మోటారు వాహనాల (సవరణ) బిల్లు 2016కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. బిల్లులోని సవరణల ద్వారా రోడ్డు ప్రయాణికులకు అనేక విధాలుగా మేలు జరగనున్నుది.
ప్రతి సంవత్సరం భారతదేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.5 లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాలను, తద్వారా సంభవించే మరణాలను యాభై శాతం మేరకు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
కేంద్రంలో ఎన్ డి ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రహదారి భద్రత కార్యక్రమాల్లో భాగంగా రహదారి రవాణా మరియు భద్రత అంశాలపై ఒక ముసాయిదా బిల్లును రూపొందించడం జరిగింది. అయితే, దీనిపై చాలా రాష్ట్రాలు అశ్యంతరాలను వ్యక్తం చేశాయి.
రహదారి భద్రత సమస్యను పరిష్కరించడానికి, రవాణా విభాగాల సేవలను ఉపయోగించుకునే సమయంలో ప్రజలకు తగిన సౌకర్యాలను కల్పించడానికిగాను ఆయా రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మంత్రుల బృందాన్ని (జి ఒ ఎమ్) రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ (ఎమ్ ఒ ఆర్ టి హెచ్) ఏర్పాటు చేసింది. రాజస్థాన్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ యూనుస్ ఖాన్ అధ్యక్షునిగా ఉన్న ఈ మంత్రుల బృందం మూడు సమావేశాలను నిర్వహించింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 18 మంది రవాణా మంత్రులు ఈ సమావేశాలలో పాల్గొని, మధ్యకాల నివేదికలను సమర్పించడం జరిగింది.
రహదారి భద్రతా సమస్యలను వెంటనే పరిష్కరించి రవాణా రంగ స్థితిగతులను మార్చడానికిగాను ప్రభుత్వం వెంటనే మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని జి ఒ ఎమ్ సిఫారసు చేసింది. జి ఒ ఎమ్ చేసిన సిఫారసుల మేరకు రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల సవరణ బిల్లు 2016ను రూపొందించి మంత్రిమండలి ముందుంచింది. ఈ బిల్లును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతమున్న మోటారు వాహనాల చట్టంలో 223 సెక్షన్లు ఉన్నాయి. వీటిలో 68 సెక్షన్లకు సవరణలు తేవాలనేది బిల్లు లక్ష్యం. అంతే కాదు, చాప్టర్ 10ని తొలగించడం జరిగింది. థర్డ్ పార్టీ బీమా అభ్యర్థనలను, సెటిల్‌మెంట్ విధానాన్ని సరళీకరించడానికిగాను చాప్టర్ 11 స్థానంలో నూతన అంశాలను చేర్చబోతున్నారు.
సవరణ బిల్లులో పలు ప్రధానమైన సవరణలలో కొన్ని ఇలా ఉన్నాయి.
హిట్ అండ్ రన్ కేసులో జరిమానాను రూ.25,000 నుండి రూ.2 లక్షలకు పెంచారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సమీప బంధువులకు రూ.10 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించే నిబంధనలను కూడా చేర్చారు.
28 కొత్త సెక్షన్లను చేర్చాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. రహదారి మార్గాలలో భద్రతను మెరుగపరిచి, రవాణా శాఖతో వ్యవహరించే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి ప్రధానంగా ఈ సవరణలలో శ్రద్ద తీసుకున్నారు. గ్రామీణా రవాణా రంగాన్ని బలోపేతం చేయడం, మారుమూల ప్రాంతాలకు సహితం రవాణా సౌకర్యాన్ని సమకూర్చడం, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, ఆటోమేషన్, కంప్యూటరీకరణ, ఇంకా ఆన్ లైన్ సేవలను ఏర్పాటు చేయడం మొదలైనవి సవరణ బిల్లులోని ఇతర ముఖ్యాంశాలు.
దేశంలో రవాణా రంగంలో భారీ మార్పులను చేయాలని బిల్లు ప్రతిపాదించింది. గ్రామీణ రవాణాను ప్రోత్సహించడానికిగాను స్టేజ్ క్యారేజ్, కాంట్రాక్ట్ క్యారేజ్ అనుమతుల్లో మినహాయింపులను ఇవ్వడానికి రాష్ట్రాలకు అనుమతినిచ్చింది. తద్వారా ప్రజా రవాణా మెరుగైన మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పడి ప్రయాణికులకు రవాణా సౌలభ్యంతో పాటు రోడ్డు భద్రత ఏర్పడుతుంది.
ఒకటి కంటే తక్కువ లేకుండా, పది కంటే ఎక్కువ లేకుండా ఈ చట్టం కింద ప్రతి జరిమానాకు అనువర్తించేలా మల్టిప్లయర్ ను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా రూపొందించవచ్చని బిల్లు ప్రతిపాదించింది.
పాదచారుల సౌకర్యం కోసం, రవాణా మెరుగు పరచడానికిగాను బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని బిల్లు ప్రతిపాదించింది.
ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (e-Governance) ద్వారా ప్రజలకు సేవలను అందించాలనేది బిల్లులో ప్రధాన అంశాల్లో ఒకటి. ఆన్ లైన్ ద్వారా లైసెన్సులు ఇవ్వడం, డ్రైవింగ్ లైసెన్సుల కాలపరిమితిని పెంచడం, రవాణా లైసెన్సులను ఇవ్వడానికిగాను అవసరమయ్యే విద్యార్హతల సమస్యలను పరిష్కరించడం మొదలైనవి ఈ బిల్లులోని ముఖ్యాంశాలు.
బాలలు వాహనాలను నడుపుతూ చేసే ప్రమాదాలపైన కూడా బిల్లు దృష్టి పెట్టింది. అటువంటి పిల్లల సంరక్షకులు, వాహన యజమాని శిక్షార్హులవుతారు. నేరారోపణలు ఎదుర్కొనే పిల్లల్ని జెజె చట్టం కింద విచారిస్తారు. వాహన రిజిస్ట్రేషన్ ను రద్దు చేయడం జరుగుతుంది.
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నారు. వాహన డీలర్ దగ్గరే ఈ పని జరుగుతుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పైన నిబంధనలు విధించడం జరిగింది.
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే వారికి భారీగా జరిమానాలు విధించడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచాలని బిల్లు ప్రతిపాదించింది. వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారికి జరిమానాలు భారీగా ఉండబోతున్నాయి. బాలలు డ్రైవింగ్ చేసినా, తాగి వాహనాన్ని నడిపినా, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసినా, ప్రమాదాకరంగా బండిని నడిపినా, వేగంగా నడిపినా, పరిమితికి మించి లోడుతో బండిని నడిపినా, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపినా భారీగా జరిమానాలుంటాయి. ఉల్లంఘనలకు పాల్పడేవారిని ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా గుర్తిస్తారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడానికి బిల్లులో పలు మంచి మార్గదర్శకాలను చేర్చారు. 2018 అక్టోబర్ 1 నుండి రవాణా వాహనాలకోసం ఆటోమేటెడ్ ఫిట్ నెస్ టెస్టింగును తప్పనిసరి చేయాలని బిల్లు ప్రతిపాదించింది. దీనివల్ల రవాణాశాఖలో అవినీతి తగ్గుతుంది. అంతేకాదు, వాహనాల సమర్థత పెరుగుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి భద్రత, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలను విధిస్తారు. ఈ విషయంలో వాహన బాడీ తయారీదారులను, విడిభాగాల సరఫరాదారులను కూడా బాధ్యులను చేస్తారు.
వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సు విధానంలో సరళీకరణ తేవడానికి బిల్లు కొన్ని ప్రతిపాదనలు చేసింది. నేషనల్ రిజిస్టర్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ చేయించేలా చూడాలని ప్రతిపాదించింది. ఇందుకోసం వాహన్, సారథి ప్లాట్ ఫామ్స్ నెలకొల్పాలని నిర్ణయించారు. దీనివల్ల ఈ విషయంలో దేశమంతా ఒకే విధానం అమలులోకి వస్తుంది.
వాహనాల టెస్టింగ్, సర్టిఫికెట్ జారీ విధానాన్ని మరింత సమర్థవంతంగా నియంత్రించాలని బిల్లు ప్రతిపాదించింది. ఆటోమొబైల్ అనుమతులనిచ్చే టెస్టింగ్ ఏజెన్సీలను చట్టం పరిధిలోకి తేవడం జరిగింది.
డ్రైవింగ్ శిక్షణా విధానాన్ని బలోపేతం చేసి, రవాణా లైసెన్సుల జారీని వేగవంతం చేయనున్నారు. దీనివల్ల వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే డ్రైవర్ల కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
దివ్యాంగులు ఎదుర్కొనే రవాణా సమస్యలకు కూడా ఈ బిల్లు పరిష్కారం చూపింది. వారికి డ్రైవింగ్ లైసెన్సులను ఇవ్వడంలోని అడ్డంకులను తొలగించాలని, వారు వాడే వాహనాల తయారీలో మార్పులు చేర్పులు చేసి వారు నడపడానికి వీలుగా వాటిని రూపొందించాలని బిల్లు ప్రతిపాదించింది.
మంత్రివర్గం ఆమోదించిన మోటారు వాహనాల సవరణ బిల్లు 2016 రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు తెర తీసిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చూపిన చొరవ, అందజేసిన సహాయం పట్ల శ్రీ గడ్ కరీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సవరణల రూపకల్పనలో రాష్ట్రాల రవాణా మంత్రులు చేసిన కృషిని శ్రీ గడ్ కరీ అభినందించారు. ఈ సవరణల బిల్లు వచ్చే వారం పార్లమెంటు ముందుకు వస్తుందని, అన్ని పార్టీలు సహకరించి ఈ బిల్లు చట్టం కావడానికి సహకరించాలని ఆయన అభ్యర్థించారు.
మోటారు వాహనాల సవరణ బిల్లు -2016 కింద వివిధ జరిమానాలలో ప్రతిపాదించిన సవరణలు
177 | జనరల్ | రూ. 100 | రూ.500 |
న్యూ 177A | రోడ్డు నిబంధన అతిక్రమణపైన నియమాలు | రూ.100 | రూ. 500 |
178 | టికెట్ లేకుండా ప్రయాణం | రూ. 200 | రూ. 500 |
179 | అధికారుల ఆదేశాల ను పాటించకపోవడం | రూ. 500 | రూ. 2,000 |
180 | లైసెన్సు లేకుండా అనధికారికంగా వాహనాన్ని వినియోగించడం | రూ. 1,000 | రూ. 5,000 |
181 | లైసెన్సు లేకుండా వాహనాన్ని నడపడం | రూ. 500 | రూ. 5,000 |
182 | అనర్హులై ఉన్నా వాహనాన్ని నడపడం | రూ. 500 | రూ. 10,000 |
182 B | ఎక్కువ పరిమాణం కలిగిన వాహనాలు | న్యూ | రూ. 5000 |
183 | అతి వేగంగా నడపడం | రూ. 400 | ఎల్ ఎమ్ వి కి రూ.1,000, మధ్యతరహా ప్రయాణికుల వాహనానికి రూ. 2,000 |
184 | అపాయకరంగా నడిపితే జరిమానా | రూ. 1,000 | రూ. 5,000 వరకు |
185 | తాగి వాహనాన్ని నడపడం | రూ.2,000 | రూ. 10,000 |
189 | వేగంగా / పోటీ పెట్టుకొని వాహనాన్ని నడపడం | రూ. 500 | రూ. 5,000 |
192 A | అనుమతి లేకుండా వాహనం నడపడం | రూ. 5,000 వరకు | రూ. 10,000 వరకు |
193 | లైసెన్సు విధానాల అతిక్రమణ | న్యూ | రూ. 25,000 నుండి
రూ. 1,00,000 |
194 | ఎక్కువ లోడు వేయడం | రూ. 2,000, ప్రతి అదనపు టన్నుకు రూ. 1,000 | రూ.20,000 మరియు ప్రతి అదనపు టన్నుకు రూ. 2,000 |
194 A | స్థాయిని మించి ప్రయాణికులను నింపడం | ప్రతి అదనపు ప్రయాణికునిపైన రూ.1,000 | |
194 B | సీట్ బెల్టు లేకపోతే | రూ. 100 | రూ.1,000 |
194 C | ద్విచక్రవాహనాల పైన పరిమితికి మించి ప్రయాణికులు | రూ.100 | రూ.2,000 ; మూడు నెలల పాటు లైసెన్సు లేకుండా అనరర్హత |
194 D | హెల్మెట్ లేకపోతే | రూ.100 | రూ.1000 ; మూడు నెలల పాటు లైసెన్సు లేకుండా అనర్హత |
194 E | ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే | న్యూ | రూ.10,000 |
196 | ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం | రూ.1,000 | రూ.2,000 |
199 | బాలలు వాహనాలు నడిపితే | న్యూ | సంరక్షకుడు/ యజమాని నేరస్తులుగా పరిగణన. మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా. నేరారోపణ ఎదుర్కొంటున్న బాలల్ని జెజె చట్టం కింద విచారణ. మోటారు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రద్దు. |
206 | డాక్యుమెంట్ల స్వాధీనంలో అధికారుల అధికారం | సెక్షన్ లు 183, 184, 185, 189, 190, 194C, 194D,194E ల కింద డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్ | |
210 B | అధికారులు చేసే నేరాలు | సంబంధిత సెక్షన్ కింద రెండింతల జరిమానా | సెక్షను | పాత నిబంధన/ జరిమానా | కొత్తగా ప్రతిపాదించిన నిబంధన/ అతి తక్కువ జరిమానా |
---|
***