Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొత్తం దేశం 21 రోజుల పాటు పూర్తిగా లాక్ డౌన్ పాటించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. 


కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి చేస్తున్న కృషిలో భాగంగా ఈ అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశం మొత్తం సంపూర్ణంగా లాక్ డౌన్ పాటించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.  

 
జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా టెలివిజన్ లో మాట్లాడుతూ, అత్యుత్తమమైన వైద్య సదుపాయాలున్న దేశాలు సైతం ఈ వైరస్ ను కట్టడి చేయలేక పోయాయనీ, దీన్ని తగ్గించడానికి సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.  

” ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ మహమ్మారి ముందు ఎంత నిస్సహాయంగా ఉండిపోయాయో మీరు కూడా గమనించారు.   అంటే, ఈ దేశాలు తగిన కృషి చేయటం లేదా? లేక వారికి వనరుల కొరత ఉందా?  ఎంతగా ఎక్కువగా కృషి చేసినప్పటికీ, కరోనా వైరస్ అంత వేగంగా విస్తరిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఆ దేశాలకు చాలా కష్టంగా ఉంది.  

గత రెండు నెలలుగా ఈ దేశాల్లో సంఘటనల విశ్లేషణను గమనిస్తే, ఈ కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి – సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమన్న నిపుణుల అభిప్రాయం రుజువౌవుతోంది” అని ఆయన చెప్పారు.   

ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని ప్రధానమంత్రి హెచ్చరిస్తూ – ” కొంత మంది నిర్లక్ష్యం , కొంత మంది చెడు భావనలు, మిమ్మల్నీ, మీ పిల్లలనీ, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాన్నీ, మీ స్నేహితులను, ఈ దేశం మొత్తాన్నీ భయంకరమైన ప్రమాదానికి గురిచేస్తాయి.   ఇదే అజాగ్రత్త కొనసాగితే భారతదేశం ఎంత మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో అంచనా వేయడం అసాధ్యం.” 

గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను ప్రజలు సంపూర్ణ చిత్తశుద్ధితో స్వీకరించాలని కూడా ప్రధానమంత్రి కోరారు.  

ఈ రోజు అర్ధరాత్రి నుండి దేశం యావత్తూ పూర్తి లాక్ డౌన్ లో ఉంటుందని ప్రధానమంత్రి ప్రకటించారు.  21 రోజులపాటు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాకూడదనీ, ఈ విషయంలో ప్రజలపై పూర్తి నిషేధం విధించడం జరిగిందని ప్రధానమంత్రి ప్రకటించారు.  ఆరోగ్యరంగానికి చెందిన నిపుణుల అనుభవాలు,  ఇతర దేశాల అనుభవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి 21 రోజుల లాక్ డౌన్ అత్యవసరమనీ ఆయన చెప్పారు.  

ఇది జనతా కర్ఫ్యూ కంటే కొన్ని స్థాయిల పైన ఉంటుందని కూడా ఆయన చెప్పారు.   దేశాన్ని పరిరక్షించుకోడానికీ,  కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఈ దేశ పౌరులందరినీ పరిరక్షించుకోడానికీ, ఈ నిర్ణయం చాలా కీలకమైందని ప్రధానమంత్రి వివరించారు.  

ఈ మహమ్మారి కారణంగా ఆర్ధిక ప్రభావాన్ని గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ – ”  ఈ లాక్ డౌన్ కారణంగా దేశంపై తప్పకుండా ఆర్ధిక భారం పడుతుంది. అయితే,  ప్రతి ఒక్క భారతీయుని ప్రాణాన్ని కాపాడటం మా మొదటి ప్రాధాన్యత.  అందువల్ల, దేశంలో ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీరు ఉండడం కొనసాగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ”