పరివర్తిత మొబిలిటీ, బ్యాటరీ స్టోరేజి జాతీయ మిషన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదించింది. దేశ ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు స్వచ్ఛమైన, అనుసంధానిత, భాగస్వామ్య రవాణా విధానాలను ఈ మిషన్ ప్రోత్సహిస్తుంది. బ్యాటరీలు, ఇలెక్ట్రిక్ వాహన విడిభాగాల దశలవారీ తయారీ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా పరిపూర్ణమైన రవాణా విధానాలను అందుబాటులోకి తెస్తుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ దిగువ అంశాలను ఆమోదించింది.
i. స్వచ్ఛమైన, అనుసంధానిత, భాగస్వామ్య, సుస్థిర ప్రాతిపదికన రవాణా సాధనాలు అందుబాటులోకి తేవడంలో భాగంగా పరిపూర్ణమైన చొరవలు చేపట్టేందుకు సహాయకారిగా నిలిచే పరివర్తిత రవాణా, బ్యాటరీ స్టోరేజికి ఒక జాతీయ మిషన్ ఏర్పాటు.
ii. 2024 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల కాలానికి దశలవారీ తయారీ కార్యక్రమం (పిఎంపి) కింద కొన్న భారీ పరిమాణం, ఎగుమతి సామర్థ్యం గల సమగ్ర బ్యాటరీ, సెల్ తయారీ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది.
iii. ఇలెక్ట్రిక్ వాహనాల విలువ గొలుసుకట్టులోని అన్ని విభాగాల్లోనూ ఉత్పత్తుల స్థానికీకరణను 2024 వరకు అమలులో ఉండే పిఎంపి ప్రోత్సహిస్తుంది. స్వచ్ఛమైన, అనుసంధానిత, భాగస్వామ్య, సుస్థిర ప్రాతిపదికన రవాణా సాధనాలు అందుబాటులోకి తేవడం కోసం ఏర్పాటు చేసిన జాతీయ మిషన్ ఈ రెండు పిఎంపిలకు తుది రూపం ఇస్తుంది.
పరివర్తిత రవాణా, స్టోరేజి జాతీయ మిశన్:
కూర్పు:
– విభిన్న విభాగాలకు ప్రాతినిథ్యం ఉండే పరివర్తిత మొబిలిటీ, బ్యాటరీ స్టోరేజి జాతీయ మిషన్ అమలును నీతి ఆయోగ్ సిఇఒ అధ్యక్షతన ఏర్పాటు చేసే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటవుతుంది.
– రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ; విద్యుత్ మంత్రిత్వ శాఖ; సరికొత్త, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ; సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ; భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ; పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ; పారిశ్రామిక ప్రమాణాల బ్యూరో డైరెక్టర్ జనరల్ సభ్యులుగా సారథ్య సంఘం పని చేస్తుంది.
పాత్ర:
– ఈ మిషన్ పరివర్తిత రవాణా వ్యవస్థ; ఇవిలు, ఇవి విడిభాగాలు, బ్యాటరీల దశల వారీ తయారీ వ్యూహాలను రూపొందించి అవసరమైన సిఫారసులు చేస్తుంది.
– ఇవిల విలువ గొలుసుకట్టులో అన్ని స్థాయిల్లోనూ స్థానికంగానే ఉత్పత్తిని ప్రపోత్సహించేందుకు దశలవారీ తయారీ కార్యక్రమం (పిఎంపి) ఆవిష్కరిస్తారు. పిఎంపి పరిధి ఏమిటన్నది పరివర్తిత రవాణా, బ్యాటరీ స్టోరేజి జాతీయ మిషన్ నిర్ణయిస్తుంది. అందుకు అనుగుణంగా చేపట్టే కార్యక్రమాలకు తుది రూపం ఇస్తుంది.
– ఇలెక్ట్రిక్ వాహన విడి భాగాలు, బ్యాటరీల ఉత్పత్తిని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద చేపట్టేందుకు ఉత్పత్తుల స్థానికీకరణకు సంబంధించిన అన్ని ప్రతీ ఒక్క దశలోనూ విలువ జోడింపు ఎంత ఉండాలి అనేది కూడా మిషన్ నిర్ధారిస్తుంది.
– ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యే మంత్రిత్వ శాఖలు/ ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ పరివర్తిత రవాణా కార్యక్రమాలన్నింటినీ సుసంఘటితం చేసి ఈ మిషన్ సమన్వయపరుస్తుంది.
ప్రణాళికలు:
– 2019-20 నాటికి భారీ పరిమాణం గల మాడ్యూళ్లు, ప్యాక్ అసెంబ్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు, 2021-22 నాటికి ఇంటిగ్రేటెడ్ సెల్ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ భారీ పరిమాణంలో బ్యాటరీల తయారీకి ఒక దశలవారీ ప్రణాళిక ఆవిష్కరిస్తారు.
