రధాన మంత్రి చెప్పారు. శిక్షణలో ఉన్న అధికారులు వారికి పోస్టింగులు లభించినప్పుడు క్షేత్ర పర్యటనలు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వృత్తి జీవితాన్ని సాధించి తీరాలన్న పట్టుదల ఒటి లను విజయవంతంగా ఎల్బిఎస్ఎన్ఎఎ కు తీసుకువచ్చిందని, అయితే ఇప్పుడిక భారతదేశ ప్రజలకు సేవ చేయాలన్న దీక్షను వారు అలవరచుకోవాలని ఒటి లకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. భవిష్యత్తులో వారు కార్య క్షేత్రంలో సేవలను అందించేటప్పుడు ఇదే వారి ‘‘జీవిత పరమార్థం’’ కావాలని ఆయన అన్నారు.
అంత క్రితం, హిమాలయాల సానువులలో నెలకొన్న అకాడమీ పచ్చిక బయలు ప్రాంతంలో ఉదయం పూట నిర్వహించిన యోగాభ్యాస కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఆఫీసర్ ట్రైనీలతో కలిసి పాలుపంచుకొన్నారు.
నూతన వసతి గృహ భవనం మరియు 200 మీటర్ల బహుళోపయోగ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ల నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.
అకాడమీ లోని బాల్వాడీని ప్రధాన మంత్రి సందర్శించి, చిన్నారులతో కొద్దిసేపు గడిపారు. అలాగే అకాడమీ లోని వ్యాయామశాలను, ఇంకా ఇతర సదుపాయాలను కూడా ఆయన సందర్శించారు.