– బ్యాటరీల పిఎంపి వివరాలను మిషన్ రూపొందిస్తుంది. దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమ సమగ్రంగాను, పరిపూర్ణంగాను అభివృద్ధి చెందేందుకు మిషన్ చర్యలు తీసుకుంటుంది.
– భారతదేశం పరిధిలోను,పరిమాణంలోను ఆధునికమైన, ప్రపంచంలో అన్ని పరిస్థితులకు అనువైన బహుళ నమూనా రవాణా సొల్యూషన్ల విభాగంలో పోటీ సామర్థ్యాలు గలదిగా తయారయ్యేందుకు అవసరమైన ప్రణాళికను మిషన్ రూపొందిస్తుంది.
– రవాణాకు అనువైన సుస్థిరమైన వాతావరణం కల్పించేందుకు, దేశీయ ఉత్పత్తి కార్యకలాపాలను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చేపట్టేందుకు, ఉపాధి కల్పనకు దోహదపడే విధంగా “నవ భారతావని”కి పరివర్తిత రవాణా సాధనాల ప్రణాళికను కూడా మిషన్ నిర్వచిస్తుంది.
ప్రభావం:
– పరిశ్రమ, ఆర్థిక రంగం, దేశం యావత్తుకు ప్రయోజనాలు కలిగించే రవాణా సాధనాల ఆవిష్కారానికి మిషన్ కృషి చేస్తుంది.
– ఈ రవాణా సాధనాల వల్ల నగరాల్లో వాయు నాణ్యత మెరుగుపడి దేశం చమురు దిగుమతులపై ఆధారనీయతను తగ్గిస్తుంది. పునరుత్పాదక ఇంధన వనరులు, స్టోరేజి సొల్యూషన్ల వినియోగాన్ని పెంచుతుంది.
– పోటీ సామర్థ్యాలకు తట్టుకోగల విద్యుత్ వాహనాలు భారీ పరిమాణంలోను, ప్రమాణంలోను తయారుచేసేందుకు అనువైన వాతావరణాన్ని దేశంలో ఏర్పాటు చేసే వ్యూహాలను, ప్రణాళికలను మిషన్ ఆవిష్కరిస్తుంది.
– జీవన సరళత, ప్రజల జీవన నాణ్యత పెంచడం ద్వారా అన్ని వర్గాల పౌరులు ప్రయోజనం పొందేలా కార్యాచరణ ఆవిష్కరించడం ద్వారా అన్ని రకాల నైపుణ్య విభాగాల్లోను మేక్ ఇన్ ఇండియాను ఆసరా చేసుకుని ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తుంది.
పూర్వాపరాలు:
2018 సెప్టెంబర్ లో జరిగిన ప్రపంచ రవాణా సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 7సిలు కీలకంగా – ఉమ్మడి (కామన్), అనుసంధానిత (కనెక్టెడ్), సౌకర్యవంతం (కన్వీనియెంట్), ఇరకాటరహిత (కంజెషన్ ఫ్రీ), చార్జింగ్తో పని చేసే (చార్జ్ డ్), స్వచ్ఛ (క్లీన్), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన (కటింగ్ ఎడ్జ్ – రవాణా సాధనాలు తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఆ రవాణా సాధనాలు ఆర్థికాభివృద్ధికి, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో పౌరుల జీవితాలు మెరుగుపడేందుకు సహాయకారిగా నిలుస్తాయి.
వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, జీవన సరళత మెరుగుదల ప్రాథమిక వ్యూహాలుగా అందరూ భరించగల స్థాయిలో ఉండే, సమ్మిళిత, సురక్షిత మొబిలిటీ సొల్యూషన్ల అవసరం ప్రపంచంలో పెరిగింది. వాతావరణ లక్ష్యాలకు ప్రకటించిన కట్టుబాట్లు ఆధారంగా ప్రపంచ రవాణా విప్లవంతో ప్రధాన చోదక శక్తిగా నిలిచేందుకు సమర్థవంతమైన వ్యూహాలను భారతదేశం ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది.
ఈ కారణంగానే సహకార ఫెడరలిజం స్ఫూర్తితో బహుళ విభాగాలకు భాగస్వామ్యం గల ఒక మిషన్ ఆవిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిగువన పొందుపరిచిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమంలో బహుళ విభాగాల పాత్రకు, మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులకు అనువుగా రవాణా రంగానికి సంబంధించిన అన్ని విభాగాలను పరివర్తితం చేసే విధంగా ఆ మిషన్ ఉంటుంది.
1. తయారీ
2. స్పెసిఫికేషన్లు, ప్రమాణాలు
3. ఆర్థిక ప్రోత్సాహకాలు
4. స్థూల డిమాండు కల్పన, అంచనాలు
5. నియంత్రణ వ్యవస్థ
6. పరిశోధన, అభివృద్ధి
త్వరిత గతిన పట్టణీకరణ జరుగుతున్న భారతదేశంలో రానున్న దశాబ్దాల్లో భారతదేశానికి ఈ చొరవలు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి.